Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
శాస్త్రి విషయం డోర్నకల్లు అక్బరుకు తెలియపరచాం. అతడు 'దిగు' అన్నాడు. దిగలేదు. ఊరంతా ఉడికిపోతున్నది. మూడు రోజులయింది. విషం దిగలేదు కాని శరీరం నల్లబడలేదు. ఆశ! ఇంకా బతుకుతాడని!
మూడో నాడు అక్బరు స్వయంగా వచ్చాడు. పాము కరిచినవాడు లేచేదాకా అతడు అన్నం ముట్టడట! మూడు రోజుల ఉపవాసం ఉండి దిగాడు. శాస్త్రి ఇంటికి వచ్చాడు. శాస్త్రి తలమీద పేము బెత్తంతో మూడుసార్లు కొట్టాడు. శాస్త్రి లేవలేదు. అక్బరు మూడుసార్లు తన నొసలు నేలకు కొట్టుకున్నాడు. శాస్త్రి లేవలేదు.
"పామును చంపారా?" అడిగాడు అక్బరు.
"అవును, చంపాం" అన్నాడు తండ్రి.
"అప్పుడే చెప్పొద్దా! పామును చంపుతే నా మంత్రం పారదు. ఇతనికి ప్రాణం లేదు" అని లేచి వెళ్లిపోయాడు.
ఆశ చచ్చింది! శాస్త్రి చచ్చాడు!! అందరం గొల్లుమన్నాం. అతని శవయాత్రకు ఊరంతా కదిలింది.
అన్నయ్య ఎముకల గూడులా ఉన్నాడు. కదుల్తే గలగల మంటున్నాయి. ఆ స్థితిలోనే మా ఇంట్లో సమావేశం జరిగింది. యుద్ధం నుంచి కోటగడ్డ పోరాటం దాకా చర్చ జరిగింది. అప్పుడు స్వార్థపరత్వం లేదు. గ్రూపులు లేవు. లక్ష్యం ఒక్కటి. ఒకే తాటిమీద నడక. గ్రంథాలయం స్థాపించాలి. పేరు ఆంధ్ర గ్రంథాలయం. ముక్తకంఠ నిర్ణయం.
తెల్లవారి బయలుదేరాం అందరం. చేతకాకున్నా అన్నయ్యా వచ్చాడు. అన్నయ్యా, నేను, వేంకటేశ్వరరావు, కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, చందా వీరభద్రం మరికొందరం బృందంగా బయలుదేరాం. వర్తకుల ఇళ్లకు, రైతుల ఇళ్లకు వెళ్లాం. అది అక్షరానికి అందని అనుభూతి! అందరికీ అందని అనుభూతి!! ఎన్నటికీ చెరగని అనుభూతి!!!
ప్రతి ఇంటివారు ఆత్మీయంగా ఆహ్వానించారు. సన్నిహిత బంధువుల వలె పలకరించారు. అభిమానంతో ఇంటి వారందరూ ఉరుకులు పరుగులు పెట్టారు. ఒకరింట్లో చాయ్ లు - ఒక ఇంట్లో మజ్జిగ - ఒక ఇంట్లో మిఠాయిలు! ఏదో పండుగ జరుగుతున్నట్లే! ఎవరూ లేదనలేదు. అందరూ అడిగినంత ఇచ్చారు.
ఆనాటి మా సంబరం - సంతోషం - ఆనందానికి అవధుల్లేవు. ఎందుకు? ప్రజాకార్యం సాధించామని! తనకోసం కంటే పదిమందికోసం పాటుపడడంలో ఆనందం ఉంది. ఆనందమే బ్రహ్మము.
పనులన్నీ చకచకా జరిగిపోయాయి. ఒక్కడు కాదుగదా - అందరూ చేశారు. పెద్ద బజారులో ఇల్లు అద్దెకు తీసుకున్నాం. బెజవాడనుంచి పుస్తకాలు తెచ్చాం. పత్రికలకు చందాలు కట్టాం. ప్రారంభ ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయినాయి. సభాస్థలం - తేదీ నిర్ణయం అయింది.
తిర్పన్ కింద అనుమతి అధికారులు కొంత పేచీ పెట్టారు. జాగీరు అధికారులు మానుకోటకు పొమ్మన్నారు. అప్పుడు గార్ల మానుకోట తాలూకాలో ఉండేది. వాళ్లు వరంగల్లు పొమ్మన్నారు. ప్రజాయుద్ధం రోజులు. అనుమతించక తప్పలేదు.
