Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    విషయం వివరించాను. జనాన్ని లోనికి చేరమన్నాను. అందరూ నన్ను ఎత్తుకున్నారు. ఎగరేశారు. శివాలయం జనంతో కిటకిటలాడింది. మంటపం వేదిక అయింది.

 

    "అన్యాయ కాలంబు దాపురించిందిపుడు
    అందరము మేలు కోవాలండీ
    మాన్యాలు భోగాలు మునుజూలందరి కబ్బు
    మార్గాలు వెదకాలి రారండి" అనే పాట నాగేశ్వరరావు పాడాడు. అధ్యక్షులని ఉన్నట్లు లేదు. కిషన్ రావు - భద్రం - నేను చాల ఉద్రేకంగా మాట్లాడాం.

 

    సభ ముగిసేవరకు ఒక పెళ్లి ముగిసినట్లయింది. తరువాత చాలారోజులు గ్రామంలో ఆ ముచ్చటలే సాగాయి.

 

    శాసనోల్లంఘనాన్ని తాసిల్దార్ ఎలా సహించాడు అనేది చాల రోజులు చర్చకు వచ్చింది.

 

    1. ఊరేగింపుకు అనుమతి తీసుకోవాలనే విషయం తాసిల్దారుకు తెలిసి ఉండదు.

 

    2. పోలీసులకు ఏం చేయాలో తెలియలేదు. అయోమయంలో పడ్డారు. బెదిరించ చూశారు. కుదర్లేదు. ఏం చేసినా బెడిసి కొడుతుందేమోనని భయపడ్డారు.   

 

    3. అంత జనాన్ని అంతకు ముందు చూడలేదు. జాగీరు పోలీసులకు శిక్షణ లేదు.

 

    ఏం చేయాలో తెలియలేదు.

 

    ఇవే కారణాలు అయ్యుంటాయి అనుకున్నాం.

 

    అన్నింటినీ మించింది - కమ్యూనిస్టుల ప్రజాయుద్ధపు పాలసీ కావచ్చు.

 

    బాలసంఘానికి పుస్తకాలు కొనాలనుకున్నాం. వేంకటేశ్వరరావు డబ్బుతో రెడీ! అయినా డబ్బు బాలసంఘానికి బాగానే ఉంది. ఇద్దరం బెజవాడ వెళ్లాం.

 

    బెజవాడ నాకు చాలా ఇష్టం. ఖమ్మం నుంచి కూడా తరచు వెళ్లేవాణ్ణి. బెజవాడలో తెలుగు బోర్డులు - తెలుగు పత్రికలు - తెలుగుదనం - కృష్ణవేణి - వంతెనమీదినుంచి పోయే రైలు చూడ్డమంటే ఎంతో ఎంతో ఇష్టం. రిక్షావాళ్లు - గుర్రబ్బళ్లవాళ్లు పత్రిక చదువుతారు. రాజకీయాలు మాట్లాడ్తారు. అది నాకు ముచ్చట. ఇలాంటివి తెలంగాణంలో చూడాలని ఆపేక్ష. దేశానికి స్వాతంత్ర్యం రావాలి. నిజాం నవాబు పోవాలి. తెలుగువాళ్ళంతా ఒకటి కావాలి. అదొక ఆదర్శం. అదొక లక్ష్యం. అదొక గమ్యం. 

   

    వెంకటేశ్వరావు - నేను 'మోడరన్ కెఫ్'లో గది తీసుకున్నాం. బెజవాడంతా తిరిగాం. ప్రజాశక్తి బుక్ స్టాల్లో పుస్తకాలు కొన్నాం. 'సరస్వతి'లో 'బసంత్' పిక్చరు చూచినట్లు గుర్తు. అశోక్ కుమార్, లీలా చిట్నీస్ ఉన్నారు. వారు అప్పటి ఆరాధ్యులు. లీలామహల్లో సినిమా చూశాం.

 

    పుస్తకాల కట్టలతో నిజాం బండి ఎక్కాం. అక్కడ ఒకేరకం పుస్తకాలు అమ్మేవాళ్లు వస్తారు. కొవ్వలి - జంపన నవలలు చాల ప్రఖ్యాతాలు. పుస్తకం మీద  అర్ధరూపాయి ధర. కాని రూపాయికి ఆరు - ఎనిమిది ఇచ్చేవారు. అవి కూడా కొన్నాం. కాని, వాటి మీద నాకు అంత మంచి అభిప్రాయం లేదు. అయితే 'కొవ్వలి' నవలలు తెలుగువారికి చదివే అలవాటు చేశాయి. అంతవరకు అదీ కొంత సాధించినట్లే!

