Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
అందరం ఇంటికి చేరాం. అమ్మ ఇచ్చిన చాయ్ చప్పరిస్తూ ముచ్చట్లన్నీ చెప్పాను.
"చెప్పకపోతివి. మేము రాకపోయినాం?" అన్నారు అందరూ ఏదో ఆనందం జారిపోయినట్లు!
పందొమ్మిది
"అచ్చేద్యో2య మదాహ్యో2యం":
1945 ఏప్రిల్ నెలలో 12 వ ఆంధ్రమహాసభలు ఖమ్మంమెట్టులో జరిగాయి. ఇవి ప్రజల ఉద్యమాల చరిత్రలో ప్రగతి బావుటాలు. ఇంతటి ఉత్సాహం - ఆవేశం ప్రజలలో కనిపించిన సభలు మళ్లీ జరగలేదు. ఇంతటి ప్రజా సమీకరణ మళ్లీ జరిగిన జాడలు కనిపించవు. తమ విముక్తికోసం ప్రజలు స్వచ్చందగా - అంత పెద్ద సంఖ్యలో చేరి ఉండరు. ఈ సభలకు 30 వేల పైచిలుకు ప్రజానీకం హాజరయినట్లు అంచనా.
జనం కూడటం కాదు - వెల్లివిరిసిన ఉత్సాహం. అది ఎంత అని ఎలా చెప్పడం? గ్రామాలకు గ్రామాలు తరలి వచ్చాయి. కాలినడకన - బండ్లమీద జనం సాగారు. జాతరకు వలె సాగారు. ముసలీ - ముతక, చిన్నా - పెద్ద, ఆడా - మగ తరలారు. తరలడం ఊరికే కాదు. పదాలు పాడారు. నినాదాలు చేశారు.
జలప్రవాహంలా గర్జిస్తూ జనప్రవాహం సాగింది.
అంతప్రజ రిక్త హస్తాలతో తరలలేదు. కొందరు కూరల తట్టలు - కొందరు పచ్చళ్ల జాడీలు - కొందరు విస్తళ్లకట్టలతో బయలుదేరారు. మేమూ అట్లాగే బయలుదేరాం. మహానదిలో కలిసే ఉపనదుల్లా జనప్రవాహాలు మహాప్రవాహాల్లో కలిశాయి.
ఖమ్మం మెట్టులో జన ప్రవాహాలు జనసాగరం అయినాయి. ఖమ్మంలో నేల ఈనినట్లు ప్రజ. గాలి ఈనినట్లు అరుణ పతాకాలు.
ఖమ్మం ప్రజలతో నిండింది.
ఖమ్మం ఎర్రజండాలతో నిండింది.
సభాస్థలిలో వంటలు! అదొక కర్మాగారం. అందరూ స్వచ్చందం. వందలమంది కూరగాయలు తరిగారు. వందలమంది వంటలు చేశారు. వేలమంది వడ్డించారు. పదుల వేలమంది భుజించారు.
ఎవరిని చూచినా 'లాల్ సలాం' - ఎవరిని చూచినా "ఇన్ఖిలాబ్ జిందాబాద్."
అదొక పబ్బం. అదొక పండుగ. అదొక ఉత్సవం. అదొక జాతర. అదొక తిరునాళ్లు.
అది ఉత్సాహ తరంగం. ఉద్వేగ తరంగం. ఉద్రేక తరంగం. అది క్రాంతి తరంగం. అది విప్లవ తరంగం.
ఎహ్ లహర్ హై ఇన్ఖిలాబ్ కా - ఇదొక విప్లవతరంగం.
ఆ సాయంత్రం పన్నెండు జతల ఎడ్లు కట్టిన బండి బయలుదేరింది. బండి ముస్తాబయింది. పూల దండలతో ముస్తాబయింది. ఎర్రజండాలతో ముస్తాబయింది. బండి మీద అధ్యక్షులు రావి నారాయణరెడ్డిగారు. వారిసరసన బద్ధం ఎల్లారెడ్డిగారు. బండి పురవీధుల్లో సాగింది. ఉప్పెనలా జనం - ముందూ వెనుకా - బండి కదలడం కష్టం అవుతున్నది.
