Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam


   
    లంబాడీలు స్త్రీలు - పురుషులు ఇతర గ్రామాల ప్రజలు భూమిని వదల్లేదు. ఎర్రజండా విడువలేదు. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టారు. పేలుస్తామన్నారు. ప్రజలు ఆదరలేదు. బెదరలేదు.

 

    పోలీసులు బెదిరారు. తోకముడిచారు.

 

    3. సూర్యాపేట తాలూకా ఎర్రపాడు దొర జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి లక్షాయాభైవేల ఎకరాల భూమి ఉంది. అయినా, దాహం తీరలేదు. చిల్పకుంట - ఎడవల్లి - నూతనకల్లు ప్రజల భూములు కాజేయాలనుకున్నాడు. మందీ, మార్బలంతో దిగాడు.

 

    సంగం ప్రజలను సమీకరించింది. గుజ్జుల రామచంద్రయ్య నాయకత్వాన దొరను గ్రామ బహిష్కారం చేశారు. పనివాడు ఒక్కడూ గడీ తొక్కలేదు. దొరవారు మండిపడ్డారు. గుండాలను తెచ్చారు. గడీలో పోలీసు క్యాంపు పెట్టించారు.

 

    దొరకు కర్చుదక్కింది. పనివాడు రాలేదు. ప్రజలు భూములు వదులుకోలేదు.

 

    4. హుజూర్ నగర్ తాలూకా బేతవోలు మఖ్తేదారు - ప్రజలనుంచి లెక్కలేనన్ని పన్నులు గుంజుతాడు. భూములు ప్రజల పేరుమీద పట్టా చేయడు. సంగం నాయకత్వాన ప్రజలు హక్కుల కోసం పోరాడారు.

 

    దొర పట్నం నుంచి అరబ్బులను - సిక్కులను రప్పించాడు. ప్రజలను బెదిరించాడు. స్త్రీలు వేల సంఖ్యలో పొరకలు తీసుకుని గుండాల వెంటపడ్డారు. ప్రజలు 600ఎకరాల దొరభూములమీదకు వందల పశువులను తోలారు.

 

    దొర పారిపోయాడు.

 

    5. మేళ్ల చెరువు బంజర్దారు ప్రజలకు భూమి హక్కు ఇవ్వడు. వాళ్లను పీడించుకు తింటాడు. ప్రజలు సంగం పతాకం కింద ఏకం అయినారు. పట్టపగలు బంజార్దారును హతమార్చారు. దాంతో మిగతా బంజర్దార్లు లొంగి వచ్చారు. రాజీకి వచ్చారు. ప్రజలకు భూముల మీద హక్కులు ఇచ్చారు.

 

    6. మల్లారెడ్డి గూడెంలో సంగం పటేల్, పట్వారీల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించింది. పటేల్, పట్వారీలు తాసిల్దారును తీసుకొని వచ్చారు. రైతులు రఖం కట్టడం లేదన్నాడు. పంటలు జప్తు చేయవలసిందన్నాడు. లంచం తిన్న తాసిల్దారు అందుకు సిద్ధం అయినాడు. పంటమీద చేయిపడితే పానాలు దక్కవని ప్రజలు  తాసిల్దారును హెచ్చరించారు. తాసిల్దారు తోకముడిచాడు.

 

    గ్రామాల్లో ప్రజలను పటేల్, పట్వారీలు పెట్టినన్ని బాధలు దొరలు కూడా పెట్టలేదు. పోలీస్ పటేల్ అంటే గ్రామానికి పోలీసు అధికారి. శాంతిభద్రతల బాధ్యత అతనిది. జగడం జరిగిందనో, దొంగతనం అనో, కంసాళ్లదగ్గర దొంగబంగారం ఉందనో సతాయించి లంచాలు గుంజుతాడు. పట్వారీ అంటే కరణం. భూమికి సంబంధించిన వ్యవహారాలన్నింటికి పట్వారీ బాధ్యత. కరణమంత పేచీకోరు మరొకరు ఉండడు. పొలాల సరిహద్దులు మారుస్తాడు. పేర్లతో పేచీ పెడ్తాడు. అందుకే కరణం పగ కాటికి పోయేదాక ఉంటది అని సామెత.

