Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
పదహారు
ఎరుపు కెరటం:
1917లో ఒక మహత్తర సంఘటన సంభవించింది. అలాంటిది మానవ చరిత్రలో అంతవరకు జరుగలేదు. అది రష్యాలో విజయం సాధించిన శ్రామిక విప్లవం. దానికి నాయకత్వం వహించిన లెనిన్ ప్రపంచ శ్రామిక వర్గానికి ఆశాజ్యోతి.
రష్యాలో లెనిన్ నాయకత్వాన శ్రామిక ప్రభుత్వం ఏర్పడింది. అది ప్రపంచంలోని దోపిడి వర్గాన్ని - శ్రామిక వర్గాన్ని ఆశ్చర్యచకితులను చేసింది. దోపిడి వర్గం దానిని కూల్చడానికి కుట్ర సాగించింది. శ్రామిక వర్గం దాన్ని రక్షించుకోవడానికి ప్రతినబూనింది.
మానవ జాతి చరిత్రలో శ్రమను దోచుకోవడాన్ని శాస్త్రీయంగా వివరించినవాడు కారల్ మార్క్స్ ఒక్కడే. ధన స్వామ్య సామాజంలో ధనస్వాములు శ్రామికుల రక్తాన్ని పీల్చడం చూసి, కారల్ మార్క్స్ హృదయం తపించినంతగా మరొకరి హృదయం తపించి ఉండదు. మార్క్స్ మహా మేధావి. మహా మనిషి. అనంత మానవతామూర్తి. అతడు ధనస్వామ్యపు పట్టపగలు దోపిడిని బయట పెట్టాడు. వారి ఎత్తులను, జిత్తులను కనిపెట్టాడు. శ్రామిక వర్గం ధన స్వామ్యపు ఊబినుండి బయటపడడానికి సశాస్త్రీయమైన వెలుగు బాటను కనిపెట్టిన మహర్షి కారల్ మార్క్స్
సమాజంలో లోపాలను అనేకమంది వివరించారు. ఎత్తి చూపారు. మానవ సమాజం ఇలా ఉండాలి అని చెప్పినవాడు మార్క్స్ మహాశయుడు ఒక్కడే. "ప్రపంచ శ్రామికులారా! ఏకం కండి. ఎదురు తిరగండి. మీ దగ్గర ఏమీలేదు పోగొట్టుకోడానికి. పోతే బానిసత్వమే పోతుంది - తెగుతే సంకెలులే తెగుతాయి" అనే నినాదంతో శ్రామిక ఉద్యమాల చిచ్చు రగిల్చినవాడు మార్క్స్ మహర్షి.
లెనిన్ - మార్క్స్ వాదానికి తన నిర్వచనం ఇచ్చాడు. మార్క్స్ వాదం - సమాజవాదం - శ్రామిక వాదానికి ఆచరణరూపం - కార్యరూపం - సాఫల్యరూపం ఇచ్చాడు. ఎందుకూ పనికి రారని ధనస్వామ్యం ముద్రవేసిన శ్రామికులలో - మహత్తర శక్తిని మేల్కొలిపి, ధన స్వామ్యానికి సమాధి కట్టించాడు రష్యాలో.
మార్క్స్ వాదంకన్న లెనిన్ పోరాట విజయం - విప్లవ విజయం - ప్రపంచమేధావులను ఆలోచింపచేసింది. అది దేశాల - జాతుల - మతాల హద్దులను చెరిపి, అందరు మేధావులను ప్రభావితం చేసింది. రష్యా విప్లవాన్ని గురించే ఆలోచించేట్లు చేసింది. రవీంద్రుడు - జవహర్ లాల్ వంటివారు అత్యంతప్రభావితులయినారు.
రచయితగా జవహర్ లాల్ నెహ్రూ భారత దేశంలో సోషలిస్టు భావాలను ప్రసారం చేశారు. వారు సోషలిజాన్ని గురించి వ్యాసాలు వ్రాశారు. వారు రచించిన ప్రపంచ చరిత్ర, వారి స్వీయ చరిత్ర - సోషలిస్టు భావాలను ఎంతో వ్యాపింప చేశాయి.
1925లో భారతదేశంలో "కమ్యూనిస్టు పార్టీ" అవతరించింది. ఆపార్టీ అవతరణప్రేరణ రష్యా విప్లవమే కాని, మార్క్సిజం మాత్రం కాదని నా అభిప్రాయం. మార్క్సిజం ప్రేరణ అవుతే, అది రష్యా విప్లవానికి ముందే ఏర్పడాల్సింది. అయితే, మార్క్సిజం లేని రష్యా విప్లవం లేదు. అందువల్ల మార్క్సిజం ప్రేరణ ఉంది అని వాదించవచ్చు. అది వాస్తవం అయినా, ఆ ప్రేరణ పరోక్షం మాత్రమే!
