Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
"దున్ని తీరుతాం" సంగం శపథం.
ఆరోజు చుట్టుపట్లగ్రామాల వేల జనం కూడారు. నేల ఈనినట్లు ఎర్ర జండాలతో భూమి మీద నిలిచారు. నినాదాలతో కొండలు - కోనలు ప్రతిధ్వనించాయి ఎర్రజండాలు కట్టిన వందల నాగళ్లు భూములు దున్నాయి.
అజరయ్య గుండాలూ - ప్రభుత్వ పోలీసులు నివ్వెరపోయి చూచారు. అడుగు ముందుకు వేయలేదు.
"ఇన్ఖిలాబ్ జిందాబాద్" నినాదం మిన్నంటింది.
గుండాలు పోలీసులు వెన్నుచూపి పారిపోయారు.
తరువాత కోర్టులోకూడా హరిజనులు గెలిచారు.
9. కోటగడ్డ గార్ల జాగీరులో - మారుమూలన - అరణ్యంలో ఉన్న - కోయగూడెం.
కోయలు అడవి బిడ్డలు. అమాయకులు. భూమి ఒకరి పేర ఉంటుందని కూడా తెలియదు. అరకకు రూపాయిపావలా కిస్తు కడ్తారు. చేతనయినంత దున్నుకుంటారు. ఒకేచోట దున్నాలనీ ఎరుగరు. వాళ్లు అడవిదొరలు. అడివిమీద వారి జీవనం. వ్యవసాయం నామమాత్రం. నాగరకత వారిని అంటడానికి వెరుస్తుంది.
ఈ అమాయక కోయల భూమికి ఎసరు పెట్టాడు. ఒక రాక్షసుడు. వాడి పేరు రంగారెడ్డి. వాడు దేశ్ ముఖ్. వానికి వేల ఎకరాలుంది. ఇదీ కాజేయాలని పథకం పన్నాడు. భూమి సాంతం తన పేర చేయించుకున్నాడు.
అప్పుడు మొదలయినాయి కోయల కడగళ్లు. రంగారెడ్డి మనుషులు కోటగడ్డలో మకాం పెట్టారు. కోయలకు హక్కులే దన్నారు. అది కోయలకు అర్థం కాలేదు. గిరిజనులను కౌలు అడిగారు. వాళ్లు ఇచ్చారు. అడవి సామగ్రి తెచ్చివ్వమన్నారు. ఇచ్చారు.
కోటగడ్డకు రంగారెడ్డి ప్రత్యక్షం అయినాడు. భూములు వదిలి పొమ్మన్నాడు. కోయ అన్నింటినీ వదలగలడు - భూమిని వదలడు - బిడ్డను వదలడు. "భూమిని వదలం" అని గట్టిగా చెప్పారు. రంగారెడ్డి దౌర్జన్యం సాగింది. కారంముంతలు కళ్లల్లో పోయించి - కోయలను కొట్టించాడు.
ఆనాటినుంచి అతడు "కారంముంతల రంగారెడ్డి" అయినాడు.
కోయలకు సంగం సంగతి తెలిసింది. వారు 'సంగం'ను ఆశ్రయించారు. సంగం 'యోగక్షేమం వహామ్యహం'అని అభయమిచ్చింది. దాశరథి - కిషన్ రావు - గోపాలరావు కోటగడ్డలో మకాం వేశారు. కోయలతో ఉన్నారు. తిన్నారు. పన్నారు. కోయాలలో చైతన్యం కలిగించారు. కోయగూడేలను సంఘటితపరిచారు.
సంగం నాయకత్వాన కోయలు రంగారెడ్డిని - అతని మనుషులను బహిష్కరించారు. కోయ సహకారం లేకుండా అడవిలో ఉండడం అసంభవం. రెడ్డి మనుషులు పారిపోయారు.
రంగారెడ్డి అంతిమ పోరాటానికి ఆయత్తం అయినాడు. అడవి కోయల రాజ్యం. రంగారెడ్డి ఆటలు సాగడం అసంభవం. అయినా ఊరుకోలేదు. బండ్లలో గుండాలను, పోలీసులను తీసుకొని బయలుదేరారు.
