Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                                           శ్రీ సత్యనారాయణాచార్య, ఉత్పల

    త్యాగానికి సమయ మిదే!

    చీనా సామ్రాజ్యవాది! చీ ఛీ యుద్ధోన్మాదీ!
    తిరిగిపో - తిరిగిపో - సరిహద్దులు విడిచిపో!
    భరతావని నీ పాపపు పాదాలను ఉంచినావు
    భారత జనతా హృదయము ప్రజ్వరిల్ల జేసినావు
    పంచశీల ఒప్పందము వంచన కావించినావు
    శాంతికాముకుల మీదను సమరము సాగించినావు
    స్నేహ సామరస్యములను చెడగొట్టుక పోయినావు
    పొరుగునున్న దేశాలను దురాక్రమణ జరిపినావు
    అమాయికుల నీ ప్రజలను సమూహముగ చంపినావు
    ప్రజ కన్నము పెట్టలేక ప్రాజెక్టులు కట్టలేక
    సకల దేశములమాదిరి సభ్యత సాధింపలేక
    శాంతిగ పదిమందితోడ సహజీవన మిష్టపడక
    విజ్ఞానపు వీధిలోన వెస పురోగమించలేక
    యుద్ధమనే నెపమున సరిహద్దులలో నీదు ప్రజల
    ప్రాణాలను వ్యర్థముగా బలిపెట్టగ పూనినావు
    ప్రజాస్వామ్య పాలనలో భారత దేశాభివృద్ధి
    నీ వొకడవె చూపోపక నిప్పులు చెరిగించినావు
    అంతర్జాతీయ రంగమం దశాంతి రేపినావు
    నేటి యీ ప్రపంచమెల్ల నిన్నొకనినె నిన్నొకనినె
    దురాక్రమణదారునిగా మరియాదకు దూరునిగా
    ఒక మిత్రద్రోహినిగా యుధ మదోన్మాదునిగా
    వ్రేలిడి చూపిస్తున్నది వేయికండ్ల చూస్తున్నది.
    నవభారత యువకులార! నౌజవానులార రండు!
    ప్రతివ్యూహ దాహకులై ప్రతిఘటనోత్సాహకులై
    రండో రారండు రండు! రణభేరీ నినదం బదె!
    త్యాగానికి సమయమిదే! ధైర్యానికి సమయమిదే!
    శౌర్యానికి సమయమిదే! స్థైర్యానికి సమయమిదే!
    నీదు తరము యువలోకము నిర్వీర్యం బనిపించకు
    భరతమాత శత్రువులకు శిరమొగ్గిన దనిపించకు
    ఇరుగు పొరుగు వారలచే పిరికిపంద లనిపించకు
    చైనా ఒక జపానుకే శత్రువగుట కాదిప్పుడు
    స్వేచ్చగోరు జగతికెల్ల చీనా ఒక్కటె శత్రువు
    బంగారమె కాదు మాదు ప్రాణాలను ధారపోసి
    సరిహద్దుల రక్షింతుము శత్రువులను శిక్షింతుము
    అంగుళమైనను శత్రువు హస్తగతము కానీయము
    దగాకోరు చైనీయుని దరిదాపుల రానీయము
    వీరాగ్రేసరులారా! భారత సైనికులారా!
    నలభై కోటుల భారత నరనారీ జనమెల్లను
    మీ వెంబడి నిలుచున్నది మీకు రక్షగా నున్నది
    దురాక్రమణదారులపై ద్రోహులపై దుష్టులపై
    శత శతఘ్నులను ప్రేల్చుడు చాపకట్టుగా కూల్చుడు
    నీహార ధరాధరమున నెత్రుటేర్లు పాఱించుడు
    శత్రురక్తముల చేలకు జాఱిచి సాగొనరించుడు
    శాంతిభద్రతల పేరటి సస్యములను పండించుడు
    మగువలార! మీ రందఱు మాంచాలలు కావలయును
    ఖడ్గమిచ్చి మీ పతులను కదనానికి పంపవలయు
    పండించుడు రైతులార! పంటలు ఇబ్బడి ముబ్బడి
    శత్రువుపై పోరాటము జరుపుడు ఎగబడి తెగబడి
    బకాసురుని చంబోవు భారతభీముని కన్నము
    బండ్లకు బండ్లకు నిమ్పుడు బలవంతుని గావింపుడు
    భారత కార్మికులారా! పారిశ్రామికులారా!
    అహర్నిశలు చెమ్మటోడ్చి అధికోత్పత్తిని జేయుడు
    అరులకు సమ్మెట పోటులు అగు మీ చెమ్మట బొట్టులు!

                                                                      *  *  *  *




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.