Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    పొగలు చిమ్ముతూ లాంచి వచ్చింది. పెనుధ్వనిచేస్తూ ఆగింది. 'లాంచి - రాజమండ్రి లాంచి' - ప్రయాణీకులను పిలుస్తున్నారు. ఎక్కాను. కూర్చున్నాను. లాంచి రొదపెడ్తూ సాగింది. జోరున వాన మొదలయింది. కుండపోత! గోదావరి పెరుగుతున్నది.

 

    జోరున వాన.

 

    వరదలో నావ.

 

    ఒడ్డున చిక్కని - పచ్చని అరణ్యం!

 

    చెట్లమీద ముడుచుకున్న పక్షులు!!

 

    ఏ పయనం! ఎలాంటి పయనం!! ఎంతటి సంబరం! ఎంతటి ఆనందం!!

 

    ఆనందం అంబరం అవుతున్నది!

 

    వాన నీళ్లలో పడే చప్పుడు!

 

    నీటిని చీల్చుకుని నావ పయనం!!

 

    "గోదావరి పొంగుతూంది. లాంచి మాధారంలో ఆగదు. అమరారంలో దిగాలి" అన్నారు. దిగక తప్పలేదు. చిమ్మన చీకటి! పెనువాన! దారి తెలియదు. ఎక్కడికి పోవాలి? ఏమీ అర్థంకాదు. వణుకుతున్నాను. అమరారంలో సుబ్రహ్మణ్యం బంధువులు ఉన్నారు. అది విన్నాను. అడిగాను. వారింటికి చేరాను. ఇద్దరు పూర్వ సువాసినులు. అత్తా - కోడండ్లు. కోడలు పరువంలో ఉంది. ఉరుకులు పెట్టాల్సింది. నిలిచి ఉంది. పరవళ్ల గోదావరి నిలిచినట్లుంది.

 

    వారు సాదరంగా ఆహ్వానించారు. పొడి బట్టలు ఇచ్చారు. తడికట్టెలు - పొగ - ఇంట్లో వంట చేశారు. పీట వేశారు. విస్తట్లో అన్నం ఆవకాయ వడ్డించారు. కమ్మని నేయి వేశారు. చారు. ఎర్రగా కాగిన పాలు. వీటినిమించి ఇద్దరూ ఎదురుగా కూర్చున్నారు. ముచ్చట పెట్టారు. నేను తెలుసును అన్నారు. సుబ్రహ్మణ్యం చెప్పాడు అన్నారు. మెచ్చుకున్నట్లు మాట్లాడారు.

 

    పొగ చిమ్మే దీపం! మనకవెలుగు!! అందులోనూ ఆమె పరువం!!! కటిక చీకట్లో వెలిగిన వెన్నెల్లా ఉంది.

 

    అది పూరిల్లు. వెదురు తడకలకు మట్టి పూసిన గోడలు. నులక మంచం మీద పడుకున్నాను. బయట వాన. ఇల్లు కురుస్తున్నది. ఒక్కొక్క చినుకు నేలకు చిల్లులు చేస్తున్నది.

 

    నిలిచినా ఉరుకుల గోదారి.

 

    కటిక చీకట్లో వెలుగు వెన్నెల.

 

    ఆ రాత్రి నిదురలేదు. అయినా తెల్లారింది. వాన వెలిసింది. మబ్బులు - విరహపు ప్రియుని కోసంలా ఉరుకుతున్నాయి. పక్షులు తడి రెక్కలతో ఎగిరిపోతున్నాయి. అల్లరిమానిన అమ్మాయిలా అంతా శాంతించింది. సూర్యుడు ఉదయించాడు. వెలుగులు పరుస్తున్నాడు.  

 

    నాకు వేడి వేడి బెల్లపు చాయ్ ఇచ్చారు. చాల రుచిగా ఉంది. పీట మీద కూర్చున్నాను. చప్పరిస్తున్నాను. అత్త మాట్లాడుతున్నది. కోడలు పెదవులు కదలవు. ఆమె చూపులు పలకరిస్తున్నాయి.

 

    "చిన్నవాడివి. బాటసాంతం అడివి. ఎలా చేర్తావో? మా పాలేరు గండి దాటిస్తాడు" - అత్తగారు అన్నది. నేను బయలుదేరాను. వెంట పాలేరున్నాడు. అతని చేతిలో బల్లెం ఉంది. ఇద్దరూ నన్ను సాగనంపడానికి వాకిట్లోకి వచ్చారు.

