Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
జీహాఁ! హమారీ జుబాన్ హీ అయిసీ హై - మా భాషంతా సుమారు ఇలాగే ఉంటుంది."
"ఫిర్ తో హమ్ చల్తేహైఁ - అయితే మేం వస్తాం."
నాగేశ్వరరావు నన్ను గట్టిగా కావిలించుకొని - ఎత్తి గిరగిరా తిప్పాడు. "బాగా బుద్ధి చెప్పావు దొంగను అవసరపరుడు అనడం రంగన్నకు తప్ప చేతకాదు" అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు.
ఈ సంతోష సమయంలో - దొంగలు పడ్డది సంతోష సమయమండీ - అందరికీ చాయ్ తాగించాలనిపించింది. కాని, ఇంట్లో చెక్కెర లేదు. టీ పొడి లేదు. పాలు లేవు. అసలు బిందె లేదు కాచడానికి!
అనుకుంటుండగానే బిందెతో చాయ్ తెచ్చింది పొరుగింటి మంగమ్మ. అందరం చాయ్ తాగుతున్నాం.
"ఇంక ఈ ఇంట్లో ఉండడం కష్టం" అన్నాడు కొదుమూరి.
"ఏం చేద్దమంటవు?" నకిరేకంటి ప్రశ్న.
"ఇల్లుకట్టాలె!" నినాదంలా నాగేశ్.
"మనం పిల్లలం భాయీ! మనం ఇల్లేం కడ్తాం? మాకోసం ఇంతమంది వచ్చారు.ఇది చాలు. ఇళ్లూ వాకిళ్లమీద నాకు నమ్మకం లేదు" అన్నాను.
"ఏం కట్టలేమా? కడ్తం" అన్నారు అందరు.
క్రమంగా అందరూ వెళ్లిపోయారు.
నేను వీధిలో పోతుంటే రామానుజంగారు పిలిచారు. వారిది బట్టల కొట్టు. నన్ను ఇంట్లోకి తీసికెళ్ళారు. కుర్చీ వేసి కూర్చొమ్మన్నారు. "దొంగలను చుట్టాలన్నోణ్ణి నిన్నే చూచిన" - అతని కంఠం రుద్ధం అయింది. 'బట్టలన్ని పోయినయని విన్న' అని కొత్త బట్టలమూట అందించాడు.
అంతటి ఆత్మీయతను తట్టుకోలేకపోయాను. కన్నీరు దానంతట అదే జలజలా రాలింది. అన్నయ్యను మించి దగ్గరికి తీసుకొని రామానుజంగారు నా కన్నీరు తుడిచారు. "ముండ కొడుకులు మంచోళ్లు కారు. నేనిచ్చిన్నని చెప్పకున్రి. ఇల్లు కడ్తనంటున్రు. ఏంకావాలన్నన్నా తీసుకపోండి" అని మాట ఇచ్చి పంపించారు.
ఇంత అభిమానం, ఇంత ఆత్మీయత ఎందుకు?
ఈ అనుభూతులే నాకు ఆహారం!
నేను డబ్బును - ఆస్తిని - ఆదాయాన్ని నమ్ముకోలేదు.
ఆత్మీయతనే నమ్ముకున్నాను.
ఇప్పుడు అదీ కరువవుతున్నది!!!
వ్రాస్తే - ఈనాడు కల్పన అనిపించవచ్చు - కాని, తెల్లవారి ఇంటికి ముగ్గుపోశారు. పునాదులు తవ్వారు. బండ్లలో రాయి, ఇటుక వస్తూనే ఉన్నవి. గోడలు లేవనే లేచాయి!
వరదయ్యగారిది పెద్ద కలపమండి. వేంకటేశ్వరరావు వారి కొడుకు. తండ్రిచాటు బిడ్డ. బండ్లమీద కలప పంపుతున్నాడు - తండ్రికి తెలియకుండా. ఒకనాడు బండ్లు సాగుతున్నప్పుడు తండ్రి చూచాడు. కొడుకు బిక్కుబిక్కుమన్నాడు.
