Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
5. హవ్యసహిత ఆహ్వానముల ద్వారా ఆపరాతుడగు రుద్రుని నేను నుతింతును. అతని క్రోధము దూరము చేతును. కోమలోదరుడు, శోభన ఆహ్వానవంతుడు, పీతవర్ణుడు, సునాసికుడు రుద్రుడు మమ్ము బాధించరాదు.
6. అభీష్టవరదుడు, మరుద్వంతుడు రుద్రుడు మమ్ము దీప్తిమంతమగు అన్నమున తృప్తుని చేయవలెనని ప్రార్థించుచున్నాము. ఎండకు డస్సినవాడు నీడకు చేరినట్లు నేను పాపరహితుడనయి రుద్రుడు ప్రసాదించిన సుఖములను అనుభవింతును. రుద్రుని పరిచర్య చేసెదను.
7. రుద్రా ! ఔషధము చేసి అందరికి సుఖములు ప్రసాదించు సుఖప్రదమగు నీ హస్తము ఏది? అభీష్ట వరదా ! రుద్రా ! దేవపాపముల అపహర్తవయి మమ్ము శీఘ్రముగా క్షమింపుము.
8. విశ్వభర్త, అభీష్టవరదుడు, రుద్రుని కొఱకు అత్యంత మహిమాన్వితమగు స్తోత్రమును ఉచ్ఛరించుచున్నాను. స్తోతలారా ! నమస్కరించి తేజస్వి రుద్రుని ఆరాధించండి. మేము రుద్రుని ఉజ్వలనామ సంకీర్తనము చేసెదము.
9. రుద్రుడు దృఢాంగుడు, బహురూపుడు, ఉగ్రుడు, దీప్తిమంతుడు. అతడు హిరణ్మయ అలంకారములతో సుశోభితుడు అగును. రుద్రుడు సకల భువనములకు అధిపతి. భర్త. అతని బలమునకు అడ్డులేదు.
10. రుద్రా ! నీవు పూజనీయుడవు. ధనుర్దారివి. పూజార్హుడవు. నానారూపములవాడవు. పూజనీయము అగు 'నిష్క' ను ధరించినవాడవు. సర్వవ్యాపక భువనముల రక్షకుడవు. నిన్నుమించిన బలవంతుడు మరొకడు లేడు.
(నిష్కనాణెము కావచ్చును. రత్నపతకపు బిళ్లముద్ర అగును)
11. రుద్రుడు విఖ్యాత రథారూఢుడు. యువకుడు. అడవి మృగమువలె భయంకరుడు. శత్రు వినాశకుడు. ఉగ్రుడు, స్తోతలారా ! అట్టి రుద్రుని స్తుతించుడు. రుద్రా ! నిన్ను నుతించిన వారలకు సుఖములు ప్రసాదింతువు. నీ సేన శత్రువులను నాశము చేయవలెను.
12. తండ్రి ఆశీర్వాదము అర్థించిన పుత్రుడు తండ్రికి నమస్కరించును. అట్లే రుద్రా ! నీవు రాగానే మేము నమస్కరించెదము. నీవు బహుధన దాతవు. సాధు రక్షకుడవు. మేము నిన్ను స్తుతింతుము. మాకు ఔషధములు ప్రసాదించుము.
13. మరుత్తులారా ! మీరు అభీష్టవరదులు. మీ ఓషధము నిర్మలము. అత్యంత సుఖప్రదము. దానిని మా పితృపాదుడు మనువు నిర్మించినాడు. అట్టి సుఖకరము. భయ నివారకము అగు ఔషధము మాకు కావలెను.
14. రుద్రుని యొక్క "హేతి' ఆయుధము మమ్ము విడవవలెను. అట్లే రుద్రుని 'మహతిదుర్మతి' మమ్ము వీడవలెను. సేచన సమర్థ రుద్రా ! ధనవంతుడగు యజమాని విషయమున నీ ధనువుయొక్క నారిని బిగించకుము. మా పుత్ర, పౌత్రులకు సుఖములు ప్రసాదించుము.
