Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    13. బ్రహ్మణస్పతి యొక్క వేగవంతములగు అశ్వములు మా స్తుతులు వినును. మేధావి అయి సభ్యతగల అధ్వర్యుడు మనోహర స్తోత్రముల ద్వారా హవ్యముల అందించును. పరాక్రమవంతులను అణచివేయగల బ్రహ్మణస్పతి మావద్ద ఇష్టపూర్తిగా ఋణము గ్రహించును. అన్నవంతుడగు బ్రహ్మణస్పతి యుద్ధమున హవ్యము గ్రహించును.

    ("ఋణం అస్మాభిర్యజ్వుభిః ప్రదేయం" అన్నాడు శాయణుడు. యజ్వులు ఇవ్వవలసినది ఋణము అని అర్థము. యజ్వులు దేవతలకు ప్రతిఫలమును ఆశించి హవ్యము ఇచ్చినపుడు అది అప్పుకావచ్చును కదా !)

    14. బ్రహ్మణస్పతి మహాకార్యములందు నిమగ్నుడై ఉన్నపుడు అతని మంత్రములు అతని అభిలాషలను సఫలము చేయును. అతడు గోవులను విడిపించి ద్యులోకమునకు భాగము కలిగించినాడు. మహంతమగు స్తోత్రము పగిది గోవులు స్వబలమున విడివిడిగా ద్యులోకమునకు వెళ్ళినవి.   

    15. బ్రహ్మణస్పతీ ! మమ్ము సర్వవేళల ఉత్కృష్ట నియమములు గల అన్నవంతమగు ధనమునకు అధిపతులను చేయుము. నీవు ఎల్లరకు ఈశ్వరుడవు. మా పుత్రులకు పౌత్రులను ప్రసాదించుము. మా స్తుతిని అన్నమును ఆశించుము.

    16. బ్రహ్మణస్పతీ ! నీవు ఈ లోకములకు నియామకుడవు. మా సూక్తమును గ్రహించుము. మా సంతతులను ప్రసన్నులను చేయుము. దేవతలు రక్షించువారు చక్కని కళ్యాణ వంతులగుదురు. మేము, పుత్ర, పౌత్రవంతులమయి ఈ యజ్ఞమున ప్రభవించు స్తోత్రమును గానము చేసెదము.

                              ఇరువది అయిదవ సూక్తము

        ఋషి - శౌనక గృత్సమదుడు, దేవత - బ్రహ్మణస్పతి, ఛందస్సు - జగతి.

    1. యజమానులు అగ్నిని ప్రజ్వరిల్లచేసి శత్రువును హింసించగలిగినారు. స్తోత్రములు చదివియు హవ్యములు అందించియు యజమానులు సమృద్ధులు అయినారు. బ్రహ్మణస్పతి మిత్రునిగా భావించిన యజమానికి పుత్రునికన్న అధిక జీవితము కలుగును.

    (మనుమనికన్న ఎక్కువకాలము జీవించును)

    2. యజమాని తన వీర పుత్రులద్వారా శత్రువు వీరపుత్రులను కొట్టవలెను. అతడు గోధనమునకు విఖ్యాతుడు అయినాడు. అతడు స్వయముగా గ్రహించు బుద్ధికుశలుడు. బ్రహ్మణస్పతి మిత్రునిగా భావించిన యజమానికి పుత్ర పౌత్ర సమృద్ధి కలుగును.

    3. నది తటములను తెంపినటుల, ఆ బోతు ఎద్దులను ఓడించినటుల బ్రహ్మణస్పతిని సేవించు యజమాని స్వశక్తితో తన శత్రువులను పరాభూతులను చేయగలడు. అగ్నిశిఖను ఆర్పరానటులే బ్రహ్మణస్పతి మిత్రునిగా భావించిన యజమానిని ఎంతటి వాడును ఆర్పజాలడు.

    4. బ్రహ్మణస్పతి మిత్రునిగా గ్రహించిన యజమానివద్దకు నిరంతర ఝరిగా స్వర్గీయజలము వచ్చును. పరిచారకులు సహితము ఇతరుల పరిచారకులు కన్నముందు, గోధనము పొందుదురు. అతని బలము అనివార్యము అగును. అతడు స్వబలమున శత్రువులను పరిమార్చును.

    5. బ్రహ్మణస్పతి మిత్రునిగా గ్రహించిన యజమాని దిశకే నదులన్నియు ప్రవహించును. అతడు సర్వదా సకల సుఖములు అనుభవించును. అతడు సౌభాగ్యశాలి అగును. అతనికి దేవతలు ప్రసాదించిన సుఖములు సమృద్ధములు అగును.