"ఎంకటేశా! యాడికిరా బండ్లు పోతున్నయ్ ?"
"అయ్యగారింటికి" వెంకటేశ్వరరావు నన్ను పేరుపెట్టి పిలవడం వాళ్ల ఇంట్లో వప్పుకోరు. వాడు నన్ను "అరే రంగా," అనడం వింటే వాళ్లమ్మ "అయ్యగారిని అట్లనొద్దుర. కళ్లుపోతయ్. కాళ్లు పట్టుకో" అనేది.
"అరే! ఎంకటేశా! పెద్దలను అట్లనొద్దు. కిరాయి కూడా మనమే ఇయ్యాలె. ఇగో పైసలు తీస్క పోయి ఇరాయి ఇచ్చి రాపో" అని పంపించారు వరదయ్యగారు - పెద్ద సాహుకారు.
వేంకటేశ్వరరావు తనుచుకుంటూ ఉండి వచ్చాడు. వాళ్ల తండ్రి సాధారణంగా కరగడు. పూచికపుల్ల పోనివ్వడు. వాడు జరిగింది చెప్పాడు. "ఎందుకురా నువ్వంటే ఇట్లపడి చస్తరు?" ఆశ్చర్యంగా అడిగాడు.
"అరే! గజేంద్రుడు మొర పెట్టుకున్నాడు. భగవంతుడు వచ్చాడు. రక్షించాడు. నేను మొరపెట్టుకోలేదు. అయినా రక్షిస్తున్నాడు"అన్నాను.
"అరే రంగడూ! ఈ మాటలతోనే వశపర్చుకుంటున్నవుర" అన్నాడు వేంకటేశ్వరరావు రుద్ధకంఠంతో.
వాస్తవంగా బండ్లకిరాయలు వాడే ఇస్తున్నాడు. నా దగ్గర కనీసం బూడిద లేదు.
ఎవరెవరు ఎంత ఇచ్చారో తెలియదు కాని, వానలు నెత్తిమీదకు వచ్చేవరకు ఆరు గదుల విశాలమయిన పెంకుటిల్లు తయారయింది. మేము అందులోకి మారాం. ఆ సంవత్సరపు భారీ వర్షాలకు ఇదివరకటి పూరిల్లు కూలిపోయింది!
సరిగ్గా సమయానికి భగవంతుడు నీడ చూపించాడు. అలా అంటున్నానంటే గ్రామ ప్రజలను కించపరచడం కాదు. చేత చిల్లిగవ్వలేని పిల్లవాణ్ణి ఆదరించి - నాకు ఏమాత్రం ఆయాసం కలక్కుండా - చక్కని ఇల్లు సమకూర్చారు. వారి రుణం తీర్చుకోరానిది!
కన్న తండ్రి కావాలని గుడిశలో ఉంచిపోయాడు. 'మాతాత్వమేవ - పితాత్వమేవ' అన్నట్లు ప్రజలు తల్లులయి, తండ్రులయి, అన్నలై, తమ్ములయి ఒక మంచి ఇల్లు కట్టించి ఇచ్చారు!
వాస్తు వగైరా ఏమీ చూడక దడదడా కట్టినిల్లు లక్ష్మీప్రదమైంది. ఆ ఇల్లు కొన్నవాళ్లు కూడా దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు ఇల్లు ధన ధాన్యాలతో కళ కళలాడుతున్నది.
వ్యక్తిగతంగా కొదుమూరి వేంకటేశ్వరరావు రుణం తీరేదికాదు. అడిగి కొన్ని - ఆడగక కొన్ని అనేకం సమకూర్చాడు. పెద్ద చెల్లెలు శకుంతలను గుంటూరు 'శారదానికేతనం'లో చదివించడానికి డబ్బిచ్చాడు.