1929లో మీరట్ తిరుగుబాటు జరిగింది. ప్రభుత్వం దాన్ని "కుట్రకేసు" అని ముద్రవేసింది. నాయకులందరిని నిర్బంధించింది. పార్టీని నిషేధించింది.
రెండో ప్రపంచ యుద్ధం భారత కమ్యూనిస్టు పార్టీకి గొప్ప అవకాశాలను కల్పించింది. కాంగ్రెస్ - బ్రిటిష్ వారు చేస్తున్న, యుద్ధాన్ని బలపరచలేదు. అంతేకాదు, సహాయ నిరాకరణ చేశారు. కమ్యూనిస్టులు కొంతకాలం మిన్నకున్నారు. 1941లో జర్మనీ రష్యాపై దాడి చేసింది. అది జరగగానే పార్టీ దాన్ని ప్రజాయుద్ధంగా ప్రకటించింది. తద్వారా ఫాసిస్టు వ్యతిరేక పోరాటం జరుపుతున్న బ్రిటిషు ప్రభుత్వాన్ని బలపరిచింది.
సుభాస్ చంద్ర బోస్ ఆనాటి భారత యువకుల ఆశాజ్యోతి. బోస్ కాంగ్రెస్ లో తీవ్రవాది. మహాత్ముని నిర్ణయాన్ని ఎదిరించి కాంగ్రెస్ అధ్యక్షుడు అయినాడు. బోస్ ను ప్రభుత్వం నిర్బంధించింది. బోస్ ప్రభుత్వ నిర్బంధం నుంచి నాటకీయంగా తప్పుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మార్గంగా జర్మనీ చేరుకున్నాడు. ఆ వార్తలు కథలు కథలుగా పత్రికల్లో వచ్చాయి. అవి యువకులను ఎంతో ఉత్తేజపరచాయి. తరువాత బోస్ ఆజాద్ హింద్ ఫాజ్ కూర్చి, భారతదేశపు అంచులదాకా జయించడం, ప్రజల్లో బోస్ విషయంలో భక్తి భావం ఏర్పడింది. బోస్ నినాదం "జైహింద్" వందేమాతరాన్ని మించిన నినాదం అయింది.
కమ్యూనిస్టుపార్టీ యుద్ధానికి అనుకూల తీర్మానం చేయడం వల్ల ప్రభుత్వం నిషేధం తొలగించింది.
పార్టీ - అంతర్జాతీయ సిద్ధాంతం దృష్ట్యా సుభాస్ చంద్ర బోస్ ను దేశద్రోహి అన్నది. బోస్ ఫాసిజాన్ని భారతదేశానికి తెస్తున్నట్లు ప్రచారం చేసింది. వాల్ పోస్టర్లు వేసింది. పార్టీ అవలంబించిన ఈ విధానం యువకులకు ఆగ్రహం తెప్పించింది. ప్రజలకు దూరం చేసింది.
చరిత్రాత్మకం అయిన 1942 క్విట్టిండియా ఉద్యమాన్ని పార్టీ బలపరచలేదు. దాన్ని ప్రజా ఉద్యమంగా గుర్తించలేదు. వ్యతిరేకించనూలేదు. ఈ తటస్థ విధానం ప్రజలను అగ్రహోదగ్రులను చేసింది. ప్రజలు బొంబాయిలో పార్తీ కార్యాలయం మీద దాడి చేశారు.
ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ 1942-51 మధ్యదే భారత కమ్యూనిస్టులకు - ముఖ్యంగా ఉభయాంధ్ర కమ్యూనిస్టులకు స్వర్ణయుగం. పార్టీని ప్రజలు తమ పార్టిగా గుర్తించారు. వాస్తవం చెప్పాలంటే - తెలుగు ప్రజలను చైతన్యవంతం చేసింది కమ్యూనిస్టు పార్టియే. ఆనాటి పరిస్థితులను కమ్యూనిస్టులు వ్యూహాత్మకంగా వాడుకుని బలపడ్డారు. తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఆంధ్రలోనే ఏర్పడుతుందనుకున్నారు. ఇందుకు కారణాలు స్థూలంగా ఇవి:
1. 1942లో ప్రభుత్వం కాంగ్రెసు వాదులందరినీ అరెస్టు చేసింది. అందువల్ల రిక్తిత void ఏర్పడింది. వాతావరణంలో void ఏర్పడినపుడు చప్పున చొచ్చుకు గాలి తుఫాను అవుతుంది. కమ్యూనిస్టులు ఆ అవకాశాన్ని అప్పుడు వాడుకున్నంతగా ఏ రాజకీయ పార్టీ ఎన్నడూ వాడుకోలేదు.
