Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



    విచిత్రం! వలపులో ఓటమియే గెలుపు!!
    ఆ రాత్రి ప్రేయసీ ప్రేమికులది వలపు గాథ! విరహ అగాథ!
    తరువాత సాంతం సాధారణ ప్రేమకథయే!
    వేశ్యమాత దుండగులను పంపింది. ధనుర్దాసు వాళ్ళ కీళ్ళు విరిచాడు.
    హేమను గదిలో పెట్టింది. తాళం వేసింది. మనసుకు తాళం వేయతరమా?
    చాటుమాటు కలయికల మాధుర్యం!
    ఇక చాలు. కథ చాలా ఉంది!
    ఒక శుభదినం సాయం సంధ్య మసక చీకటి. తల్లి హేమను వెంటపెట్టుకున్నది. గుడికి చేరింది జపం చేస్తున్నది. ప్రదక్షిణ చేస్తున్నది. హేమ వెంట ఉన్నది అనుకుంటున్నది.
    హేమ గుడి బయటకు వచ్చింది. ధనుర్దాసు గుర్రం సహితంగా సిద్ధంగా ఉన్నాడు. హేమను ఎక్కించుకున్నాడు ఉడాయించింది.
    వేశ్యమాత తెలుసుకుంది. అప్పటికే వారు ఊరు దాటారు. కోట దాటారు. పేట దాటిపోయారు!
    మాత తల బాదుకుంది. గొల్లుమన్నది. దైవాన్ని దూషించింది.
    హేమవతీ ధనుర్దాసులు శ్రీరంగం చేరుకున్నారు. శ్రీరంగం దివ్యక్షేత్రమని చేరుకోలేదు. భద్ర క్షేత్రమని చేరుకున్నారు.
    అక్కడ అందరూ వారికి పెండ్లి చేయడానికి నిరాకరించారు. వారు అవివాహిత దంపతులుగానే ఉండిపోయారు. వారు అనన్యంగా జీవించారు!
    మనసు ఒకటి దేహాలు రెండు అన్నట్టి దాంపత్యం వారిది. వారు పరస్పరం ప్రేమించటం మాత్రం కాదు. ఆరాధించుకున్నారు.
    వారి జీవితం నిర్మలంగా సాగింది. రెండు సెలయేళ్ళు కలిసి పారినట్లు సాగింది.
    అది కామం కాదు. ప్రేమ, ఆరాధనల ముప్పేటి పాట!