                              ఇరువది ఆరవ సూక్తము

        ఋషి - శౌనక గృత్సమదుడు, దేవత - బ్రహ్మణస్పతి ఛందస్సు - జగతి.

    1. బ్రహ్మణస్పతిని స్తుతించు సామాన్యుడు శత్రు వినాశకుడు కావలెను. దేవతలను నమ్మినవాడు, నమ్మినవారిని పరాభూతులను చేయవలెను. బ్రహ్మణస్పతిని చక్కగా సంత్రుప్తుని చేసినవాడు దుర్ధర్ష శత్రువును సహితము నాశము చేయగలడు. యజ్ఞపరాయణలు అయాజ్ఞికుల ధనమును అనుభవించవలెను.

    2. వీరులారా ! బ్రహ్మణస్పతిని స్తుతించుడు. దురభిమాని శత్రువుపై యుద్ధయాత్ర సాగించుడు. శత్రువుతో యుద్ధమున మనసును గట్టిపరచుకొనుడు, బ్రహ్మణస్పతి కొఱకు హవ్యములు సిద్ధము చేయుడు. అది మాకు ఉత్తమ ధనములు కలిగించును. మేము బ్రహ్మణస్పతి రక్షణ కోరుచున్నాము. "బ్రహ్మణస్పతేరవవృణేమహే"

    3. శ్రద్ధావంతుడయి దేవతల పితరుడు బ్రహ్మణస్పతికి హవ్యముల ద్వారా పరిచర్య చేయువానికి అతని అనుచరులు ఆత్మీయులు పుత్రులు పరిచారకుల సహితముగా అన్నము, ధనము లభించును.

    4. ఘృతయుక్త హవ్యమున పరిచర్య చేయువానికి బ్రహ్మణస్పతి ప్రాచీనమగు సులభమార్గము చూపును. బ్రహ్మణస్పతి అతనిని పాపము, శతృత్వము, దారిద్ర్యము నుండి రక్షించును. ఆశ్చర్యరూపుడగు బ్రహ్మణస్పతి అతనికి మహోపకారము చేయును.

                              ఇరువది ఏడవ సూక్తము

    ఋషి - గృత్సమదుడు లేక అతని పుత్రుడు కూర్ముడు దేవత - ఆదిత్యుడు, ఛందస్సు - త్రిష్టుప్

    1. సర్వదా శోభిల్లు ఆదిత్యులకు నేను ఘృతము స్రవించు స్తుతిని సమర్పించుచున్నాను. మిత్ర, అర్యమ, భగ బహువ్యాపక వరుణ, దక్ష, అంశాదులు నా స్తుతులను ఆలకించవలెను.

    2. దీప్తిమంతులు, వృష్టిపూర్ణులు, అనుగ్రహ పరాయణులు, హింసారహితులు, ఏకవిధ కర్మకర్తలు అర్యమ, వరుణనామక ఆదిత్యులు నేడు నా స్తోత్రమును గ్రహించవలెను.

    3. మహామహులు గంభీరులు, దుర్దమనీయులు, దమనకారులు, బహువృష్టిమంతులు ఆదిత్యగణములు ప్రాణుల అంతఃకరణములను చూడగలరు. దూర దేశమునందు ఉన్న పదార్థము ఆదిత్యులకు అతి దగ్గరది అగును.

    4. ఆదిత్య గణములు స్థావర జంగమాత్మకములను స్థాపించినారు. సమస్త భువనములను రక్షించుచున్నారు. యజ్ఞవంతులగు ప్రాణుల హేతుభూతము అగు జలమును రక్షించుచున్నారు. వారు సత్యవంతులు. ఋణ చయనులు.

    5. ఆదిత్యులారా ! మాకు మీ ఆశ్రయము లభించవలెను. భయము కలిగినపుడు మీ ఆశ్రయము సుఖప్రదము అగును. ఆర్యమ, మిత్ర వరుణులారా ! మిమ్ము అనుసరించి దిబ్బలవంటి పాపములను వదిలించు కొందును.

    6. అర్యమ, మిత్రావరుణులారా ! మీ మార్గము సుగమము, సుందరము, నిష్కంటకము. మమ్ము ఆ మార్గముననే నడిపించుడు. తీయగా మాట్లాడుడు. అవినాశ్య సుఖములు ప్రసాదించుడు.