అడవి బాటలు పాపిటలు - బండ్లు సాగడం కష్టం. దోవలు తెలియవు. సంగం నాయకత్వాన కోయలు కట్టుదిట్టమైన వ్యూహం పన్నారు. గుండాల బండ్లను చుట్టుముట్టారు. బరిశెలు - కత్తులు - రోకళ్లు - కర్రలు - వడిసెలలు - రాళ్లతో ఒక్కుమ్మడి దాడి చేశారు. స్త్రీలు కారంముంతలు రంగారెడ్డి కంట్లో కొట్టారు. వచ్చిన గుండాల - పోలీసులు - గుడ్డివాళ్లు అయినారు. కోయలు చేత చావుదెబ్బలు తిన్నారు. ఎడ్లు - బండ్లు - తుపాకులు వదిలి ప్రాణాలు దక్కించుకొని పారిపోయారు.
రంగారెడ్డి చాల రోజులు లేవలేదు.
కోయలు నిండు వెన్నెట్లో డప్పులు - పాటలు - ఆటలతో విజయోత్సవం చేసుకున్నారు.
అన్నయ్య దాశరథికి అడవిలో - ఆ కోయ గూడెంలో - ఆనాడు తగిలిన మలేరియా ప్రభావం అంతిమసమయందాకా వదలలేదు.
ఈ పోరాటాన్ని నా "మోదుగుపూలు " నవలలో చిత్రించాను.
కాంతి నిలయం గ్రంథాలయం:
బాల సంఘానికి గ్రంథాలున్నాయి. పత్రికలు వస్తున్నాయి. అందరు చదువుతున్నారు. కాని, గ్రామంలో గ్రంథాలయం లేదు. దాశరథి ఉండగానే గ్రంథాలయం స్థాపించాలనుకున్నాం.
అన్నయ్యకు చలిజ్వరం. గజగజా వణికిపోతాడు. ముడుచుకొని ఎండలో కూచుంటాడు. తగ్గుతుంది. మళ్లీ లేచి తిరుగుతాడు. మందు లేదు. మాకు లేదు. గార్లలో పేరుకు సర్కారీ దవాఖానా ఉంది. కాని, డాక్టరుకు విరేచనాల మందు ఇవ్వడం తప్ప తెలియదు.
ఆ స్థితిలోనే మా ఇంట్లో సమావేశం జరిగింది. ఇప్పుడు మా ఇల్లు బావుంది. గదులున్నాయి. గదులకు తలుపులున్నాయి. మరీ ఇంట్లోకి పాములు రావడం లేదు. పెరట్లోనే పుట్టలున్నాయి. దర్శనం ఇస్తూనే ఉంటాయి. పాము కుబుసాలు కనిపిస్తూనే ఉంటాయి! మాది సర్పాలతో సహజీవనం.
పాములు - తేళ్లు ఊళ్లో కూడా విరివిగా ఉండేవి. శాస్త్రి అని మాకు మిత్రుడు. సీతారామయ్యగారి కొడుకు. కామ్రేడ్ మంగపతి బావమరిది. ఎప్పుడూ మాతోనే ఉండేవాడు. శివాలయం సత్రంలో.
ఒకనాటి రాత్రి అతడు మంచంలో పడుకున్నాడు. నిద్రలో ఉన్నాడు. అతనిమీద కట్లపాము పడ్డది. అది కరుస్తున్నది. శాస్త్రికి తెలియడం లేదు. అతడు పొర్లినప్పుడల్లా దానిమీద పడుతున్నాడు. అది కరుస్తున్నది. తుదకు లేచాడు. దీపం బుడ్డితో చూస్తే పక్కలో పాము! తల్లిదండ్రులను లేపాడు. అందరు కలిసి పామును చంపారు.
శాస్త్రి స్పృహ కోల్పోయాడు పడిపోయాడు. తెల్లవారింది. వార్త పాకింది. మేమంతా వాళ్ల ఇంట్లోనే ఉండిపోయాం. ఊరి జనం ఇంటి నిండా కూడింది. మందులు లేవు. డాక్టర్లు లేరు. దైవ ప్రార్థన. అంతే. ఇంకేమీలేదు..
డోర్నకల్లు స్టేషన్లో 'అక్బర్' అని రైల్వే ఉద్యోగి. అతనికి పాము మంత్రం వచ్చు. పాము కరిచిందని ఏ స్టేషను నుంచయినా అక్బరుకు తెలియపరచవచ్చు. అతడు మంత్రాలు చదువుతాడు. దిగిపొమ్మని ఫోనులో చెపుతాడు. విషం దిగిపోతుంది. మనిషి లేచి ఇంటికి వెళ్తాడు. చూసినా కొందరు నమ్మరు. మనిషిమీదనే విశ్వాసం లేనివానికి మంత్రంమీద విశ్వాసం ఏముంటుంది?





