Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



    శ్రీ భగవానువాచః

        సుదర్దర్శ మిదం రూపం దృష్టవానసి యన్మమ
        దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః  52

    నేను నీకు చూపిన రూపము అలభ్యము. దేవతలు సహితము అట్టి రూపమును దర్శించుటకు నిత్యము నిరీక్షిస్తుంటారు.

        నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా
        శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మా యథా  53

    వేదము, తపస్సు, దానము, యజ్ఞములకు శక్యముగాని రూపమును నీకు దర్శింపచేసినాను.

        భక్త్వా త్వనన్యయా శక్యః అహమేవం విధో-ర్జున
        జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప!  54

    ఆ రూపమును ప్రత్యక్షముగా దర్శించుటకు, తత్వజ్ఞానము పొందుటకు అందు ఏకీభావస్థితి గలుగుటకు అనన్యభక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును.
    
        మత్కర్మకృన్ మత్పరమః మద్భుక్త స్సంగవర్జితః
        నిర్వైర స్సర్వ భూతేషు యస్సమామేతి పాండవ!  55

    సర్వ కర్మలు నాకు సమర్పించువాడును, సంగవర్జితుడగు నా భక్తుడును, ప్రాణులందు వైరభావము లేనివాడును పాండవా! నన్ను చేరుచున్నారు.

    దీపిక:

    ఈ అధ్యాయము ఆధ్యాత్మికము అద్భుతము. ఆశ్చర్యకరము.
    ఇది ఐదువేల ఏండ్ల క్రిందటి కథ. వ్యాసమహర్షి అవలంబించిన టెక్నిక్ అత్యంత ఆధునికంగా వుంది. వ్యాసమహర్షి కెమెరాతో బొమ్మను తీశాడా? చిత్రకారుడు చిత్రాలు వేసినాడా? అనిపిస్తుంది. మనము అంతా హాలులో కూర్చొనియున్నాము. తెర ఎప్పుడు లేస్తుందా అను ఆతురత. తెర లేచింది. రంగములో అర్జునుడు, స్వామిని విశ్వరూపమను దర్శింపచేయుమని ప్రార్థిస్తాడు. స్వామి తన వర్ణన ప్రారంభిస్తాడు. అంతే!
    రంగము మీకు సంజయుడు చేరుకొంటాడు. సంజయుడు కొంత వర్ణిస్తాడు. అంటే మనకు చెప్పుతున్నాడని అర్థము.
    అంతా ఒకే ఒక్కనితో చెప్పించరాదు. అనేది వ్యాసుని టెక్నిక్.
    అర్జునుడు మాట్లాడతాడు అని సంజయుడు తప్పుకొంటాడు. అర్జునుడు విశ్వరూపమును మొత్తము వర్ణించి చెపుతాడు.
    స్వామి భీకర రూపమును దర్శిస్తాడు. అర్జునుడు భయపడిపోతాడు. సౌమ్య రూపమును దర్శించమని స్వామిని ప్రార్థిస్తాడు.
    స్వామి తన నిజస్వరూపము చూపిస్తాడు. అప్పుడు అర్జునుడు అంటాడు.
    అబ్బా! మానుష రూపములో వచ్చినావు. నాకు ఎంతయో హాయిగా వున్నది.
    ఇదే వ్యాసుని మానవ మనస్తత్వ పరిశీలన.
    కాస్త రామాయణములోనికి పోదాము. రావణవధ జరిగిపోయింది. రామలక్ష్మణులు లంక చూచుటకు వెళ్ళినారు.
    'అన్నా! లంక అంతయు బంగారమే' అన్నాడు లక్ష్మణుడు.
    అందుకు రాముడు అన్నమాట:
    అపిస్వర్ణమయీలంకానామమరోచతే
    జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి
    లంకా బంగారు మాయ అగుగాక. నాకు నచ్చదు.
    జననీ జన్మభూమి యీ రెండును స్వర్గములో గూడా లభించవు.
    అర్జునుడు నిరంతరము విశ్వరూపమును చూడదలచలేదు. నాటకము వలె మాత్రమే!
    ఎవరి ఇల్లు వారికే బాగుంటుంది. గుడిసెగాని, మహా సౌధము గాని, ఎంత తిరిగినా తన యింటికి చేరాలి. అప్పుడు గాని సేదతీరదు. సరిగ్గా అర్జునుడు అదేమడి అన్నాడు. అది వ్యాసుని మనస్తత్వ పరిశీలన. నాటికి నీటికీ మనిషి మారలేదు! మనసు మారలేదు! మారినది బయటి లోకమే!
    వ్యాసుడు చిత్రించిన పద్ధతి అమోఘము. అద్భుతము. ఆశ్చర్యకరము. నాకు అర్జునునికి వలె స్వామిని దర్శింపచేశాడు.
    స్వామి సాక్షాత్కరించినాడు. నాముందే నిలచినట్లు అనిపించింది. అది వ్యాసుని చిత్ర చమత్కారము. మీరు శ్రద్ధగా చదవండి. స్వామి తప్పక సాక్షాత్కరిస్తాడు ఒకసారి గాదు, పదిసార్లు చదవండి. విశ్వరూప ప్రదర్శన శ్లోకాలు ప్రత్యేకముగా చదవండి.
    అప్పుడు చెప్పండి. స్వామి ఏ రూపములో వున్నాడు? మీ ముందు ఎలా ప్రత్యక్షమైనాడు?
    స్వామి అందరికీ ఒకే పేరున ప్రత్యక్షముగాడు. 'లోకోభిన్న రుచిః ప్రోక్తా' లోకానికి రుచులు వేరు. నా వరకు నాకు వ్యాసుడు కెమేరాతో ఫిలిం తీసి పంచరంగుల చిత్రమును ప్రదర్శించునట్లున్నది. అది వ్యాసునికి మాత్రమే సాధ్యము.
    నిజముగా ఎవరైనా ఒక ఫిలిం తీయగూడదూ? డబ్బు, పుణ్యము గూడా వస్తవి గదా! నాకున్న మరో ఆశ-బాపుతో విశ్వరూప దర్శన చిత్రాలు వేయించి ఒక ఆల్బమ్ ను చూడాలని.
    అప్పుడు స్వామి నిత్యము దర్శనమును ఇస్తుంటాడు గదా! అన్ని ఆశలు ఫలించవు!
    విశ్వరూప దర్శన యోగమను 11వ అధ్యాయం ముగిసింది.

                                ఓం శాంతిః శాంతిః శాంతిః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.