Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
రెండవ సూక్తము
ఋషి - శౌనక గృత్సమదుడు, దేవత - ఇంద్రుడు ఛందస్సు -1,4 అష్టి, 2-3 అతిక్వరి.
1. ఇంద్రుడు పూజనీయుడు. బహు బలశాలి. తృప్తికరుడు. అతడు ముందుకోరిన రీతి త్రికదరమున 'యవలు' కలిపినాడు. అభిషవించిన సోమమును ఇంద్రుడు విష్ణు సహితుడయి పానము చేయవలెను. మహత్తు గల సోమము ఇంద్రుని తేజస్సు పెంచినది. మహాకార్యములకు సంసిద్ధుని చేసినది. ప్రసన్నుని చేసినది. సత్యవంతము. దీప్తివంతము అగు సోమము సత్యవంతుడు ప్రకాశవంతుడగు ఇంద్రుని పరివ్యాప్తుని చేయవలెను. "సత్యమింద్ర సత్యిందుః"
(త్రికద్రము అభిప్లవ ఉత్సవము. అందు జ్యోతి, గోర, ఆయువ్రతములు కలిసి ఉండునని శాయనుడు. మూడువిధముల భావప్రకటనము అని దయానందుడు)
2. ఇంద్రుడు ప్రకాశవంతుడు. అతడు తన బలమున యుద్ధమునందు 'క్రివి' నమకుని గెలిచినాడు. ద్యావాపృథ్వులను నలుదిశల తన తేజమున నింపినాడు. ఇంద్రుడు సోమపు బలమున వృద్ధి చెందినాడు. ఇంద్రుడు సోమమున ఒక భాగము తన ఉదరమున ధరించినాడు. అన్యభాగములను దేవతలకు ఇచ్చినాడు. "సత్యమింద్ర సత్యిందుః"
3. ఇంద్రా ! నీవు యజ్ఞమున సబలుడవై ప్రభవించినావు. నీవు సర్వము గ్రహించు ఇచ్చగలవాడవు. పరాక్రమమున వర్థిల్లినాడవు. హింసకులను జయించినావు. సదసద్వివేకుడవు. ఇంద్రా ! స్తోతకు కర్మసాధకము, వాంఛనీయము అగు ధనమును ప్రసాదించుము. సత్యవంతము, దీప్తివంతము అగు సోమము సత్యవంతుడు ప్రకాశవంతుడవగు ఇంద్రుని పరివ్యాప్తుని చేయవలెను.
4. ఇంద్రా ! నీవు సర్వ రక్షకుడవు. నీవు పూర్వము మానవులకు హితకారి అయినావు. అది ద్యులోకమున శ్లాఘనీయమయినది. నీ పరాక్రమమున వృత్రుని ప్రాణమును హింసించినావు. జలములను ప్రవహింప చేసినావు. శతక్రతువుకు అన్నము బలము జ్ఞానము ఉన్నది.
(శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత రెండవ అష్టకమున రెండవ మండలము రెండవ అనువాకము సమాప్తము.)
మూడవ అనువాకము ఇరువది మూడవ సూక్తము
ఋషి - శౌనక గృత్సమదుడు, దేవత - 1,5,9,11,17,19 బ్రహ్మణస్పతి-2-4,
6-8,10,12-16,18 బ్రహ్మణస్పతి, ఛందస్సు-1-14,16-18 జగతి, 15,19 త్రిష్టుప్.
1. బ్రహ్మణస్పతీ ! నీవు దేవతలలో గణపతివి. కవులలో కవివి. నీ అన్నము సర్వ శ్రేష్ఠము. ఉపమానభూతము. నీవు ప్రశంసనీయులలో రాజువు. మంత్రములకు స్వామివి. మేము నిన్ను ఆహ్వానించుచున్నాము. నీవు మా స్తుతులను ఆలకింపుము. మాకు ఆశ్రయ ప్రదానమునకుగాను యజ్ఞగృహమున ఆసీనుడవగుము.
2. బృహస్పతీ ! నీవు అసురహంతవు. అపారజ్ఞానివి. దేవతలు నీ యజ్ఞభాగమును సంపాదించినారు. జ్యోతి నుండి పూజ్యుడు సూర్యుడు కిరణములను ఉత్పత్తి చేసినట్లు నీవు సమస్త మంత్రములను ఉత్పత్తి చేయుము.
3. బృహస్పతీ ! నీవు నలుదిశల నిందకులను, అంధకారములను దూరము చేసినావు. జ్యోతిర్మంతము, యజ్ఞ ప్రాపకము, భయానకము, శత్రుహింసకము, రాక్షస నాశకము, మేఘ భేదకము స్వర్గ ప్రదమగు రథమును నీవు అధిరోహింపుము.
