Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    8. మరుత్తుల వక్షములు దీప్త ఆభరణయుతములు. వారు రథమున గుఱ్ఱములు పూన్చినంతనే గోవుతన దూడకు పాలిచ్చినరీతి హవ్యదాత యజమాని ఇంట కావలసినంత అన్నము ప్రసాదింతురు.

    9. మరుత్తులారా ! మాతో శత్రుత్వముగల తోడేళ్ల వంటి మనుష్యులు ఉన్నారు. వసువులారా ! ఆ హింసకుల బారినుండి మమ్ము రక్షించండి. తాపప్రద చక్రము ద్వారా వానిని నలుదిశలనుండి పారతోలండి. రుద్రగణములారా ! మీరు వారి అస్త్రములను అన్నింటిని విసరివేయండి. వారిని నష్టపరచండి.

    10. మరుత్తులారా ! మీరు పృశ్ని అధోభాగమును పితికినప్పుడు స్తోత్రనిందకులను హతమార్చినారు. త్రిత యొక్క శత్రువులను వధించినారు. రుద్రపుత్రులారా ! ఆ సమయమున ఆశ్చర్యకరము అగు మీ శక్తియుక్తులను ఎల్లరు గమనించినారు.

    11. మహా సుభగులగు మరుత్తులారా ! మీరు సదా యజ్ఞ స్థలమునకు వెళ్లుదురు. సోమము ప్రార్థనీయము. అది సిద్ధము కాగానే మేము మిమ్ము ఆహ్వానింతుము. స్తోత్ర పాఠకులు స్రుక్కును ఎత్తి స్వర్ణవర్ణులు సర్వశ్రేష్ఠులు అగు మరుత్తులను ప్రశంసనీయ ధనమును యాచింతురు.

    12. అస్వర్గగాములు. అంగిరో రూపులయిన మరుత్తులు ప్రథమ యజ్ఞమును వహించినారు. ఉష ఉదయించగా మరుత్తులు మమ్ము యజ్ఞాదులందు ప్రవృత్తులను చేసెదరు. ఉష అరుణ కిరణ జాలములతో కృష్ణవర్ణ రాత్రిని తొలగించును. అట్లే విశాలము, దీప్తిమంతము, జలస్రావకమగు జ్యోతిచే మరుత్తులు అంధకారమును దూరము చేసెదరు.

    (ప్రథమ యజ్ఞము అనగా మొట్టమొదటి ఉదయ సవనము. మబ్బులు కమ్ముకున్నపుడు మెరుపుతో మరుత్తులు అంధకారమును దూరము చేతురు అని అర్థము. వృత్రాదీన్ హత్వాసర్వం జగత్ప్రకాశయన్తీత్యర్థః అని శాయణుడు)

    13. మరుత్తులు రుద్ర పుత్రులు. వారు శబ్ద కారకమగు వీణా విశేషమునందు, అరుణవర్ణ అలంకార యుక్తులగు మరుత్తులు జలములకు నివాస భూతములగు మేఘములందు వర్థిల్లినారు. వారు సర్వత్ర ప్రభావముగల బలమున జలమును వహించుచు ప్రసన్నదాయకము, మనోహరమునగు సౌందర్యమున విరాజిల్లుదురు.

    14. మరుత్తులను వరణీయ ధనమును యాచింతుము. రక్షణలు కోరుదుము. రక్షణలు కోరుదుము. స్తోత్రముల స్తుతింతుము. మరుత్తులకు 'త్రిత' నేత అగును. వారు 'చక్రి' ఆయుధధారులు. వారిని ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన పంచహోతలు ఆవర్తితులను చేయుదురు.

    (పంచహోతలు అయిదుగురు ఋత్విజులు. శ్వాసరూపమున ఉన్న అయిదు ప్రాణములు అని దయానందుడు.)

    శాయణుని ప్రకారము ఇది యోగ రూపము. అయిదుగురు హోతలు సోమము అర్పించువారు. శ్వాసరూపమున ఉన్న పంచ ప్రాణులు. 'త్రిత' అను ఋషి యోగిగా ఆ ప్రాణములను దిగ్భంధము చేసినాడు. వానిని చక్రరూపమున ఉండునట్లు చేసినాడు. నాభి చక్రమున ప్రవర్తిల్ల చేసినాడు.

    15. మరుత్తులారా ! మీరు యజమానికి ఆశ్రయకారకులు అగుదురు. పాపములనుండి రక్షింతురు. స్తోతలను శత్రుహస్తము నుండి విముక్తులను చేసెదరు. మాకు సహితము అట్టి ఆశ్రయము ప్రసాదించి మావద్దకు విచ్చేయండి.