 

    "మళ్లీ వస్తారా?" కోడలు అడిగింది.

 

    "తిరిగి వెళ్లేప్పుడు" అన్నాను - సాగిపోతున్నాడు.

 

    నేను వెనుకకు చూడడం సభ్యత కాదు. ఆమె ఇంకా చూస్తున్నది. అది మనసు చెపుతున్నది.

 

    "గండంటే - దట్టపు అడవి - పులులు, చిరుతలు ఉంటాయి." కోయపాలేరు చెపుతున్నాడు. నేను తేరుకుని చూచాను. ఎండదూరని అడివి. బాట కనపడడు చేసుకోవాలి. కోయదొర బల్లెంతో బాట చేస్తున్నాడు.

 

    "అగ్రతస్తే గమిష్యామి మృద్నన్ పాపాణ కంటకాన్" - "నీముందు నడుస్తాను. రాళ్లూ ముళ్లు తీస్తాను. బాట చేస్తాను" అంటాడు లక్ష్మణుడు రామునితో. ఆ అవసరం తెలిసింది.

 

    ఎక్కడో పులి వాసన - దూరాన చిరుత జాడ. అన్నీ కనిపెడ్తున్నాడు దొర. ముందునుంచే జరజర పాము. ఆపుతున్నాడు దొర. జింకలు చాటుకు నక్కుతున్నాయి. కుందేళ్లు ఉరుకుతున్నాయి. గువ్వలు డప్పులు కొడుతున్నాయి. చిలుకలు పలుకుతున్నాయి. గుంపులు గొరవంకలు.

 

    అడవి భయం. నిజమే. మనసును మరిపించే అందం! మనం ఎంత పోగొట్టుకున్నామో!

 

    గండి దాటిందన్నాడు దొర. మారు మాట్లాడలేదు. నా మాట ఆలకించలేదు. దొర బల్లెంతో వెనుతిరిగాడు. అడవిలో కలిసిపోయాడు.

 

    చిక్కటి అడవి అయిపోయింది. అడవి ఇంకా ఉంది. అది పల్చగా ఉంది. వెలుగు పడుతున్నది. తోడులేక నడవడం గగనమే! గుబులుగా ఉంది. భయంగా ఉంది. గుండె దడదడ లాడుతున్నది. వెనక్కుపోలేను. ముందుకే సాగాలి. మనిషి కనిపించడు. ఊరిజాడ లేదు. సాగుతున్నాను. బాగా నడిచినట్లున్నాను. ఆకలి - అడవిలో ఏం దొరుకుతుంది అనుకుంటాం. అసలు అడవిలో దొరకంది ఏమిటి? మన జ్ఞాన-విజ్ఞానాలు సహితం అడవినుంచే వికసించాయి.

 

    బాటలో - ఈ అడవిలో కాలిబాట ఉంది. పిల్ల కాలువ కనిపించింది. విశ్వనాథ కిన్నెరసానిలా ఉరుకుతున్నది. దాని వడ్డున నేరేళ్లు - నేరేడు చెట్లు. ఆ చెట్ల కింద నేరేడు పళ్లు. నల్లగా - నీగ్రోయువతి బుగ్గలా - రాలి ఉన్నాయి. పచ్చిక మీద కూర్చున్నాను. నేరేడు పళ్లు ఫలహారం చేశాను. దోసిలితో పిల్లకాలువ నీళ్లు తాగాను. కడుపు నిండింది.

 

    మళ్లీ కాలిబాటమీద సాగాను. పచ్చని చెట్లు - చిలకల పలుకులు - గలగల నీటి సవ్వడి - పరిగెత్తే లేళ్లు - సాగుతున్నాను. బాట చీలింది. ఎటు పోవాలో తెలియదు. మనిషి అలికిడి లేదు. దుఃఖం పొంగి వచ్చింది. ఏడ్చాను. ఎందుకు వచ్చినట్లు? ఏమి సాధించనున్నట్లు?

 

    దేవుని వలె ప్రత్యక్షం అయింది ఒక కోయల జంట. బుడుతణ్ణి బుజాన వేసుకుని దొర నడుస్తున్నాడు. దొరసాని వెనుక వస్తున్నది. వారిని చూచాను. ప్రాణం లేచి వచ్చింది. బాట అడిగాను. వారు చెప్పారు. నేను సాగాను.

