Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
7. ఇంద్రా ! శీఘ్రగాములగు నీ అశ్వద్వయము వానమబ్బులను ఉరిమించును. ఉరుముల చప్పుడుకు నేల పులకరించును. మబ్బులు ఇటునటు నడయాడి శోభిల్లును.
8. ప్రమాద రహితమగు మేఘము అంతరిక్షమున చేరినది. మాతృభూత జలవాహకమయి కదలాడినది. అంతరిక్షమున అతిదూరమున ఉన్న ధ్వనిని మరుత్తులు పెంచినారు. ఇంద్రప్రేరితమగు ఆ ధ్వనిని నలుదిశల వ్యాపింప చేసినారు.
9. బలశాలి అగు ఇంద్రుడు అటునిటు కదలాడు మేఘమున దాగిన మాయావి వృత్రుని పడగొట్టినాడు. జల వర్షము కలిగించు ఇంద్రుని వజ్రధ్వనికి ద్యావాపృథ్వులు గడగడలాడినవి.
10. ఇంద్రుడు మానవ శ్రేయోభిలాషి. మానవ శత్రువగు వృత్రుని వధించ నుంకించినపుడు ఇంద్రుని వజ్రము వారంవారం గర్జించినది. ఇంద్రుడు అభిషుప్త సోమపానము చేసినాడు. మాయావి దానవుని మాయలన్నింటిని కూల్చినాడు.
11. ఇంద్రా ! నీవు అభిషుప్త సోమపానము చేయుము. మాదకమగు సోమరసము నిన్ను ఉన్మత్తుని చేయును. సోమరసము నీ పొట్టనింపవలెను. నిన్ను ప్రసన్నుని చేయవలెను. ఉదరపూరకమగు సోమరసము ఇంద్రుని సంతృప్తుని చేయవలెను.
12. ఇంద్రా ! మేము విప్రులము. మేము నీలో స్థానము పొందుదుము. కర్మ ఫలమును ఆశించి మేము నీ సేవ చేయు యజ్ఞము నిర్వహింతుము. ఈ క్షణముననే నీ యొక్క ధనదాన పాత్రులము అగుటకు నిన్ను ఆశ్రయింతుము. ప్రశంసింతుము. ధ్యానింతుము.
13. ఇంద్రా ! నీ ఆశ్రయముకోరి నీకు హవ్యములు అర్పించువానివలెనే మేము సహితము నీ అధీనులము. ద్యుతిమంతుడవగు ఇంద్రా ! మాకు అన్నివిధముల బలవంతులు, వీర్యవంతులగు పుత్ర ధనమును ప్రసాదించుము.
14. ఇంద్రా ! నీవు మాకు గృహమును, బంధువులను, మహా పురుషులవంటి శక్తిని ప్రసాదించుము. వాయుగణములు ప్రసన్నచిత్తులయి, వారికి అందించిన సోమమును పానము చేయవలెను.
15. ఇంద్రా ! మరుత్తుల సాయము అందుకొని నీవు పరిపుష్టుడవు అగుదువు. అట్టి మరుత్తులు సోమపానము చేయవలెను. నీవు సహితము నిన్ను బలపరచుకొనుటకు తృప్తినిచ్చు సోమపానము చేయుము. శత్రునాశకుడవగు ఇంద్రా ! పూజ్యులగు మరుత్తులతో కూడుము. యుద్ధమున మమ్ము వర్థిల్లచేయుము. ద్యులోకమును సహితము వర్థిల్ల చేయుము.
16. అరిష్ట నివారక మహేంద్రా ! నీవు సుఖప్రదుడవు. నిన్ను ఉక్థ ద్వారా సేవించినవాడు వెంటనే మహామహుడు అగును. కుశలు పరచి నిన్ను సేవించువాడు నీ ఆశ్రయము పొంది ఇల్లు, అన్నము లభించినవాడు అగును.
17. ఇంద్రా ! నీవు శూరుడవు. ఉగ్రములకు "త్రికర్దు" దినములందు నీవు హర్షోల్లాసమున సోమపానము చేయుము. అనంతరము ప్రసన్నుడవు అగుము. నీ గడ్డమునకు అంటిన సోమమును తుడుచుకొనుము. తిరిగి సోమపానమునకు హర్యశ్వములను అధిరోహించి విచ్చేయుము.
