Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
పదవ అధ్యాయము
విభూతి యోగము
శ్రీ భగవానువాచః
భూయ ఏవ మహాబాహో! శృణు మే పరమం వచః
యత్తే - హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా 1
అర్జునా! నీవు నాకు ప్రేమపాత్రుడవు. నీ హితము కోరి చెప్పుచున్నాను. మరలా నా పరమవాక్కును వినుము.
నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః 2
దేవతలు గాని, మహర్షులు గాని నా మూలమును తెలియజాలరు. నేను దేవతలకన్న, మహర్షులకన్న మొదటివాడను.
యో మామజ మనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్
అసంమూఢ స్స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్చతే 3
నరులలో నన్ను ఎవడు అజునిగను, అనాది పురుషుడగను, లోక మహేశ్వరుడుగను, తెలియుచున్నాడో వాడు జ్ఞాని. అతడు సర్వపాపములనుండి విముక్తుడగును.
బుద్ధిర్ జ్ఞాన మసంమోహః క్షమా సత్యం దమశ్శమః
సుఖం దుఃఖం భవో భావః భయం చాభయమేవ చ 4
అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః 5
బుద్ధి, జ్ఞానము, మోహము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖము, దుఃఖము, ఉండుట లేకుండుట, భయము, అభయము, అహింస, సమత, సృష్టి, తపము, దానము, కీర్తి, అపకీర్తి ప్రాణుల భావములు అగుచున్నవి. ఇవన్నియు వేరువేరుగా నా వల్లనే కలుగుచున్నవి.
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా
మద్భావా మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః 6
సప్తరుషులు, వారి పూర్వులు నలుగురు మనువులు నా మనసు నుండియే ఉద్భవించినారు. లేమందలి సమస్త ప్రజ వీరి బిడ్డలే అగుచున్నారు.
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః
సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః 7
నా విభూతిని, యోగమును తాత్వికముగా తెలియువాడు చలించడు. యోగి అగును. నాకు నిశ్చలభక్తుడగును. ఇందు సందేహము లేదు.
అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః 8
నేను సమస్తమును సృష్టించుచున్నాను. నా వల్లనే ఇది నిలచి యున్నది. ఇది తెలిసినవాడు, విద్వాంసుడు, భావ సమన్వితుడు నన్ను భజించుచున్నారు.
మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరమ్
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చయ రమంతి చ 9
నాయందే మనసు, ప్రాణము గలవారు, నన్ను గురించి చెప్పుకొనువారు, పరస్పరము బోధించుకొనువారు, నిత్యతృప్తులు నిత్య సంతోషులు అగుచున్నారు.
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతీ పూర్వకమ్
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే 10
వారిలో నిరంతరము ప్రీతి పూర్వముగా భజించువారికి బుద్ధి యోగమును ప్రసాదించుచున్నాను. దానివలన వారు నన్ను చేరుకొనగలరు.
తేషామే వానుకంపార్థం అహమజ్ఞానజం తమః
నాశయామ్యాత్మ భావస్థః జ్ఞానదీపేన భాస్వతా 11
అజ్ఞానము, అంధకారము అగుచున్నది. వారిని అనుగ్రహించి వారి అజ్ఞానమును, జ్ఞానదీపముచే దూరము చేయుచున్నాను. కాంతిని ప్రసాదించుచున్నాను.
అర్జున ఉవాచః
పరంబ్రహ్మ! పరం ధామ! పవిత్రం పరమం భవాన్!
పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవ! మజం విభుమ్ 12
ఆహుస్త్వాం ఋషయస్సర్వే దేవర్షిర్నారద స్తథా
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే 13
సమస్త రుషులు నిన్ను, పరంబ్రహ్మముగను, పరంధామునిగను, పవిత్రునిగను, పరమ పురుషుని గను, శాశ్వతునిగను, దివునిగమను, ఆదిదేవునిగను, జన్మరహితునిగను, ప్రభువుగను పలుకుచున్నారు. దేవరుషి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుని వలె స్వయముగా నాకు ఉపదేశించుచున్నావు.
సర్వమే తదృథం మన్యే యన్మాం వదసి కేశవ
న హి తే భగవాన్! వ్యక్తిం విదుర్దేవా న దానవాః 14
కేశవా! నీవు నాకు ఉపదేశించినదంతయు సత్యమే. భగవాన్ దేవతలు గాని దానవులు గాని నీ రూపమును తెలియకున్నారు.
స్వయమేవాత్మనా త్మానం వేత్థ త్వం పురుషోత్తమ!
భూతభావన! భూతేశ దేవదేవ! జగత్పతే! 15
పురుషోత్తమా! భూతభావనా! భూతేశా! దేవ దేవా! జగత్పతే నిన్ను నీవే ఎరుగుదువు. మరొకరు ఎరుగజాలరు.
వక్తుమర్హ స్యశేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః
యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్యం వ్యాప్యతిష్ఠసి 16
మీ విభూతులు గొప్పవి. వాటి వల్లనే మీరు సమస్త లోకములందును వ్యాపించి యున్నారు. మీ విభూతులను విశేషముగా, దివ్యముగా ప్రవచించుటకు మీరే సమర్థులు.

కథం విద్యామహం యోగిన్! త్వాం సదా పరిచింతయన్!
కేషు కేషు చ భావేషు చింత్యో - సి భగవన్! మయా! 17
యోగీశ్వరా! మిమ్ములను నేను ఎట్లు తెలియగలను, ఎట్లు నిత్యము చింతించగలను? ఏఏ భావములచే ధ్యానించవలెను?
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్ధన!
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తిమే మృతమ్ 18
జనార్ధనా! నీ యోగమును, విబూతిని మరొకసారి వివరించగలరు. మీ మాటలు అమృతతుల్యములు. తృప్తి గలుగుటలేదు.
దీపిక:
అర్జునుడు వాస్తవమును వెల్లడించినాడు. పలుకులు తీయనివి ఐనా ఏదైనను ఎంతయైనను వినవచ్చును.
జీవితము ఒక్కటే యింత కాలముగా కవులు చెప్పుచున్నారు. గాయకులు పాడుచున్నారు. ఐనను తృప్తిలేదు.
జీవితము అదియే! చెప్పువారు సమర్థులైనా ఎన్ని తీరులైనను చెప్పవచ్చును. ఎంతైనైనను చెప్పవచ్చును.
వాల్మీకి రామాయణము, వ్యాసుని భారత భాగవతములు, ఎంత విన్నను, ఎన్ని విధములుగా విన్నను మరింత వినుటకె నా మనస్సు కోరుచునేయుండును.
కథలు అనంతములు, కథకుల తీరును బట్టి దాని స్థాయి నిర్ణయింపబడును. పలుకు పటికబెల్లమైనా ఎంతవిన్న విన్ననేమి!