4. బృహస్పతీ ! నీకు హవిస్సులు అర్పించువారిని సన్మార్గమున నడిపింతువు. వారిని రక్షింతువు. వారికి పాపము తగలకుండును. నీవు మంత్రద్వేషులకు సంతాపకుడవు. క్రోధనులకు హింసకుడవు. అది నీ మహాత్మ్యము.
5. బ్రహ్మణస్పతి సురక్షకుడు. అతడు రక్షించిన వారికి దుఃఖములు, నష్టములు కలుగవు. పాపములు అతనిని బాధించవు. శత్రువులు అతనిని హింసించలేరు. దొంగలు అతనిని దోచుకొనలేరు. అతనిని, నీవు, సర్వహింసకులనుంచి దూరము చేయుము.
6. బృహస్పతీ ! నీవు మాకు రక్షకుడవు. సన్మార్గ ప్రదాతవు. విలక్షణుడవు. నీ యజ్ఞమునకు మేము స్తోత్రములు చదువుదుము. స్తుతులు పాడుదుము. మా విషయమున కుటిలముగా ప్రవర్తించువాని దుర్బుద్ధి వేగవంతము కావలెను. అతనిని నష్టపరచవలెను.
7. బృహస్పతీ ! గర్వోన్మత్తుడు, సర్వగ్రాసి యగువాడు మా ముందునకు వచ్చి మమ్ము హింసించినప్పుడు వానిని సన్మార్గము నుండి తొలగింపుము. యజ్ఞముకుగాను మా మార్గమును సుగమము చేయుము.
8. బృహస్పతీ ! నీవు అందరిని ఉపద్రవముల నుండి రక్షింపుము. మా పౌత్రాదులను పాలింపుము. మా కొఱకు మధుర భాషివి అగుము. మా విషయమున ప్రసన్నుడవగుము. మేము నిన్ను ఆహ్వానించుచున్నాము. దేవనిందకులను నాశము చేయుము. దుర్బుద్ధిగలవారు ఉత్కృష్ట సుఖములు పొందవలెను.
9. బ్రహ్మణస్పతీ ! నీవు మమ్ము వర్థిల్లచేయుము. మానవులనుండి స్పృహణీయ ధనము మాకు లభించవలెను. దూరమునుండిగాని, దగ్గరనుండిగాని మమ్ము పరాజితులను చేయు యజ్ఞహీన శత్రువులను నష్టపరచుము.
10. బృహస్పతీ ! నీవు కోరిక తీర్చువాడవు. పవిత్రుడవు. నీ సాయమున మాకు ఉత్కృష్ట అన్నము లభించును. మమ్ము పరాజితులను చేయదలచిన దుర్జనుడు మాకు అధిపతికారాదు. మేము ఉత్కృష్ట స్తుతులు చేయవలెను. పుణ్యవంతులము కావలెను. ఉన్నతిని పొందవలెను.
11. బ్రహ్మణస్పతీ ! నీ దానము నిరూపమానము. నీవు అభీష్టవరప్రదాతవు. యుద్ధమున నీవు శత్రువులను సంతప్తులను చేయుదువు. వారిని నష్టపరతువు. నీవు సత్య పరాక్రముడవు. ఋణశోధకుడవు. ఉగ్రుడవు. మదోన్మత్తులను అణచి వేతువు.
12. బృహస్పతీ ! దేవశూన్యుని మనసులో మమ్ము హింసించ దలచిన వాని, పొగరున మమ్ము వధించదలచిన వాని ఆయుధము మమ్ము తాకకుండ వలెను. అట్టి బలవంతుడగు దుష్ట శత్రువు యొక్క క్రోధమును మేము నాశనము చేయగల సమర్థులము.
13. యుద్ధకాలమున బృహస్పతి ఆహ్వానయోగ్యుడు. నమస్కార పూర్వక ఉపాసనాయోగ్యుడు. అతడు యుద్ధములకు వెళ్లును. సకల విధ ధనములను ప్రసాదించును. సకల జనులకు స్వామియగు బృహస్పతి విజయాభిలాషగల హింసక సేనలన్నింటిని రథమువలె హతమార్చును. ధ్వంసము చేయును.