 

    బడి - రీడింగ్ రూం - బాలసంఘం - ఆంధ్రమహాసభ అయిన శివాలయ సత్రం ఇప్పుడు గ్రంథాలయం అయింది. పుస్తకాలు తీసికెళ్లడం - చదవడం - తెచ్చివ్వడం చాలమంది చేస్తున్నారు. వాటిలో ఉబుసుపోకవి తక్కువ. విజ్ఞానదాయకములు ఎక్కువ. వాటి వలన మంచి ప్రచారం - విజ్ఞానం - చర్చ జరిగాయి.

 

    ఆ రోజుల్లో నేను అనేక పుస్తకాలు చదివాను. నన్ను ప్రభావితుణ్ణి చేసినవి మినూమసానీ 'మన ఇండియా', దేవులపల్లి వేంకటేశ్వరరావుగారి 'జనగాం ప్రజల వీరోచిత పోరాటాలు', 'గదర్ వీరులు', 'అమ్మ'. ఆరోజుల్లో 'అమ్మ' మీద నిషేధం ఉంది నిజాంలో. నాగేశ్వరరావు ఒక ప్రతి 'అమ్మ' సంపాదించాడు. అది ఒక్కొక్కళ్లకు  ఒక్క రోజుకు మాత్రం ఇచ్చేవాడు. నావంతు వచ్చింది. అది నాకు అందింది.

 

    రాత్రిపూట - మంచంకోడుమీద కోడిగుడ్డు లాంపు వెలుగులో చదువుతున్నాను. గోర్కీ నవల కాల్షియం ఇంజక్షనులా వేడి ఎక్కిస్తుంది . ఆ రచన - ఆ శైలి - ఆ పాత్రలు - ఆ ఉద్యమంలో మునిగిపోయాను.

 

    ఇంటికి తలుపు లేదని చెప్పాను. దర్వాజకు అడ్డంగా మంచం వేసుకొని చదువుతున్నాను. అమ్మ - పావెల్ - సమ్మె - చిత్రాల్లా మనోఫలకం మీద కదిలిపోతున్నాయి. ఎప్పుడో అర్ధరాత్రికి ముగించాను. దీపం ఆర్పి పడుకున్నాను.

 

    అర్ధరాత్రి దాటిందనుకుంటాను. ఏదో కదిలినట్లయింది. లేవబోయాను. తలకు ఏదో తాకింది. మేలుకొని చూశాను. ఇద్దరు దొంగలు రెండు ట్రంకు పెట్టెలు తీసుకొని పారిపోతున్నారు. "దొంగలు" "దొంగలు" అని కేకలు వేసుకుంటూ వాళ్లవెంట ఉరుకుతున్నాను. ఇరుగు పొరుగువారు లేచారు. పరిగెత్తే నన్ను పట్టుకున్నారు. "దొంగలు రాళ్లు కొడ్తరు పోవద్ద"న్నారు. నన్ను ఇంటికి తెచ్చారు. రాత్రంతా మా ఇంటిముందే మేలికతో గడిపారు. చాయ్ చేయడానికి పాలుకూడా లేవు.

 

    "పెట్టెలు పోనియ్యి. ప్రాణం దక్కింది" అని అమ్మ నన్ను పట్టుకొని ఏడ్చింది. చెల్లెళ్లూ ఏడ్చారు. అందరూ వాళ్లను ఓదార్చారు. మేమున్నాం అని ధైర్యం చెప్పారు.

 

    ఇరుగు పొరుగు మాత్రమే కాదు - చుట్టుపట్ల వాళ్లు కూడా లేచారు. "మేమున్నాం" అని సిద్ధం కావడం ఎంతో ధైర్యం -మనోబలం కలిగింది. నాయన మమ్ములను వదిలివెళ్లారు. మాతామహులుకు అమ్మ ఒక్కర్తే. పితామహులకు నాయన ఒక్కరే. మాకు మేనమామలు లేరు. మేనత్తలు లేరు. బంధువుల్లో ఒక్కరు - ఒక్కరంటే ఒక్కరు పలకరించలేదు. నాయన పండితుడు, సర్కారు బలం ఉన్నవాడు. కడుపుతో ఉన్న భార్యను అయిదుగురు పిల్లలనూ వదిలి వెళ్లిపోతే వేలెత్తి చూపినవాడు లేడు. ఆ వయసులో - పెళ్లాం పిల్లలను వదులుకొని - పెళ్లి కాలేదని అబద్ధం ఆడి - పెళ్లి చేసుకుని - మైసూరునుంచి ఆ ఆడమనిషిని తీసుకొనివస్తే - పేష్కారు వరవరరావు స్వాగతం పలికాడు. వాళ్ల ఇంట్లో ఉంచుకున్నాడు!

