Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    1971లో తిరుమల రామచంద్రగారితోబాటు - నా 'చిల్లరదేవుళ్లు' నవలకు - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకునే అదృష్టం నాకు కలిగింది.

 

    అడవి బాపిరాజుగారు తమ నవలలు 'తుఫాను', - "హిమబిందు" "గోనగన్నారెడ్డి" మున్నగునవి మీజాన్ లో సీరియల్ గా ప్రచురించారు. బాపిరాజుగారు ఎప్పటికప్పుడు వ్రాసి అచ్చుకు ఇచ్చేవారు. గత సంచిక చూచేవారు కారు. ఒకసారి క్రితంసంచిక పాత్రపేరు ఈ సంచికలో మారింది. ఇది రాజుగారి దృష్టికి తేవడం జరిగింది. వారు ప్రతిభావంతులు. తరువాతి సంచికలో పాత్రపేరు మార్పును గురించి ఒక కథ అల్లారు!

 

    కొందరు ఏకీభవించక పోయినా మీజాన్ తెలంగాణా ప్రజాపోరాటానికి సాయపడిందనే నా సంపూర్ణ విశ్వాసం. ఖమ్మంలో జరిగిన 12 వ ఆంధ్రమహా సందర్భంగా మీజాన్ వెలువరించిన ప్రత్యేక - విశేష - సంచిక ఎంతో విలువయింది.

 

    బ్లాక్ మార్కెటును ఎదుర్కొనే ఉద్యమంలో భాగంగా నేను మీజాన్ కు ఒక లేఖ వ్రాశాను. దానిశీర్షిక 'గార్లలో చెక్కెర కరువు.' నల్లబజారును గురించి - పంచదార భాగోతాన్ని గురించి వివరంగా వ్రాశారు.

 

    నా లేఖ మీజాన్ లో పడింది. అది నా తొలిరచన. ఇలాంటి వార్త రావడం - అదీ గార్లను గురించి కావడం. ఆ ప్రాంతం సాంతంలో సంచలనం కలిగించింది. జనం పత్రిక కోసం ఎగబడ్డారు. ప్రతులు వ్రాసుకున్నారు. గ్రామ గ్రామాన చదువుకున్నారు.

 

    తమను అద్దంలో చూచుకున్నట్లు తమ వార్తను చూచి మురిసిపోయారు! అంతకు ముందు అలాంటి వార్త రాలేదు. అదే మొదలు. ఎందరో నన్ను అభినందించారు. నా మీద ఏం జరుగుతుందో అని భయపడ్డారు. నేను భయపడలేదు. నాకు ప్రజాబలమే కవచనం.

 

    ఆ వార్త ప్రభుత్వాన్ని కదిలించింది. తాసిల్దారు నన్ను పిలిచాడు. కూర్చుండబెట్టాడు. అతనిముందు అంతా నుంచోవాల్సిందే. నాకు నీతులు బోధించాడు.

 

    "బేటా! బద్ హోనా బద్నాం నహీఁ హోనా - చెడు కావచ్చు, చెడు పేరు తెచ్చుకోవద్దు" అని షికాయతులుంటే తన దగ్గరకి రమ్మన్నాడు. పత్రికలకు మాత్రం వ్రాయవద్దన్నాడు.

 

    ప్రభుత్వం పంచదార డీలరును మార్చింది. పంచదార పంచేందుకు ఒక పద్ధతిని ఏర్పరచింది.

 

    ఆరోజుల్లో పత్రికలకు అంతటి విలువ ఉండేది. ఒక్క వార్త - వార్తకూడా కాదు లేఖ -అంత సంచలనం కలిగించింది. పత్రికలకు ప్రజాసేవా భావం ఉండేది. అవి ఆర్ధిక లాభాలకోసం అవతరించలేదు. లాభాల లోకంలో అవి అంతరించాయి!

 

    ఇవి ఉదాహరణలు మాత్రమే. సంఘటనలు అన్నీ వ్రాయడం అసాధ్యం. వర్తకులకు వ్యతిరేకమే చేశాను. కాని, వర్తకులకు నా విషయంలో అభిమానం తగ్గకపోవడం విశేషం! అది వారిలోని గొప్పదనం.!!

 

    చెక్కెర కోటా కోల్పోయిన వర్తకుడు నన్ను మచ్చిక చేశాడు. నాతో పాన్ దుకాణం పెట్టించాడు. నేను కిళ్లీలు కట్టాను. ఆకులు అమ్మాను. సిగరెట్లు అమ్మాను. అరటిపళ్లు అమ్మాను. అది కొంతకాలం తరువాత వదిలాను. అప్పుడు కూడా ప్రజలు నన్ను చిన్నచూపు చూడలేదు.

