Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
రామా: అయితే ధన్యులు. బిడ్డా! గొడుగు విసనకర్ర పట్టుకొని వీధిలో వెళ్తుంటావు. లోకులు ఏమనుకుంటారో అనిపించింది?
ధ.దా: స్వామీ! మా లోకం వేరు. మాకు లోకులతో నిమిత్తమేమి? లోకులతో నిత్తమేమి?
రామా: అమ్మా! నీవేమంటావమ్మా
హేమ: స్వామీ! నాకంటూ ఏమీలేదు. వారు నన్ను యమకూపం నుంచి రక్షించిన దేవత! వారి మాట - బాటయే నాది.
రామా: అమ్మా అర్ధాంగిని మించినావమ్మా! నాయనా ఈ సుందరిలో నీవు ఆరాధించునదేమి?
ధ.దా: స్వామీ! హేమ విశాల నేత్రాలు! అవి సాటిలేనివి. వాటిలోనే నా ప్రాణాలు పెట్టుకున్నాను. అతని కనులు వెలిగాయి.
ఆమె తలవాల్చుకుంది. సిగ్గు తెరలు వాలాయి- తొలిగాయి.
రామా: ధనుర్దాసూ! అంతకన్న సుందర నేత్రాలు ...
ధ.దా: స్వామీ! మన్నించాలి. హేమ వంటి సుందర విశాల నేత్రాలు ముల్లోకాలలో ఉండవు. మీరు నరరూపంలో ఉన్న నారాయణులు! అతీత శక్తులు లేవు. కేవలం ఊహ. ఉంటేగింటే!
కొలది క్షణాలు నిశ్శబ్దం.
కేవలం చెట్టు మీది పిట్టల పలుకులే!
హేమ: స్వామీ! మీవి వట్టిమాటలు కావు. మా మేలుకే శలవిస్తున్నారు. అట్టి సుందర నేత్రాలను ఉభయులం ప్రేమిస్తాం, ఆరాధిస్తాం.
ధ.దా: స్వామీ! సౌమ్యం వదిలి మాట్లాడినట్టున్నాడు. క్షుంతవ్యుడను. హేమ మాటయే నా మాట.
కొంతసేపు లోకాభిరామాయణం. తరువాత వీడ్కోలు!
'స్వామి అట్లా ఎందుకు అన్నారు? పరీక్షించటానికా? వాస్తవంగా సుందర నేత్రాలు ఉన్నాయా? అంటే అస్సలవి? ఇవే వారి మధ్య నలిగాయి.
ధనుర్దాసు చేతి గొడుగు, విసనకర్ర మూతపడ్డాయి.
వారి నిత్య విహారయాత్ర నిలిచింది.
ఆశ్రమానికి రాకపోకలు ఉండటం ఎక్కువైనాయి.
భక్తి భావం గూడుకట్టుకుంది. ఆత్మ - పరమాత్మ - ఆచార్య చర్చలు పదునెక్కాయి.
జీవన విధానం గుర్తించరానంతగా మారింది. ఆశ్రమవాసులే ఆశ్చర్యపోయారు!
సాక్షాత్కారం
ఒకనాటి సాయం సంధ్య ఒక రామానుజ శిష్యుడు ధనుర్దాసు ఇంటికి వచ్చాడు. వారు తగు రీతిన సత్కరించారు.
శిష్యుడు ఆచార్యాజ్ఞ వెల్లడించాడు.
'మా ఆచార్యులు రామానుజ మునివర్యులు హేమవతీ - ధరుర్దాసులను ఆదేశించునదేమనగా రేపు వేకువజామున శుచి మంతులై ఆశ్రమమున ఉపస్థితులు కావలసినది'.
శిష్యుడు నిర్గమించినాడు.
వేకువనే దంపతులు ఆశ్రమం చేరారు. ఎంబెరుమానార్ ధనుర్దాసు భుజం మీద చేయి వేసినారు. హేమవతి ఒదిగి పక్కన నిలిచింది.
స్వామి హస్తం ధనుర్దాసులో విద్యుత్తు ప్రవహింపచేసింది.
