Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    7. ఇంద్రా ! నీవు కర్మద్వారా క్షేత్రములందు పుష్పములను, ఫలవంతములగు ఓషధులను రక్షించుచున్నావు. కాంతివంతుడగు సూర్యునకు నానావిధ జ్యోతులను కల్పించినావు. నీవు మహామహుడవయి మహాప్రాణులను సృష్టించినావు. అందువలన స్తుతియోగ్యుడవు.

    8. ఇంద్రా ! నీవు బహుకర్మ కర్తవు. హవ్య ప్రాప్తికొఱకును, దస్యులను నాశనము చేయుటకును 'నృమర' పుత్రుని "వసు సహితుని" వజ్రాయుధమున హతమార్చినావు. అందువలన నీవు స్తుతియోగ్యుడవు.

    9. ఇంద్రా ! నీ ఒక్కని సుఖము కొఱకు పదివందల అశ్వములు ఉన్నవి. నీవు 'దభీతి' ఋషి కొఱకు రజ్జురహిత దస్యులను వధించినావు. నీవు అందఱకు ప్రాప్త్యుడవు. అందువలన స్తుతియోగ్యుడవు.

    (రజ్జురహితులు-బంధకులు కానివారు. స్వేచ్చాచారులు)

    10. నదులు అన్నియు ఇంద్రుని శక్తిని అనుసరించుచున్నవి. యజమానులు ఇంద్రునకు అన్నము సమర్పించుచున్నారు. జనులు ఇంద్రుని కొఱకు ధనమును ధరించుచున్నారు. ఇంద్రా ! నీవు ద్యు, పృథివి, రాత్రింబవళ్ళు, ఓషధులు అను ఆరు స్థానములను నిశ్చితము చేసినావు. నీవు పంచ జనులను పాలించువాడవు. అందువలన స్తుతియోగ్యుడవు.

    11. ఇంద్రా ! నీ శౌర్యము సర్వజన శ్లాఘనీయము. నీవు ఒకే పనితో శత్రువుల ధనమును గ్రహించినావు. బలవంతుడగు 'జాతుష్ఠిదు' నకు అన్నము ప్రసాదించినావు. అన్నికార్యములు నీవే నిర్వహించినావు. అందువలన నీవు సర్వజన స్తుతిపాత్రుడవు.

    12. ఇంద్రా ! ప్రవాహము దాటుటకు 'తుర్వీతు' నకు 'వయ్యు' నకు నీవు అనాయాసముగా మార్గము కల్పించినావు. కుంటి, గ్రుడ్డి అగు 'పరావృజు' ని రక్షించినావు. అఖండకీర్తిని ఆర్జించినావు. అందువలన నీవు స్తోతవ్యుడవు.

                               పదునాలుగవ సూక్తము
          ఋషి-శౌనక గృత్సమదుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-త్రిష్టుప్.

    1. అధ్వర్యులారా ! ఇంద్రునికొఱకు సోమము తెండు. చమసముతో మాదక అన్నమును అగ్నికి అర్పింపుడు. వీరుడగు ఇంద్రుడు సర్వదా సోమపానమును అభిలషించును. అభీష్ట ప్రదాత ఇంద్రునకు సోమము సమర్పించుడు.

    2. అధ్వర్యులారా ! నీటిని కప్పివేసిన వృత్రుని ఇంద్రుడు చెట్టును నరికినట్లు నరికినాడు. అట్టి సోమాభిలాషి ఇంద్రుని కొఱకు సోమము సిద్ధము చేయుడు. ఇంద్రుడు సోమపానార్హుడు.

    3. అధ్వర్యులారా ! ఇంద్రుడు 'దుభీకు' ని నాశనము చేసినాడు. 'బలాసురుడు' బంధించిన గోవులను విడిపించినాడు. వానిని వధించినాడు. అట్టి ఇంద్రునకుగాను, వాయువు అంతరిక్షమున వ్యాపించిన రీతి సోమమును సర్వత్ర వ్యాపింపచేయుడు. చిరుగును బట్టతో ఆచ్చారించినట్లు ఇంద్రుని సోమమున ఆచ్చాదించుడు.

    4. అధ్వర్యులారా ! తొంబది తొమ్మిది చేతులు చూపు 'ఉరణ' అసురుని ఇంద్రుడు హతమార్చినాడు. అట్లే 'అర్బుదు'ని అధోముఖునిచేసి అంతమొందించినాడు. సోమము సిద్ధముచేసి అట్టి ఇంద్రుని ప్రసన్నుని చేయుడు.

