Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    5. ఇంద్రుడు ఇటునటు తిరుగు పర్వతములను కేవలము తన బలమున నిశ్చలములు చేసినాడు. మేఘములందు ఉన్న జలరాశిని నేలమీద కురిపించినాడు. లోక ధరిత్రి పృథివిని తన బలమున ధరించినాడు. బుద్ధిబలమున ద్యులోకమును పడిపోకుండ చేసినాడు.

    6. ఇంద్రుడు లోకముల కొఱకు పరివ్యాప్తుడు అయినాడు. అతడు సర్వ రక్షకుడు. ఇతర ప్రాణులకన్న జ్ఞానవంతుడు. ఆ జ్ఞానమున సకల లోకములను నిర్మించినాడు. అనన్య కీర్తిమంతుడయిన ఇంద్రుడు తన జ్ఞానమున క్రివి, నామక దస్యుని వజ్రమునబాది నేలమీద పడి ఉండునట్లు చేసినాడు.

    7. మరణ పర్యంతము తలిదండ్రుల వద్ద ఉండు కూతురు పుట్టింటి క్షేమమునకు ప్రార్థించినట్లు నేను నిన్ను ధనమును యాచించుచున్నాను. ఆ ధనమును లెక్కింపుము. ఆర్జింపుము. అందరివద్ద ఉండునట్లు చేయుము. నా దేహము అనుభవింపదగిన ధనమును ప్రసాదించుము. ఈ ధనమున స్తోత్రము ఆదరింపుము.

    8. ఇంద్రా ! నీవు పాలకుడవు. నీవు అన్నపు కర్మల దాతవు. మేము నిన్ను ఆహ్వానించుచున్నాము. మాకు అనేక విధముల ఆశ్రయములు ప్రసాదించుము. అభీష్టప్రదుడవగు ఇంద్రా ! నీవు మమ్ము అత్యంత ధనవంతులను చేయుము.

    9. ఇంద్రా ! ధనవంతము అగు నీ దక్షిణ నిన్ను స్తుతించువారి కోరికలు తీర్చును. నీవు అట్టి దక్షిణనే మాకు ప్రసాదించుము. మాకు కాక మరెవ్వరికి ఇవ్వరాదు. నీవు పూజనీయుడవు. మేము పుత్ర పౌత్రుల సహితులమయి ఈ యజ్ఞమున ప్రభవించు స్తోత్రమును గానము చేసెదము.

                              పద్దెనిమిదవ సూక్తము
        ఋషి - శౌనక గృత్సమదుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. స్తుతియోగ్యము, పవిత్రము అగు యజ్ఞము ఉదయముననే ఆరంభమయినది. ఈ యజ్ఞమున నాలుగు శిలలు మూడు విధముల స్వరములు ఏడు విధముల ఛందములు పది విధముల పాత్రలు ఉన్నవి. ఇది మానవులకు హితకరము, స్వర్గ ప్రదాతల అగును. ఇవి మనోహర స్తుతులు, హోమము మున్నగువాని ద్వారమున ప్రసిద్ధములగును.

    (4 యుగములు ముగ్గురు అధ్వర్యాదులు ఏడు స్వరములు పది గ్రహములు కూడ అగునని శాయన వ్యాఖ్య)

    2. ఈ యజ్ఞము ఇంద్రుని కొఱకు ప్రథమ, ద్వితీయ, తృతీయ సవనములు అగును. ఇది మానవులకు శుభప్రద ఫలములను ఇచ్చును. అన్య ఋత్విక్కులు సహితము ఇతర వాక్కులను ఉచ్ఛరింతురు. అభీష్ట వరదము, జయశీలమగు యజ్ఞము అన్యదేవతలతో కలిసి ఉండును.

    (దయానందుడు నేల, నీరు, ఆకసమున నడుచు మూడు విధముల వాహనములు అని వ్యాఖ్యానించినాడు)

    3. ఇంద్రుని రథమున హరినామక అశ్వములు పూన్చబడును. అవి స్తోత్రముల ద్వారా శీఘ్రగాములు అగును. ఈ యజ్ఞమున అనేకమంది మేధావులగు స్తోతలు ఉన్నారు. ఇంద్రా ! ఇతర యజమానులు నీకు ఇంతటి సంతృప్తిని కలిగించలేరు.

    4. ఇంద్రా ! నీవు ఆహ్వానము అందుకొని రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది హరినామక అశ్వములపై సోమ పానమునకు విచ్చేయుము. శుభ ధనవంతుడవగు ఇంద్రా ! ఈ సోమము నీకు సమర్పించబడినది. దీనిని వృధా చేయకుము.