 

    సారాయి దుకాణంలో భువనగిరినుంచి వచ్చిన కేశవులు ఉండేవాడు. అతను కమ్యూనిస్టు ఆంధ్రమహాసభ కార్యకర్త. అతనితో సారాదుకాణంలో గంటలు గడిపేవాణ్ణి. మిత్రులందరూ - జనం ఏమనుకుంటారో - వెళ్లవద్దు అనేవారు. నేను మానలేదు. జనం ఏమీ అనుకోలేదు!

 

    మాన్ సింగ్ అని పాన్ దుకాణం అతను ఉండేవాడు. అతనికి నేనంటే అపరిమితం అయిన అభిమానం. నేను రోజు సాయంత్రం అతని దుకాణానికి వెళ్లాలి. నాకోసం ఉదయంనుంచీ నీళ్లలో ఉంచిన సోడా కొట్టి ఇచ్చేవాడు. ఈనెలు తీసిన తమలపాకుతో పాన్ కట్టి అదీ, ఒక సిజర్ సిగరెట్టు ఇచ్చేవాడు. ఎన్నడయినా పొరపాటున వెళ్లకుంటే మాన్ సింగ్ దుకాణం వదిలి వెతుక్కుంటూ వచ్చేవాడు. మాన్ సింగ్ అలా వచ్చినపుడు నా హృదయం ద్రవించేది! కళ్లు చెమర్చేవి! ఇది ఎక్కడి బంధం! ఈ రుణం ఎలా తీరేను?

 

    పోలీసుచర్య జరిగింది. గార్ల తిరిగి వచ్చాం. మాన్ సింగ్ కనిపించలేదు. అతని దుకాణపు స్థలానికి చేరుకోగానే కాళ్లు నిలిచిపోయేవి! మాన్ సింగ్ లేడని నమ్మడానికి మనసుకు కొంత సమయం పడ్తుంది.

 

    ఆనాటి గార్ల ప్రజల ఆత్మీయత - అనురాగం - అభిమానం - ప్రేమ - వాత్సల్యం తీర్చడం అసాధ్యం. మరవడమూ అసాధ్యమే!

 

    వయోజన విద్య:

 

    నేనూ నాగేశ్వరరావు వయోజనులకు రాత్రి పాఠశాలలు నడిపాం. జీయాజిగూడెం హరిజనవాడలో నాగేశ్వరరావు, పుట్టకోటలో నేనూ నిర్వహించాం. పలకలు - పుస్తకాలు - లాంతర్లు మేమే ఇచ్చాం. హరిసర్వోత్తమరావుగారి వాచకం చెప్పినట్లు గుర్తు. అక్షరమాలిక చెప్పకుండా పదాలతో చదువు చెప్పాం. కొద్ది రోజుల్లో చదవడం - మరికొద్దిరోజుల్లో వ్రాయడం నేర్పాం. వారు తొలిసారి పత్రిక చదివినప్పుడు వారికి కలిగిన ఆత్మవిశ్వాసం - వాళ్లకళ్లలోని వెలుగు చూడడం అద్భుత అనుభవం.

 

    విశేషం ఏమంటే - తాసిల్దారు అనుచర వర్గంలోని మస్తాన్ - సిగ్గుపడుతూ - నా దగ్గరికి చదువుకోవడానికి వచ్చాడు. అతనికి ఉర్దూ నేర్పాను. అతడు నన్ను 'మౌల్వీ'గా అభిమానించాడు.

 

    పూలదండల పెళ్లిళ్లు:

 

    బ్రిటిషాంధ్రంనుంచి వచ్చి స్థిరపడినవారిలో ఎక్కువమంది కమ్మవారు. త్రిపురనేని రామస్వామి చౌదరి అభిమానులు. వారు కమ్మబ్రాహ్మణున్ని తెచ్చుకున్నారు. అతను వారికి పౌరోహిత్యం నిర్వహించేవాడు.

 

    ఆనాడు నామీద ప్రభావం వేసిన పుస్తకాల్లో రజనీ పామీదత్ 'ఇండియా టుడే' ఒకటి. భారతజాతి దరిద్రానికి ప్రధాన కారణం పెళ్లిళ్లకు, చావులకు పెట్టే కర్చేనని తేల్చి చెప్పాడు. పురోహితుని కులం మారడం చాలదు. ఆడంబరాలు పోవాలి, మంత్రాలు లేని నిరాడంబర వివాహం జరగాలని నచ్చచెప్పాను. కొన్ని గ్రామాలలో పది దాకా పూలదండల పెళ్లిళ్లు జరిపించాను. వారి పేర్లు గుర్తులేవు. వారు కూడా ఇప్పటికి తాతలు అయ్యుంటారు!