    5. అధ్వర్యులారా ! ఇంద్రుడు అనాయాసముగా 'అశ్ను' డను దస్యుని నాశనము చేసినాడు. అశోషనీయుడగు 'శుష్ణుడు' అను అసురుని భుజములు నరికి చంపినాడు. 'నముచి', 'రుధిక' నామక దస్యులను హతమార్చినాడు.అట్టి ఇంద్రునకు అన్నమును సమర్పించుడు.

    6. అధ్వర్యులారా ! ఇంద్రుడు ప్రస్తరము వంటి వజ్రాయుధమున 'శంబరు'ని నగరములను ఛిన్నాభిన్నము చేసినాడు. అతడు 'వర్చు'ని వందవేల పుత్రులను నేలకరిపించినాడు. అట్టి ఇంద్రుని కొఱకు సోమము సిద్ధము చేయుడు.

    7. అధ్వర్యులారా ! శత్రుహంత ఇంద్రుడు లక్షమంది అసురులను హతమార్చి నేలతల్లి వడిలోపడవేసినాడు. అతడు 'కుత్సుడు' 'ఆయువు' 'అతిథిగ్వు' ని ప్రతిద్వంద్వులను వధించినాడు. అట్టి ఇంద్రుని కొఱకు సోమము సిద్ధము చేయుడు.

    8. నేత, అధ్వర్యులారా ! ఇంద్రునకు సోమము సమర్పించిన మీరు కోరుకున్నది వెంటనే లభించును. ఇంద్రుడు ప్రసిద్ధుడు. అతని కొఱకు చేతితో శోధించిన సోమము సిద్ధము చేయుడు. యాజ్ఞికులారా ! దానిని ఇంద్రునకు సమర్పించుడు.

    9. అధ్వర్యులారా ! ఇంద్రునకు సుఖమును ఇచ్చు సోమమును చేయుడు. ఆనందదాయకమగు జలమున శోధించిన సోమము తీసికొనిరండు. ఇంద్రుడు ప్రసన్నుడయి మీ చేతి సోమము కోరుచున్నాడు. ఇంద్రునకు మాదక సోమమును సమర్పించుడు.

    10. అధ్వర్యులారా ! ఆవు చన్నులందు పాలునిండి ఉండును. అట్లే ఫలప్రదాతయగు ఇంద్రుని సోమమున నింపుడు. సోమపు స్వభావము నాకు తెలియును. యజనీయుడగు ఇంద్రుడు సోమము సమర్పించు యజమానిని గురించిఎరుగును.

    11. అధ్వర్యులారా ! ఇంద్రుడు స్వర్గము, భూమి, అంతరిక్షము మూడు లోకములకు అధిపతి. గరిశలలో ధాన్యము నింపినట్లు ఇంద్రుని సోమమున నింపుడు. ఆ పనిని మీరు పూరించవలెను.

    (చన్నులందలి పాలు, గరిశలోని ధాన్యము ఖర్చగునవికావు. తిరిగివచ్చునవి. ఇంద్రుడు వర్షరూపమున ఇచ్చును.)

    12. నివాసప్రదుడవగు ఇంద్రా ! మా అనుభవమునకు ధనమును ప్రసాదించుము. నీవు అందించు ధనము వాసయోగ్యము, అవినాశ్యము విచిత్రమయినది. మేము నిత్యము అట్టి ధనమును అనుభవించు అభిలాష కలిగి ఉన్నాము. ఉత్తమ పుత్ర, పౌత్ర సంపదతో ఈ యజ్ఞమున ప్రభవించిన స్తోత్రములను గానము చేసెదము.

                               పదిహేనవ సూక్తము
        ఋషి - శౌనక గృత్సమదుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. నేను బలవంతుడను. సత్యసంకల్పుడగు ఇంద్రుని యదార్థమహత్తును వర్ణించి కీర్తింతును. ఇంద్రుడు త్రికద, యజ్ఞమున సోమపానము చేసినాడు. సోమపాన బలమున 'అహి' ని వధించినాడు. "సోమస్యతామద ఇంద్రశ్చకార"

    2. ఇంద్రుడు ఆకాశమున ద్యులోకమును నిలిపి ఉంచినాడు. ద్యావాపృథ్వి అంతరిక్షములను తన తేజమున నింపినాడు. విశాల భూగోళమును ధరించినాడు. దానిని ప్రసిద్ధము చేసినాడు. "సోమస్యతామద ఇంద్రశ్చకార"

    3. యజ్ఞగృహమును కొలిచినట్లు ఇంద్రుడు సకల ప్రపంచమును పూర్వాభిముఖము చేసినాడు. అతడు తన వజ్రమున నదుల ముఖ ద్వారములను తెరచినాడు. అతడు అనాయాసముగ దీర్ఘకాలము పయనించగల నదులమార్గమును సుగమము చేసినాడు. "సోమస్యతామద ఇంద్రశ్చకార"

