Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
పదిహేనవ అధ్యాయము
పురుషోత్తమ యోగము
శ్రీ భగవానువాచః
ఊర్ధ్వమూల మధశ్శాఖం అశ్వత్థం ప్రాహు రవ్యయమ్
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ 1
ఇది సంసార అశ్వత్థ వృక్షము. దీని మూలము పైన, శాఖలు క్రింద. దీనిని అవ్యయము అనుచున్నారు. ఈ వృక్షపు ఆకులు వేదములు. ఇది తెలిసినవాడే వేదము తెలిసినవాడు.
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః
గుణ ప్రవృద్ధా విషయప్రవాళాః
అధశ్చ మూలా న్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే 2
ఈ చెట్టు యొక్క శాఖలు గుణములచే వృద్ధి పొందుచున్నవి. విషయ వాసనలు దీని చిగుళ్ళు. ఇది క్రిందకు, మీదకు వ్యాపించును. దీని మూలములు కర్మమూలములు. అవి సహితము క్రిందకు పైకి వ్యాపించును.
న రూపమస్యేహ తథోప లభ్యతే నాంతో న చాదిర్ న చ సంప్రతిష్ఠా
అశ్వత్థ మేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన ఛిత్త్వా 3
సంసార రూప వృక్షము లభించదు. ఏలనన దీనికి ఆద్యంత స్థితులు లేవు. ఈ అశ్వత్థపు వేరులు చాలా గట్టివి. అసంగమను ఆయుధముతో గట్టిగా ఖండించును.
తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ 4
తదుపరి గతించి తిరిగిరాని మార్గమును అన్వేషించవలయును. అట్టి ఆదిపురుషునే శరణు వేడుచున్నాము. అచటి నుండియే పురాతనమైన యీ మూలము వ్యాపించియున్నది.
నిర్మాన మోహా జితసంగదోషాః అధ్యాత్మ నిత్యా వినివృత్తాకామాః
ద్వంద్వైర్విముక్తా స్సుఖదుఃఖ సంజ్ఞెః గచ్ఛంత్య మూఢాః పద్య మవ్యయంతత్ 5
దురభిమానమును, మోహమును, ఆసక్తి దోషమును జయించిన వారలును, నిత్య ఆధ్యాత్ములును కోరికలు వదలిన వారును, సుఖదుఃఖములను ద్వంద్వములనుండి విముక్తులైన వారలును, జ్ఞానులై అవ్యయపదమునకు చేరుచున్నారు.
న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ 6
ఎచట సూర్యచంద్రాదులు ప్రకాశించరో, ఎచటకు చేరిన వారు తిరిగిరారో అయ్యది నా పరంధామము అగుచున్నది.
మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః
మనః షష్ఠాణీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి 7
జీవి లోకమున సనాతనమైన ప్రాణిజాలమంతయు నా అంశమే అగుచున్నది. ప్రకృతి ఇంద్రియములు మనస్సును ఆకర్షించుచున్నవి.
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్ర్కామతీశ్వరః
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ 8
వాయువు గంధముతో సాగును. అట్లే జీవాత్మ మరొక దేహమునకు మారునపుడు మనసు ఇంద్రియసహితుడై సాగును.
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే 9
మనస్సు అధిపతిగా చెవులు, నేత్రములు, స్పర్శనము, నాలుక, ముక్కు, విషయములను అనుభవించుచున్నవి.
ఉత్ర్కామంతం స్థితం వా-పి భుంజానం వా గుణాన్వితమ్
విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః 10
జీవాత్మ పోయినపుడుగాని, స్థితుడైయున్నప్పుడు గాని, గుణానుభవము చేయునపుడు గాని మూఢులు గమనించరు. జ్ఞాన చక్షువు మాత్రమే గమనించును.
యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మ న్యవస్థితమ్
యతంతో -ప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః 11
యోగులు ప్రయత్నించి ఆత్మతత్వమును తెలియగలరు. కాని అశుద్ధాత్ములు ఎంత ప్రయత్నించినను తెలియజాలరు.
యదాదిత్యగతం తేజః జగద్భాసయతే ఖిలమ్
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ 12
రవిచంద్ర అగ్నులు ఏ తేజస్సుతో జగమును ప్రకాశింపచేయుచున్నారో ఆ తేజస్సు నాది అగుచున్నది.
గామావిశ్య చ భూతాని ధారయామ్యహ మోజసా
పుష్ణామి చౌషధీస్సర్వాః సోమో భూత్వా రసాత్మకః 13
భూమియందు చేరి సమస్త భూతములను పోషించుచున్నాను. రసాత్మక చంద్రుడనై ఓషధులను పోషించుచున్నాను.

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ 14
నేను అగ్నినై ప్రాణుల దేహములందు చేరుతున్నాను. ప్రాణము అపానము సహితముగా నాల్గువిధముల అన్నమును అరిగించుచున్నాను.
సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ
వేదైశ్చ సర్వై రహమేవవేద్యః వేదాంతకృద్వేదవి దేవ చాహమ్ 15
అందరి హృదయాంతర్గామిని నేనే. నీ వల్లనే స్మృతి జ్ఞానము సందేహ నివారణము కలుగుచున్నది. సర్వవేదములు తెలిసికొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను నేనే.
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ
క్షర స్సర్వాణి భూతాని కూటస్థో -క్షర ఉచ్చతే 16
ఈ లోకమున క్షర అక్షర పురుషులు ఇద్దరేయున్నారు. సమస్త భూతములు క్షరములు. ఇప్పుడు అక్షరుడు అగుచున్నాడు.
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః
యో లోకత్రయ మావిశ్య బిభర్త్య వ్యయ ఈశ్వరః 17
ఆ ఇద్దరిని మించినవాడు పరమాత్మ అనబడుచున్నాడు. అతడు ముల్లోకములందు ప్రవేశించి భరించి పోషించుచున్నాడు.
యస్మాత్ క్షరమతీతో -హం అక్షరాదపి చోత్తమః
అతో స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః 18
ఏలనన క్షర అక్షరముల కన్న నేను ఉత్తముడను. అందుకే లోకమున వేదములు నన్ను పురుషోత్తమునిగా భావించుచున్నవి.
యో మామేవ మసమ్మూఢః జానాతి పురుషోత్తమమ్
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత! 19
భారతా! జ్ఞానియైనవాడు నన్ను పురుషోత్తమునిగా తెలియుచున్నాడు. అతడు నన్ను సర్వ విధములుగా భజించుచున్నాడు.
ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా -నఘ
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత 20
పుణ్యపురుషా అర్జునా! ఇది అత్యంత రహస్యమైన శాస్త్రము. దీనిని నీకు ఈ విధముగా బోధించినాను. దీని తత్వము తెలిసిన నరుడు జ్ఞానియై కృతార్ధుడు అగును.
పురుషోత్తమ యోగమను పదునైదవ అధ్యాయము ముగిసినది.
ఓం శాంతిః శాంతిః శాంతిః





