Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    10. వరుణరాజా ! నేను పిరికివాడను. నా బంధువులు నన్ను కలలలో కలవరము కలిగించు మాటలు అందురు. నన్ను వారి మాటలనుండి రక్షింపుము. దొంగలు తోడేళ్లవలె పొంచి ఉన్నారు. వారినుండి నన్ను రక్షింపుము.

    (బంధువులు సాయము చేయకపోగా హానిచేతురు. వారు అప్పులవాళ్లవంటివారు. "జ్ఞాతిశ్చేదనలేనకిమ్" అన్నాడు భర్తృహరి. నిప్పులేక తగల పెట్టువాడు బంధువు అనుచున్నాడు.)

    11. వరుణరాజా ! ధనికుడు, దానశీలుని ముందు నా దారిద్య్రమును గురించి చెప్పుకొనవలసిన అవసరము కలుగరాదు. నాకు అవసరమగు ధనపు అభావము కలుగరాదు. మేము పుత్ర, పౌత్రవంతులమయి ఈ యజ్ఞమున ప్రభవించిన స్తుతిని గానము చేసెదము.

                                    ఇరువది తొమ్మిదవ సూక్తము

    ఋషి-గృత్సమదుడు లేక అతని పుత్రుడు కూర్ముడు. దేవత - విశ్వదేవతలు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఆదిత్యులారా ! మీరు వ్రతకారులు. శీఘ్రగాములు. ప్రార్థనీయులు. రహస్యముగ ప్రసవించు స్త్రీ ఫూరప్రదేశమున ప్రసవించును. అట్లే మా అపరాధమును దూరప్రదేశమున విసర్జింపుడు. మిత్రావరుణులారా ! మీ మంగళప్రదమగు పనులను ఎరుగుదుము. అందువలననే ఆహ్వానించుచున్నాము. మా స్తుతులను ఆలకింపుడు.

    2. దేవతలారా ! మీరు అనుగ్రహించువారు. శత్రుహింసకులు. బలవంతులు. మమ్ము ద్వేషించువారిని మానుండి వేరు చేయుడు. శత్రువులను పరాజితులను చేయుడు. వర్థమాన భవిష్యత్తులందు మాకు సుఖములు ప్రసాదించుడు.

    3. దేవతలారా ! మేము ఆశక్తులము. మీకు సంబంధించిన ఏ కార్యము చేయగలము? వసుపూర్ణము, సనాతనము, ప్రాప్తవ్యము అను కార్యము ద్వారా ఏ పనిని నిర్వర్తించగలము? మిత్రావరుణులు, ఇంద్రుడు, అదితి, మరుద్గణములారా ! మీరు మాకు శుభములు సమకూర్చగలరు.

    4. దేవతలారా ! మీరే మా బంధువులు. మమ్ము అనుగ్రహించవలసినదని మిమ్ము పార్థించుచున్నాము. మా యజ్ఞమునకు వచ్చుటకు మీ రథము మందగించరాదు. మీ వంటి బంధువురాక మాకు ఆనందము కలిగించును.

    5. దేవతలారా ! తండ్రి కొడుకునకు ఉపదేశించినట్లు మీరు నాకు ఉపదేశించినారు. మీ మధ్య మానవ మాత్రుడనయి అనేక పాపములను దూరము చేసినాను. సకల పాపములు, పాశములు దూరము కావలెను. వ్యాధుడు పిల్లముందు పిట్టను కొట్టును. మీరు నన్ను అట్లు కొట్టరాదు.

    (పసిపిల్లలను అనాధలను చేసి తలిదండ్రులను మృత్యువాత పడనీయరాదు అనుచున్నాడు)

    6. పూజనీయులగు దేవతలారా ! మాముందునకు విచ్చేయుడు. నేను భయము భయముగానైన మీ హృదయమున స్థానము సంపాదించవలెను. మమ్ము తోడేళ్ల బారిన పడిచావకుండ కాపాడుడు. మమ్ము ఆపదలందు చిక్కించువాని చేతికి మమ్ము ఒప్పగించరాదు. వాని నుండి మమ్ము రక్షించుడు.

    7. వరుణరాజా ! ధనికుడు, దానశీలునిముందు మా దారిద్ర్యమును గురించి చెప్పుకొనవలసిన అవసరము కలుగరాదు. మాకు అవసరమగు ధనపు అభావము కలుగరాదు. మేము పుత్ర పౌత్ర వంతులమయి ఈ యజ్ఞమున ప్రభవిమ్చిన స్తుతిని గానము చేసెదము.