                                       ముప్పది అయిదవ సూక్తము

          ఋషి-శౌనక గృత్సమదుడు దేవత-అపాన్నపాత, ఛందస్సు-త్రిష్టుప్.

    1. నేను అన్నములుకోరి ఈ స్తుతిని ఉచ్ఛరించుచున్నాను. శబ్దకర్త, శీఘ్రగామి అపాన్నపాతుడు మాకు అన్నమును, సుందరరూపమును ప్రసాదించవలెను. నేను అతనిని స్తుతింతును. అతడు నా స్తుతికి ప్రసన్నుడు అగును.

    (అపాన్న పాతుడు అనగా జలములకు నప్త. అనగా మునిమనుమడు. జలముల వలన వృక్షములు కలుగును. అందువలన వృక్షములు జలములకు పుత్రులు అగుదురు. వృక్షములవలన అగ్ని పుట్టును. అందువలన అగ్ని జలములకు పౌత్రుడు, నప్త అగును ఇది అపాన్నపాత అగ్నికి సంబంధించిన సూక్తము)

    2. వారి కొఱకు హృదయమున రచించిన ఈ మంత్రమును ఉచ్ఛరింతుము. వారు మరలమరల దానిని గ్రహించవలెను. అపాన్నపాత తన బలమున శత్రువును అణచగలడు. అతడు సమస్త భువనములను సృజించినాడు.

    3. ఒక్కొక్కచోట జలము నిలుచును. దానికి మరొకచోట జలము కలియును. అవి అన్నీ సముద్రమునందలి బడబానలమును ప్రసన్నము చేయును. నిర్మల జలములు అపాన్నపాతుని నలువైపులనుండి చుట్టుకొనును. సేవించును.

    4. దర్పరహితులగు యువతులు అపాన్నపాతుని యువరాజునువలె అలంకరింతురు. పరివేష్టింతురు. అపాన్నపాతుడు ఇంధన రహితుడు. ఘృతపూతుడు. అతడు సంపన్నములగు మా అన్నములను ఉత్పత్తి చేయుటకుగాను నిర్మల జలమధ్యమున తేజోవంతుడయి ప్రకాశించును.

    5. దుఃఖరహితుడయిన అపాన్నపాతుని కొఱకు ఇళ, సరస్వతి, భారతి దేవేరులు అన్నమును ధరింతురు. వారు జల మధ్యమున ఉత్పన్నమగు పదార్ధము కొఱకు స్రవింతురు. అపాన్నపాతుడు సర్వప్రథమముగ ప్రభవించిన జలముల యొక్క సారభూతమును పానము చేయును.

    6. అపాన్నపాతుడు అధిష్ఠించిన సముద్రము నుండి 'ఉచ్చైశ్రవసము' అణు అశ్వము జన్మించినది. అపాన్నపాతా ! నీవు అపహర్తవు. స్తోతలను హింసకుల బారినుండి రక్షింపుము. దాన శూన్యులు, అబద్దజనులు అపరిపక్వ లేక పరిపక్వ జలములందు ఉండియు అహింసకుడగు అపాన్నపాతుని దర్శించలేరు.

    7. తమ గృహములందు నివసించువారు, గోవులపాలు సులభముగా పితుకు వారు మాత్రమే అపాన్నపాతుని వర్షజలమును వర్థిల్ల చేయుదురు. ఉత్తమ అన్నములు భుజింతురు. అపాన్నపాతుడు జల మధ్యమున నిలుచును. యజమాని ధనము ప్రకాశించుటకు దీపించును.

    8. అపాన్నపాతుడు సత్యవంతుడు. సర్వదా ఏకరూపి అతి విస్తీర్ణుడు. అతడు జలముల మధ్యమున పవిత్ర దేవ తేజమున ప్రకాశించును. భూతములు అన్నియు అతనిశాఖలే ! ఫలపుష్ప సహితముగా సర్వ ఓషధుల అతని ఉత్పత్తియే!!

    9. అపాన్నపాతుడు కుటిలగతులగు మేఘముల నడుమ స్వయముగా ఊర్థ్వభావమున అవస్థితుడు. అట్లయయు విద్యుత్తును ధరించి అంతరిక్షమును ఆరోహించును. హిరణ్యవర్షములగు నదులు సర్వత్ర అతని మాహాత్మ్యమును కీర్తించుచు ప్రవహించును.