    4. 'దభీతి' ఋషిని దస్యులు అతని పురము నుండి బయటకు తీసికొనిపోవునపుడు ఇంద్రుడు వారిదారిని అడ్డగించి దస్యుల ఆయుధములను అగ్నికి ఆహుతి చేసినాడు. తదనంతరము 'దభీతి'కి అనేక గోవులు, అశ్వములు, రథములు ప్రసాదించినాడు. "సోమస్యతామద ఇంద్రశ్చకార"

    5. ఇంద్రుడు 'ద్యుతి' 'ఇరావతి' నదులను జనులు దాటుటకుగాను శాంతపరచినాడు. అంతకుముందు నదులు దాటలేనివారు నిరాటంకముగ నదులు దాటినారు. నదులు దాటినవారు ధనము గమ్యముగా సాగినారు. "సోమస్యతామద ఇంద్రశ్చకార"

    (అటవీ సంపద సాధించుటకు ఆటంకములు అయిన నదులను జనులు దాటగలుగునట్లు చేసినాడు)

    6. ఇంద్రుడు తన మహిమద్వారా సింధునదిని ఉత్తరవాహినిని చేసినాడు. బలవంతమగు సేనతో దుర్బల సేనను ఛిన్నాభిన్నము చేసినాడు. వజ్రాయుధమున ఉష రథమును చూర్ణము చేసినాడు. "సోమస్యతామద ఇంద్రశ్చకార"

    7. తమ వివాహమునకుగాను వచ్చిన కన్యలు పారిపోవుటను 'పరావృజర్షి' గ్రహించినాడు. లేచి నిలిచినాడు. కుంటివాడయినను వారిని వెంబడించినాడు. అంధుడయినను వారిని చూచినాడు. ఋషి స్తుతికి ఇంద్రుడు ప్రసన్నుడయి కాళ్లు, కళ్లు ఇచ్చినాడు. "సోమస్యతామద ఇంద్రశ్చకార"

    8. అంగిరులు స్తుతించిన మీదట ఇంద్రుడు బలమును పెంచుకున్నాడు. పర్వతముల సుదృఢ ద్వారములను తెరిచినాడు. వాని కృత్రిమ ఆటంకములను తొలగించినాడు. "సోమస్యతామద ఇంద్రశ్చకార"

    9. ఇంద్రా ! నీవు అనంత నిద్రలో ఉన్న 'చుమురి, ధుని' అను దస్యులను హతమార్చినావు. 'దభీతి' ని రక్షించినావు. అతని వేత్రధారియగు దౌవారికుడు సహితము శత్రువు ధనమును పొందినాడు. "సోమస్యతామద ఇంద్రశ్చకార"

    10. ఇంద్రా ! ధనవంతమగు నీ దక్షిణ నిన్ను స్తుతించువారి కోరికలు తీర్చును. నీవు అట్టి దక్షిణనే మాకు ప్రసాదించుము. మమ్ము కాదని మరెవ్వరికి ఇవ్వరాదు. నీవు స్తోతవ్యుడవు. మేము పుత్ర, పౌత్రుల సహితులమయి ఈ యజ్ఞమున ప్రభవించిన స్తోత్రమును గానము చేయుదుము. 

                                 పదహారవ సూక్తము
        ఋషి శౌనక గృత్సమదుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - జగతి 1-8, 9 త్రిష్టుప్.

    1. మీ ఉపకారము కొఱకు, దేవతలతో జ్యేష్ఠతముడగు ఇంద్రునకుగాను ప్రజ్వలించు అగ్నియందు హవ్యములు అర్పింతుము. తరువాత ఇంద్రుని మనోహరముగ స్తుతింతుము. స్వయముగా జరారహితుడు, సకలలోకములకు జర కల్పించువాడు, సోమసిక్తుడు, సనాతనుడు, తరుణ వయస్కుడగు ఇంద్రుని మా రక్షణ కొఱకుగాను ఆహ్వానించుచున్నాము.

    2. మహామహుడగు ఇంద్రుడులేని లోకములేదు. ఇంద్రునిలో సర్వశక్తులు ఉన్నవి. అతని ఉదరమున సోమరసము, అతని శరీరమున బలము ఉన్నవి. తేజస్సు ఉన్నది. చేత వజ్రము ఉన్నది. తలలో జ్ఞానము ఉన్నది.

    3. ఇంద్రా ! నీవు శీఘ్రగామివి గుఱ్ఱమును ఎక్కి యోజనముల పర్యంతము వెళ్లునపుడు ద్యావాపృథ్వులు నిన్ను పరాజితుని చేయలేవు. సముద్రములు, పర్వతములు నీ రథమును అడ్డలేవు. ఎంతవాడయినను నీ శక్తిని పరిభవించలేడు.