    5. ఇంద్రా ! మంచి నడకలు గల ఇరువది, ముప్పది, నలుబది, ఏబది, ఆరువది, డెబ్బది అశ్వములమీద మేము సమర్పించు సోమపానము చేయుటకు విచ్చేయుము.

    6. ఇంద్రా ! ఎనుబది, తొంబది, నూరు అశ్వములమీద మా ముందుకు విచ్చేయుము. నీ కొఱకు నీ ఆనందము కొఱకు పాత్రలలో సోమము నింపి ఉంచినాము.

    7. ఇంద్రా ! నా స్తుతి ఆలకించుము. నా ముందుకు విచ్చేయుము. జగత్ వ్యాపకములు అగు రెండు అశ్వములను అగ్రభాగమున కూర్చుము. బహు సంఖ్యాకులగు యజమానులు నిన్ను ఆహ్వానించుచున్నారు. శూరా ! ఇంద్రా ! నీవు ఈ యజ్ఞమున సంతుష్టుడవు అగుము.

    8. ఇంద్రునితో నా స్నేహము పట్టిదికారాదు. ఇంద్రుడు ప్రసాదించు దక్షిణ మాకు అభిమత ఫలప్రదాత కావలెను. ఇంద్రుని రెండు చేతులలో ఒకటి ప్రశంసనీయము. రెండవది ఆపదలు హరించునది. మేము ఇంద్రుని రెండు చేతులవద్దనిలిచి ఉందుము. యుద్ధములందు మేము విజయులము కావలెను. "జిగీవాంసఃస్యామ"

    9. ఇంద్రా ! నీవు కీర్తనీయుడవు. ధనవంతము అగు నీ దక్షిణ నిన్ను స్తుతించువారి కోరికలు తీర్చును. నీవు అట్టి దక్షిణనే మాకు ప్రసాదించుము. మాకు కాక అరెవ్వరికి ఇవ్వరాదు. మేము పుత్ర, పౌత్రుల సహితులమయి ఈ యజ్ఞమున ప్రభవించు స్తోత్రమును గానము చేసెదము.

                              పందొమ్మిదవ సూక్తము
        ఋషి - శౌనక గృత్పమదుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. సోమాభిషకర్త, మనీషియగు యజమాని సమర్పించు మాదకము అగు అన్నము సిద్ధముగా ఉన్నది. దీనిని ఇంద్రుడు తన ఆనందము కొఱకు ఆరగించవలెను. ఈ అన్నము ప్రాచీనము. ఇందు వర్థమానుడగు ఇంద్రుడు నివసించును. ఇంద్రుని స్తోతాభిలషులగు ఋత్విక్కులు సహితము ఈ అన్నమున నివసింతురు.

    2. ఇంద్రుడు మదమును కలిగించు సోమము గ్రహించినాడు. ఆనంద నిమగ్నుడు అయినాడు. వజ్రమును అందుకున్నాడు. జలమును ఆవరించిన 'అహి' ని హతమార్చినాడు. పక్షులు తమ తావులకు సాగినట్లు అప్పుడు జలరాశులు సముద్రమువైపు సాగినవి.

    3. ఇంద్రుడు అహిహంత, పూజనీయుడు. అతడు జల ప్రవాహములను సముద్రమువైపు ప్రేరేపించినాడు. సముద్రమును కల్పించినాడు. గోవులను విడిపించినాడు. తన తేజోబలమున పగళ్ళను ప్రకాశవంతము చేసినాడు.

    4. ఇంద్రుడు హవ్యదాతలగు మానవ యజమానులకు అనేకములగు ఉత్తమ ధనములను ఇచ్చినాడు. సూర్యప్రాప్తి కొఱకు స్తోతలలో విభేదములు వచ్చినపుడు ఇంద్రుడు వారికి ఆశ్రయదాత అయినాడు.

    5. తండ్రి కొడుకునకు ధనము ఇచ్చును. ఆవిధముగనే యజ్ఞకాలమున 'ఏతశుడు' ఇంద్రునకు ప్రచ్చన్నము, అమూల్యము అగు సోమమును ఇచ్చినాడు. అందువలన తనను స్తుతించగా ఇంద్రుడు 'ఏతశు'ని కొఱకు సూర్యుని రప్పించినాడు.

    6. తన సారథియగు 'కుత్స' రాజర్షి కొఱకు దీప్తవంతుడగు ఇంద్రుడు 'శుష్ట, అశుష, కువయు' లను వశపరచుకున్నాడు. దివోదాసు కొఱకు శంబరుని తొంబది తొమ్మిది నగరములను భగ్నము చేసినాడు.

