Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



                                                పన్నెండవ అధ్యాయము

                                                              భక్తి యోగము

    అర్జున ఉవాచః

        ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే
        యే చాప్యక్షర మవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః  1

    నిత్యము నీపై మనసు వుంచి భక్తితో ఉపాసిస్తారు. అవ్యక్తుడైన అక్షర బ్రహ్మము ఉపాశించువాడు ఒక్కడు. యీ రెంటిలో ఎవడు ఉత్తముడు అగుచున్నాడు?

    శ్రీ భగవానువాచ:
    
        మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే
        శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః  2

    నా మీదనే మనసుంచి నిరంతర భక్తుడై అత్యంత విశ్వాసముచే నన్ను అర్చించువాడు పరమయోగి అని నా అభిప్రాయము.

        యే త్వక్షర మనిర్దేశ్యమ్ అవ్యక్తం పర్యుపాసతే
        సర్వత్రగ మచింత్యం చ కూటస్థ మచలం ధ్రువమ్  3
        సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః
        తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః  4

    ఎవడు ఇంద్రియములను వశపరచుకొనునో, సకల భూత హితమును కోరునో, సర్వప్రాణులను సమభావముతో చూచునో, అతడు యోగి అనబడుచున్నాడు. అట్టివాడు మనో బుద్ధులకు అతీతుడును, సర్వవ్యాపియు, అనిర్వచనీయుడును, కూటస్థుడును, నిశ్చలుడును, నాశరహితుడును అగు బ్రహ్మమునందే ధ్యానముంచి భజించువారు పరబ్రహ్మమునే పొందుదురు.

        క్లేశో - ధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసామ్
        అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవర్భిరవాప్యతే  5

    అక్షర పరబ్రహ్మను చేరుటకు మార్గము చాలా కఠినమైనది. దుఃఖ పూరితము, దేహాభిమానులకు మరింత కష్టమగుచున్నది. ఇది అక్షర బ్రహ్మను చేరు ఉపాయము.

        యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరాః
        అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే  6
        తేషామహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్
        భవామి న చిరాత్పర్థ! మయ్యావేశిత చేతసామ్  7

    ఎవడు సమస్త కర్మలను నాకే అర్పించునో, మత్పరులై, అనన్య యోగమున నన్ను ధ్యానించి ఉపాశించునో నాయందే లగ్న మనస్కులైన పరమభక్తులను త్వరలోనే మృత్యు సంసార సాగరము నుండి ఉద్ధరింతును.

        మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ
        నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః  8

    నా యందే మనసును నిలుపుకోబుద్ధిని చేర్చును. అట్టివాడు నాయందే నివసించుచున్నాడు. యీ విషయములో ఎట్టి సంశయము లేదు.

        అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్
        అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ!  9

    అర్జునా! ఆ విధముగా మనసును, నా యందు నిలుపుటకు అశక్తుడవైనచో, అభ్యాసయోగమున నన్ను చేరుటకు ప్రయత్నించుము.

        అభ్యాసే - ప్య సమర్తో - సి మత్కర్మ పరమో భవ
        మదర్థమపి కర్మాని కుర్వన్ సిద్ధి మవాప్స్యసి  10

    అభ్యాసమునకు గూడా అశక్తుడవైనచో నా కర్మపరుడవగుము. నా కొరకు కర్మలను చేయుము. ఆ విధముగా సిద్ధిని పొందుము.
    
        అథైతదప్యశక్తో - సి కర్తుం మద్యోగ మాశ్రితః
        సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్  11

    నా యోగమును ఆశ్రయించి, అది చేయుటకును అశక్తుడవైనచో సర్వకర్మ ఫల త్యాగము చేయుము. నీ ప్రయత్నము ఫలించును.

        శ్రేయో హి జ్ఞాన మభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే
        ధ్యానాత్కర్మ ఫలత్యాగః త్యాగాచ్ఛాంతి రనంతరమ్  12

    అభ్యాసమును మించినది జ్ఞానము, జ్ఞానమును మించినది ధ్యానము, ధ్యానమును మించినది కర్మఫలత్యాగము. దానివల్ల వెంటనే శాంతి లభించును.

        అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ
        నిర్మమో నిరహంకారః సమ దుఃఖసుఖః క్షమీ  13
        సంతుష్ట స్సతతం యోగీ యతాత్మాదృఢనిశ్చయః
        మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్త స్స మే ప్రియః  14

    సమస్త ప్రాణులను ద్వేషించనివాడు మైత్రి, కరుణాకలవాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖదుఃఖముల సమముగా భావించువాడు, క్షమించువాడు, నిరంతర తృప్తి కలవాడు యోగి. అతడు ప్రయత్నించును. దృఢ నిశ్చయము కలవాడు. అట్టివాడు తన మనస్సును, బుద్ధిని నాకు అర్పించినచో, నాకు భక్తుడు, ప్రియుడు అగును.

        యస్మా న్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చ యః
        హర్షామర్ష భయోద్వేగైః ముక్తో య స్స మే ప్రియః  15

    ఎవని వలన లోకము ఉద్విగ్నము గాకున్నదో, లోకముల వలన ఎవడు ఉద్విగ్నుడు గాకునానడో, సంతోషము, ఈర్ష్య, భయము, ఉద్వేగము నుండి విముక్తుడో అట్టివాడు నాకు ప్రియుడగుచున్నాడు.

        అనపేక్ష శ్శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః
        సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః  16

    ఎవడు నిరపేక్షకుడో, శుచియో, వ్యధలేనివాడో, ఉదాసీనుడో, ఎవడు సర్వారంభ పరిత్యాగియో! అతడు నాకు భక్తుడు, ప్రియుడు అగుచున్నాడు.

        యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి నా కాంక్షతి
        శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్య స్స మే ప్రియః  17

    ఎవడు పొంగడో, ద్వేషించడో, ఏడవడో, కాంక్షించడో, శుభా శుభ పరిత్యాగియో, భక్తిమంతుడో అతడు నాకు ప్రియుడు.

        సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః
        శీతోష్ణ సుఖదుఃఖేషు సమ స్సంగ వివర్జితః  18
        తుల్య నిందా స్తుతా ర్మౌనీ సంతుష్టో యేనకేనచిత్
        అనికేతః స్థిరమతిః భక్తిమాన్మే ప్రియో నరః  19

    శత్రుమిత్రులు, మానావమానములు, శీతోష్ణ సుఖదుఃఖములు సమములైన సంగవర్జితులు.
    నిందాస్తుతులను సమముగా భావించువాడును, మౌనియు, సంతుష్టుడును, అనాసక్తుడును, స్థిరమతియు, భక్తిమంతుడు నాకు ప్రియుడు అగుచున్నాడు.

        యే తు ధర్మ్యామృత మిదం యథోక్తం పర్యుపాసతే
        శ్రద్ధదానా మత్పరమాః భక్తాస్తే - తీవ మే ప్రియాః  20

    అటువంటి ధర్మామృతమును యథోక్తము ఉపాశించువారు శ్రద్ధగలవారు మత్పరాయణులగు భక్తులు నాకు అతిప్రియులు.
    భక్తియోగము అను పన్నెండవ అధ్యాయము ముగిసినది.

                                                ఓం శాంతిః శాంతిః శాంతిః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.