 

    కొంతదూరం వెళ్లాను. గోదారి కనిపించింది. దాని వడ్డునే బాట. చెట్టూ చేమా ఉన్నాయి. అడవి పల్చబడింది. కొంగల బారులు కనిపిస్తున్నాయి.

 

    మాధారం వచ్చింది. ఉత్సాహం కలిగింది. అది ఊరు కాదు. గూడెం. కొన్నే పర్ణశాలలున్నాయి. ఇల్లు దొరికింది. పెద్ద మనిషి మంచంలో ఉన్నాడు. నా బాధలు విన్నాడు. విల విలలాడారు. రమ్మనటం తప్పయింది అన్నారు. అదేం కాదన్నాను. ఒక్కనికి చదువుచెపితే ఎంతో ఆనందం అన్నాను.

 

    సుబ్రహ్మణ్యం ఏర్పాట్లు చేశాడు. వేణ్ణీళ్లు స్నానం చేశాను. వేడి అన్నం తిన్నాను. కాళ్లు సలుపుతున్నాయి. పడుకున్నాను. నిద్రపోయాను. సాయంత్రం లేచాను. మళ్లీ జల్లు. కుండెడు వాంతి చేసుకున్నాను. పులసరం వాసన. ఇంటి వాళ్లు బెదిరిపోయారు. సుబ్రహ్మణ్యానికి తెలుసు. ఇది మామూలే!

 

    తెల్లవారి ప్రయాణం. మూటా ముల్లే సర్దుకున్నాం. గోదావరి వడ్డుకు చేరాం. లాంచి పోతుంటుంది. బట్టలు పతాకాల వలె ఊపి - కేకలు పెట్టి పిలవాలి. పిలిచాం. లాంచి ఒడ్డుకు రాలేదు. ఇంటికి చేరుకున్నాం. అలా వారం గడిచింది. అది అనుకున్నది కాదు. అమ్మ ఏడుస్తుంది. భద్రాద్రి భయం! మరో మార్గం లేదు. పడవలో గోదావరి దాటాలి. గౌరీదేవి పేట చేరాలి. అక్కణ్ణుంచి భద్రాచలం నడవాలి.

 

    అవతల వడ్డు ఆంగ్రేజు రాజ్యం. అడవి ఇంత లేదు. రోడ్డున్నది. సుబ్రహ్మణ్యం, నేను గౌరిదేవి పేటనుంచి రోడ్డున పడ్డాం. ఇద్దరం పిల్లలమే - రెండుమూడేండ్లు తేడా! మధ్యమధ్యన బెల్లపు చాయ్ తాగుకుంటూ భద్రాచలం చేరాం. కాళ్లు సలుపుతున్నాయి. పడవమీద గోదావరి దాటాం. బస్సెక్కి కొత్తగూడెంలో దిగాం. ఆ రాత్రి అన్నపూర్ణమ్మగారి సత్రం. తెల్లవారి రైల్లో గార్లలో దిగాం.

 

    స్టేషనులో మిత్రబృందం నిరీక్షిస్తున్నది. బతికి వచ్చినందుకు అభినందించారు. ఆలింగనం చేసుకున్నారు. స్టేషను మాస్టర్ డేవిడ్ కూడా సంతోషించాడు. మిత్రబృందంతో వెళ్తుంటే వీధుల్లో అందరూ అడగడమే!

 

    అందరూ నేను తిరిగి రానని నిశ్చయించుకున్నట్లున్నారు!

 

    అమ్మా, చెల్లెళ్లు వాకిట్లో ఎదిరి చూస్తున్నారు. వార్త అందింది. అమ్మ దూరంగానే చూచింది. ఉరికి వచ్చింది. నన్ను ఆధారాన్ని వలె పట్టుకుంది. ఏడ్చింది. కన్ను సుఖానికీ నీరు కారుస్తుంది. దుఃఖానికీ నీరు కారుస్తుంది. సుఖదుఃఖాలు ఒకలాంటివే అనే మహత్తర సత్యాన్ని వెల్లడిస్తాయి కన్నీళ్ళు.

 

    "నవ్వినా - ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి" అన్నారు మిత్రులు ఆత్రేయ.

 

    "నసుఖాల్లభతేసుఖం - సుఖం నుంచి సుఖం పుట్టదు" అంటాడు వాల్మీకి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.