                                  ముప్పదవ సూక్తము

        ఋషి-శౌన గృత్సమదుడు, దేవత-అనేకులు ఛందస్సు 1-10 త్రిష్టుప్, 11 జగతి

    1. వర్షకారుడు, ద్యుతిమంతుడు, సర్వప్రేరకుడు, వృత్రనాశకుడు ఇంద్రుని యజ్ఞమున జలములు నిలువవు. అవి నిరంతరము ప్రవహించుచుండును. అతడు తొలుత ఎప్పుడు పుట్టినాడు? సృష్టికి ముందునుంచే ఉన్నాడు.

    2. వృత్రునకు అన్నము పెట్టిన వాని విషయము అదితి మాత ఇంద్రునకు చెప్పినది. ఇంద్రుని ఇచ్చానుసారము నదులు తమ మార్గమున ప్రవహించినవి. నిత్యము సాగరదిశగా సాగినవి.

    3. వృత్రుడు అంతరిక్షమున లేచినిలిచినాడు. సకల పదార్థములను ఆక్రమించినాడు. అందుకే ఇంద్రుడు వానిమీద వజ్రము విసరినాడు. వర్షించు మేఘమును కప్పుకొని వృత్రుడు ఇంద్రుని ముందర ఉరికినాడు. అప్పుడు తీక్ష్ణ ఆయుధ దారి ఇంద్రుడు వానిని పరాజితుని చేసినాడు.

    4. బృహస్పతీ ! నీ ఆయుధము వజ్రము వంటిది. దానితో వృకద్వారాసురుని పుత్రులను ఛేదింపుము. ఇంద్రా ! నీవు ప్రాచీన కాలమున శక్తియుక్తుడవయి శత్రువులను గెలిచినావు. అట్లే ఇప్పుడు మా శత్రువులను నాశము చేయుము.

    5. ఇంద్రా ! నీవు పైన ఉందువు. స్తోతలు నిన్ను నుతింతురు. అప్పుడు నీవు శత్రునాశకమగు ఆయుధమును విసరినావు. అది కఠిన శిలవంటి వజ్రము. దానిని నీవు దిగువకు రువ్వుము. అందువలన మాకు వలసిన పుత్ర, పౌత్ర, గోధనము లభించును. అట్లే మాకు సమృద్ధిని ప్రసాదించుము.

    6. ఇంద్ర సోములారా ! మీరు హింసించు ద్వేషిని నిర్మూలనము చేయండి. యజమానులను శత్రువు మీదికి పురికొల్పండి. ఈ భయస్థానమును భయశూన్య స్థానమును చేయండి.

    7. ఇంద్రా ! నన్ను కష్టపెట్టకుము. అలసట కలిగించకుము. సోమరిని చేయకుము. సోమాభిషవము చేయరాదని మేము ఇతరులకు చెప్పాము. ఇంద్రుడు మా అభీష్టములను నెరవేర్చును. కోరిన దానము ఇచ్చును. యజ్ఞమును గ్రహించును. గోసమూహ సహితుడయి అభిషవకర్త వద్దకు విచ్చేయుము.

    8. సరస్వతీ ! నీవు నన్ను రక్షింపుము. మరుత్తులతో కలిసి శత్రువులను గట్టిగా గెలువుము. ఇంద్రుడు శూరాభిమాని, స్పర్ధవంతుడు. శుండకుల ప్రధాన శుండామార్కుని హతమార్చినాడు.

    9. బృహస్పతీ ! చాటుమాటునదాగి మమ్ము హతమార్చగోరువారిని వెదికి, వాడి ఆయుధమున నరకుము. ఆయుధమున మా శత్రువులను గెలువుము. ద్రోహులకు విరుద్ధముగా ప్రాణ నాశక వజ్రమును నలుదిశల విసరుము.

    10. శూర ఇంద్రా ! మా శత్రుహంత వీరులవెంట ఉండుము. నీవు ఆర్జించిన సాధన సంపత్తిని వారికి కూర్చుము. మా శత్రువులు చాల కాలముగా గర్వాంధులగుచున్నారు. వారిని నాశము చేయుము. వారి ధనమును మాకు ప్రసాదించుము.

    11. మరుత్తులారా ! మేము సుఖాభిలాషులము. మిమ్ము స్తుతింతుము. మీకు నమస్కరింతుము. దైవికము, ప్రాడుర్భూతము, ఏకత్రితమయిన మీ బలమును కీర్తింతుము. అందువలన సంతానవంతులము కావలెను. ప్రశంసనీయ ధనమును పొందవలెను. దానిని అనుభవించ కలుగవలెను.