వేదిక రంగురంగుల కాగితాలతో అలంకరించాం. తోరణాలు కట్టాం. మైకులు పాటలు లేవు. జనం పోరుగూళ్లనుంచి కూడా పెళ్ళికి తరలినట్లు వచ్చారు. సభకు కొమరగిరి నారాయణరావుగారు - సర్వదేవభట్ల రామనాథంగారు వచ్చినట్లు గుర్తు.
"నల్లగొండలో నాజీశక్తులు
నగ్ననృత్యమింకెన్నాళ్లు?
పోలీసు అండను దౌర్జన్యాలు
పోషణ బొందే దెన్నాళ్ళు?
హింసపాపమని యెంచు దేశమున
హిట్లరత్వమింకెన్నాళ్లు?
పగటి దోపిడులు నాపగలేనీ
ప్రభుత్వముండేదెన్నాళ్ళు?" అనే కాళోజీ గేయాన్ని మా విద్యార్థులు చదివారు.
ఉపన్యాసకులందరూ చండ్రనిప్పులు చల్లారు. పెట్రోమాక్సుల వెలుగులో కష్టజీవి బుర్రకథ. జనం సర్వం మరిచారు. ఊగిపోయారు. అర్థరాత్రికి సభ ముగిసింది. జనం - అప్పుడే అయిపోయిందా? అని ఆశ్చర్యపడ్డారు. ఉద్యమాన్ని ఉరికించాలని ఉవ్విళ్ళూరుతూ ఇళ్లకు చేరుకున్నారు.
గార్లలో ఆంధ్రగ్రంథాలయం వెలిసింది. రజాకార్ల రోజులదాకా నేనే గ్రంథాలయాన్ని నిర్వహించాను.
నల్లబజారు తెలుపు:
ఒకనాడు బడిలో ఉన్నాను. పిల్లలకు పాఠాలు చెపుతున్నాను. ఒక ముసలమ్మ వచ్చింది. చేతిలో సీసా ఉంది. ఏడుస్తున్నది. "గ్యాసునూనే పోస్తలేడు. తిడుతున్నాడు. ఎల్లగొడ్తున్నాడు" అని ఏడ్చింది.
నాకు ఆవేశం ఎక్కువ. బడి పిల్లలను వెంటపెట్టుకున్నాను. ఉరికాను. దుకాణంలో దూకాను. నేను నిప్పులు కక్కుతున్నాను. దక్షుని మీదకు ఉరికిన వీరభద్రునిలా ఉన్నాను. దుకాణం వాడు జంకాడు. "కిర్సనాయిలు పోయి" - అదేదో ఆవేశం! గర్జన!! మనకేదో అధికారం ఉన్నట్లు!!
దుకాణందారు పలుకలేదు. కిర్సనాయిలు డబ్బా బయటపెట్టాడు. ముసలమ్మకు సీసానింపి ఇచ్చాడు. ఆమె నన్ను మనసార దీవించింది. వార్త పాకింది. జనం గుంపులు కూడారు. కొట్టుకుంటున్నారు. బడిపిల్లలు వారిని వరుసలో నుంచో పెట్టారు. డబ్బా తరువాత డబ్బా! అందరికీ అందేదాకా అక్కడే నుంచున్నాను. అప్పుడు అక్కణ్ణుంచి కదిలాను.
అవి యుద్ధం రోజులు. కిర్సనాయిలు - చెక్కెర వంటివి దొరకడం దుర్లభంగా ఉండేది. ప్రభుత్వం కంట్రోలు ధరకు కొంత సరఫరా చేసేది. కాని, సరియైన పంపిణీ విధానం లేదు. అందువల్ల వర్తకులు సరుకులను దాచిపెట్టేవారు. నల్లబజారులో అమ్ముకునేవారు. నల్లబజారును అరికట్టి, ప్రజలకు నిత్యావసరాలు అందేటట్లు చూడడం కమ్యూనిస్టుపార్టీ - ఆంధ్రమహాసభల కార్యక్రమాలలో ప్రధాన అంశం. అది ప్రజలలోకి పార్టీని తీసికెళ్లింది. ప్రజలు పార్టీని తమదిగా భావించారు. తెలంగాణంలో అంతకు ముందు రాజకీయ పార్టీయే లేదు. ప్రవేశించడమే ఉప్పెనలా ప్రవేశించారు కమ్యూనిస్టులు. ప్రజలలోనికి చొచ్చుకుని పని చేశారు. ప్రజలు అరుణ పతాకచ్ఛాయన ప్రాణాలు అర్పించడానికి సిద్ధం అయినారు.