    నవజీవం - అమృతపదం

    ఆ దంపతులు నిత్యం కావేరికి విహారానికి వెళ్ళేవారు. అది సరిగ్గా యతిరాజు కావేరి నుంచి మరలే సమయం. ఆ దంపతుల వ్యవహారం వారికి విచిత్రం అనిపించింది.
    విచిత్రం ఏమనగా:
    ధరుర్దాసు ఒక చేత గొడుగు, ఒక చేత విసనకర్ర పట్టేవాడు. హేమ అతని ఛత్రచ్ఛాయన నాజూకుగా అడుగులు వేసేది. అతను విసనకర్రతో విసురుతుండేవాడు!
    వారిలో మంచి ఉన్నది అనిపించింది రామానుజులకు, మరొకనాడు నిర్మలత్వం గోచరించింది.
    ఏలనో తెలియదు వారికి, ఆ దంపతుల విషయంలో శ్రద్ధ ఏర్పడింది. అది రంగనాథుడే కలిగించెనేమో!
    మరొకనాడు వారిలో ప్రేమ మాత్రం కాదు, ప్రేమ తత్వం కనుగొన్నారు. ప్రేమను భక్తిగా మార్చవచ్చు. ప్రేమ సాగునీటి వంటిది. ఎటు మళ్ళిస్తే అటు ఆ పంటపండుతుంది. ఇప్పుడు నది పండుతున్నది. మళ్ళిస్తే మల్లెలు పూస్తాయి. స్వామికి సమర్పించవచ్చు అనుకున్నారు.
    కృతనిశ్చయులు అయినారు.
    మరునాడు యతిరాజులు ఆ దంపతులకు ఎదురయ్యారు.
    అది ఎన్నడూ ఎరుగని సంఘటన! వారు చకితులు అయినారు. కళ్ళు చీకట్లు కమ్మాయి. ఒక అడుగు వెనక్కు వేశారు. క్షణాల్లో చీకట్లు విడిచాయి.
    తమ ముందు ఒక తేజోమూర్తి నిలిచి ఉన్నారు. వదనంలో వర్చస్సు - చూపులో కరుణ - చిరునవ్వులో వెన్నెల! ఎవరా మహర్షి? వారు కలవరపడ్డారు. తడబడ్డారు. ఏమీ తోచలేదు నేను రామానుజుడను. ధనుర్దుసు చేతిలోని గొడుగు. విసనకర్ర జారిపడ్డాయి. దంపతుల యతిరాజుల పాదాల మీద పడిపోయారు. లేచారు. చేతులు జోడించారు. నిలిచారు.
    'శ్రీరంగనాథ అనుగ్రహ ప్రాప్తిరస్తు.'
    ఈమె హేమవతి. నా భార్య అందాలకు అందం. సింగారాలకు సింగారం. ఈమె విశాల నేత్రాలే నాకు ఆలయాలు
    'స్వామీ! వీణ పలికింది' మా మీద దయకురిపించారు. ఇది మాకు పర్వదినం. మా జన్మ ధన్యమైనది. ఈ దాసులు ఏ సేవకు అర్హులు?
    అమ్మా! నీ భర్తపేరు?
    సిగ్గుతో ఆమె చెంపలు కెంపులయినాయి. తల వంచుకుంది.
    "స్వామీ! ఈ దాసుని పేరు ధనుర్దాను' అన్నాడు. గొడుగు, విసనకర్ర అందుకున్నాడు. మళ్ళీ అదే రీతి!
    రామానుజులు విస్మయులు.
    నాయనా! ధనుర్దాసా! ఏ ఊరివాడవు?
    'స్వామీ! నిచులాపురం' అన్నాడు. తనను గురించి సంగ్రహంగా వివరించాడు.
    'మీ పెండ్లి ఎక్కడ జరిగింది?'
    'జరగలేదు. ఈమె వేశ్య కూతురు. నేను క్షత్రియుణ్ణి' సంగ్రహంగా వివరించాడు.
    మేము అవివాహిత దంపతులం.
    'నాయనా! ధనుర్దాసూ! ఇది వీధి. ఇక్కడ మంచిది కాదు. రేపు ఉదయం తొలిజామున ఆశ్రమానికి వస్తారా?'
    'స్వామీ! దాసులం. ఆదేశం పాలిస్తాం'.
    'అయితే వస్తాం'.
    ఉభయులూ పాదాభినందించారు.
    ఆశీర్వచనం ఒకేసారి. స్వామి శిష్యులతో కలిసి సాగిపోయారు. సత్యవచనులు అనుకున్నారు. దంపతులు చూపందినంత స్వామిని దర్శించారు. మురిసి పొంగిపోయారు.
    ఆ రాత్రి దంపతులకు అవే దృశ్యాలు - ముచ్చట్లు
    'మనకు పెండ్లి చేయిస్తారేమో! హేమా'.
    'వారు మహాత్ములు. ఏదైనా చేయగలరు'.
    'ఇది సాంతం మన మంచికేనండి.'
    వారు చెడు చేయజాలరు.
    తెల్లవారింది కూడా తెలియలేదు. తెలిసి దబ్బున ల్;లేచారు. నిత్యకృత్యాలు ముగించుకున్నారు. ఆశ్రమం చేరుకున్నారు. ఆశ్రమం కొత్త కొత్తగా ఉంది. వాతావరణం, పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి. అక్కున చేర్చుకునేట్లు ఉన్నాయి. దైవత్వం పరిమళిస్తున్నది.
    నేను 'శ్రీమద్రామానుజ తిరునక్షత్రం'లో ఈ విషయం వ్రాశాను. నేనూ ఆ పరిమళంలోనే ఉన్నాను. ఆస్వాదిస్తున్నాను.
    మేషార్ద్రా సంభవం విష్ణోర్దర్శన స్థాపనోత్సుకమ్|
    తుండీర మండలే శేషమూర్తిం రామానుజం భజే||

    రామానుజా! యతిరాజా! ఎంబెడుమానార్! ఉడయవరే! భాష్యకార!
    యువ దంపతులకు ఏడుపు వచ్చింది. వారు సాగుతున్నారు. శిష్యులంతా హేమనే చూస్తున్నారు. వారు గమనించనే లేదు. వారి దృష్టి అన్యత్రవుంది.
    దంపతులు స్వామిని చేరుకున్నారు. వారు తేజోమూర్తులై ఉన్నారు. అయస్కాంత రూపంగా ఉన్నారు. ఏకాంతంలో ఉన్నారు.
    దంపతులు సాష్టాంగపడ్డారు.
    'శ్రీరంగ దయా ప్రాప్తిరస్తు' స్వామి దీపించారు. పెరుమాళ్ళు ప్రసాదం తీసుకొనండి.
    శిష్యుడు ప్రసాదం ఇచ్చాడు. ఆవలికి వెళ్ళినారు. సాపడినారు. వచ్చారు. చెట్టుకిందకు వెళ్దాం' అన్నారు యతిరాజులు. రావిచెట్టు నీడకు చేరుకున్నారు. తుంగచాప పరిచి ఉంది. తాము ఆసీనులు అయినారు. వారిని కూర్చోమన్నారు.
    వాతావరణంలో దివ్యత్వం నిండి ఉంది!
    దంపతులు కూర్చోలేదు. 'మీరు పెద్దలు. మీ ముందు నిలుచుటయే సమంజసం' అన్నారు.
    'అయితే నేను నిలుచోవలసి వస్తుంది' అని ఎంబెరుమానార్ లేవబోయారు.
    దంపతులు కూర్చున్నారు. రామా - ఆశ్రమం ఎట్లా ఉన్నది?
    ధ.దా: వైకుంఠం అనిపించింది. మాకు భక్తి భావం కలిగించింది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.