 

    'పట్వారీకా కుత్తా మరాతో గాఁవ్ సబ్ అయా, పట్వారీ మరాతో ఏక్ భీ  నహీ అయా' అనేది ఉర్దూ సామెత. పట్వారీ కుక్క చస్తే ఊరంతా వచ్చింది. పట్వారీ చస్తే ఒక్కడూ రాలేదు. కరణం కుక్క చస్తే భయానికి ఊరు సాంతం తరలి వచ్చింది. కరణం చస్తే పీడ విరగడ అయిందని ఒక్కడూ రాలేదు. మాలీ పటేలు శిస్తులు వసూలు చేయడంలో పట్వారీకి సాయపడ్తాడు. వీడు గ్రామానికి ఒక పీడ!

 

    వీరు గ్రామానికి చిల్లరదేవుళ్లు. వీరి దురాగతాలను "చిల్లరదేవుళ్లు" నవలలో వివరించాను.

 

    మల్లారెడ్డిగూడెం ప్రజలు తమ బలంతో తాసిల్దారును సాగనంపారు. కాని, గ్రామాధికారులు ప్రజలను వదల్లేదు. పోలీసులను తీసుకొని వచ్చారు. ఆ ఊళ్లో మూడో వంతుకు పైగా ముస్లిములున్నారు. ముస్లిం మహిళలు ఐక్యంగా నిలిచారు. తాము తెరచాటు వాళ్లమనీ, పోలీసులను తమ ఇళ్లలో అడుగు పెట్టనీయమనీ ఎదిరించారు. మహిళాశక్తి ముందు పోలీసులు నిలవలేకపోయారు. తోకముడిచారు.

 

    గ్రామాల్లో హిందూ - ముస్లిముల సంఘటన 'అనల్ మలిక్' విధానానికి గోరీ కట్టింది.

 

    మఖ్దూం  ఈ విధానాన్ని పరిహసిస్తూ అరే ఫకీర్ తూతో హూజూర్ హై. భీక్ క్యోఁ మంగ్తా హై"- అరే ఫకీరూ, నువ్వు పాదుషావు. బిచ్చం ఎందుకు అడుగుతావు" అనేవాడు.

 

    ఒకసారి శాసన సభలో ఒక సభ్యుడు ప్రభుత్వం ప్రతిపక్షాల పేరే ప్రస్తావించదు - అన్నాడు. అప్పుడు మఖ్దూం "భారత్ మెఁ ఔరతేఁ మరద్ కానామ్ నహైఁ తేతీఁ - భారత స్త్రీలు భర్త పేరు పలుకరు" అన్నాడు. అంటే ప్రతిపక్షం ప్రభుత్వానికి మొగుడు అన్నట్లు!   

 

    7. జనగాం తాలూకా విసునూరు దొరకు 40 వేల ఎకరాల భూమి ఉంది. అది 40 గ్రామాలలో ఉంది. దౌర్జన్యానికి విసునూరు దొరలు జగత్ప్రసిద్ధులు. అక్కడ సంగం గట్టిపడింది. ప్రజలు సంగం పాటలు పాడిన్రు. సంగం మాటలు విన్నారు. దొరకు బుగులయింది. గుండాలను దింపిండు. కడివెండి గ్రామంల ఆడగుండాలను సుతదింపిండు. సంగమోల్లు ఊరుకున్నారా? ఆడమనుసులతోనే ఆడగుండాలను చిత్క కొట్టించిన్రు. వాండ్లు అయ్యో - అమ్మో అని పట్నందారి పట్టిన్రు.         

 

    దొరకు బుగులెక్కువయింది. పగబట్టిండు ఎసువంటి పగయ్యా అంటే పాము పగ. మాల్గుజారీ - రెవెన్యూ - మనసులను తెచ్చిండు. లెవీ గింజలు వసూలు చెయ్యమన్నడు. అప్పుడు సంగపోరన్నరు - మొదలు దొరకాడ పట్టండి అనటంతోని ఊరుకున్నర? దొరయి అరబస్తాల గింజలు చూపిన్రు. దొర - హోదేదార్లు - ఆఫీసర్లు - ఒకరి మొకాలు ఒకరు చూచుకున్నరు.  