    4. ఇంద్రుడు యజనీయుడు. శత్రునాశకుడు. కోరికలు తీర్చువాడు. సర్వవేళల అలంకృతుడు. సకల జనులు ఇంద్రుని యజ్ఞము చేసెదరు. నీవు సోమదాతవు. విద్వాంసుడవు. నీవు కూడ ఇంద్రుని యజ్ఞము చేయుము. ఇంద్రా ! అభీష్ట వరదుడు దీప్తిమంతుడగు అగ్ని సహితుడవయి సోమపానము చేయుము.

    5. సోమరసము అభీష్టవరదము. మాదకము. అనుష్ఠాతలకు ఉత్తేజకము, బలప్రదము అగును. అది అన్న విశిష్టుడు, అభీష్టవరదుడు అగు ఇంద్రుని పొందుటకు సాగును. ఇంద్రా ! అధ్వర్యులు నీ కొఱకుగాను సోమమును అభిషవించుచున్నారు. నీవు అభీష్టప్రదాతవు.

    6. అభీష్టప్రదుడవగు ఇంద్రా ! నీ రథము, వజ్రము, హరినామక అశ్వములు, సమస్త ఆయుధములు వరప్రదములు, నీవు మాదకము, కోరికలు తీర్చుసోమమునకు అధిపతివి. ఇంద్రా ! సోమము సేవింపుము. సంతృప్తుడవు అగుము.

    7. ఇంద్రా ! నీవు శత్రునాశకుడవు. స్తోత్రాభిలాషివగు నీవు యుద్ధములందు ఓడవలె దాటింతువు. యజ్ఞ సమయమున నేను నిన్ను స్తుతించుచు నీవద్దకు సాగుదును. మా ఈ స్తుతి వాక్యమును చక్కగా గ్రహించుము. మేము బావివలె దానాధారుడగు ఇంద్రుని సిక్తుని చేసెదము.

    8. గడ్డితిని తృప్తి చెందిన గోవు దూడను పాలిచ్చి పంపును. అట్లే మమ్ము అరిష్టములు రాకముందే పంపించుము. భార్యలు భర్తలను చేరినట్లు ఈ స్తోత్రము ద్వారమున మేము ఇంద్రుని చేరుదుము.

    9. ఇంద్రా ! ధనవంతమగు నీ దక్షిణ నిన్ను స్తుతించు వారి కోరికలు తీర్చును. నీవు అట్టి దక్షిణనే మాకు ప్రసాదించుము. పుత్ర, పౌత్ర సహితులమయి ఈ యజ్ఞమున ప్రభవించిన స్తోత్రమును గానము చేయుదుము.

                                    పదిహేడవ సూక్తము
        ఋషి - శౌనక గృత్సమదుడు, దేవత - ఇంద్రుడు ఛందస్సు - 1-7 జగతి, 8,9 త్రిష్టుప్.

    1.ఇంద్రుని తేజము పూర్వము వలెనే ఉదయించును. కావున అంగిరులవలె ఇంద్రుని నవీన స్తోత్రములచే ఉపాసించుడు. సోమజనిత హర్షమున ఇంద్రుడు వృత్రుని వధించినాడు. వృత్రుడు ఆక్రమించిన మేఘములను విడిపించినాడు.

    2. ఇంద్రుడు తన బలమును ప్రదర్శించి ప్రథమ సోమమునకుగాను తన మహిమను పెంచినాడు. శత్రు సంహారక ఇంద్రుడు యుద్ధములందు తన దేహమును రక్షించుకున్నాడు. అటువంటి ఇంద్రుడు ప్రసన్నుడు కావలెను. ఇంద్రుడు తన మహిమవలన ద్యులోకమును తన మస్తకమున ధరించినాడు.

    3. ఇంద్రా ! నీవు స్తోత్రమునకు ప్రసన్నుడవు అయినావు. శత్రునాశక బలమును ప్రదర్శించినావు. నీ మహా శౌర్యమును ప్రకటించినావు. నీ రథమునందలి అరిష్టదాయకులు కొందరు కలసి కట్టుగను, కొందరు వేరు వేరుగను పారిపోయినారు.

    4. అపార అన్నవంతుడగు ఇంద్రుడు స్వబలమున భువనములను అన్నింటిని ప్రభావితము చేసినాడు. అందరకు అధిపతిగా వర్థిల్లినాడు. అనంతరము ద్యావాపృథ్వులను వ్యాప్తము చేసినాడు. అతడు దుస్థిత తమోరాసిని పోద్రోలి లోకములందు వ్యాపించినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.