అది తెలంగాణాకు చైతన్యయుగం! వెలుగులు చిమ్మిన కాలం!! అలుగులు పారిన కాలం!!! అప్పుడు హైదరాబాదు నగరం నుంచి మూడు తెలుగు దిన పత్రికలు వెలువడినాయి. ద్వైవార పత్రికగా ఉండిన 'గోలకొండ' దినపత్రిక అయింది.సురవరం వారు సంపాదకులు. ఈనాటి వలె పత్రికలు వ్యాపారం కాదు. పత్రికా నిర్వహణ కత్తిమీద సాము. పత్రికలు ఆర్థికంగా బలహీనములు.
గోలకొండ దిన పత్రికను గురించి ఒక చాటువు ఉన్నది. ఆర్ధిక స్తోమత లేక రోజూ పత్రిక వెలువడడం దుస్థరం అయ్యేది. ఒకే సంచికను రేపటి పత్రిక అని - ఇవ్వాళ్టి పత్రిక అనీ - నిన్నటి పత్రిక అని అమ్మేవారు. పత్రికను బతికించడానికి జనం ఒకే సంచికను మూడురోజులు కొన్నారు!
గోలకొండ ద్వైవారమే! పేరు దినపత్రిక!! అని చెప్పుకునేవాళ్లు!!
రెండవది తెలంగాణా పత్రిక. బుక్క పట్నం రామానుజాచార్యులవారు సంపాదకులు. కొద్దికాలం నడిచింది. బుక్కపట్నం వారు పరమపదించే నాటికి పెళ్లాం పిల్లలకు మట్టి మాత్రం మిగిలింది. వారి పుత్రుడు శేషాద్రి - ఏడవ దశకంలో - మున్సిపల్ కార్పొరేషనులో - నాకింద క్లర్కుగా పనిచేశాడు. చిన్నవయసులోనే పేదరికానికి బలి అయినాడు.
మూడోది హూజూరు. సింధు రాష్ట్రంనుంచి వచ్చిన ఒక ముస్లిం - వ్యాపార దృష్టితో ఇది ప్రారంభించాడు. మీజాన్ అనే పేరుతో ఉర్దూ - తెలుగు - ఇంగ్లీషులో దిన పత్రికలు వచ్చేవి.
మీజాన్ అంటే త్రాసు - తరాజు - న్యాయచిహ్నం.
తెలుగు మీజాన్ కు అడివి బాపిరాజుగారు సంపాదకులు. తిరుమల రామచంద్ర - రాంభట్ల కృష్ణమూర్తి - కామరాజు వంటి హేమాహేమీలు మీజాన్ లో పనిచేశారు.
1971లో నా నవల "మోదుగుపూలు" సువాసన కూర్చే తొలిపలుకులో తిరుమల రామచంద్రగారు ఆనాటి జ్ఞాపకాలు అక్షర బద్ధం చేశారు.
"ప్రాక్ స్వాతంత్ర్యకాలంలో శ్రీ అడివి బాపిరాజుగారి సంపాదకత్వాన హైదరాబాద్ నగరంనుంచి వెలువడుతున్న 'మీజాన్' పత్రికలో పనిచేసే భాగ్యం కలిగినప్పుడు...బాధిత, తాడిత, సంతప్త, సంభ్రాంత ప్రజలు తండోపతండాలుగా 'మీజాన్' కార్యాలయానికి వచ్చి తమగోడు చెప్పుకొనేవారు - అమీన్ నా కొడుకును చావబాదిండు. గిర్దావరు మా పోరిపై జులుం చేసిండు. తాసిల్దార్ మా కొంపకు చిచ్చుపెట్టిండు - అని. ఈ పైశాచిక కృత్యాలు విని సహృదయులయిన బాపిరాజుగారిగుండె మండిపోయేది. యువకులయిన మా రక్తం ఉడుకెత్తేది. ఆ మంటను, ఆ ఉడుకును మీజాన్ పత్రికలో ప్రతిబింబించడానికి మా పరిమితులలో మేము ప్రయత్నించాము."