బండి, జనం పురవీధుల్లో ఊరేగి సభాస్థలం చేరుకున్నది. చీకటిపడింది. అయినా వెలుగు! వందల పెట్రోమాక్సులు - వేల కాగడాలు. వేదికమీద రావి నారాయణరెడ్డిగారు అధ్యక్షులు - బద్దం ఎల్లారెడ్డిగారు - సర్వదేవభట్ల రామనాథంగారు - చిర్రావూరి లక్ష్మీనరసయ్యగారు - రాజబహదూర్ గౌడ్ గారు - మఖ్దూం మొహియొద్దీన్ గారు.
పాటలతో కార్యక్రమం ప్రారంభం. దాశరథి పాటలు కూడా పాడాడు. అన్నయ్య ప్రత్యేకం రచించాడు వాటిని.
పాటల తరువాత ఉపన్యాసాలు. అందరూ యువకులు. విప్లవ పథంలో ఉన్నవారు. మాటలతో మంటలు లేపారు. చిచ్చు రగిల్చారు. సభలో చప్పట్లు.
ఆంధ్రమహాసభ జిందాబాద్.
రావి నారాయణరెడ్డి జిందాబాద్.
బద్దం ఎల్లారెడ్డి జిందాబాద్.
విప్లవం వర్ధిల్లాలి!
నినాదాలతో దిక్కులు పిక్క టిల్లాయి.
తరువాత నాజర్ బుర్రకథ. నాజర్ ఆరోజుల్లో మాకు దేవుడు! అతడు గజ్జ కడితే కళామతల్లి ప్రత్యక్షం కావలసిందే! అతడు అడుగు వేస్తే శివస్వామి కదిలినట్లే! అతను కథ చెపితే ప్రజావాహిని పొంగినట్లే!
నాజర్ 'కష్టజీవి' బుర్రకథ చెప్పాడు. ప్రజ తమ కథ చెప్పినట్లే దుఃఖించారు. ఆవేశపడినారు. సంతోషించారు. అది మహత్తమ కథనం! అది అనితరసాధ్యం.
'కష్టజీవి' బుర్రకథవలె కదిలించిన బుర్రకథ మరొకటి ఉండదు.
'కష్టజీవి' కర్త సుంకర సత్యనారాయణగారు. ఏడవ దశకంలో సాహిత్య అకాడమీ వారు కర్నూలులో సభలు చేశారు. అవి కనుల పండువుగా జరిగాయి. అందులో ఇతరులతోపాటు నన్నూ సుంకరనూ సన్మానించారు.
సుంకరవారు వేదికనుంచి ఆ రోజు తమ జన్మదినం అని ప్రకటించారు.
అది విన్నాను. నాకు వేయబోయిన పూలదండను అందుకున్నాను. సుంకరవారి మెడలో వేశాను. ఆదరంగా ఆలింగనం చేశాను.
సభ ఉప్పొంగింది!
కరతాళ ధ్వనులు ప్రతిధ్వనించాయి!
అదొక మధురానుభూతి. ఒక మహా ప్రజా రచయితను ఆదరించిన తృప్తి.
ఆ తరువాత కొద్దిరోజుల్లోనే సుంకర సత్యనారాయణగారు పరమపదించారు.
"మా భూమి" అనే మహత్తరం అయిన నాటకం కూడా వారే రచించారు.
1947 చివర్లో గన్నవరంలో విడిసంలో "మా భూమి" నాటకం ప్రదర్శించారు. వేలమంది ప్రేక్షకులు. నేనూ వెళ్లాను. నాటకంలో ఒక సన్నివేశం ఏమంటే...
