Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



        అనాదిమధ్యాంత మనంత వీర్యం అనంతబాహుం శశిసూర్య నేత్రమ్
        పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతమ్  19

    స్వామీ! నీవు ఆదిమధ్యాంతరహితుడవు, అనంతుడవు, వీరుడవు, అనంత బాహువపు, సూర్య చంద్రనేత్రుడవు. నీ వదనమున అగ్గి ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సుతో సమస్త విశ్వమును తపింపచేయు నిన్ను దర్శించుచున్నాను.

        ద్యావాపృథివ్యో రిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః
        దృష్ట్యా -ద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్  20

    స్వామీ! ద్యావ, పృధివి, అంతరిక్షములందు నీవే వ్యాపించి యున్నావు. సర్వ దిశలందును నీవే నిండియున్నావు. నీ రూపము అద్భుతము, ఉగ్రము, మహాత్మా నిన్ను చూచి ముల్లోకములు గడగడలాడుచున్నవి.

        అమీ హి త్వాం సురసంఘా విశంతి కెబిర్భీతాః ప్రాంజలయో
        గృణంతి స్వస్తీత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః  21

    స్వామీ! అదిగో నీ లోనికి సురసంఘములు ప్రవేశించుచున్నవి. కొందరు భీతిల్లి, కొందరు అంజలి ఘటించి స్తుతించుచున్నారు. మహర్షులు, సిద్ధసంఘాలు, స్వస్తి వచనములు పల్కుచున్నవి. వారు నిన్ను అనేక స్తుతులతో స్తుతించుచున్నారు.
    
        రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః విశ్వే శ్వినౌ మరుతశ్చోష్మపాశ్చా
        గందర్వయక్షా సురసిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే  22

    స్వామీ! రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సిద్ధ, సాధ్యులు, అశ్వినులు, మరుత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, సుర సంఘాలు అందరూ ఆశ్చర్యచిత్తులై నిన్ను దర్శించుచున్నారు.

        రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో! బహు బహూరుపాదమ్
        బహూదరం బహు దంష్ట్రాకరాళం దృష్ట్యా లోకాః ప్రవ్యథితా స్తథా - హమ్  23

    స్వామీ! మీ రూపము మహత్త్వము! అనేక ముఖములు, అనేక నేత్రములు, బహుబాహువులు తొడలు, పాదములు, అనేక ఉదరములు, అనేక దంష్ట్రాకరాళములు, నీ భయంకర రూపమును చూచి భయకంపితులగుచున్నారు. నేను సహితము వణకి పోవుచున్నాను.

        నభః స్పృశం దీప్తమనేక వర్ణం వ్యాత్తాననం దీప్తవిశాల నేత్రమ్
        దృష్ట్యా హి త్వాం ప్రవథితాంత రాత్మా ధృతిం న విందామి శమం చవిష్ణో!  24

    స్వామీ! నీవు ఆకాశమునంటినావు. అనేక వర్ణములతో తేజరిల్లుచున్నావు. నీ వదనము వెలుగు, విశాల నేత్రములు దీప్తములు. భూమిని అంతరిక్షము వరకు వ్యాపించిన నీవు నిన్ను దర్శించిన నా మనస్సు తత్తరపడుచున్నది. ధైర్యము సడలినది. శాంతి దూరమైనది.

        దంష్ట్రా కరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని
        దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ! జగన్నివాస!  25

    మీ ముఖమున గల కోరలు, ప్రళయాగ్ని జ్వాలలవలె దర్శన మిచ్చుచున్నవి. ఆ రూపమును దర్శించిన నాకు దిక్కుతోచకున్నది. స్వామీ! ప్రసన్నుడవు కమ్ము - శాంతి ప్రసాదించుము.

        అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావని పాలసంఘైః
        భీష్మో ద్రోణః సూతపుత్రస్తథా సౌ సహాస్మదీయై రపి యోదముఖైః  26

        వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని
        కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితై రుత్తమాంగైః  27

    స్వామీ! కౌరవులందరు సమస్త రాజన్య సహితులై భీష్మద్రోణ కర్ణాదులు, మా పక్షపు యోధముఖ్యులు నీ నోట ప్రవేశించుచున్నారు. పరుగులు పెట్టుచున్నారు. నీ కోరలు భయానకరములు. వానిలో కొందరు నలుగుచున్నారు. కొందరు నలిగిన విరిగిన అవయవములతో వ్రేలాడుచున్నారు.

        యథా నదీనాం బహవో - బువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి
        తథా తవామీ నరలోక వీరాః విశంతి వక్త్రాణ్వభి విజ్వలంతి  28

    నదులు బహువేగముగా సముద్రపు వైపు పరుగులు తీయును. అట్లే యీ నరలోక వీరులు జ్వలించుచున్న నీ ముఖమున ప్రవేశించుచున్నారు.

