Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ సుబ్బారావు, రాయప్రోలు
పిలుపు
మేలుకోవోయి భరతపుత్రుడ!
మేలుకోవోయ్ చిరచరిత్రుడ!
పిలుచుచున్నది వీరభారతి
ఎలుగు వినబడ అంతటన్,
నీ మాతృదేశంపు సీమలన్నీ నేడు
ఏమాయెనో చూడు ఏమరికలో నుండ.
మంచి మాటాడుచూ వంచించి, నమ్మించి
అట్టె తెగిపడ్డాడు
పొట్టి చీనావాడు. ||మేలుకో||
తూర్పు తలకడ దొంగ తోడేళ్లు మూగినవి,
ఉత్తరపు వాకిండ్ల ఉద్రేక మెగసింది,
ఎఱ్ఱ చీమలపుట్ట నెఱ్ఱిపడి పగిలింది,
వెట్టి సేనలమంద
చుట్టుపట్ల దిగింది. ||మేలుకో||
లేవరా పాలుమాలిక లింక చాలించి,
కట్టరా నీ వీరకాశె నడుము బిగించి,
పట్టరా ఒక చేత భద్ర భగవద్గీత
పట్టరా ఒకచేత
పదును పెట్టిన కత్తి ||మేలుకో||
కుల కక్షల్లో ఎన్నికల మొత్తు కోళ్ళలో
పరిమిట్ల తెరచాటు తిరగండ్ల పాటల్లో
చీకటి బజార్ల సినీమాల లాభాల
ప్రొద్దస్తమానాలు
పొర్లి తేలడమాయె. ||మేలుకో||
కసిపోని ముసలినక్కను చూడు నట్టింట,
కనిపెట్టు తలకొఱివి కామ్రేళ్లు పుట్టింట,
కల్ల వేదాంతాలు కపట సిద్ధాంతాలు
పడగ ముడిచిన పాము
పగ నమ్మరాదోయి! ||మేలుకో||
ఈ హిమాలయ సీమ - ఈ నదీనద పంక్తి -
ఈ మహారణ్యాలు - ఈ చరాచరకోటి
ఏనాడు వెలిసెనో - ఏ ఋషులు పెంచిరో
నేడు నాదంటాడు
నెట్టుకొని వచ్చాడు. ||మేలుకో||
తలచీర చెరిగినా - పొలిమేర జరిగినా
జాతిపేరు ప్రతిష్ఠ సన్నగిలి అడగారు
త్రిప్పించి మళ్లించి తిరగరాని విధాన
కొట్టరా చీనీల
గట్టు దాటేదాక. ||మేలుకో||
నూరు పువ్వులు పూచి - నూరు వన్నెలు విచ్చి
ఇరుగు పొరుగుల తోట లెదగాలె నంటాడు!
చీనా దగాదారి జిత్తు పన్నాగ మిది.
కాడి విరిగినగాని
కథ పూర్తి కాదోయి! ||మేలుకో||
స్నేహాల ముచ్చట్లు-ద్రోహాల మంత్రాలు
కల్లకపటాలొక్క కడవలో నింపాడు
బయిసిమాలి పరాకు పడరాదు - విడరాదు
లేపరా నీ జాతి
లావు చేవలు మెరయ
కొట్టరా చీనీల
గట్టు కావలిదాక! ||మేలుకో||
* * * *