ధనుర్దాసు వశం తప్పాడు!
స్వామి ఆలయానికి నడిపించారు.
ఆ దంపతులు ఆలయ ద్వారంలో ప్రవేశించారు. అది అమృతద్వారం అనిపించింది! పులకించారు.
ధనుర్దాసు భుజం నుంచి యతిరాజుల చేయి తొలగింది.
వారు అది గమనించనే లేదు!
ఆ దంపతులు ఏ లోకంలో వున్నారో? వారిని ఏమి ఆవహించిందో, వెనుకనుంచి ఏదో తరుముతున్నట్లు - ముందు నుంచి ఏదో లాగుతున్నట్లు పరుగెత్తుతున్నారు.
ఆ వేగం స్వయంగా రామానుజులనే చకితులను చేసింది.
వారే కేవలం దంపతులే మెట్లెక్కారు. శ్రీరంగనాథుని చేరుకున్నారు.
నాడు రంగడు వేయి పున్నముల వెన్నెలలలో వెలుగుతున్నారు.
దంపతులు నిశ్చేతులైనారు. నిలిచినారు. చేతులు జోడించినారు. కన్నీటి కాలువలు జారుతున్నవి.
రామానుజ ముని చేరుకున్నారు. అటు రంగని చూచినారు స్వామి సౌందర్యానికి ముగ్ధులు అయినారు. ఇటు దంపతులను చూశారు. దిగ్భ్రమ చెందారు!
అది నిరుపమాన దృశ్యం!
జనులు కనురెప్ప వాల్చలేదు.
దంపతులు నచేతనులు అయినారు.
యతిరాజు శ్రీరంగనాథుని నేత్ర ద్వయాన్ని దంపతులకు అపూర్వంగా వర్ణించి దర్శింపచేశారు. అది వేయి నాలుకల ఆదిశేషుడు చేసిన వర్ణన!
అది నాకు తరమా!
బాణపు దెబ్బకు పక్షులు రాలుతాయి! అట్లే ఆ దంపతులు యతిరాజుల పాదపద్మాల మీద వాలిపోయారు.
శ్రీమద్రామానుజ చరణౌ శరణం ప్రపద్యేగా ఆ దంపతులు జీవించారు.
ధనుర్దాసు తన స్థిర, చర ఆస్తులను స్వామి కైంకర్యానికి సమర్పించారు.
వేశ్యమాత మరణించింది. ఆమె ఆస్తిపాస్తులు హేమపరం అయినాయి. హేమవతి వాటిని స్వామికి సమర్పించింది.
వారు ధన్యులు!
ఇంతటి జ్ఞాన సంపద సుసాధ్యం మాత్రం కాదు.
సమస్తం స్వామి కటాక్షం!
చిత్తం - విత్తం
ఈర్ష్యా ద్వేషాలు మానవ సహజం. అవి దేవతలను, మహర్షులనే విడువలేదు. రామానుజాశ్రమం భిన్నం కాదు.
రామానుజులు ధనుర్దాస సంపతులతో సన్నిహితంగా ఉండేవారు. కొందరు శిష్యులు సహించలేకపోయారు. వారేం తమను మించినారా? అనుకున్నారు. ఉడుకుతున్నారు. అది యతిరాజు చెవిన పడింది. ఆశ్రమ శిష్యుల అపోహ తొలగించాలి అనుకున్నారు.
శిష్యులు నిత్యం బట్టలు ఉతుక్కుంటారు. రాత్రిళ్లు దండేల మీద ఆరవేసుకుంటారు.
ఒకనాటి రాత్రి ఆశ్రమం మంచి నిద్రలో ఉంది. యతిరాజు ఒక శిష్యుని ఆరేసిన గుడ్డలను చించి రమ్మన్నాడు. శిష్యుడు చేసి వచ్చాడు.
తెలవారింది. శిష్యులు లేచారు. చూచారు. బట్టలు చిరిగి ఉన్నాయి. 'నీవే చింపావు' అంటే 'నీవే చింపావు' అని ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. రోషాలు పెరిగాయి. కొట్టుకున్నారు.