        యథా ప్రదేప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః
        తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః  29

    స్వామీ! జ్వలించుచున్న అగ్నిలోనికి తమ నాశము కోరి శులభములు పరుగులు పెట్టును. అట్లే తమ నాశనమును కోరి యీ సేనలన్నియు మాహావేగముగా నీ ముఖమున ప్రవేశించుచున్నవి.

        లేలిహ్యసే గ్రసమానస్సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్ణ్వలద్భిః
        తేజోభిరాపూర్వ జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో!  30

    స్వామీ! నీ ముఖములు ప్రజ్వరిల్లుచున్నవి. దశదిశల సమస్తలోకములను కబళించుచున్నవి. నీవు ఆస్వాదించుచున్నావు. నీ ముఖపు ఉగ్రతేజస్సులు అంతటను నిండినవి. తపింప చేయుచున్నవి.

        ఆఖ్యా హి మే కో భవానుగ్రరూపః నమోస్తుతే దేవవర! ప్రసీద
        విజ్ఞాతు మిచ్ఛామి భావమ్త మాద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్  31

    స్వామీ! యీ ఉగ్రరూపము ఎవరిది? నీకు నమస్కరించుచున్నాను. నాకు చెప్పుము దేవదేవా! ప్రసన్నుడవగును. నీవు ఆద్యుడవు. నిన్ను తెలియగోరుచున్నాను. నీ ప్రవృత్తిని తెలియలేకున్నాను.

    శ్రీ భగవానువాచః

        కాలో -స్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తు మిహప్రవృత్తః
        ఋతే - పిత్వాం న భవిష్యంతి సర్వే యే -వస్థితాః ప్రత్యనీకేషు యోధాః  32

    నేను కాలమును, లోకక్షయము, వృద్ధి చేయగల వాడను. ఇప్పుడు లోక క్షయమునకు పూనుకొన్నాను. నీవు మానుకొన్నను, ప్రతిపక్ష యోధులందరు పరిసమాప్తులు అగుదురు.    

        తస్మాత్త్వ ముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్
        మయైవైతేనిహతాః పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్!  33

    కావున ఉత్తిష్ఠా! లెమ్ము కీర్తిని పొందుము. శత్రువులను జయింపుము. సమృద్ధ రాజ్యమును అనుభవించుము. నేను ఇదివరకే వారిని వధించియున్నాను. సవ్యసాచ! నీవు నిమిత్తమాత్రుడవు అగుము.

        ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథా - న్యానపి యోధవీరాన్!
        మయా హతాంస్త్యం జహి మావ్యథిష్ఠాః యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్  34

    ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాది యోధవీరులను నేను యిదివరకే సంహరించి యున్నాను. కావున యుద్ధము చేయుము. శత్రువులను ఓడించుము.

    సంజయ ఉవాచః

        ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలి ర్వేపమానః కిరీటీ!
        నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీతః ప్రణమ్య  35

    కిరీటీ, కేశవుని మాటలు విన్నాడు. చేతులు జోడించినాడు. తల వంచినాడు. నమస్కరించినాడు. తదుపరి భయము భయముగా గద్గద స్వరముతో కృష్ణునితో యిట్లన్నాడు.

    అర్జున ఉవాచః

        స్థానే హృషీకేశ! తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్య త్యనురజ్యతే చ
        రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః  36

    హృషీకేశా! జనులు నిన్ను కీర్తించుచున్నారు. అనురాగముతోను, ఆనందముతోను ఉప్పొంగుచున్నారు. భయపడిన రాక్షసులు దశదిశలకు పారిపోవుచున్నారు. సిద్ధగణములు ప్రణమిల్లుచున్నారు.

        కస్మాచ్చ తే న నమేరన్ మహాత్మన్! గరీయసే బ్రహ్మణో - ప్యాదికర్త్రే!
        అనంత! దేవేశ! జగన్నివాస! త్వమక్షరం సదసత్తత్పరం యత్!  37

    నీవు బ్రహ్మకె మూలకారకుడవు. వారు నీకేల నమస్కరించకుందురు. అనంత! దేవేశ! జగన్నివాస! నీవు అక్షర స్వరూపుడవు. సదసత్తులకతీతుడవు.

        త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానమ్
        వేత్తా - సి వేద్యం చ పరం చ ధామ త్వయాతతం విశ్వమనంతరూప!  38

    నీవు ఆదిదేవుడవు. పురాణ పురుషుడవు. నీవు లోకమునకు పరముడవైన నిధానుడవు. జ్ఞాతవు. జ్ఞేయా నివి. నీవల్ల విశ్వము అనంతరూపమై వర్థిల్లుచున్నది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.