Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ సోమసుందర్, ఆవంత్స
చైనా వృత్రదంబోళి
మధుర మధుర నిక్వణాల సమశ్రుతుల ఏకాంత హృదయాల
నులివెట్టే బాధలు భయాలు దుఃఖాశ్రువులు - మంటల
రేపే సంజవెలుగులో నా గుమ్మం పొదిగిట ఒదిగి
దాగున్న వా రెవరు?
ఎవరి భాగ మిక్కడ దాచేమని వచ్చారు?
మానసిక రోగాల సమర భీ తావహాల నయంచేయగల
చేవగల శాంతియుత సదాలోచనా మూలికల
నా నుంచి వేరుసేయు కుతంత్రంతో, కుట్రతో
నిరీక్షిస్తున్నారల్లే ఉన్న దెవ్వరు మీరు?
మనసు మరచిన పరాకుల మందసంలో దాచుకున్న
సున్నితంపు పరదాలలోని సరదాల పరపర చింపేందుకు
వచ్చారా? తరతరాల గతానేక జీవిత వృత్తాల రత్నకంబళ్ళు
దులిపేందుకు, జ్ఞాపకాల రాల్చేసేందుకా మీరు?
మచ్చికోలుమాటలు చెలిమి నటించి వలపు కలల పోకిళ్ల తలపించి
దగాజేసి జులం జరుప పూనిన వంచకులా, గోమాయువులా?
ఘనతర పదజాలంతో నన్ను సంబోధించకండి!
నిజతత్త్వం తెలిసింది మీరు గోముఖ వ్యాఘ్రాలు!
ఆర్భాటాల మేఘాళిని నాపైకి తోలకండి!
ఏ వికటాట్టహాసాలు గాని వినిపించనేరని ఈ గహన గహ్వరాన
నే నేకాంత హర్మ్యాన్ని నిర్మించుకున్నా నదృష్టవశాన;
నా సుమపేశల హృదయాన్ని దురాక్రమించకండి.
ఖరాబు చేయకండి, వికారాల ఖురాలకాల మ్రోగించకండి.
దుర్ మోహాల త్రిశ్రగతి రగడలతో జగడం సాగించకండి.
నా గడప త్రొక్కకండి, నా యెడద నలుపకండి, తొలగండి!
భూతకాలమహారణ్యమధ్యంలో ప్రేతకంఠాల దావాగ్నిచ్చటలై
మండే క్రూరాతిక్రూరమైన మీ అక్షుల్ని సారించకండి!
భయంకరమైన సుమజీవన విహ్వలమైన ఆ అర్ధరాత్రిని
జ్ఞాపకం చేయకండి; నా మూపున పాపాల బస్తాలు త్రోయకండి!
నా యీ శాంతినివాస గృహలక్ష్మి వసుంధరను చెరచకండి;
ఘోరాల ఉపద్రవాల విషద్రవాలను ప్రసరించకండి;
వైదొలగండి సత్వరం, వైహాయసం గర్జిస్తోంది వినిపించుకొండి;
మీరంతా మిమ్మల్ని మీరే మరచిపోయినవాళ్లు,
భూతకాల ప్రేతాత్మలతో జీవిస్తున్నవాళ్లు,
పరకాయ ప్రవేశంచేసి చచ్చిన గొఱ్ఱెపొట్టేళ్ళు,
మళ్ళీ ఎప్పటికీ రాజత్వం సిద్ధించదు; మీరు పాపాల బళ్లు;
మీ దేహాన్ని చేరి మహారాజ్ఞి నాక్రమించుకొని
అనుభవిస్తున్నాడు హాయిగా దురహంకారి విశ్వకర్మ.....
చాలు చాలు ఇంక దయచేయండి; మీరు మారిపోయారు.
అప్పటివాళ్ళు కారు, నా భూదరకుడ్యాల దాటలేని కప్పలు!
క్రొంబూతల అరవింద హృదయాల మాలికల కూర్చుకొని,
ఆహ్లాద మరందాల పంచుకొని,
హర్ష వర్ధనీకాసారతటంపై కూర్చొని,
మంచితలంపుల మధుర స్వప్నాల మార్చుకొన్న
తపఃఫలాల పూరా పంటల్ని నూర్చుకొన్న
కౌముదీ పరిమిళిత శుభ తరుణాల మరచిన బఱ్ఱెలు మీరు.