(జ్యోతి-గౌరి-ఆయువు అనునవి త్రికర్దుదిన విశేషములు. ఇంద్రునకు గడ్డము, మీసములు ఉన్నట్లున్నవి.)
18. ఇంద్రా ! ఏ బలమున 'దను' పుత్రుడగు వృత్రుని 'ఉర్ణనాభి' పురుగునువలె నలిచివేసినావో, నీవు ఆ బలమునే ధరించుము. ఆర్యునకు జ్యోతిని ప్రసాదించినావు. దస్యులు నీకు విరోధులు.
19. ఇంద్రా ! నీ ఆశ్రయము పొందినవారిని, సర్వగర్వయుతులను అతిక్రమించిన వారిని, ఆర్య భావమున దస్యులను అతిక్రమింహిన వారిని మేము భజింతుము. నీవు 'త్రితు'ని బంధుత్వము కొఱకు త్వష్టపుత్రుడు 'విశ్వరూపు'ని వధించినావు. మా కొఱకు కూడ అట్లే చేయుము.
20. హృష్టుడు, సుతవంతుడు అగు త్రితద్వారమున వర్థితుడయిన ఇంద్రుడు 'అర్బుదుని' నాశము చేసినాడు. ఊర్యుడు రథ చక్రమును నడిపినట్లు, ఇంద్రుడు ఆహిరుల సహాయము పొంది వజ్రమును త్రిప్పినాడు. 'బలు' ని వధించినాడు.
(అర్దుబ శబ్దము మేఘము - అసురుడు అగును. 'అర్బుద' నామవాచకము. అర్బుద మేఘము లేక అర్బుద అసురుడు)
21. ఇంద్రా ! స్తోత మనోరథమును పూర్తి చేయు నీ ధనవంతమగు దక్షిణ మాకు ప్రసాదించుము. నీవు పూజనీయుడవు. మాకు కాక మరెవ్వరికి ఇవ్వకుము. మేము పుత్ర, పౌత్రయుక్తులమయి ఈ యజ్ఞమున నిన్ను స్తుతింతుము.
(ఆంధ్రవచనము ఋగ్వేద సంహితము రెండో మండలమున మొదటి అనువాకము సమాప్తము.)
రెండవ అనువాకము పన్నెండవ సూక్తము
ఋషి-శౌనక గృత్సమదుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-త్రిష్టుప్.
గృత్సమదుడు అనుచున్నాడు:-
1. అసురులారా ! ప్రకాశితుడు పుట్టుకతోనే దేవతలకు అధిపతి. మానవులలో అగ్రగణ్యుడు. తన పరాక్రమమున దేవతలకు తలమానికమయినవాడు. తన బలమున ద్యావా పృథ్వులను వడకించినవాడు. మహాసేనానాయకుడు "స ఇంద్రః." అతడే ఇంద్రుడు.
2. మానవులారా - అసురులారా ! వ్యథిత పృథ్విని దృఢము చేసినవాడు, కోపించిన పర్వతములను నియమించినవాడు, ప్రకాశమగు అంతరిక్షమును నిర్మించినవాడు, ద్యులోకమును స్తంభింప చేసినవాడు "స ఇంద్రః." అతడే ఇంద్రుడు.
3. మానవులారా - అసురులారా ! వృత్రుని వధించి సప్తసింధువులను ప్రవహింప చేసినవాడు, బలాసురుడు పట్టిన గోవులను విడిపించినవాడు, రెండు మేఘముల మధ్య అగ్నిని సృష్టించినవాడు, సమర భూమిలో శత్రువును నాశము చేయువాడు "స ఇంద్రః." అతడే ఇంద్రుడు.
4. మానవులారా - అసురులారా ! సమస్త విశ్వమును నిర్మించినవాడు, దస్యులను నికృష్ణమగు నిగూఢ స్థానమున దాచినవాడు, వేటగానివలె లక్ష్యము ఛేదించి శత్రుధనమును వశపరచుకున్నవాడు "స ఇంద్రః." అతడే ఇంద్రుడు.
5. మానవులారా - అసురులారా ! భయంకరుడగు దేవత విషయమున జనులు ఆలోచించువాడు ఎవడు? అతడు లేనివాడని జనులు అనుకొనువాడు, శాసకునివలె శత్రువుల సమస్త ధనమును నష్టపరచువాడు అతడే ఇంద్రుడు జనులారా ! విశ్వసించుడు.