                           ముప్పది ఒకటవ సూక్తము

    ఋషి- శౌనక గృత్సమదుడు, దేవతలు-విశ్వేదేవతలు. ఛందస్సు - జగతి, చివరది త్రిష్టుప్.

    1. అన్నాభిలాషములు, మదోన్మత్తములు వననివాసములు అగు పక్షులవలె మా రథమును నివాస స్థానము నుండి మరొక స్థానమునకు సాగనంపుదు. మిత్రావరుణులారా ! మీరు ఆదిత్యులు, రుద్రులు, వసువులతో కలిసి మా రథమును రక్షించుచుందురు.

    2. సమప్రేమ గల దేవతలారా ! ఇప్పుడు మా రథమును రక్షించండి. మా రథము అన్నాన్వేషణమున దేశములకు సాగినది. మా రథమునకు పూన్చిన అశ్వములు కదంతొక్కుచు దారి గడిచి విశాల ధరిత్రియందలి ఉన్నతప్రదేశమును తాకును.

    3. అట్లు కాకున్న సర్వదర్శియగు ఇంద్రుడు మరుత్తుల పరాక్రమ సహితుడయి, పనితీర్చుకొని, స్వర్గము నుండి వచ్చునపుడు, హింసారహిత ఆశ్రయద్వారమున మహాధనము, మరియు అన్నప్రాప్తి కొఱకు మా రథమును అనుకూలము చేయవలెను.

    4. కాకున్న - లోకములు సేవించదగు త్వష్ట, దేవపత్నుల సహితుడయి, ప్రీతియుక్తముగ మా రథమును తోలవలెను. ఇళ, మహా దీప్తివంతుడు భగుడు, బహుధీమంతుడగు పూష, ద్యావాపృథ్వులు, సూర్యస్వామి, అశ్వినీద్వయము మా రథమును నడిపించవలెను.

    5. కాకున్న ప్రసిద్ధులు, ద్యుతిమతులు, పరస్పర దర్శనీయులు, ప్రాణుల ప్రేరకులు ఉషయు, రాత్రియు మా రథమును నడిపించవలెను. భూమ్యాకాశములారా ! మిమ్ము నూతన స్తవముల కీర్తింతుము. స్థావర వ్రీహి అది అన్నములు అందింతును. ఓషధులు, సోమము, పశువులు మాకు మూడు విధముల ఆహారములు.

    6. దేవతలారా ! మేము మిమ్ము స్తుతించ ఇచ్చగించినాము. మీరు మా స్తుతులను ఆలకించ సంకల్పించండి. అంతరిక్షమున జన్మించిన అహిదేవత, సూర్యుడు, త్రితక్ష, ఋభు, ఇంద్రుడు, సవిత మాకు అన్నము ప్రసాదించవలెను. శీఘ్రగామి, జలతప్త అగ్ని మా స్తుతులు వినవలెను. ప్రసన్నుడు కావలెను.

    7. పూజనీయులగు విశ్వేదేవతలారా ! మీరు సర్వవిధముల స్తుతియోగ్యులు. మేము స్తుతించ కోరుచున్నాము. అన్న, బలముల అభిలాషులగు మానవులు మీ కొఱకు స్తుతులు రచించినారు. రథాశ్వములవలె మీ దళము మా కొఱకు విచ్చేయవలెను.

                               ముప్పది రెండవ సూక్తము

        ఋషి-శౌనక గృత్సమదుడు దేవతలు-విభిన్నులు, ఛందస్సు-1-5జగతి, 6-8 అనుష్టుప్.

    1. ద్యావాపృథ్వులారా ! యజ్ఞమును, మిమ్ము ప్రసన్నులను చేయదలచిన స్తోతలకు మీరు ఆశ్రయదాతలు అగుచున్నారు. మీ అన్నము అన్నిటికన్న ఉత్కృష్టమయినది. జనులెల్లరు మిమ్ము స్తుతింతురు. అన్నకాముడనై నేను మిమ్ము మహా స్తోత్రము ద్వారా స్తుతింతును.

    2. ఇంద్రా ! శత్రువుల రహస్య మాయలు పగలుకాని రాత్రిగాని మమ్ము వశపరచరాదు. మాకు కష్టములు కలిగించు శత్రుసేనకు మమ్ము వశపరచరాదు. మా స్నేహము విడువరాదు. నీవు మనసునందు మా సుఖమును కోరవలెను. మా స్నేహమును గుర్తుంచు కొనవలెను. ఇంద్రా ! ఇదే మేము నిన్ను కోరునది.

