Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



    శ్రీ భగవానువాచః

        హంత! తే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః
        ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ! నాస్త్యంతో విస్తరస్య మే  19

    అర్జునా! నా విభూతులు అనంతములు వానిలో ప్రధానమైన వాటిని నీకు ఉపదేశింతును.

        అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః
        అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ  20
    
    అర్జునా! సర్వభూతముల హృదయములందున్న ఆత్మను నేను! భూతముల ఆది మధ్యాంతములను నేనే.

        ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవి రంశుమాన్
        మరీచి ర్మురుతామస్మి నక్షత్రాణా మహం శశీ  21

    ఆదిత్యులలో విష్ణువును. జ్యోతిషము నందు కరణములు గల రవిని, మరీచులందు మారుతమును. నక్షత్రములందు చంద్రుడను.

        వేదానాం సామవేదో - స్మి దేవానామస్మి వాసవః
        ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా  22

    వేదములందు సామవేదమును, దేవతలందు ఇంద్రుడను. ఇంద్రియములందు మనస్సును. ప్రాణులందు చేతనను.

        రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్
        వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణా మహమ్  23

    రుద్రులందు శంకరుడను. యక్షరాక్షసులలో కుబేరుడను. వసువులందు అగ్నిని పర్వతములందు మేరువును.

        పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ! బృహస్పతిమ్
        సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః  24

    పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే అని పార్థా! తెలియుము. సేనానులందు స్కందుడను. సరస్సులలో సాగరమును.

        మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేక మక్షరమ్
        యజ్ఞానాం జపయజ్ఞో స్మి స్థావరాణాం హిమాలయః  25

    మహర్షులందు భృగువును. మాటలందు ఓంకారమును. యజ్ఞములందు జప యజ్ఞమును పర్వతములందు హిమాలయమును.

        అశ్వత్థ స్సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః
        గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః  26

    చెట్లలో రావిని, దేవఋషులందు నారదుడను. గంధర్వులందు చిత్రరధుడను. సిద్ధులందు కపిలమహర్షిని.
    
        ఉచ్చై శ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్
        ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్  27

    అశ్వములలో, అమృతముతో పుట్టి ఉచ్చైశ్రవమును, గజములలో ఐరావతమును, నరులలో నరాధిపుడను.

        ఆయుధానా మహం వజ్రం ధేనూనామస్మి కామధుక్
        ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః  28

    ఆయుధములందు వజ్రాయుధమును. గోవులందు కామధేనువును. పుట్టించువారిలో మన్మధుడను. సర్పములలో వాసుకిని.
    
        అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్
        పితౄణామర్యమా చాస్మి యమ స్సంయమతామహమ్  29

    నాగులందు అనంతుడను, జలము యిచ్చు వారిలో వరుణుడను, పితరులలో ఆర్యమను, నియంత్రించువానిలో యముడను.

        ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్
        మృగాణాం చ మృగేంద్రో - హం వైనతేయశ్చ పక్షిణామ్  30

    దైత్యులలో ప్రహ్లాదుడను. గణకులలో కాలమును. మృగములలో సింహమును. పక్షులలో గరుడుడను.

        పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్
        ఝుషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ  31

    వీచు వారిలో గాలిని, ఆయుధము ధరించువారిలో రాముడను. జలచరములలో మొసలిని. నదులలో గంగను.

        సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహ మర్జున
        ఆధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతా మహమ్  32

    సృష్టికి ఆదిమధ్య అంతముడను నేనే. విద్యలందు ఆధ్యాత్మ విద్యను. వాదించువారిలో వాదమును.

        అక్షరాణా మకారో - శ్శి ద్వంద్వస్సామాసికస్య చ
        అహమేవాక్షయః కాలః ధాతా - హం విశ్వతో ముఖః  33

    అక్షరములందు అకారమును, సమాసములందు ద్వంద్వ సమాసమును, అక్షయ కాలమును నేనే. పోషకుడను నేనే. నేనే విరాట్ పురుషుడను.

        మృత్యుస్సర్వ హరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతామ్
        కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్వేధా ధృతిః క్షమా  34

    అన్నింటిని హరించువారిలో మృత్యువును. భవిష్యత్తుకు ఉత్పాదకుడను. స్త్రీలలో కీర్తి శ్రీ వాక్కు, స్మృతి, మేధ, ధ్రుతి, క్షమ నేనే అగుచున్నాను.

        బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసా మహమ్
        మాసానాం మార్గశీర్షో - హం ఋతూనాం కుసుమాకరః  35

    గాత్రమునందు బృహత్సామమును, ఛందస్సులందు గాయత్రిని, మాసమునందు మార్గశిరమును, ఋతువులందు వసంతమును.

        ద్యూతం ఛలయతామస్మి తేజ స్తేజస్వినా మహమ్
        జయో-స్మి వ్యవసాయో - స్మిసత్త్వం సత్త్వవతామహమ్  36

    పంచకులలో జూదమును, తేజస్వంతులలో తేజస్సును, కృషికులలో జయమును, సాత్వికులలో సత్వికుడను నేనే అగుచున్నాను.

        వృష్ణీనాం వాసుదేవో - స్మి పాండవానాం ధనంజయః
        మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః  37

    వృష్ణి వంశజులలో వాసుదేవుడను. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. కవులలో ఉషన కవి.

        దండో దమయతా మస్మి నీతిరస్మి జిగీషతామ్
        మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతా మహమ్  38

    శిక్షించువారిలో దండమును గెలుపుకోరు వారిలో నీతిని, గోప్యములలో మౌనమును, జ్ఞానమంతులలో జ్ఞానమును.

        యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జన!
        న తదస్తి వినా యత్స్యాత్ మయాభూతం చరాచరమ్  39

    అర్జునా! సర్వభూతములకు బీజమును నేనే. నేను లేనిది ఏదీ లేదు. చరాచరములను నేనే సృష్టించినాను.
    
        నాంతో - స్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప!
        ఏషతూద్దేశతః ప్రోక్తః విబూతేర్విస్తరో మయా  40

    అర్జునా! నా దివ్య విభూతులు అనంతములు. విస్తృతములైన వాటిని గూర్చి సంగ్రహముగా నీకు తెలియపర్చినాను.
    
        యద్యద్విభూతి మత్సత్త్వం శ్రీ మదూర్జిత మేవ వా
        తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశ సంభవమ్  41

    విభూతి యుక్తము, కాంతి యుక్తము, శక్తియుక్తమైన పదార్థమైనను, నా తేజస్సు యొక్క అంశముగానే గుర్తించుము.

        అథ వా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున!
        విష్టభ్యాహ మిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్  42

    ఇంతకుమించి తెల్సి ప్రయోజనమేమి? సమస్త జగత్తును నేనే పోషించుచున్నాను.

    దీపిక:

    శ్లోకము పందొమ్మిది నుండి 42 వరకు అనేక పదార్థములను తెలియపరచినారు. అది మన జ్ఞానమును పెంచుచున్నది. అంతే కాదు. ప్రతి దానిలో అత్యుత్తమమును గురించి తెలియపరచినారు. ఆ నామములు మనకు ఎంతో ఉపయుక్తములగును.
    ఇది స్వామి విభూతి. ఇందు యింతకు మించి చెప్పుట అవ్యాఖ్య అగును.
    స్వామి విభూతిని పూర్తిగా తెల్సుకొని ప్రయోజనము పొందవలసియున్నది.
    విభూతి యోగమను పదవ అధ్యాయము ముగిసినది.

                                      ఓం శాంతిః శాంతిః శాంతిః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.