Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ సీతారామమూర్తిచౌదరి, తుమ్మల
దేశరక్షణ
అరరే! యెంతకు సాహసించితివి! స
త్యాహింస లశ్రాంతమున్
బరమార్థం బని నమ్మి సర్వవసుధా
బంధుత్వ మాసించు మా
భరతక్షోణికె చిచ్చువెట్టితటరా!
పాపాత్మ! చైనీయ! నీ
తెఱగున్ గన్గొని దేశదేశములు ధిగ్
ధిగ్రావముల్ చేసెడిన్,
ఏ మసమర్థతన్ బడి య
హింసకు నొగ్గినవార మంచు నే
మేమొ తలంపబోకుము స
హిష్ణులుగా జగదేకవిక్రమ
స్థేములుగా మమున్ దఱిమి
దిద్దు మహాత్ముడు గాంధి మా మన
స్సీమల నేటికిన్ గల డ
జేయ మహస్సముదీర్ణమూర్తియై.
కత్తిని గత్తితో నణప
గాదని పల్కెద, మింతెకాక యీ
నెత్తురుకూడు క్రీడని య
నిన్ దెగనాడిన క్రీడి ధైర్య వి
చ్చిత్తియు నింద్యవృత్తి యని
చెప్పెద; ముత్తమ ధర్మరక్షకై
యెత్తిననా డగత్య మగు
నేని వరించెద మస్త్రశస్త్రముల్.
అసురుసురై గడించుకొని
నట్టి స్వరాజ్యము, బాపుజీ తపః
ప్రసవముగా బయల్మెఱసి
ప్రస్తుతిగన్న స్వరాజ్య, మిప్డు నీ
బుసబుస కుల్కి క్లైబ్యమున
బ్రుంగి త్యంజింపము; రిత్తరిత్తగా
నసువులు కోలుపోక జగ
మౌనన వచ్చినత్రోవ బట్టుమా!
మ్రుక్కడిమూక జూచుకొని
మోహమునం బడబోకుమోయి! మా
యొక్కొక్క భారతీయభటు
డొక్కొక వజ్రపుముక్క సుమ్ము! తా
నెక్కటి కయ్యమందు యము
నే నెదిరించుట కోహటిల్ల; డీ
పెక్కువ క్రొత్తగాదు కని
పించు యుగమ్ములనుండి మొక్కలీ!
ఇద్ధచరిత్ర భారత మ
హీ మహిళన్ విన వొక్కొ! భీరుతా
విద్ధముగాని డెందమున
విశ్వజనస్తుతి దక్కె నీమెకున్;
క్రుద్ధభుజంగివంటి దను
కొమ్మిది కోల్తలసేయుపట్ల; మీ
యుద్ధతి దూల్ప మాయువతి
యొక్కతి చాలునురా! దురాశయా!
తొలిగెల్పుం గని సంబరంపడుచు గం
తుల్వెట్ట కోరోరి! మున్
తులువల్ పెక్కురు విఱ్ఱవీగి తుద కా
ర్తుల్ గారె కయ్యాన; మా
వలనన్ ధర్మువు నిల్చి యుంట సమర
వ్యాపార మేపార మం
జులరోచిన్ జయలక్ష్మి మా కెదురు వ
చ్చున్ ఱేపు ముమ్మాటికిన్.
అచ్చపు మంచుగొండ నెల
వై వెలయున్ బరమ ప్రసన్నతన్
నిచ్చలు ప్రొద్దుపుచ్చు మహ
నీయుడు మా శిశిమౌళి రుద్రుడై
చిచ్చఱకన్ను విచ్చునటు
చేసితి వక్కట! దుర్నివారమై
వచ్చెడి యీ మహావిలయ
వహ్నికి నీఱయిపోక నిల్తువే.
నీతో నెందఱు బూదిపాలగుదురో
నీ బుద్ధి నూహింపకీ
శీతాద్రిన్ నవరక్త ధాతుపటలిన్
సృష్టించి దృష్టించుచున్
జేతఃప్రీతీ గడించుకో దలచితే!
చీనీ! భవత్ క్షుద్రపుం
జేతల్ రోతలు గూర్చె జాలు నిక ని
స్సీ! దుర్విదగ్ధక్రియల్.
లోకమునెల్ల నొక్క త్రుటి
లో మసిచేసెడి మారణాయుధా
నీకము పుట్టి నేలకును
నింగికి వ్రేల గయినట్టి వేళ నీ
దూకులు బాలు లీ కదన
దోహల మేటికి వల్లకాటికా?
నీ కనులింత గ్రుడ్డి వగు
నే! పరికింపవు సర్వనాశమున్.
నీ కిలువేల్పు బుద్ధు; డిది
నిన్నటి మొన్నటివార్త కాదు; హిం
సాకులమై వగర్చు జగ
మాతనిధర్మమె తారకమ్ముగా
జేకొన జూచువేళ నసి
చేకొని వచ్చితి వేమి? యేమియీ
మైకము? దుగ్ధమున్ వదలి
మద్యము క్రోలినయట్లు తోచెడిన్.
సత్యము వట్టి కల్లయని
చాటదలంచి కుతర్క ధోరణిన్
నిత్యము వాగినన్ నిలుచు
నే? మనకున్న యుగాలనాటి సాం
గత్యము మట్టిలో గలిపి
కాఱులు ప్రేలక; మెంతచేసినన్
వ్యత్యయ మేలవచ్చు? విజ
యంబె వశంపడుగాక పాడికిన్?.
* * * *