లేనిపోని ప్రేమల నొలికించి ఉచ్చుల పన్నకండి;
వంచనల కుచ్చుటోపీల తగిలించకండి!
ధరాశా విస్తరణ దుర్మార్గంతో సౌజన్యం చచ్చి
పశుత్వం రెచ్చింది మీలో! సౌందర్యం చచ్చి
పిశాచం నిలిచింది మీలో! సోదరభావం చచ్చి
స్వోదరభావం మిగిలింది మీలో!
ప్రకృతిమాత లాలిత్యం పరిఢవిల్లుతూన్నది నాలో....
రామణీయకత్వాల నవమాధ్వీకరసాలు మరుగుతున్నవి నాలో!
విరాజమాన మానవత్వాల పురాచరితల సాగరతరంగాల
నవనవోన్మిషిత యౌవన శంఖధ్వని
అనునిత్యం మ్రోగుతున్నది నాలో!
అంచేతనే మీ అత్యాచారాల భరించలేను, కుహనా
యోచనలతో కుళ్లుతూన్న మీ ముఖం చూడలేను;
నా తపస్వినైన నా జపతపాల మకరంద మందాకినిలో
మీ దురాశా కాలకూటవిషం కలుపకండి;
నా మొగసాలల తెరచుకొనిన తలవాకిలినుంచి
తొలగండి; సదాశయాల రంగవల్లుల చెరపకండి;
ప్రేమల అగరుధూపాల పరిమళించు మునివాకిట
ప్రాకటమగు దుర్వాసనా నిశ్వాసాల వెదజల్లకండి.
కురూపాల విరూపాక్షుల్ని ప్రదర్శించకండి.
గంభీరంగా నిలిచి అలవోకగా కన్నులెత్తి తిలకించే
మహోల్లాస లాలసమూర్తి మంతనమే నా రూపం-
నిజం, మానవీయ నయనం; నా శాప విస్ఫులింగాల
కెఱయై భస్మీపటలం కాకండి, తొలగండి తొలగండి,
నా దారి కడ్డం రాకండి, కశ్మలాలు రువ్వకండి;
నా పవిత్ర ధ్యానాన్నరికట్టకండి; నా ధ్యాసల్ని విరచకండి;
సముల్లాస నవోన్మేష ప్రణయోత్సవ స్రోతస్వినిలో
మామక మానససరోవరంలో-కశ్మలాల కల్మషాల
కిల్బిషాల టన్నులకొద్దీ ఒంపకండి! దుర్ యోగాలను
నింపకండి! శ్మనాశనాన్ని చేపట్టకండి!.....
మంచి మనసుల క్రౌంచ మిథునాల వేటాడుతూ బ్రతికిన
తిరుగుబోతు నిషాదులు మీరు, సజీవ కుసుమాల
సుగంధాలు మరచిపోయిన నిశాచరులు మీరు.
ద్వేషానలాన్ని కురిపించకండి; ఓ హరి సాహరిగా
దుష్ప్రచారాల రోగక్రిములు రాల్చకండి.
మధుస్వప్నాల బృందావనాల మహోత్సాహ నగ శిఖరాల
ఎడచి గడచి మరచిపోయారు హృదయాన్ని;
మానవీయ ప్రవర్ధనా మహోత్సాహ సిద్దాంతాన్ని;
సుస్వాంతాహ్లాద శాద్వలాల నులివెచ్చని కోర్కెల
గుర్తించలేవు మీ గుండెలు, రాబందులు వాలిన రాతిబండలు!
నడవండి నడవండి!
మీ రసవరతం ద్వేషించే సౌజన్యం నాకు ప్రేమాతి ప్రేమపాత్రం
స్నేహం, సహజీవన రసతుందిల శాంతిమయ మధుపాతం!
కనుకనే మీరు నాకు శత్రువులు; వృత్రాసురులు,
సావేశిత హృదయంతో విశ్వంభరా కవితామతల్లికి
నేను కూర్చే నూతన సౌందర్యదామాల సహించలేరు;
పొండి పొండి! - అశక్తి దుర్జనత్వంగా
అర్రులు సాచుతారేమి నడవండి; వెనక్కు నడవండి!
* * * *