అంతా గురువర్యుల వద్దకు వచ్చారు. రోషకావేషాలు వెళ్ళగక్కారు.
'ఇదంతా చిన్న పంచలు చిరుగులు కోసమా' అడిగారు.
అంతా తలలు వంచుకున్నారు. ఒక్కొక్కరూ జారుకున్నారు. కాని జగడం లోలోనే రగులుతూనే వుంది.
అది అట్లుండగా మరొక జగడం.
ఆచార్యులు మరొక రాత్రి ఇద్దరు శిష్యులను లేపారు. చేయవలసిన కార్యం తెలియపరిచారు. పంపారు.
శిష్యులు ధనుర్దాసు ఇంట్లో దూరారు. భార్యాభర్తలు చాపల మీద పడుకున్నారు. దంపతులు అలజడికి కన్నులు తెరిచారు. వచ్చినవారు వైష్ణవ భాగవతోత్తములని గమనించారు. కనులు మూసుకున్నారు. నిద్ర నటించారు.
హేమ ఒక పక్కకు తిరిగి పడుకొని వుంది. శిష్యులు ఆమె వంటి మీద ఆ పక్కకు వున్న ఆభరణాలు తొలగించారు.
హేమ వారు అవసరంలో వున్నట్లు ఉన్నారు అనుకుంది. మరొకపక్క ఆభరణాలు ఇవ్వదలచింది. ఆ పక్కకు తిరిగింది.
దొంగలు పారిపోయారు.
ధనుర్దాసు లేచి కూర్చున్నాడు.
'ఎందుకు పక్కకు తిరిగావు? బంగారం మీద వ్యామోహం వదల్లేదు' అన్నాడు. ధ్వనిలో ఎత్తిపొడుపు వుంది.
హేమ లేచి కూర్చుంది. 'హయ్యో రామా! మీకు ఎట్లా చెప్పాలో అర్థం కావటంలేదు. మరోపక్క ఆభరణాలు కూడా తీసుకుంటారనుకున్నాను. తిరిగాను.
నాకు వ్యామోహం కేవలం మీ మీదనే.
కాదు - అవును అని వాదులాడుకున్నారు. స్వామియే తీర్పు చెపుతారు అనుకున్నారు నిద్రపోయారు.
అది అందరికీ తెల్లవారిన రోజు!
దంపతులు స్వామి వద్దకు చేరుకున్నారు. శిష్యులంతా అక్కడే కూడి వున్నారు.
'అమ్మా హేమా! రాత్రి ఎవరో నీ నగలు దొంగిలించారమ్మా. మా శిష్యులు నగలు పట్టుకున్నారమ్మా! ఇదిగో నగలమూట' అని గురువర్యులు అందించారు.
'స్వామీ!' హేమ పలికింది. 'అని చేరవలసిన చోటుకే చేరాయి. అవి వ్యామోహం వదులుకొమ్మని బాధించాయి' అన్నది హేమ.
వంటి మీది నగలన్నీ వలిచింది. స్వామి పాదాల చెంత ఉంచింది.
శిష్యులు అందరూ చిత్తరువులు అయినారు. తమ చింపి గుడ్డల జగడానికి సిగ్గుపడ్డారు.
హేమవతీ దంపతుల నిర్మోహత్వాన్ని అభినందించారు!
ఇది గతమే! అయినా మనమూ నిర్మోహత్వాన్ని అభినందిస్తున్నాం.
వందే రామానుజం మునిం.
ఇది జరామరణాలు లేని వెయ్యేళ్ళ గాథ.
1. పిలకా గణపతి శాస్త్రిగారు 'విశాల నేత్రాలు' నవలగా రచించారు.
2. పానుగంటి లక్ష్మీనరసింహం గారి 'సాక్షి' వ్యాసాల్లో ఈ అమల గాథ ప్రస్తావన ఉంది.
అడుక్కోవడానికి బయలుదేరుతాను. వాకిట్లో స్వామి చిరునవ్వుతో ప్రత్యక్షం. ఆ చిరునవ్వుకు అర్థాలెన్నో!
ఓం శాంతిః శాంతిః శాంతిః