14. బృహస్పతీ ! అత్యంత తీక్ష్ణము సంతాపకారకమగు ఆయుధమున రాక్షసులను సంతప్తులను చేయుము. ఈ రాక్షసులు నీ పరాక్రమమున ప్రభావితులు అయినారు. అట్లయ్యు నిన్ను నిందించినారు. పూర్వకాలమున ప్రశస్తమయిన నీ పరాక్రమమును ఇప్పుడు ప్రకటించుము. ఆ పరాక్రమమున నిందకులను వినాశము చేయుము.
15. యజ్ఞమున జన్మించిన బృహస్పతీ ! ఆర్యులు పూజించునట్టి ధనము, తేజోవంతము యజ్ఞవంతమగు ధనము, జనులను శోభింపచేయు ధనము, స్వతేజమున ప్రకాశింపచేయు ధనము, అట్టి విచిత్ర ధనమును లేక బ్రహ్మ తేజమును మాకు ప్రసాదించుము.
16. బృహస్పతీ ! ద్రోహముచేసి ఆనందించు చోరులు, శత్రువులు, ఇతరుల ధనము ఆశించువారు, ఎల్లప్పుడు మనసులో దేవతలను బహిష్కరించు కోరికగలవారు, రాక్షసనాశకమగు సామస్తుతిని తెలియనివారి చేతికి మమ్ము చిక్కనీయకుము.
17. బృహస్పతీ ! త్వష్ట నిన్ను సర్వ శ్రేష్ఠునిగా సృష్టించినాడు. అందువలన నీవు సర్వనామముల ఉచ్ఛారణ కర్తవు. యజ్ఞము ఆరంభముకాగానే బ్రాహ్మణస్పతి దాని సర్వ ఋణములను స్వీకరించును. విముక్తము చేయును. అతడు విద్రోహులను వినాశము చేయుము.
18. అంగిరో వంశీయ బృహస్పతీ ! పర్వతములు గోవులను దాచినవి. నీ సంపదకుగాని అవి ప్రకటితములు అయినవి. నీవు ఆ గోవులను బహిర్గతము చేసినావు. అప్పుడు నీవు ఇంద్రుని సాయము పొందినావు. ఆవిధముగా వృత్రుడు ఆక్రమించిన జలాధార భూతమగు జలరాశిని విముక్తము చేసినావు.
19. బ్రహ్మణస్పతీ ! నీవు ఈ లోకములకు నియామకుడవు. మా సూక్తమును గ్రహించుము. మా సంతతులను ప్రసన్నములను చేయుము. దేవతలు రక్షించువారు చక్కని కళ్యాణవంతులు అగుదురు. మేము పుత్ర, పౌత్రవంతులమయి ఈ యజ్ఞమున ప్రభవించు స్తోత్రమును గానము చేతుము.
(బ్రహ్మణస్పతి బ్రహ్మణః + పతి- పరాత్పరుడు. జగద్రక్షకుడు. వేదములను దేశమును రక్షించువాడని దయానందుడు, అన్నమును వృద్ధి చేయువాడు. రక్షించువాడు. యజ్ఞాన్ని సకల సత్కర్మలను రక్షించువాడని శాయనుడు)
(శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత రెండవ అష్టకమున రెండవ మండలము ఆరవ అధ్యాయము సమాప్తము)
ఏడవ అధ్యాయము ఇరువది నాలుగవ సూక్తము
ఋషి - శౌనక గృత్సమదుడు, దేవత - 1, 10 బృహస్పతి, మిగిలినవి బ్రహ్మణస్పతి,
12 ఇంద్రుడు, బృహస్పతి, ఛందస్సు - 12,16 జగతి, మిగిలినవి త్రిష్టుప్.
1. బృహస్పతీ ! నీవు సకల జగములకు స్వామివి. చక్కని మా స్తుతిని గ్రహింపుము. మహంతము, నవీనము అయిన ఈ స్తుతి ద్వారా నిన్ను సేవింతుము. నీవు మాకు బంధువవు. మేము కోరిన ఫలము ప్రసాదించుము. మా స్తోతలు నిన్ను నుతింతురు.
2. బ్రహ్మణస్పతీ ! నీవు సమర్ధుడవు. తిరస్కరణీయులను తిరస్కరించినావు. క్రోధపరవశుడవు అయినావు. శంబరుని విదీర్ణుని చేసినావు. కదలని జలములను కదిలించినావు. గోధనపూర్ణమగు పర్వతమున ప్రవేశించినావు.
3. బ్రహ్మణస్పతి దేవతలందు శ్రేష్ఠ దేవత. అతడు సుదృఢ పర్వతమును శిథిలము చేసినాడు. స్థిర వృక్షమును, భగ్నపరచినాడు. గోవులను ఉద్ధరించినాడు. మంత్రమున బలాసురుని భగ్నము చేసినాడు. అంధకారమును అదృశ్యము చేసినాడు. సూర్యుని వెలువరించినాడు.