 

    అందాల అడవి:

 

    సన్నిధానం సుబ్రహ్మణ్యం మా ఇంట్లో ఉండి చదువుకునేవాడు. వాళ్లది భద్రాచలం దగ్గర - గోదావరికి ఆవలి వడ్డు గ్రామం. ఎందుకో ఇంటికి వెళ్లాడు. చాలారోజులవరకు రాలేదు. వాళ్ల తండ్రి - పేరు గుర్తులేదు - ఉత్తరం వ్రాశారు. వారికి జబ్బుగా ఉందట - నన్ను వచ్చి సుబ్రహ్మణ్యాన్ని తీసికెళ్ళమని. అంత దూరం వెళ్లడం ఏమిటి అనుకోలేదు. సుబ్రహ్మణ్యానికి చదువు రావాలి. అది ఆతురత. అమ్మ వద్దన్నది. అయినా బయలుదేరాను.

 

    భద్రాచలం ప్రమాదకరం అని అమ్మ నమ్మకం. నాయన పుట్టినప్పణ్ణుంచీ - 1898 నుంచీ -మా వాళ్లు ఎవరూ భద్రాచలం తొక్కలేదు. నాకు భయం తక్కువ. సాహసం ఎక్కువ. బయలుదేరాను.

 

    డోర్నకల్లునుంచి రైల్వేలైను కొత్తగూడెం కోసం వేసింది కాదు. భద్రాచలం కోసం వేసింది. కొత్తగూడెం రైల్వేస్టేషను పేరు భద్రాచలం రోడ్డు. నేను రైలు దిగేవరకు చీకటి పడుతున్నది. అప్పుడే కొత్తగూడెం ఏర్పడుతున్నది. అన్నీ పూరిండ్లు.

 

    స్టేషను పక్కనే 'అన్నపూర్ణమ్మగారి' సత్రం ఉంది. అదీ పూరిల్లే. ఆమె భద్రాచలం యాత్రికులకు నిరతాన్నదానం చేస్తుంది. నాకు భోజనం పడదు. ఆ రాత్రి ఆ సత్రంలో పడుకున్నాను. ఉదయం సీకుల బస్సు ఎక్కాను. యుద్ధం రోజులు. పెట్రోలు లేదు. బస్సులు బొగ్గుతో నడుస్తున్నాయి.

 

    కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకూ చక్కని - పచ్చని అడవి. దుమ్మురోడ్డుమీద బస్సు. అడవి జంతువులను బెదిరించడానికి నిరంతరం హార్ను మ్రోగుతున్నది. అయినా జింకలు - దుప్పులు - మనుబోతులు - నక్కలు - కుందేళ్లు రోడ్డుదాటి పరిగెత్తుతున్నాయి. పెద్దపులులు - చిరుతపులులూ - ఎలుగ్గొడ్లు ఉన్నాయట. బయటపడుతుంటాయట. మా బస్సుకు ఎదురుపడలేదు. సుమారు పదింటికి గొమ్మూరు చేరుకున్నాను.

 

    గోదావరి పరవళ్లు తొక్కుతున్నది. ఎర్రని జలరాశి త్రుళ్లిత్రుళ్లి పడుతున్నది. సుళ్లు తిరుగుతున్నది. అంతటి నదిని నేను అప్పటికి చూడలేదు. ఎంత అందం! ఎంతటి ఆనందం!! అందం నిండుదనంలో ఉంది! అందం సమృద్దిలో ఉంది!! పడవ వచ్చింది. పదిమంది పడవను ఒడ్డుకు లాగడం - కట్టడం - ప్రయాణీకులను ఎక్కించడం - వాళ్ల అరుపులు - కేకలు - మాటలు - అంతా నాకొక వింత. పడవ ఎక్కాను. భద్రాద్రి చేరాను. లాంచీ నాలుగింటికిగాను లేదన్నారు.

 

    భద్రాచలం మా తాతగారి ఊరు. మా నాయన పుట్టిన ఊరు. మా ఇంటిపేరే దాశరథి. రాముడు ఉన్నాడు అక్కడ. ఎక్కడికీ వెళ్లలేదు. కాస్త కాఫీ తాగి వచ్చాను. గోదావరి ఒడ్డునే కూర్చున్నాను. గోదావరిలో ఏదో ఆకర్షణ ఉంది - అనుబంధం ఉంది. అది వదలదు. పడవలు రావడం, సరుకులు దించడం, ఎక్కించడం. శ్రామికుల సమిష్టి కృషి. వారి మాటలు - నవ్వులాటలు - హాస్యాలు పరాచికాలు - కాలం ఇట్టే గడిచిపోయింది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.