 

    సంగపోరు మీ ఇద్దరి అంతు తేలుస్తుమన్నరు. మందిని గింజకు కాప్ల పెట్టిన్రు. సీధ సర్కారు తానికే పోయిన్రు. ఆడినుంచి ఆఫ్సర్లను పట్టుకొచ్చిన్రు. దొరగింజ పట్టిచ్చిన్రు. దొర గిజగిజలాడిండు. గింజుకున్నడు. సర్కారు ఆరువేల బస్తాల గింజ పట్క పోయిన్రు.

 

    ఊళ్ల సంబరం చేసుకున్నరు.

 

    గార్ల జాగీరులో కూడా సంగం ఆధ్వర్యాన రెండు చరిత్రాత్మకం అయిన పోరాటాలు జరిగాయి.

 

    8. డోర్నకల్లు జంక్షన్ను గురించి ప్రస్తావించారు. అది క్రైస్తవ మిషనరీల ప్రధాన స్థానం. హిందూ - ముస్లిం - క్రైస్తవ వాస్తు కళతో నిర్మించిన పెద్ద చర్చి ఉంది. వాళ్లు పాఠశాలలు - వైద్యశాలలు కూడా నిర్వహిస్తారు.

 

    డోర్నకల్లుకు సమీపంలోని గార్ల జాగీరులో "వేదనాయకపురం" అనే హరిజన గ్రామం ఉంది. బహుశః వాళ్లంతా మతం మార్చుకున్న హరిజనులు. వారు కలకాలంగా ఆ గ్రామ భూములను సేద్యం చేసుకుంటున్నారు. తమ ఆధీనంలో ఉన్నది కాబట్టి తమవే అనుకున్నారు. కిస్తులు కూడా కడ్తున్నారు.

 

    డోర్నకల్లులో బిషప్ ఉంటాడు. వారి పేరు అజరయ్య. విద్వాంసుడు. మతాధిపతి, వేదనాయకపురం భూములను తన పేర చేయించుకున్నారు. అందుకోసం వారు పడిన పాట్లు ప్రభువునకే తెలియవలయు.

 

    అజరయ్య గారు పేద క్రైస్తవ హరిజనులకు బేదఖల్ నోటీసులు ఇచ్చారు. అంటే - భూములను కాళీచేసి తమకు స్వాధీనం చేయవలసిందని నోటీసులు ఇచ్చారు. పేద ప్రజలు అయ్యవారి దగ్గరికి వెళ్లారు. మొర పెట్టుకున్నారు. అయ్యగారు దీవించినారు. కాని, భూములు మాత్రం వదులుకోను వీలుపడదు అన్నారు.

 

    పేద ప్రజలకు దిక్కుతోచలేదు. తాసిల్దారుతో మొర పెట్టుకున్నారు. తాసిల్దారు అయ్యవారి పక్షమే వహించారు. భూములు వదులుకొమ్మని తాకీదు ఇచ్చారు. వదలకుంటే ఖాళీ చేయిస్తామని బెదిరించారు.

 

    సరిగ్గా ఆ సమయంలో గార్లకు సంగం దిగింది. వేదనాయకపురం హరిజనులు 'సంగం'ను ఆశ్రయించారు. కిషన్ రావుగారు దాశరథిని పిలిపించారు. దాశరథి - కిషన్ రావు కేసు వివరాలు సేకరించారు. అన్నీ అజరయ్యకు అనుకూలంగా ఉన్నాయి. అన్నీ పకడ్బందీగా ఉన్నాయి. అజరయ్యగారిని కలిశారు. చెవిటిముందు శంఖము చందము అయింది.

 

    వేదనాయకపురంలో సభ చేశారు. ఎర్ర జండాలు రెపరెపలాడేయి. చుట్టుపట్ల గ్రామాల ప్రజలు కూడారు. మేమంతా వెళ్లాం. దాశరథి ఉపన్యాసం అగ్గి కురిపించింది. గుండెల్లో అగ్గి రగిల్చింది.

 

    "సంగం జిందాబాద్
    భూములు వదిలేదిలేదు" అని నినాదాలు చేశారు.

 

    పోరాటం సాగింది.

 

    అజరయ్య గుండాలను పంపాడు. హరిజనులు సాహసోపేతంగా ఎదిరించారు. హరిజనులు, గుండాలు గాయపడ్డారు. నేల రక్తసిక్తం అయింది. కిషన్ రావుకు కూడా దెబ్బ తగిలినట్లు గుర్తు.

 

    "పొలాలు దున్ననియ్యం" వాళ్ళ శపథం. 




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.