Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



        ఉపద్రష్టా నుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః
        పరమాత్మేతి చాప్యుక్తః దేహే స్మిన్ పురుషః పరః    23

    పరమాత్మ పరమపురుషునకు యీ దేహమే నివాసమగుచున్నది. అతడు సాక్షిగా ఉపద్రష్టయు అనుమంత, భక్తభోక్త మహేశ్వరులును అగుచున్నారు.

        య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ
        సర్వథా వర్తమానో - పి న స భూయో -భి జాయతే    24

    పురుషుడు, ప్రకృతిని, గుణసహితునిగా తెలిసినవాడు నిత్యము కర్మను చేసినవాడయ్యు పునర్జన్మ ఉండదు.

           

        ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మాన మాత్మనా
        అన్యే సంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే    25

    కొందరు ధ్యానించి ఆత్మలోనే స్వామిని దర్శింతురు. మరికొందరు ఆత్మలోనే ఆత్మను దర్శింతురు. ఇతరులు సాంఖ్య యోగమున, మరికొందరు కర్మయోగమున స్వామిని దర్శింతురు.

        అన్యేత్వేనవ మజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే
        తే పి చాతితరన్త్వేవ మృత్యుం శ్రుతిపరాయణాః    26

    ఇతరులకు తెలియదు. చెప్పినది విని ఆచరిస్తారు. వారికి గూడా సంసారము నుండి విముక్తి కలుగును.

        యావత్సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్
        క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భారతర్షభ!    27

    క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము వలననే సమస్త స్థావరం జంగములు ఉత్పన్నములు అగుచున్నవి. అర్జునా దానిని తెలియుము.

        సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్
        వినశ్య త్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి    28

    వినాశము అవినాశమును, ఎవడు తెలియుచున్నాడో వాడే జ్ఞాని.

        సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరమ్
        న హినస్త్యాత్మ నా - త్మానం తతో యాతి పరాంగతిమ్     29

    ఈశ్వరుడు సమస్తమున సమముగా నిలచియున్నాడు. అట్టివానిని సర్వత్ర సమముగా దర్శించువాడు ఆత్మ వినాశకుడు కాకున్నాడు. అతనికి పరమగతి లభించును.

        ప్రకృత్యైచ కర్మాణి క్రియమాణాని సర్వశః
        యః పశ్యతి తథా - త్మానం అకర్తారం స పశ్యతి    30

    ప్రకృతియే సకల కర్మలకు కారకమనియు, ఆత్మకాదనియు తెలియువాడు వాస్తవ దర్శకుడు అగుచున్నాడు.

        యదా భూత పృథగ్భావం ఏకస్థ మనుపశ్యతి
        తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా    31

    భూతములు వివిధములు. ఐనను పరమాత్ముని యందు ఏకస్థమని దర్శించువాడు, అట్లే ఇది అంతయు స్వామి వలననే విస్తరించునని తెలియువాడును తక్షణమే బ్రహ్మమును చేరుచున్నాడు.

        అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మా - యమవ్యయః
        శరీరస్థో -పి కౌంతేయ! న కరోతి న లిప్యతే    32

    సర్వత్రా వ్యాపించియున్న ఆకాశము, చిన్నది అనుటవలన దానికి ఏమి లోపము. అట్లే సర్వ ప్రాణులయందు నిలచియున్న పరమాత్ముని తెలియకున్న స్వామికేమి లోపము?

        యథా సర్వగతం సాక్ష్య్మాత్ ఆకాశం నోపలిప్యతే
        సర్వత్రావస్థితో దేహే తథా - త్మా నోపలిప్యతే    33

    ఒక సూర్యుడు, సమస్త లోకమును ప్రకాశింపజేయును. అట్లే క్షేత్రము, క్షేత్ర సమస్తమును ప్రకాశింపజేయును.

        యథా ప్రకాశయత్యేకఃకృత్స్నం లోక మిమం రవిః
        క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత!    34

    ఒకే సూర్యుడు లోకమును ప్రకాశింపచేస్తున్నాడు. అట్లే క్షేత్రం క్షేత్రి సమస్తమును ప్రకాశింపచేయుచున్నవి.

        క్షేత్ర క్షేత్రజ్ఞయో రేవం అంతరం జ్ఞాన చక్షుషా
        భూతప్రకృతి మోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్    35

    క్షేత్రక్షేత్రజ్ఞుల అంతరమును జ్ఞాన నేత్రముచే దర్శించువాడు భూత ప్రకృతి నుండి విముక్తుడగుచున్నాడు, మరియు పరమ గతిని పొందుచున్నాడని మహాత్ములు వచించుచున్నారు.

    దీపిక:

    భగవద్గీత జ్ఞాన సూర్యుడు అగుచున్నది. సూర్య ప్రకాశము ఒకటియే అట్లయినను, వివిధ రూపములుగా దర్శన మిచ్చుచున్నది. వివిధ రూపముల ప్రయోజనము కలిగించుచున్నది.
    అట్లే క్షేత్ర క్షేత్రజ్ఞ అధ్యాయము.
    క్షేత్రము ఆత్మ, క్షేత్రజ్ఞుడు పరమాత్మ. ఈ అధ్యాయము ఇరువురి సంబంధమును వివరించుచున్నది.
    ఇంతియే కాక ప్రకృతి గుణములను, దాని స్వభావమును, దాని కర్తవ్యమును వివరముగా తెలిపినది.
    నరుడు అనగా మనము తెలుసుకొనవలసినది ఆత్మ, పరమాత్మ సత్సంబంధమునే. పరమాత్మ మనలోనే యున్నాడు. అందరిలో జ్ఞానమును వెలిగించుచున్నాడు. కాని దానిని ఎందరు తెలియుచున్నారు.
    చివరి శ్లోకములో స్వామి అట్టి జ్ఞానము గలవారికి సద్యోవిముక్తి కలుగుచున్నదని శలవిచ్చినారు.
    కాబట్టి ఆ జ్ఞానమును సంపాదించుకొనుటకు ప్రయత్నించవలెను.
    క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము అను పదమూడవ అధ్యాయము ముగిసినది.

                                  ఓం శాంతిః శాంతిః శాంతిః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.