    10. అపాన్నపాతుడు హిరణ్యరూపుడు. హిరణ్యాకృతుడు. హిరణ్యవర్ణుడు. అతడు హిరణ్యస్థానమునకు ఉపరి ఉపస్థితుడయి విరాజిల్లును. హిరణ్యదాత అతనికి అన్నము ప్రసాదించును.

    11. అపాన్నపాతుని కిరణ్మయరూప దేహము, అతని నామము అతి సుందరములు. అవి రెండు నిగూఢములు. అట్లయ్యు వర్థిల్లును. యువతి, 'జలసంహితి' ఆ హిరణ్మయుని అంతరిక్షమున ముదముగా ప్రకాశింపచేయును. అతనికి జలమే అన్నముకదా ! "ధృతమన్నమస్య"

    12. మాకు మిత్రుడు, దేవతలకు ఆద్యుడు అపాన్నపాతుని మేము యజ్ఞము, హవ్యము నమస్కృతులతో సేవింతుము. అతని ఉన్నత ప్రదేశమును అందముగా అలంకరింతుము. కాష్ఠాదులు, అన్నములతో అతనికి పరిచర్యలు చేసెదము. మంత్రములతో స్తుతింతుము.

    13. అపాన్నపాతుడు సేచన సమర్థుడు. అతడు ఈ మహాజలముల మధ్య గర్భమును కలిగించినాడు. అతడే పుత్ర రూపుడయి జలములను త్రాగును. సమస్త జలములు అతనిని నాకును. అతడే దీప్తయుక్తుడగు స్వర్గీయ అగ్ని. పృథ్విమీద మరొక రూపమున వ్యాపించినాడు.

    14. అపాన్నపాతుడు ఉత్కృష్ట స్థానమున నిలుచును. అతడు స్వతేజమున నిత్యము దీప్తిమంతుడు అగును. మహాజల సమూహములు అతని కొఱకు అన్నము వహించి నిరంతర గతులతో అతనిని పరివేష్టించును.

    15. అగ్నీ ! నీవు శోభాన్వితుడవు. పుత్రలాభముకొఱకు నీ వద్దకు వచ్చినాను. యజమాని హితము కొఱకు సురచిత స్తోత్రముకొని వచ్చినాను. సమస్త దేవతలు చేయు శుభములు మావి కావలెను. మేము పుత్ర, పౌత్ర సహితులమయి ఈ యజ్ఞమున ప్రభవించు స్తోత్రమును గానము చేసెదము.

                              ముప్పది ఆరవ సూక్తము

        ఋషి-శౌనక గృత్సమదుడు దేవతలు - వేరు వేరు, ఛందస్సు - జగతి

    1. ఇంద్రా నీ కొఱకు ప్రేరితమయిన సోమము గవ్యము, జలముతో కలిసినది. యజ్ఞనేతలు దీనిని ప్రస్తర ఖండమున ఆభిషవించినారు. మేషలోమమయము, దిశాపర్వమున సంస్కరించినారు. ఇంద్రా ! నీవు సకలవిశ్వములకు ఈశ్వరుడవు. దేవతలలో ప్రథముడవు. స్వాహాకారమునందు అగ్నియందు ప్రక్షిప్తమై వషట్కారమున వ్యక్తమయిన సోమము హోతవద్ద ఉన్నది. స్వీకరింపుము.

    2. మరుత్తులు యజ్ఞసంయుక్తులు. పృషిత మృగములు కట్టిన రథములవారు. ఆయుధ శోభితులు. రుద్ర పుత్రులు. అంతరిక్ష నాయకులు. అట్టి మరుత్తులారా ! మీరు కుశాసనమున ఆసీనులుకండు. 'పోత' నుడి సోమము గ్రహించండి. స్వీకరించండి.

    3. శోభిత ఆహ్వానవంతులగు దేవతలారా ! మీరు మా వెంటరండి కుశముల మీద కూర్చొనండి, విహరించండి. అనంతరము త్వష్టా ! నీవు దేవతలు, దేవపత్నులు సహితముగా అన్నము సేవించుము. తృప్తినొందుము.

    4. అగ్నీ ! నీవు మేధావివి. ఈ యజ్ఞమునకు దేవతలను ఆహ్వానించుము. యజ్ఞము నిర్వహించుము. నీవు మాహవ్యాభిలాషివి. విచ్చేయుము. గార్హపత్యాది మూడు స్థానములందు ఆసీనుడవు అగుము. హోమము కొఱకు ఉత్తర వేదిక తెచ్చిన సోమరూప మధువును స్వీకరింపుము. అగ్నీధ్రుని వద్ద సోమమును స్వీకరించుము, తృప్తినొందుము.