6. మానవులారా - అసురులారా ! సమృద్ధ ధనము ప్రదానము చేయువాడు, దరిద్ర యాచకులకు తనను స్తుతించువారలకు ధనము ప్రసాదించువాడు సోమాభిషవకర్తను రక్షించువాడు "స ఇంద్రః." అతడే ఇంద్రుడు.
7. మానవులారా - అసురులారా ! అశ్వములు, గోవులు, గ్రామములు, రథములు తన ఆధీనమున ఉంచుకున్నవాడు, సూర్యుని ఉషను ఉదయింప చేయువాడు, జలమును ప్రేరేపించువాడు "స ఇంద్రః." అతడే ఇంద్రుడు.
8. మానవులారా - అసురులారా ! ఉభయ సేనలు తటస్థపడినపుడు ఆహ్వానించబడువాడు, ఉత్తమ అధమ ఉభయ శత్రువులచే ఆహ్వానించబడువాడు, ఒకేరకపు రథములమీది ఇద్దరు నరులచే ఆహ్వానించబడువాడు "స ఇంద్రః." అతడే ఇంద్రుడు.
9. మానవులారా - అసురులారా ! అతడులేని జయములేనివాడు, యుద్ధకాలమున అందరు ఆహ్వానించువాడు, సకలలోకములకు ప్రతినిధి అయినవాడు, క్షయము నెరుగని పర్వతాదులను సహితము నష్టపరచగలవాడు "స ఇంద్రః." అతడే ఇంద్రుడు.
10. మానవులారా - అసురులారా ! వజ్రఘాతమున అనేకమంది పాపులను హతమార్చువాడు, గర్వించదగిన మానవులకు సిద్ధిని ప్రసాదించువాడు, దస్యులను హతమార్చువాడు "స ఇంద్రః." అతడే ఇంద్రుడు.
11. మానవులారా - అసురులారా ! పర్వతములందు దాగిన 'శంబరాసురుని' నలుబది సంవత్సరములు వెదికి పట్టినవాడు, తన బలపరాక్రమమున 'అహి' అను నిద్రించు దైత్యుని హతమార్చినవాడు "స ఇంద్రః." అతడే ఇంద్రుడు.
12. మానవులారా - అసురులారా ! సప్తవర్ణముల వరాహ, స్వపత, విద్యుత్, మహః, ధూపి, స్వాపి, గృహమేధ రశ్మివంతుడు అగువాడు, అభీష్ట వరదుడు, బలవంతుడు, సప్తసింధులను ప్రవహింప చేసినవాడు, వజ్రహస్తుడయి స్వర్గమునకు పోవు 'రోహణు'ని హతమార్చినవాడు, "స ఇంద్రః." అతడే ఇంద్రుడు.
13. మానవులారా - అసురులారా ! అతనిని గాంచి ద్యావాపృథ్వులు ప్రణమిల్లును. అతని బలము ముందు పర్వతములు గడగడలాడును. సోమపాయి, దృఢాంగుడు, వజ్రబాహువు, వజ్రయుక్తుడు "స ఇంద్రః." అతడే ఇంద్రుడు.
14. మానవులారా - అసురులారా ! సోమాభిషవకర్తయగు యజమానిని రక్షించువాడు, పురోడాశాదులు పచనముచేయు స్తోతలగు యజమానిని రక్షించువాడు అతని స్తోత్రములు మనకు సోమము, అన్నము అయినవాడు, "స ఇంద్రః." అతడే ఇంద్రుడు.
15. ఇంద్రా ! నీవు వర్థిల్లి సోమాభిషవకర్త, పాకకారియగు యజమానికి అన్నము ప్రసాదింతువు. నీవే సత్యమవు. మేము ప్రీతులమయి పుత్ర పౌత్రాదుల యుక్తులమయి, చిరకాలము నిన్ను స్తుతించుచుందుము.
ఆలోచనామృతము
1. ఒకసారి దేవతలు యజ్ఞము చేసినారు. గృత్సమదుడు ఆ యజ్ఞమునకు వచ్చినాడు. దస్యులు ఇంద్రుని పట్టుటకు ఆ యజ్ఞమునకు వచ్చినారు. ఇంద్రుడు దస్యులను చూచినాడు గృత్సమదుని వేషమున తప్పించుకున్నాడు. యజ్ఞమున ఉన్న గృత్సమదుడే ఇంద్రుడు అనుకున్నారు దస్యులు. అతనిని పట్టుకున్నారు. తాను ఇంద్రుడను కాననియు, ఇంద్రుడు ఈ లక్షణములు కలవాడనియు గృత్సముడు చెప్పినది ఈ సూక్తము.