తెలంగాణంలో ఒక దొర - విసునూరు రామచంద్రారెడ్డి కావచ్చు. వాళ్ల గడీకి సర్కారీ అప్సర్లు వచ్చారు. వారికి చాయ్ అందించమంటాడు దొర. జీతగాడు పాలు లేవంటాడు. అపుడు దొర -
"అరె, పోయి ఊళ్ల బాలెంతల పాలు పిండుకరా పో" అంటాడు.
ఈ సన్నివేశాన్ని ప్రజానాట్య మండలివాళ్లు ఎంత గొప్పగా ప్రదర్శించారంటే ప్రేక్షకులు దొరను 'బాలింతల పాలు పిండమంటావుర' అని కర్రలతో స్టేజిమీదికి ఉరికారు!
అంతటి గొప్ప నాటకం అది. తెలంగాణ ప్రజా ఉద్యమానికి ఎంతగానో ఉపకరించిన నాటకం, వందల సార్లు ప్రదర్శింపబడిన నాటకం.
ఆ నాటక కర్త సుంకర సత్యనారాయణగారు.
ఖమ్మంమెట్టులో జరిగిన 12 వ ఆంధ్రమహాసభలో అనేక ప్రజా సమస్యలపై తీర్మానాలు చేశారు.
ప్రజలకు ఉపకరించే అనేక తీర్మానాలు చేశారు. వారిలో కొన్ని:-
1. ఆంధ్రమహాసభ - మహారాష్ట్ర పరిషత్తు - మజ్లిసులకు ప్రభుత్వంలో స్థానం కల్పించాలి. (స్టేట్ కాంగ్రెస్ మీద నిషేధం ఉంది. అందువల్ల దాన్ని ప్రస్తావించలేదు.)
2. చిన్నరైతులను విధిగా సర్కారుకు చెల్లించాల్సిన లేవీ ధాన్యం చెల్లింపునుంచి మినహాయించాలి. జొన్నలు రైతుల దగ్గర పల్లా 18 రూపాయిలకు కొంటున్నారు. 25కు అమ్ముతున్నారు. అమ్మేధర తగ్గించాలి. కౌలుదార్లకు రక్షణ కల్పించాలి.
3. జనగాం ప్రజల వీరోచిత పోరాటం సందర్భంగా నిర్బంధించిన ఆరుట్ల రామచంద్రారెడ్డి - గోపాలరెడ్డి - చింతల నర్సింహారెడ్డిని విడుదల చేయాలి. చట్టవ్యతిరేకంగా ప్రవర్తించి, దౌర్జన్యం జరిపే దొరలమీద కఠినచర్యలు తీసుకోవాలి.
4. సింగరేణి గని కార్మికులకు రోజుకు రూపాయి మాత్రం కూలి చెల్లిస్తున్నారు. వారికీ ఇతర కార్మికులకూ కరువుబత్తెం చెల్లించాలి.
1934లో ఖమ్మంలో జరిగిన మూడవ మహాసభలకు 1945లో జరిగిన 12 వ ఆంధ్రమహాసభలకు హస్తిమశక వ్యత్యాసం కనిపిస్తుంది.
1. అప్పటి ప్రభుత్వపు, సనాతనుల బలం ఇప్పటికి తగ్గిపోయింది.
2. 11 వ సభకు 10 వేలమంది ప్రజలు వచ్చారు. ఈ సభకు 30 వేల పైగా జనం వచ్చారు.
3. ఆనాడు ప్రజాసమస్యలను అంటుకోలేదు. ఈ సభలో ప్రజా సమస్యలగురించి చర్చించడం - తీర్మానాలు చేయడం జరిగింది.
ఖమ్మంమెట్టు సభలను గురించి మాడపాటి హనుమంతరావుగారు తమ గ్రంథంలో తక్కువ చేసి వ్రాశారని రావి నారాయణరెడ్డిగారు అంటుండేవారు. అయితే, మాడపాటి వారు ఖమ్మం సభలను గురించి ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు.
ఖమ్మంమెట్టులో 12 వ ఆంధ్రమహాసభలు విజయవంతంగా ముగిశాయి.