4. ఆ మేఘము శిలవలె దృఢముఖము గలది. మధురజల పూర్ణము. క్రిందికి వంగినది. దానిని బ్రహ్మణస్పతి బలప్రయోగమున వధించినాడు. ఆ జలమును సూర్యకిరణములు త్రాగినవి. ఆ జలమే వర్షమయి నేలను తడిపినది.
(ఇది ఒక ఆవర్తము. నేలమీది నీరు మేఘము అగును. మరల వర్షించును. ఇది భూమి, అంతరిక్షమునకు గల బంధము)
5. బ్రహ్మణస్పతి ప్రజ్ఞానము విచిత్రము. సనాతనము. అతడు తన ప్రజ్ఞానమున మాసములకు మాసములు వత్సరములకు వత్సరములు కలుగు వర్షద్వారములు తెరచినాడు. అతడు ఈ ప్రజ్ఞానమును మంత్ర విషయకము చేసినాడు. అట్లు చేసి ద్యావాపృథ్వుల పరస్పర సుఖమును వృద్ధిపరచినాడు.
6. అంగిరులు విజ్ఞులు. వారు నలు దిశల గాలించినారు. పణుల గుహలందు దాగిన పరమ ధనమును సాధించినారు. అసురుల మాయలో పడినారు. బయలుదేరిన చోటికే చేరినారు.
7. అంగిరులు సత్యవాదులు. సర్వజ్ఞులు. అట్లయ్యు అసురమాయలో పడినారు. మరల మరల ప్రధాన మార్గమున పోయినదారినే వెళ్లినారు. వారు తమచేతులతో చేసిన అగ్నిని పర్వతము మీదకు విసరినారు. అంతకుముందు ధ్వంసకము అగు అగ్ని అక్కడ లేకుండెను.
(అంగిరులు తొలుత అగ్నిని కలిగించినవారు అయినారు)
8. బ్రహ్మణస్పతి బాణము విసరగలవాడు. అతని బాణమునకు సత్యమే 'నారి' అగును. అతడు తాను కోరినది ధనువున సాధించును. అతడు విడిచిన బాణము కార్యము సాధించి తీరును. అతడు బాణదర్శనముకే పుట్టినాడు. కర్ణమే బాణముల జన్మస్థానము.
(బాణము ఆకర్ణాంతము లాగబడును. అందువల్ల కర్ణము జన్మస్థానము కావచ్చును. బ్రహ్మణస్పతి సర్వమును మంత్రములను చేసినాడు. మంత్రము శృతి. కావున కర్ణము జన్మస్థానము అయినది)
9. బ్రహ్మణస్పతి పురోహితుడు. అతడు పదార్థములను వేరు చేయగలడు. కూర్చగలడు. అందరు అతనిని స్తుతింతురు. అతడు యుద్ధమున వ్యక్తమగును. సర్వదర్శి అగు బ్రహ్మణస్పతి అన్నమును, ధనమును ధరించినపుడు సూర్యుడు అనాయాసముగ ఉదయించును.
10. బృహస్పతి వర్షము కలిగించువాడు. అతని ధనము నలుదిశల వ్యాపించి ఉన్నది. ఆ ధనము ప్రాపణీయము. ప్రభూతము. ఉత్తముడు, దర్శనీయుడు, అన్నవంతుడు బృహస్పతి ఆ ధనము సాంతము దానము చేసినాడు. యజమానులు, స్తోతలు ప్రసన్నచిత్తులయి ఆ ధనమును అనుభవించెదరు.
11. బ్రహ్మణస్పతి నాలుగు చెరుగుల వ్యాపించినవాడు. స్తవనీయుడు. మహాబలవంతుడు. యజమానులను స్తోతలను స్వశక్తిచే రక్షించును. అతడు దానాది గుణములు కలవాడు. దేవతల ప్రతినిధి. ప్రఖ్యాతుడు. అందువలననే అతడు సకల ప్రాణులకు స్వామి అయినాడు.
12. ఇంద్ర, బ్రహ్మణస్పతులారా ! మీరు ధనవంతులు, సత్యము సాంతము మీ స్వంతము. మీ వ్రతమును నీరు ముంచజాలదు. రథమునకు కట్టిన గుఱ్ఱము తిండి వెనుక పరిగెత్తును. అట్లే నీవు మా హవ్యముల కొఱకు ఉరుకుము.