(హేతి ఆయుధ విశేషము. మహతీదుర్మతిః దుఃఖకారిణీ అని శాయణుడు)
15. రుద్రుడు అభీష్ట వరుదుడు. వభ్రువర్ణుడు. దీప్తిమంతుడు సర్వజ్ఞుడు మా ఆహ్వానములను ఆలకించువాడు. రుద్రా ! మా మీద ఎన్నిటికి కోపించనట్టి యోచన చేయుము. మాకు ఏనాడును నష్టము కలిగించకుము. మేము పుత్ర, పౌత్రవంతులమయి ఈ యజ్ఞమున ప్రభవించు స్తోత్రమును గానము చేసెదము.
ఆలోచనామృతము
1. మానవుని సృష్టి ఆదిగా ఎదుగుచున్న ఒక మహా దివ్యవరము. ఆలోచనము. బాహ్యలోచనమునకు అందనిది ఆలోచనము. ఆలోచనము భగవత్ సృష్టివలె ఆద్యంత రహితము. అనంతము. సర్వవ్యాపకము. ఆలోచనకు అందనిది సత్యము, భగవత్ స్వరూపము. దీనినితెలియుటకే మానవుడు నిరంతరము అన్వేషించుచున్నాడు.
"ఏకం సద్విప్రాబహుధావదంతి ఇది వేదవాక్కు."
సత్యస్వరూపము-భగవత్ స్వరూపము తెలిసిన కదా పండితులు దానిని అనేక రీతులు చెప్పుట. ఈ అన్వేషణమున మానవులకు అర్థమయినది ఏనుగు, గ్రుడ్డివాళ్ల సామెత మాత్రమేనని నా అభిప్రాయము.
సత్య స్వరూపమును తెలియుట, తెలియపరచుటయే వేదపు పరమావధి. ఈ ప్రయత్నముననే మనకు ఇంద్రాగ్నులు, మరుత్తులు, అశ్వినులు, ఆదిత్యులు మున్నగువారు దర్శనము ఇచ్చుచున్నారు.
ఈ ప్రయత్నముననే గృత్సమదర్షి బ్రహ్మణస్పతిని ప్రతిపాదించు ప్రయత్నము చేసినాడు. కాని నెరవేరినట్టులు కనిపించదు. ఇదియు ఇంతకు పూర్వపు ప్రయత్నముల వంటిదే !
24, 25, 26 సూత్రములందు ప్రతిపాదించబడిన బ్రహ్మణస్పతి ఒకసారి లీలగా తొలిమండలమున దర్శనము ఇచ్చినారు.
బ్రహ్మణస్పతికి అన్యదేవతలకన్న ఒక విశిష్టత, విలక్షణత ఉన్నది. అన్యదేవతలు ప్రకృతి స్వరూపులు. వర్షము, వాయువు, సూర్యచంద్రాదులు ఇట్టివారు. వీరిని మనము పంచేంద్రియములలో దేనితోనైనను కనుగొనవచ్చును. బ్రహ్మణస్పతి అట్టివాడుకాడు. అతడు ప్రకృతి శక్తులకు అతీతుడు. ఒక విశిష్టుడు. ఒక అధిపతి. ఒక శాసకుడు. ఒక ప్రభువు.
దయానందుడు బ్రహ్మణః+పతిని పరాత్పరుడు అన్నాడు. బ్రహ్మాండ రక్షకుడు. దేశరక్షకుడు. వేదవిజ్ఞాన రక్షకుడు అన్నాడు.
"బ్రహ్మణోఞోన్నస్య పరివూఢస్య కర్మణోవాపతే పాలయితః" అన్నాడు శాయణాచార్యులు. అన్నములు, యజ్ఞములను వర్థిల్ల చేయువాడు లేక రక్షకుడు అన్నాడు.
ఏమయినను అది ఒక "పర" స్వరూపము అగును.
2. వేదము కర్మ ప్రతిపాదకము. కర్మ అనగా కార్యము, కృషి. ఇందలి దేవతలు కర్మలవల్ల గొప్పవారయినారు. జన్మమాత్రమునకాదు.
శతక్రతు అనగా నూరు సత్కార్యములైన యజ్ఞములు చేసినవాడు ఇంద్రుడు అగును. వృత్రుని వధించుటవలన పణుల చెరనుండి గోవులను విడుపించుట మున్నగు మానవ కళ్యాణ కార్యములు చేసినందున దేవత అయినాడు.
