Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
శ్రీ భగవానువాచః
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ!
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి 22
పాండవా! త్రిగుణములు కల్గినప్పుడు సంతోషించడు. లేనప్పుడు బాధపడడు. ఇవి తొలగినపుడు కాంక్షించడు.
ఉదాసీనవదాసీనః గుణైర్యోన విచాల్యతే
గుణావర్తంత ఇత్యేవ యో -పతిష్ఠతి నేంగతే 23
త్రిగుణములకు చలింపడు. సాక్షివలె నిలచియుండును. గుణములే గుణములందు ప్రవర్తించుచున్నవని తెలియును. అతడు పరమగతికి చేరుచున్నాడు.
సమ దుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః
తుల్య ప్రియాప్రయో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతిః 24
సుఖదుఃఖములందు సమభావముగలవాడు, మట్టిముద్ద, రాయి బంగారమును ఒకే రీతిగా చూచువాడు, ప్రియ అప్రియములను, నిందలను, స్తుతిని ఒకే రీతిగా చూచువాడు ధీరుడు.
మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారి పక్షయోః
సర్వారంభ పరిత్యాగీ గుణాతీత స్స ఉచ్చతే 25
మానాభిమానములను, శత్రుమిత్రులను ఒకే భావముతో చూచువాడు సర్వారంభ పరిత్యాగి, త్రిగుణాతీతుడు అనబడుచున్నాడు.
మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే 26
నన్ను నిర్మల భక్తి భావమున సేవించువాడు, త్రిగుణములకు అతీతుడు, బ్రహ్మ ప్రాప్తికి అర్హుడగుచున్నాడు.
బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతి కస్య చ 27
పరబ్రహ్మమునకును, అమృతత్వమునకును అవ్యయమునకును, శాశ్వతమునకును, ధర్మమునకును, సుఖమునకును ఏకాంతికమునకును నేనే ఆధారమగుచున్నాను.
దీపిక:
ఈ అధ్యాయము మానసికతత్వ శాస్త్రము. నేను మానసిక శాస్త్రవేత్తను కాను. ఆధునిక శాస్త్రము ఎంతో ప్రగతిని సాధించినదని వింటున్నా. ప్రస్తుతమున్న ఉత్పత్తి విధానములో మానసిక వ్యాధులకు ఎంతో అవకాశమున్నది. కాబట్టి నివారణోపాయాలు పరిశోధనలు జరుగుతున్నవి.
ఈ అధ్యాయము మానసిక వ్యాధులకు సంబంధించినది కాదు. మానసిక అంశము ప్రధాన భూమిక. ప్రపంచములో వున్న మానవులందరినీ గుణ లేక స్వభావరీత్యా మూడు భాగములుగా విభజించుట సామాన్యము గాదు. ఇది శాస్త్రీయ తత్వము. అయిదువేల సంవత్సరములుగా దీనిని అందరూ ఆమోదిస్తూనే వస్తున్నారు. ప్రశ్నించినవారు సుమారు లేరు.
మానవుడు సహజ స్వభావముతో జన్మిస్తాడు. ఆ స్వభావమే గుణము. ఈ మూడు విభాగాలలో మొదటిది సాత్వికము. రెండవది రాజసము. మూడవది తామసము.
1. సాత్వికము: మంచి అలవాట్లు, సద్భావనలు కలవారు సాత్విక స్వభావులు. సాత్వికము అతని ముఖముననే కనిపించుచున్నది. అతనిని చూచిన ప్రణమిల్లవలె ననిపించును. అయితే యిది మూల స్వభావము మాత్రమే జీవితము సాంతము ఇదే స్వభావము స్థిరముగా ఉండుట శ్రీరామకృష్ణ పరమహంసకే సాధ్యము.
సాధారణ సాత్వికుడు అప్పుడప్పుడు రాజసతామసాలకు లోనుకావడము సహజము. జీవితము ఒక విచిత్ర వలయము. అందులోనికి తాను తప్ప ఇతరులను చొరనీయడు. ఎంత సాత్విక స్వభావుడైన, సమయసందర్భాలను బట్టి రాజసము తామసము కాక తప్పదు.
2. రాజసము: ప్రస్తుత సమాజములో సాధారణముగా రాజసులేయున్నారు. రాజసము కోర్కెలు తీర్చుకొనుటకు ఉపాయాలు అన్వేషిస్తుంది. అవసరమైతే సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగిస్తుంది. రాజసానికి తృప్తిలేదు. అది పైకి ఎక్కవలెనని ప్రయత్నిస్తుంది. ఎక్కితే సరే. జారిపడితే విలవిలలాడుతుంది. రాజసుడు గూడా సమయ సందర్భములను బట్టి సాత్వికుడౌతాడు. తామసుడు అవుతాడు.
రాజసము మూల స్వభావము. అప్పుడప్పుడు తప్ప సాధారణముగా రాజసంగానే ప్రవర్తిస్తాడు.
3. తామస స్వభావము: అక్కరలేని ఆరాటము, అనవసరముగా ఇతరులను బాధించడము, హింసాప్రవృత్తి కలిగియుండటము, తెలిసీ తెలియక తప్పులు చేయడము. ఇది తామస స్వభావము. వీరు సాధారణముగా రాజసుల చేతి కీలుబొమ్మలయి వుంటారు. వారు తమ కోసము నేరాలు చేయిస్తారు. వీరు శిక్షలు అనుభవిస్తారు. తామసులు గూడా గుడికి పోయినప్పుడు సాత్వికులు, పని పడ్డపుడు రాజసులు అవుతుంటారు.
ఎంతటి కిరాతకుడైనా ఏదో ఒక బలహీనతలో సాత్వికుడు అవుతాడు. యీ అధ్యాయము చదివిన తర్వాత ఇందులో చెప్పబడిన మూడు గుణాలలో మనది ఏ గుణమో నిర్ణయించుకోవాలి. పై గుణమును అందుకోడానికి చారడానికి ప్రయత్నించాలి. ఇది గుణ త్రయ విభాగ యోగ అధ్యాయపు ఉపదేశము.
త్రయ గుణ్య విభాగయోగమను పదునాల్గవ అధ్యాయము ముగిసింది.
ఓం శాంతిః శాంతిః శాంతిః