శారదానికేతనం ఉన్నవ లక్ష్మీనారాయణగారు స్థాపించి, నిర్వహించింది. ఆ సందర్భంలో వారిని దర్శించుకునే భాగ్యం కలిగింది. వారు రచించిన "మాలపల్లి" నవల నాకు ఆదర్శప్రాయం.
1982లో అనుకుంటా - కుమారి ప్రేమావతి గారు సికిందరాబాదులో మా ఇంటికి వచ్చారు. వారు నా 'జనపదం' నవలమీద - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డాక్టరేటు కోసం పరిశోధన చేస్తున్నారు. నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు.
"గార్లలో మీకు ఎలా గడిచింది?" అడిగారు.
"గ్రామం పోషించింది" అన్నాను.
ఆమె బిత్తరపోయింది. పరిహాసం అనుకుంది. ఎంతో వివరించాల్సి వచ్చింది.
ఈ తరానికి గ్రామాలే తెలియవు.
గ్రామం పోషించిందంటే అర్థంకాదు.
అది త్యాగాలయుగం - ఇది లాభాలయుగం.
పద్దెనిమిది
'మూకం కరోతి వాచాలం':
ఆంధ్రమహాసభకు ప్రజలు 'సంగం' అని తమపేరు పెట్టుకున్నారు. చిలుకూరు సభనుంచి భువనగిరి సభ దాకా "సంగం" ప్రభుత్వం ఆదేశాలు అమలు చేయించడం మీదనే కేంద్రీకరించింది. ప్రజలకు హక్కులను తెలియపరచింది. వెట్టిని వ్యతిరేకించింది. రైతు కూలీల హక్కులను రక్షించింది.
భువనగిరి సభ తరుఆత ప్రజా పోరాటాలను నిర్వహించింది. ఎన్నో జరిగాయి. వీనిలో ఎక్కువ నల్లగొండ జిల్లాలోనే జరిగాయి. అప్పుడు ఖమ్మం ప్రత్యేక జిల్లాగా లేదు. జనగాం నల్లగొండ జిల్లాలో ఉండేది.
1. జనగామ తాలూకా ధర్మాపురంలో లంబాడీలు తరతరాలుగా 80 ఎకరాల మెట్ట - 25 ఎకరాల మాగాణి సాగు చేసుకుంటున్నారు. జమీందారు పోసుకూరి రాఘవరావుకు భూదాహం అపరిమితం అయింది. లంబాడీలను తొలగించాలనుకున్నాడు. గుండాలను తెచ్చాడు. సంగం లంబాడీలను ఏకం చేసింది. కత్తులు - కొడవళ్లు - కర్రలు - వడిసెలలతో - ఎర్రజండాలు చేతబూని గుండాలను తరిమికొట్టారు. భూమి దక్కించుకున్నారు.
2. జనగామ తాలూకా మొండ్రాయిలో లంబాడీల స్వాధీనంలో ఉన్న భూమిని కఠారి సోదరులు - జమీందార్లు - కాజేయాలనుకున్నారు. ధర్మాపురం పోరాటం బుగులు పుట్టించింది. చుట్టుపక్కల దొరలను కూడకట్టారు. 75 మంది సాయుధ పోలీసులతో బయలుదేరారు.
ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వాన లంబాడీలు బరిశలు - వడిసెలలు ఎర్రజండాలతో కదిలారు. చుట్టుపట్ల మనుపాడు - గొల్లపల్లి - దేవరుప్పల - కడివెండి - సీతారామపురం - ముడిపడగ - కఠారు - రామరంగ్రామాలనుంచి సాయుధ ప్రాణులయిన ప్రజావాహిని - ఎర్రజండాలు రెపరెపలాడగా - నినాదాలు దిక్కులు పిక్కటిల్లగా కదలివచ్చింది. ఆరువేల జనాన్ని చూచి దొరలు, పోలీసులు దడుచుకున్నారు. కామ్రేడ్ ఆరుట్లను అరెస్టు చేయించారు. తాము గెల్చామని జల్సాలు చేసుకున్నారు.