    5. ఇంద్రా ! నీవు ధనవంతుడవు. ప్రాచీనుడవు. సోమము వలన నీకు శత్రువిజయ సామర్థ్యము, బలము చేకూరినవి. అదే సోమము అభిషవించబడి, ఆహ్వానించుచున్నది. బ్రాహ్మణ ఋత్విక్కు నుండి స్వీకరించుము, తృప్తినొందుము.

    6. మిత్రావరుణులారా ! మీరు మా యజ్ఞమును సేవించండి. హోతలు ఆసీనులయి స్తుతులు ఉచ్చరించుచున్నారు. మా ఆహ్వానమును మన్నింపుడు. ఋత్విజులు పరివేష్టించిన అన్నము మీ ముందున్నది. ప్రశస్తనుంచి సోమము స్వీకరించుడు. తృప్తినొందుడు.

           (శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత రెండవ అష్టకము, రెండవ మండలమున ఏడవ అధ్యాయము సమాప్తము)

    ఎనిమిదవ అధ్యాయము             ముప్పది ఏడవ సూక్తము
       
        ఋషి-శౌనక గృత్సమదుడు, దేవతలు-వేరు వేరు,ఛందస్సు - జగతి

    1. ద్రవణోద అగ్నీ ! హోత చేయు యజ్ఞమున అన్నము గ్రహింపుము. ప్రసన్నుడవు అగుము. హృష్టినొందుము. అధ్వర్యులారా ! "ద్రవణోద" సోమాభిలాషి. అభీష్ట ఫలములు ఇచ్చువాడు. ద్రవణోద యజ్ఞమున ఋతువులతో సోమపానము చేయవలెను. "సోమం ద్రవణోదః పిబతు ఋతుభిః"

    2. దాతలు, అందరకు అధిపతులు అయినవారిని ఇదివరకు ఆహ్వానించినాము. వారు ఆహ్వానయోగ్యులు. ఇప్పుడు కూడ వారినే ఆహ్వానించుచున్నాము. వారి కొఱకు అధ్వర్యుల ద్వారా సోమ మధువు సిద్ధము చేయబడినది. "పోత" యజ్ఞమున ద్రవద ఋతువులతో సోమపానము చేయవలెను. "సోమం ద్రవిణోదః పిబతు ఋతుభిః"

    3.ద్రవిణోదా ! నీవు అధిరోహించు అశ్వము తృప్తినొందవలెను. వనస్పతులు ఎవరినీ హింసించరాదు. అవి బలపడవలెను. నేష్ట యజ్ఞమున ద్రవిణోద ఋతువులతో సోమపానము చేయవలెను. "సోమం ద్రవిణోదః పిబతు ఋతుభిః"

    4. ద్రవిణోద హోత యజ్ఞమున సోమపానము చేసినాడు. పోత యజ్ఞమున హృష్టుడు అయినాడు. నేష్ట యజ్ఞమున అన్నము భుజించినాడు. సువర్ణ ప్రదాత అగు ద్రవిణోద ఋత్విక్కులనుండి దశపవిత్రము, మృత్యువినాశకమగు నాలుగవ సోమపాత్రను పానము చేయవలెను. 

    5. అశ్వినులారా ! మీ రథము శీఘ్రగామి. మీరు కోరిన చోట మిమ్ము దింపునది. అదే రథమున మా యజ్ఞమునకు విచ్చేయుడు. మా హవ్యమును రుచికరము చేయండి. అన్నవంతులగు అశ్వినులారా ! మా సోమమును పానము చేయండి.

    6. అగ్నీ ! నీవు సమిధ, ఆహుతి, జనహితకరస్తుతి, సుందర స్తోత్ర యుక్తుడవు అగుము. నీవు అందరకు ఆశ్రయ ప్రదాతవు. మా హవ్యముల అభిలాషవి అగుము. మా హవ్యములు కోరునట్టి సకల దేవతల, ఋభువుల, విశ్వేదేవతల వెంట విచ్చేయుము. సోమపానము చేయించుము.

                            ముప్పది ఎనిమిదవ సూక్తము

         ఋషి-శౌనక గృత్సమదుడు, దేవత-సవిత, ఛందస్సు-త్రిష్టుప్.

    1. సవిత - సూర్యుడు, ప్రకాశకుడు, జగత్ వాహకుడు. అతడు లోక కళ్యాణమునకుగాను ప్రతిదినము ఉదయించును. అదే అతని కార్యము. అతడు స్తోతలకు రత్నములు ప్రసాదించును. యజ్ఞవంతుడగు యజమానిని శుభముల భాగస్వామిని చేయును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.