    7. ఇంద్రా ! మేము అన్నమును అభిలషించువారము. నిన్ను బలవంతుని చేసినాము. స్తుతించుచున్నాము. నీ వలన మాకు సాప్తపదీన సఖ్యత లభించవలెను. దేవరహితుడగు 'పేయు' ని మీద వజ్రము విసరుము.

    (స్నేహం సాప్తపదీనముచ్యతే అన్నాడు కాళిదాసు. ఏడు మాటలు మాట్లాడినను ఏడు అడుగులు కలిసి వేసినను స్నేహము కలుగునని అర్థము. వివాహములందు వధూవరులు ఏడు అడుగులు కలసి నడచి ఏడేడు జన్మలు కలిసిపోదురు. ఇంద్రునివలన అట్టి సఖ్యతను అభిలషించుచున్నాడు.)

    8. బలవంతుడవగు ఇంద్రా ! బాటసారి తన దారిని బాగుపరచుకొనును. అట్లే గృత్సమద గణము నీ కొఱకు రమ్యములగు స్తుతులు రచించినారు. నీవు అన్నివిధముల నవీనుడవు. నిన్ను స్తుతించు అభిలాషగల గృత్సమద గణమునకు అన్నము, బలము, సుఖము, గృహము లభించవలెను.

    9. ఇంద్రా ! నీవు కీర్తనీయుడవు. ధనవంతము అగు నీ దక్షిణ నిన్ను స్తుతించువారి కోరికలు తీర్చును. నీవు అట్టి దక్షిణనే మాకు ప్రసాదించుము. మాకు కాక మరెవ్వరికి ఇవ్వరాదు. మేము పుత్ర, పౌత్ర సహితులమయి ఈ యజ్ఞమున ప్రభవించు స్తోత్రమును గానము చేసెదము.

                            ఇరువదియవ సూక్తము
        ఋషి-శౌనక గృత్సమదుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. బాటసారి అన్నము కొనిపోవుటకు రథము సిద్ధము చేయును. అట్లే ఇంద్రా ! మమ్ము బాగుగా ఎరుగుదువు. మేము నిన్ను నుతింతుము. దీప్తివంతుని చేయుదుము. నీవంటి వాని నుండి మేము శుభములు అర్థించుచున్నాము.

    2. ఇంద్రా ! నీవు మమ్ము పాలించువాడవు. మమ్ము కాపాడుము. రక్షింపుము. నిన్ను అర్థించువారు ఉన్నారు. వారిని శత్రువులనుండి కాపాడుము. నీవు హవ్యదాత యజమానికి ఈశ్వరుడవు. అతని శత్రువులను దూరము చేతువు. హవ్యములు ఇచ్చి నిన్ను సేవించువానికొఱకు నీవు సర్వము చేసెదవు.

    3. ఇంద్రుడు యువకుడు. ఆహ్వానయోగ్యుడు. మిత్రతుల్యుడు. సుఖదాత. మేము యజ్ఞకార్యము నిర్వహించుచున్నాము. ఇంద్రుడు మమ్ము రక్షించవలెను. సోత్త్రములు ఉచ్చరించువారికి, క్రియసమకూర్చువారికి, హవ్యపాకము చేయువారికి, స్తుతించువారికి ఇంద్రుడు ఆశ్రయము ఇచ్చును. కర్మను దాటించును.

    4. నేను ఇంద్రుని స్తుతింతును. ప్రశంసింతును. ఇంతకుముందు ఇంద్రుని స్తుతించినవారు వర్థిల్లినారు. ఇంద్రుడు వారి శత్రువులను నాశము చేసినాడు. కొత్త యజమానులు ఇంద్రుని స్తుతించుచున్నారు. ప్రార్థించుచున్నారు. ఇంద్రుడు వారి ధనేచ్చను పూర్తిచేయును.

    5. అంగిరుల మంత్రములకు ఇంద్రుడు ప్రసన్నుడు అయినాడు. అంగిరులకు గోవులను తెచ్చుకొను మార్గము చూపినాడు. వారి స్తుతులను పరిపూర్ణము చేసినాడు. స్తోతలు స్తుతించగా ఇంద్రుడు సూర్యుని ద్వారా ఉషను అపహరించినాడు. 'అశ్ను' ని ప్రాచీన నగరమును నష్టపరచినాడు.