    7. రాజమాత అదితి శత్రువులను లంఘించి మమ్ము అన్యదేశమునకు చేర్చవలెను. అర్యమ మమ్ము సుగమమార్గమున నడిపించవలెను. మేము మహావీరులము, అహింసకులము కావలెను. మిత్రావరుణులు మాకు సుఖములు ప్రసాదించవలెను.

    8.పృథివి, అంతరిక్ష, స్వర్గ, మర్త్యులారా ! మీరు జన, సత్యలోకములను ధరింతురు. వారి యజ్ఞము మూడు సదనములతో కూడినది. యజ్ఞము వలన ఆదిత్యుల మహిమ వ్యక్తమయినది. అర్యమ మిత్రావరుణులారా ! మీ మహత్వము మహోన్నతము.

    9. స్వర్ణాలంకార భూషితులు, దీప్తిమంతులు, నిద్రారహితులు, అనిమేషనేత్రులు, హింసారహితులు, సర్వులకు స్తవనీయులు ఆదిత్యుల సరళ స్వభావము లోకములకు అగ్ని, వాయు, సూర్య త్రివిధ తేజస్సులను అందించుచున్నది.

    10. అసుర వరుణా ! నీవు దేవతవో, మానవుడవో కాని అందరకు రాజువు. పూర్వులు అనుభవించిన ఆయువును అనుభవించునట్లు మమ్ము వంద సంవత్సరములు చూడనిమ్ము.

    11. ఆవాస ప్రదాతలగు ఆదిత్యులారా ! మేము కుడి ఎడమలు ఎరుగము. ముందు వెనుకలు ఎరుగము. మాది అపరిపక్వ బుద్ధి. మేము పిరికివారలము. మీరు మమ్ము వెంట తీసికొని వెళ్లుడు. మాకు నిర్భయ జ్యోతి ప్రాప్తించును. "అభయజ్యోతిరశ్యామ."

    12. యజ్ఞనాయకులు, ప్రభువులు ఆదిత్యులకు హవ్యము సమర్పించువారు వారి నిత్యానుగ్రహ పాత్రులు, ధనవంతులు, విఖ్యాతులు, వదాన్యులు, ప్రశంసనీయులయి రథమును ఎక్కి యజ్ఞభూమికి సాగుదురు.

    13. అతడు దీప్తిమంతుడు, హింసారహితుడు, విస్తార అన్నవంతుడు, సుపుత్రవంతుడు, సస్యవంతుడయి జలస్థానమున నివసించును. ఆదిత్యులను పూజించువారిని దూరపు శత్రువుకాని, దగ్గరి శత్రువుకాని వధించలేడు.

    14. అదితి, మిత్రావరుణులారా ! మేము మీ విషయున ఏదేని అపరాధము చేసి ఉన్నచో దయచేసి దానిని తుడిచివేయుడు. ఇంద్రా ! మాకు విశాలము, నిర్భయమగు జ్యోతి లభించవలెను. అంధకార రాత్రి మమ్ము దాచరాదు.

    15. ఆదిత్యులను అనుసరించువారికి ద్యావాపృథ్వులు ఏకముగా పుష్టిని కలిగించును. అతడు సౌభాగ్యశాలి. స్వర్గీయ జల ప్రాప్యుడయి సమృద్దుడు అగును. యుద్ధమునందు అతడు శత్రువులను పరాజితులను చేయును. తన స్థానము యుక్తముగా శత్రుస్థానమునకు చేరును. లోకపు అర్ధభాగము అతనికి మంగళ ప్రదము అగును.

    16. ఆదిత్యులారా ! ద్రోహులకొఱకు మీరు మాయను రచించినారు. శత్రువుల కొఱకు పాశము సిద్ధము చేసినారు. అందువలన అశ్వారోహకునివలె అనాయాసముగా శత్రువును లఘించగలము. మేము హింసారహితులమయి పరమ సుఖమునందు నివాసము ఏర్పరచుకొందుము.

    17. వరుణరాజా ! ధనికుడు, దానశీలుని ముందు నా దారిద్ర్యమును గురించి చెప్పుకొనవలసిన అవసరము ధనపు అభావము కలుగరాదు. మేము పుత్ర, పౌత్రవంతులమయి ఈ యజ్ఞమున ప్రభవించిన స్తుతిని గానము చేసెదము.