ఋభువులు మున్నగువారు తమ స్వయంకృషితో దేవతలందు చేరినారు.
ప్రతిపాదించ దలచిన ప్రతిదేవతయు ఇంద్రుడు నిర్వహించిన కార్యములనే నిర్వహించినట్లు చెప్పుట జరుగుచున్నది.
బ్రహ్మణస్పతి విషయమునను అదియే జరిగినది.
3. అర్థము అనగా ధనము. మానవునిలో అర్థము అనగా సగము మాత్రమే ! అర్థము బాహిరము. భౌతికము. శ్వాసలేక మనిషి జీవించలేనట్లే అర్ధము లేక మనిషి జీవించలేడు. "ధనమూల మిదం జగత్" అన్నాడు వాల్మీకి. అర్థము జీవికకు తప్పనిసరి !
జీవితము శ్వాసమాత్రము కాదు. ఇది పశుపక్ష్యాదులకు కావచ్చును. మానవునకు కాదు. అతనికి మనసున్నది. అందువలన మానవుడు అయినాడు. మనసు అర్థ పరముకాదు. ధర్మపరము. "నాహం అర్ధపరోదేవీ !" అంటాడు రాముడు. కేవలము అర్థపరులు కాని వారు మహాత్ములు అగుచున్నారు.
అయినను మానవ జీవితమున 'శరీరమాద్యంఖలు ధర్మ సాధనం' ధర్మమును సాధించుటకు తొలుత కావలసినది శరీరముకదా !
గృత్సమదసూనుడు కూర్ముడు 28వ సూత్రము 9,10,11 మంత్రములందు అప్పులు దారిద్ర్యబాధను గురించి అతివాస్తవముగా వర్ణించినాడు. అప్పులు, వాటి బాధలు నాటికి నేటికి వ్యక్తులకు, దేశములకు తప్పకున్నవి.
"మాహ మఘోనో వరుణ ప్రియస్య భూరిదాన్న అవిదం శునమ"
వరుణరాజా ! ధనికుడు దానశీలుని ముందు మా దారిద్ర్యమును గురించి చెప్పుకొనవలసిన అవసరము కలుగరాదు అంటాడు.
ఎంతటి దయనీయస్థితి ! ఎంతటి ఉదాత్త వ్యక్తీ కరణ !!
అభయం జ్యోతిరశ్యామ నిర్భయజ్యోతిని కనుగొందుము అనుచున్నాడు.
మానవ జీవితపు మొట్టమొదటి దుర్దశ భయం. భయములేనిదగు జ్యోతిని దర్శించుట ఎంత మహోన్నతము, మానవీయము, దైవికము, మహత్తమము అగు ఆలోచన ! సంకల్పము !! దృశ్యము !!!
ఇట్టివి వేదమున కొల్లలు. అందుకే వేదము అయినది ! అపౌరుషేయముః ధియితిశి అయినది !! అమృతమయము అయినది!!!
అన్నింటిని గురించి ఇంతింత చెప్పవలెనని ఆలోచన ! ఆరాటము !! తపన !!! కాని అన్నింటికీ ఒక చెలియలికట్ట ఉన్నది. నా ఆలోచనా రత్నాకరమునకు సహితము.
ఈ 33వ సూక్తమున రుద్రుని వైద్యునిగా దర్శింప చేసినాడు. రుద్రుడు ఉగ్రుడు. క్రోధనుడు. వైద్యుడు ఉగ్రుడయిన ప్రమాదకరము. వైద్యుడగు రుద్రుని వద్ద అమృతము ఉన్నది. హాలాహలము ఉన్నది !
కుప్పిగంతులు వేయు, కోపగించు, కేకలు పెట్టు డాక్టర్లు మనకు నిత్య జీవితాను భవమున ఉన్నారు. వారి వలన నష్టము జరుగకుండుటకు వారిని ప్రసన్నులను చేయుట తొలి అవసరము. అందుకే రుద్రుని కోపించరాదనియు నష్టపరచరాదనియు సూక్తద్రష్ట ప్రార్థించుచున్నాడు.
ఎంతటి నిత్యము, సత్యమైన, కథనము !
అందుకే ఇది వేదము !!
జరామరణములు ఎరుగని నాదము !!!