 

    పేష్కారుకు ప్రభుత్వ బలం ఉంది. నాయనకు పేష్కారు 'పట్టు' ఉంది. వాళ్లను పల్లెత్తుమాట అనే ధైర్యం జాగీరులో ఏ ఒక్కనికీ లేదు. నాయన మరొక ఆడదాన్ని తెచ్చుకున్నాడు. అది తెలిసి అమ్మ క్రుంగిపోయింది. అగ్గి బుగ్గి అయింది. ఆడిపోసుకున్నది. నేను ఆవేశపరుణ్ణి. అన్యాయం సహించలేను. అమ్మ ఏడుపు చూడలేక పోయాను. పేష్కారు ఇంటి మీదికి ఉరికాను. అమ్మ నన్ను పట్టుకున్నది. "నిన్ను వాండ్లు చంపుతరు, పోవద్దు" అన్నది. నేను విడిపించుకున్నాను. ఉరికాను.

 

    సుడిగాలిలా ఉరికాను. బచ్చాగాణ్ణి! ఏమిటా సాహసం! పేష్కారు ఇంటిముందు నుంచున్నాను. 'నీ వంశం నాశనం అవుతుంది. నీ కొంప కూలుతుంది. నువ్వు నాశనం అవుతావు' లాంటి తిట్లు - తిట్టింది తిట్టకుండా గంట తిట్టాను. మన్నులు - దుమ్ములు పోశాను. జనం గుంపులుగా నిలబడి చూస్తున్నారు. కాని పేష్కారు ఇంట్లోంచి ఒక్కడు బయటికి రాలేదు. తలుపులు వేసుకున్నారు. కిమ్మనలేదు.

 

    నాయన బంగ్లామీదినుండి మమ్ములను నానా తిట్లు తిట్టారు. "మీరు ఊళ్లో ఎత్తుకునేట్లు చేస్తాను" అని శపథం పట్టారు. ఎవరు? కన్నతండ్రి! పండితుడు!! వేదాంతి!!!

 

    ఆనాటి సంఘటనకు గ్రామం ఆశ్చర్యచకితం అయింది! పేష్కారు నన్నేమో చేయిస్తాడు అన్నారు మిత్రులు. అది పేష్కారుకు అంత పెద్ద పని కాదు. కాని, ఏమీ చేయలేదు. చేయలేకపోయాడు! ఎందుచేత? ఇదిగో "మేమున్నాం" అని మా వెంట నిలిచే జనం ఉన్నారు. మాకు ప్రజాబలం ఉంది!

 

    అసలు జాగీరులో మా నిలకడయే ప్రజావిజయం. పూర్తి ప్రభుత్వబలం - పశుబలం - రాక్షసబలం వాళ్లదగ్గర ఉంది. మాకు ప్రజలున్నారు. ప్రజాశక్తి ఉంది. ప్రజాబలం ఉంది.

 

    'మావాళ్లు' అనేవాడు తొక్కి చూడలేదు. "మేమున్నాం" అని జనం సాంతం మా ఇంటిముందు నిలిచింది. అది కొండంత బలం కలిగించింది. తెల్లవారింది. వార్త అగ్గిలా పాకింది. వెంటనే ఉరికి వచ్చినవాళ్లు కొదుమూరి వేంకటేశ్వరరావు - నకిరేకంటి కృష్ణమూర్తి - పానుగంటి నాగేశ్వరరావు. "పేష్కారీ చేయించిండు" అన్నారు మొదటి ఇద్దరు. "ఊరుకోరాదు - ప్రతీకారం చేయాలె" అన్నాడు నాగేశ్వరరావు పిడికిలి బిగించి - ఆవేశంగా. అతడు నన్ను మించిన ఆవేశపరుడు - "మోదుగుపూలు"లో నాగేశ్!

 

    జనం గుంపులుగా గుంపులు కూడారు. మా ఇల్లు జాతర అయింది. ఇద్దరు మనుషులు రెండు ట్రంకు పెట్టెలు తెచ్చారు. 'పుట్టకోటదగ్గర పారేసి పోయిన్రు' అన్నారు అంతా. వట్టి పెట్టెలు, బట్టలన్నీ పోయినాయి. "మీ ఇల్లే దొరికిందా?" అన్నారు అంతా. పోలీసులకు ఇత్తలా -రిపోర్టు చేయమన్నారు కొందరు. 'నాకు ఈ సర్కారుమీద నమ్మకం లేదు. పోలీసుల మీద నమ్మకం లేదు' అన్నాను.    

 

    పోలీసు అమీను వచ్చాడు.

 

    "క్యాహూవా? - ఏమైంది?" అడిగాడు.

 

    "కుచ్ నహీఁ - ఏమీ కాలేదు."

 

    "కహతే హైఁ చోరీ హువా? - దొంగతనం అయింది అంటున్నారు."

 

    "జీనహీఁ! కుచ్ జరూరత్ మందోనే కప్డేలేగయె - అవసరం ఉన్నవాళ్లు బట్టలు తీసికెళ్లారు."

 

    "ఆజబ్ సే బాత్ హై, చోర్ కో జరూరత్ మంద్ కహెతహైఁ - విచిత్రం! దొంగను అవసరపరుడు అంటున్నారు."




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.