2. కాంగ్రెస్ క్రోధాన్ని చవి చూసిన ప్రభుత్వం కమ్యూనిస్టులను దూరం చేసుకోదలచలేదు. ప్రభుత్వం ఉదార విధానం వల్ల కమ్యూనిస్టులు లాభపడినారు. కమ్యూనిస్టుల అంతర్జాతీయ విధానం వల్ల ప్రభుత్వం లాభపడింది.
3. పార్టీ విధానం అంతర్జాతీయం అయినా స్థానిక సమస్యలమీద దృష్టి కేంద్రీకరించింది. పార్టీ కాంగ్రెసుకు వ్యతిరేకం కాదని ప్రజలలో విశ్వాసం కలిగించింది. కాంగ్రెస్ నాయకులను విడుదల చేయాలని నిరంతరం కోరింది.
4. కాంగ్రెసువారు ఎన్నడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. బ్రిటిషు ప్రభుత్వాన్ని సాగనంపడం - ఖాదీవడకడం - సత్యాగ్రహం చేయడం - జేళ్లకు పోవడం వరకే పరిమితం అయినారు.
కమ్యూనిస్టులు సాధారణ ప్రజానీకం - రైతు కులీలలోనికి చొచ్చుకొనిపోయారు. కార్యకర్తలు కూడా అట్టడుగునుంచి వచ్చారు. వారికి ప్రజల సమస్యలు తెలుసు. పార్టీ వాటికోసం పోరాడటం నేర్పింది.
5. యుద్ధం కమ్యూనిస్టులకు ఎంతో ఉపకరించింది. యుద్ధంవల్ల ఏర్పడిన సరకుల కొరత, ప్రభుత్వం విధానం, బ్లాక్ మార్కెట్టు - వీటి విషయంలో పార్టీ ప్రజల పక్షం వహించి నిరంతరం పోరాడింది. ప్రజలకు నిత్యావసరాలు లభింపచేసి పార్టీ ప్రజలకు మరింత దగ్గరయింది. బియ్యం - చక్కర - కిర్సనాయిలు - వంట సరకుల సక్రమ పంపిణీ జరిపించడంతో ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరింది.
6. దోపిడిని గురించి ప్రజలకు తెలియపరిచింది. అంతేకాదు, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు జరిపింది. చల్లపల్లి వంటి జమీందార్లకు వ్యతిరేకంగా చరిత్రాత్మకం అయిన పోరాటాలు జరిపింది.
7. ప్రజాశక్తి పత్రిక - ప్రచురణలు మధ్య తరగతి - మేధావి వర్గంలో తీవ్ర సంచలనం కలిగించాయి. సుమారు మేధావులందరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పార్టీని - పార్టీ కార్యక్రమాలకు తమవిగా భావించి బలపరచారు.
8. అన్నింటినీ మించింది పార్టీ నాయకులు - కార్యకర్తల నైతిక స్థాయి. నైతిక స్థాయి విషయంలో అగ్రనాయకులనుంచి సామాన్య కార్యకర్త వరకూ జాగ్రత్త పడ్డారు. కార్యకర్తల కుటుంబ విషయాలు చక్కబరచడానికి కూడా నాయకత్వం శ్రద్ధ తీసుకున్నది. "కమ్యూనిస్టు" అంటే దోషరహితుడు అని ప్రజలు గుర్తించేట్లు చేశారు. ఆడపిల్లను ఇవ్వడానికి సహితం "కమ్యూనిస్టు" ఒక అర్హతగా పరిణమించింది.
ఇన్నింటివల్ల ఆంధ్రదేశంలో ఒక ఎర్ర కెరటం లేచింది. ఎర్ర బావుటా ఎగిరింది. సుత్తీకొడవలి తెలుగు చిహ్నం అయింది. సుత్తీ కొడవలి ముగ్గులు - సుత్తీ కొడవలి ఆభరణాలు - కమ్యూనిస్టు పేర్లు సర్వసాధారణం అయినాయి.
ఇది బ్రిటిషాంధ్రం స్థితి. తెలంగాణంలో నేల - కొండలు - పొలాలు ఎర్రబడ్డాయి నిజాం రాజు తన రాజ్యాన్ని ప్రపంచానికి దూరంగా - తన గుప్పెట్లో ఉంచుకోవడానికి చేసిన నికృష్టకృత్యాలకు అంతులేదు. అయినా అరుణోదయాన్ని, కార్చిచ్చును - సుడిగాలిని - ఉప్పెనను ఆపగలిగినవా డెవడు?