ముప్పది నాలుగవ సూక్తము
ఋషి-శౌనక గృత్సమదుడు దేవత - మరుత్తులు, ఛందస్సు - జగతి, చివరిది త్రిష్టుప్.
1. మరుత్తులు జలధారలతో ఆకాశమును ఆచ్చాదింతురు. వారి బలము పరులను పరాజితులను చేయును. వారు మెకమువంటి భయంకరులు. వారు స్వశక్తితో జగములందు వ్యాపింతురు. వారు అగ్నివలె దీప్తివంతులు. జలపూర్ణులు. వారు భ్రమణ కర్త మేఘమును అటునిటు పంపుదురు. జలధారలు కురిపింతురు.
2. మరుత్తులు స్వర్ణ హృదయులు. సేచన సమర్థుడగు రుద్రుడు పృశ్ని ఉదరమున, మరుత్తులారా ! మిమ్ము ఉత్పన్నము చేసినాడు. అందుకే ఆకాశమునకు నక్షత్రములు శోభాయమానములు అయినట్లు మీరు ఆభరణములు అలంకరించుకొని సుశోభితులు కండు. మీరు శత్రుభక్షకులు, జలప్రేరకులు. మీరు మేఘమునందలి విద్యుత్తువలె మెరువవలెను.
(పృశ్నిని పృథ్వియొక్క స్తనములుగా విల్సన్ పేర్కొన్నాడు. భూమిమీద ఎత్తుప్రదేశములు పర్వతములు కావచ్చును అన్నాడు
శాయణుడు ఒక గాథను పేర్కొన్నాడు. "పృశ్నిర్నానువర్జాయతం భూమిః" అన్నాడు. భూమి ఒకప్పుడు గోరూపము దాల్చినది. రుద్రుడు వృషభరూపి అయినాడు. వారి సంగమమున మరుత్తులు ఉద్భవించినారు)
3. యుద్ధభూమిలో తురంగమువలె మరుత్తులు విశాల భువనములను సిక్తము చేయుదురు. వారు అశ్వములను అధిరోహింతురు. శబ్దాయమాన మేఘపు కర్ణపు పక్క నుండి సాగి వేగవంతులయి వెళ్లిపోవుదురు. మరుత్తులారా ! మీరు హిరణ్యశిరస్త్రాణులు. సమాన క్రోధనులు. మీరు వృక్షాదులను గడగడలాడింతురు. పృషతి మృగముపై స్వారిచేయుచు అన్నమునకుగాను వెళ్లుదురు.
(పృషతి మచ్చలుగల జింకవంటి జంతువు.)
4. మరుత్తులు, మిత్రులవలె, హవ్యయుక్త యజమానులకొఱకు జలములను వహింతురు. వారు దానశీలురు. పృషతి మృగవంతులు. అక్షయులు. అన్నవంతులు. వారు ఆకుటిలగామి అశ్వమువలె పథికుల ముందునుంచి సాగిపోవుదురు.
5. మరుత్తులు సమాన క్రోధనులు. దీప్తిమంతులు. ఆయుధప్రాణులు. హంస తన నివాసస్థానమునకు పోవునట్లు, మరుత్తులారా ! మహాజల స్రోతస్సుగల జలదముల వెంట ధేనుయుక్తులయి విఘ్నరహిత మార్గమున మధుర సోమరస ఉత్పన్న హర్షలాభమునకు విచ్చేయుడు.
6. మరుత్తులారా ! మీరు సమాన క్రోధనులు. మీరు స్తోత్రము నుండి ఉద్భవింతురు. అట్లే మా అభిషవ అన్నము వద్దకు విచ్చేయండి. ఆడ గుఱ్ఱమునువలె గోవు అధోభాగమును పరిపుష్టము చేయండి. యజమాని యజ్ఞమును అన్నవంతము చేయండి.
7. మరుత్తులారా ! మాకు అన్నయుక్తమగు పుత్రుని ప్రసాదించండి. అతడు మీరు విచ్చేసినపుడు నిత్యము మీ గుణములను కీర్తించును. మీరు స్తోతలకు అన్నము ప్రసాదించండి. యుద్ధకాలమున స్తోతలకు దానశీలము, యుద్ధకుశలము, జ్ఞానవంతము, అక్షయమగు అపార బలమును ప్రసాదించండి.