    3. ఇంద్రా ! నీవు ప్రసన్నుడవు అగుము. సుఖకరము. దుగ్ధవతి, బలవతి, పుష్టివతి అగు గోవును తీసుకొనిరమ్ము. నిన్ను ఎల్లరు ఆహ్వానింతురు. నీ నడక బలమైనది. మాట సత్యమయినది. నేను రాత్రింబవళ్ళు నిన్ను స్తుతింతును.

    4. నిండు పున్నమి చంద్రుని, పౌర్ణమి రాత్రిని ఆహ్వానించుచున్నాను. వారు ఉత్కృష్ట స్తోత్రమున ఆహ్వానయోగ్యులు, సుభగులు. వారు స్వయముగా మా కోరికలు ఎరుగవలెను. సూదితో బట్టలనువలె మా కర్మలను కుట్టవలెను. వారు మాకు బహుధనవంతులు, వీర్యవంతులగు పుత్రులను ప్రసాదించవలెను.

    5. పౌర్ణమీదేవీ ! నీవు హవ్యదాతను అనుగ్రహింతువు. ధనము ప్రసాదింతువు. నేడు ప్రసన్న చిత్తవు అగుము. అదే అనుగ్రహమున విచ్చేయుము. భాగ్యవతివగు నీవు మాకు వేలరీతులుగా పుష్టిని ప్రసాదింతువు.

    6. స్థూలజాతవగు సినీవాలీ ! అమావాస్య రాత్రీ ! నీవు దేవతల సోదరివి. నీకు సమర్పించిన హవ్యమును సేవింపుము. మాకు సంతానమును ప్రసాదించుము.

    7. సినీవాలి సుబాహువులు, సుందర అంగుళులు కలది. ఆమె సుప్రసవిని. బహు ప్రసవిత్రి. లోక రక్షకమయిన ఆ దేవికి హవ్యములు అర్పించుడు.

    8. గుంగ, కుహు, దేవపత్ని, సినీవాలి, పున్నమిరేయి, సరస్వతిని ఆహ్వానించుచున్నాను. ఆశ్రయమునకు ఇంద్రాణిని, సుఖముల కొఱకు వరుణానిని ఆహ్వానించుచున్నాను.

    (గుంగ, కుహువు, రాకా, సినీవాలి సహచరులు)

    ఆంధ్రవచన ఋగ్వేద సంహిత రెండవ మండలమన మూడవ అనువాకము సమాప్తము.

    నాలుగవ అనువాకము             ముప్పది మూడవ సూక్తము

        ఋషి-శౌనక గృత్సమదుడు, దేవత -రుద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. రుద్రా ! నీవు మరుత్తు పితరుడవు. నీవు అందించు సుఖము మా వరకు రావలెను. మమ్ము సూర్యదర్శనము నుండి విడదీయరాదు. వీరులగు మా పుత్రులు శత్రువులను పరాజితులను చేయవలెను. మేము పుత్ర, పౌత్రులతో అనేకులము కావలెను.

    2. రుద్రుడా ! నీవు మాకు ప్రసాదించు సుఖకరము అగు ఔషధమున మేము నూరేళ్లు జీవించవలెను. మా శత్రువులను నాశము చేయుము. మా సర్వపాపములను దూరము చేయుము. శరీరమునందు అంతట వ్యాపించిన రోగములను దూరము చేయుము.

    3. రుద్రా ! నీవు ఐశ్వర్యమున అందరిని మించిన వాడవు. నీవు వజ్రబాహువవు. ప్రవృద్ధులలో అందరిని మించిన ప్రవృద్దుడవు. మమ్ము పాపముల నుండి చేరి చేర్చుము. పాపముల మా వద్దకు రాకుండ చేయుము.

    4. అభీష్టవరదా ! రుద్రా ! మేము అన్యథా నమస్కరించి, అన్యథా స్తుతించి, విసదృశదేవతల సత్య ఆహ్వానమున నీకు కోపము తెప్పించకుండవలెను. మా పుత్రులను ఔషధముల ద్వారా పుష్టివంతులను చేయుము. "భేషజోభిర్బిపక్తమం త్వాభిషజాశృణోమి" నీవు వైద్యులందు సర్వ శ్రేష్ఠుడవని వినుచున్నాము.    




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.