                          ఇరువది ఎనిమిదవ సూక్తము

        ఋషి-గృత్సమద పుత్రుడు కూర్ముడు దేవత - వరుణుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. వరుణుడు కవి. సుశోభితుడు. ఈ హవ్యము అతనికి సమర్పించుచున్నాము. అతడు తన మహిమచే సకల భూతములను పరాజితులను పరాజితులను చేయును. వరుణుడు స్వామి. ప్రకాశమానుడు. అతడు యజమానుని ప్రసన్నుని చేయును. నేను వరుణుని స్తుతులను ప్రార్థించుచున్నాను.

    2. వరుణా ! మేము నిన్ను స్తుతింతుము. ధ్యానింతుము. పరిచర్యలు చేయుదుము. అట్లు చేసి సౌభాగ్యవంతులము అగుదుము. కిరణయుక్తమగు ఉష ఉదయించగనే అగ్ని క్రియలు ప్రారంభించినట్లు మేము తేజోవంతులము అగుదుము. కిరణయుక్తమగు ఉష ఉదయించగనే అగ్నిక్రియలు ప్రారంభించినట్లు మేము తేజోవంతులము అగుటకు నిన్ను నిత్యము స్తుతింతుము.

    3. విశ్వనాయకా ! వరుణా ! నీవు ఎంతో శౌర్యవంతుడవు. అందువలన నిన్ను అనేకులు స్తుతింతురు. మాకు నీ ఇంట నివసించు కోరిక కలదు. హింసారహితుడవు. ప్రకాశమానుడవగు అదితిపుత్రా ! మాతో స్నేహము చేయుము. మా అపరాధములు మన్నింపుము.

    4. వరుణా ! నీవు విశ్వమును ధరించువాడవు. అదితి పుత్రుడవు. నీవే జలమును సృష్టించినావు. నీ మహిమ వలననే నదులు ప్రవహించుచున్నవి. నదులు విశ్రమించవు. వెనుతిరుగవు. అవి ఆకాశమునందలి పక్షులవలె భూమిమీద వేగవంతములయి ప్రవహించుచున్నవి.

    5. వరుణా ! నన్ను పాపములను త్రాళ్లు కట్టివేసినవి. విడిపించుము. జలపూర్ణములగు నీ నదులు మాకు లభించవలెను. నేతనేయునపుడు మా దారము తెగరాదు. అకాలమున అసంపూర్ణముగ మా యజ్ఞము విఫలము కారాదు.

    6. వరుణా ! నీవు సామ్రాట్టువు. సత్య స్వరూపుడవు. నా మీద దయ తలచుము. నా భయమును దూరము చేయుము. త్రాటితో కట్టిన దూడను విడిపించినట్లు, నన్ను పాపములనుంచి విడిపించుము. నిన్ను విడిచి ఎంతటివాడయినను ఒక్క క్షణమయినను ఆధిపత్యము చేయలేడు. నీవే అధిపతివి.

    7. వరుణా ! నీ యజ్ఞమున అపరాధము చేయువారిని హతమార్చు ఆయుధము మాకు దూరముగా ఉండవలెను. మాకు వెలుగులు దూరము కారాదు. మా జీవనము నుండి హింసకులను తొలగింపుము.

    8. వరుణా ! నీవు అనేక స్థానములందు జన్మింతువు. మేము భూత, భవిష్యత్, వర్తమానములందు నీకు నమస్కరింతుము. అహింసనీయ వరుణా ! పర్రతములనువలె సర్వసత్కర్మలు నిన్ను ఆశ్రయించి ఉన్నవి.

    9. వరుణా ! మా పూర్వులు చేసిన ఋణములు తీర్చుము. ఇప్పుడు మేము చేసిన ఋణములను తీర్చుము. మాకు ఇతరులు ఆర్జించు ధనముమీద ఆధారపడు అవసరము కలుగరాదు. అప్పుల కారణముగా అప్పుచేసినవానికి అనేక ఉషస్సులు ఉదయించవు. మా జీవితమున అన్ని ఉషస్సులు ఉదయించవలెను. వరుణా ! అట్లని ఆదేశింపుము. 

    (అప్పులు-అప్పులు ఇచ్చువారు ఎంత భయంకరులో వివరించినాడు. అప్పు ఇచ్చినవాడిని తీసుకున్నవాడిని రాత్రులు బాధించును. బంధించును. ఉషను దర్శించనీయడు. ఉషతో జరుపవలసిన కార్యక్రమములను జరుపనీయడు. వాని జీవితము అంధకారమయము అగును. వెలుగు కనిపించదు. అందువలన అప్పులు లేని జీవితము ప్రసాదించుమనుచున్నాడు. ఈ విషయమున మరెంతో చెప్పవచ్చును.)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.