    6. ఇంద్రుడు ద్యుతిమంతుడు, కీర్తిమంతుడు, అత్యంత దర్శనీయుడు. అతడు మానవుల కొఱకు సర్వధాసిద్ధముగా ఉండును. శత్రుహంత, బలవంతుడు ఇంద్రుడు లోకారిష్టకారి 'దాసు' ని తలనరికి నేలకు విసరినాడు.

    7. వృత్ర హంత, పురనాశకుడు ఇంద్రుడు కృష్ణ జన్మదాస సేనను హతమార్చినాడు. మనువు కొఱకు పృథ్విని, జలమును సృష్టించినాడు. ఇంద్రుడు యజమానుల ఉన్నత అభిలాషలను పూర్తిచేయును.

    (1. కృష్ణుడను అసురుని గర్భవతి భార్య 2. శాయనుదు అసురసేన అన్నాడు. 3. నల్లని దుష్ట మేఘములు)

    8. స్తోతలు జలప్రాప్తికొఱకు సర్వదా ఇంద్రునకు అన్నము సమర్పించినారు. అతనిని బలవర్థకుని చేసినారు. ఇంద్రుని చేతికి వజ్రమురాగానే దానితో అతడు దస్యులను హతమార్చినాడు. దస్యుల ఇనుప నగరములను ధ్వంసము చేసినాడు.

    9. ఇంద్రా ! నీవు కీర్తనీయుడవు. ధనవతి అగు నీ దక్షిణ నిన్ను స్తుతించువారి కోరికలు తీర్చును. మాకు కూడ అట్టి దక్షిణనే ప్రసాదించుము. మాకు కాక మరెవ్వరికి ఇవ్వరాదు, మేము పుత్ర, పౌత్ర సహితులమయి ఈ యజ్ఞమున ప్రభవించు స్తుతిని గానము చేసెదము.

                                      ఇరువది ఒకటవ సూక్తము
        ఋషి - శౌనక గృత్సమదుడు, దేవత - ఇంద్రుడు ఛందస్సు 1-5 జగతి, 6 త్రిష్టుప్.

    1. ధనంజయుడు, స్వర్గజయుడు, సదాజయుడు, మానవజయుడు, విశ్వజయుడు, అశ్వజయుడు, గోజయుడు, జలజయుడు, సర్వజయుడు, పూజనీయుడు అగు ఇంద్రుని కొఱకు సోమము తెండు.

    2. ఇంద్రుడు అందరిని పరాజితులను చేయువాడు, విమర్దకుడు, భోక్త, అజేయుడు, సర్వసహిష్ణువు, పూర్ణగ్రీవుడు, సర్వవిధాత, సర్వవోఢ, ఇతరులకు దుర్ధర్షుడు, సర్వదాజయశీలుడు. 'నమః' శబ్దము ఉచ్చరించి ఇంద్రుని స్తుతించుడు.

    3. ఇంద్రుడు అనేకులను పరాజితులను చేయువాడు. జనులకు పూజనీయుడు. బలవంతుల విజేత. శత్రు నివారకుడు. యోద్ధ, సోమసిక్తుడు. శత్రుహింసకుడు. శత్రువులను పరిభవించువాడు. ప్రజాపాలకుడు. ఉత్కృష్టశూరకర్ముడు అని ఇంద్రుని సర్వజనులు స్తుతించుచున్నారు.

    4. ఇంద్రుడు అతులత దాన సంపన్నుడు. అభీష్టవర్షి. హింసకులహంత. గంభీరుడు. దర్శనీయుడు. కర్మలందు అపరాజితుడు. సమృద్ధజనులకు ఉత్సాహకారకుడు. శత్రువుల బలాపహారి. దృఢాంగుడు. జగత్ వ్యాపి. సుందర యజ్ఞవిశిష్ఠుడు. ఇంద్రుడు ఉషనుండి సూర్యుని ఉత్పన్నము చేసినాడు.

    5. అంగిరులు ఇంద్రుని యజ్ఞము చేసినారు. దొంగిలింపబడిన గోవుల మార్గమును ఇంద్రుని వలన తెలిసికున్నారు. తదుపరి రక్షాభిలాషి ఇంద్రుని అంగిరులు స్తుతించినారు. పూజించినారు. గోధనమును పొందినారు.

    6. ఇంద్రా ! మాకు ఉత్తమ ధనమును, నిపుణతలో ప్రసిద్ధిని, సౌభాగ్యమును ప్రసాదించుము. మా ధనమును అభివృద్ధి చెందించుము. మా దేహములను రక్షింపుము. మాటలందు మధురిమను ప్రసాదించుము. దినములను సుదినములను చేయుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.