మరొక కథ ఇట్లున్నది:-
గృత్సమదుడు తపస్సుచేసి ఇంద్రుని వంటి బలమును, రూపమును ఆర్జించినాడు ధుని, చుమురి అను దస్యులు అతనిని పట్టుకొనుటకు వచ్చినారు. వారిని అరికట్టుటకు ఈ సూత్రమున ఇంద్రుని వర్ణించినాడు.
2. పూర్వము పర్వతములకు రెక్కలు ఉండెడివి. వానిని ఇంద్రుడు త్రెంచినాడని ఐతిహ్యము.
3. దస్యులు దేవతలకన్న బలవంతులవలె కనిపించుచున్నారు. అట్లుకాకున్న ఇంద్రుడు మారు వేషమున తప్పుకొనువాడుకాడు. తనను విడిపించుకొనుటకు గృత్సమదుడు ఇంత వివరము ఇచ్చువాడుకాడు.
పదమూడవ సూక్తము
ఋషి - శౌనక గృత్సమదుడు, దేవత - ఇంద్రుడు
ఛందస్సు - 1-12 జగతి, 13 త్రిష్టుప్.
1. వర్షఋతువు సోమలతకు మాతృరూపి. పుట్టిన సోమము జలమున పెరుగును. జలమున పెరిగి సారవంతమయిన సోమలత అభిషవమునకు ఉపయుక్తము అగును. అట్టి సోమలత యొక్క పీయూషమే ఇంద్రునకు హవ్యము అగును.
2. పరస్పరము కలిసి ఉన్న జలప్రవాహ నదులు నలువైపుల వ్యాపించి ఉన్నవి. అవి సకల జలమునకు ఆశ్రయ భూతమగు సముద్రమునకు భోజనము కలిగించుచున్నవి. పల్లమునకు పారునీటి దారి ఇక్కటియే. ఇంద్రా ! నీవు తొలుత ఈ కార్యములను అన్నింటిని చేసినావు. అందువలననే స్తుతియోగ్యుడవు. "యస్తాకృణోః ప్రథమం సాస్యుక్ధ్యః"
3. ఒక యజమాని దానముచేయును. మరొకడు అతనిని అనుకరించును. ఒక నీరు పశుహింస చేయును. పారిపోవును. మరొకనీరు చెడునంతను కడిగివేయును. "యస్తాకృణోః ప్రథమం సాస్యుక్థ్యః"
4. గృహస్థుల అతిథి అభ్యాగతులకు భూరిదానములు ఇచ్చెదరు. అట్లే నీవు ఇచ్చిన ధనము ప్రజలందు విభక్తము అగును. జనులు తండ్రి ఇచ్చిన భోజనమును దంతములతో నమిలి తిందురు. "యస్తాకృణోః ప్రథమం సాస్యుక్థ్యః"
(యజమాని సమర్పించిన హవిస్సులను అగ్ని తన శిఖలను దంతములతో నమిలి భుజించును.)
5. ఇంద్రా ! ఆకసము కొఱకు నీవు భూమిని దర్శనీయము చేసినావు.నదుల ప్రవాహములకు మార్గములు కల్పించినావు. ఇంద్రా ! వృత్రుని వధించినావు. గుఱ్ఱమునకు నీరు పెట్టి తృప్తి కలిగింతురు. అట్లే స్తోతలు స్తోత్రములు చదివి నిన్ను తృప్తి చెందింతురు.
6. ఇంద్రా ! నీవు భోజనమను వర్థిల్లు ధనమును ఇచ్చుచున్నావు. ఆర్ద్రకాండమున శుష్కమగు కాండమును, మధుర రసభరిత సస్యమును చేయుచున్నావు. సేవకుడగు యజమానికి ధనము ఇచ్చుచున్నావు. "యస్తాకృణోః ప్రథమం సాస్యుక్థ్యః" విశ్వమున అద్వితీయుడవై ఉండి స్తుతియోగ్యుడవు అయినావు.





