Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    9. అగ్నీ ! గృత్సమద వంశపు ఋషులు నిన్ను రక్షకునిగావించి ఛందోపాఠములు పఠింతురు. గుహా మధ్యమున ఉత్కృష్ట స్థానమున ఉన్న ధనమును గ్రహింతురు. వారు ఉత్తమ పుత్రులను పొందుదురు. శత్రువులను పరాజితులను చేతురు.
   
    అగ్నీ ! మేధావులు స్తుతికారులగు యజమానులకు మరింత ప్రసిద్ధ ధనమును ప్రసాదించుము.

                                   అయిదవ సూక్తము
         ఋషి-భార్గవ సోమాహుతి, దేవత-అగ్ని, ఛందస్సు-అనుష్టుప్.

    1. అగ్ని చైతన్య ప్రదాత. మనకు తండ్రి. పితరుల రక్షణకు జన్మించినాడు. హోతా ! మనము అగ్నికి హవిస్సులు అర్పింతము. మనలను రక్షించునట్టి, ఇతరులను ఓడించునట్టి ధనమును సాధించుటకు సమర్ధులము అగుదుము.

    2. అగ్ని యజ్ఞనేత. అతడు సప్తరశ్ములతో పరివ్యాప్తుడు అగును. దేవతలకు 'పోత' వంటి అగ్ని మానవులకు పోతవలె అష్టమ స్థానీయుడయి పరివ్యాప్తుడు అగును.

    3. ఈ యజ్ఞమున ఋత్విక్కులు ధరించిన హవ్యాదులను, వారు పఠించు మంత్రములను అన్నింటిని అగ్ని ఎరుగును.

    4. పవిత్రుడగు ప్రశాస్త, అగ్నియొక్క పుణ్యక్రతువు వెంబడి జన్మించినాడు. పండ్లు కోయుటకు జనులు ఒక కొమ్మనుంచి మరొక కొమ్మకు పోదురు. అట్లే అగ్ని అవశ్యము ఫలములు ఇచ్చువాడని గ్రహించిన యజమాని ఒకటి తరువాత మరొక వ్రతము అవలంబించును. (యజ్ఞమును నిరాటంకముగా నడుపువాడు ప్రశాస్త)

    5. నిరంతరము పనులుచేయు చేతివ్రేళ్లు నేష్టాగ్నికి ధేను స్వరూపములు. అవి అగ్నిని సేవించును. గార్హపత్యాది మూడు అగ్ని స్వరూపములను సేవించును.

    6. మాతృరూపిణియగు వేదివద్ద సోదరీ సమానమగు జుహువును ఘృతపూర్ణముగ ఉంచినపుడు వర్షమున యవధాన్యము పరిపుష్టమైనటుల అధ్వర్యురూపుడగు అగ్ని పరిపుష్టినొందును.

    7. ఋత్విక్కు రూపమగు ఈ అగ్ని తన కర్మ కొఱకుగాను ఋత్విక్కుల కర్మలను ఆచరించును. తదనంతరమే మేము సహితము స్తోమము, యజ్ఞము, హవ్యము సమర్పింతుము.

    8. అగ్నీ ! నీ మహిమ తెలిసిన యజమాని సమస్త దేవతలను తృప్తి పరచునట్లు చేయుము. మేము చేయు యజ్ఞములు అన్నియు నీకు సంబంధించినవియే అగును. 

                                ఆరవ సూక్తము
          ఋషి-భార్గవ సోమాహుతి, దేవత-అగ్ని, ఛందస్సు-గాయత్రి.

    1. అగ్నీ ! నేను సమర్పించు సమిధను, ఆహుతిని గ్రహింపుము. నా స్తుతిని ఆలకింపుము.

    2. అగ్నీ ! నీవు బలపుత్రుడవు. విస్తీర్ణుడవు. యజ్ఞశాలివి. సుజన్మవు. మేము ఆహుతులు అందించి నిన్ను సేవించెదము. నిన్ను స్తుతింతుము. ప్రసన్నుని చేసెదము.

    3. అగ్నీ ! నీవు ధనుదుడవు. స్తుతియోగ్యుడవు. యజ్ఞాభిలాషివి. మేము నీ సేవకులము. నిన్ను నుతింతుము. సేవింతుము.

    4. అగ్నీ ! నీవు ధనవంతుడవు. విద్వాంసుడవు. ధనదాతవు. లెమ్ము. మా శత్రువులను దూరము చేయుము.

    5. అదే అగ్ని అంతరిక్షము నుండి మా కొఱకు వర్షము కురిపించును. అగ్నీ ! నీవు మాకు మహాబలమును, అనంతవిధ సంపదలను ప్రసాదించుము.

    6. అగ్నీ ! నీవు యువకుడవు. అత్యంత్ పూజనీయుడవు. నేను నిన్ను స్తుతించుచున్నాను. విచ్చేయుము. నిన్ను పూజించువాడను. నీ ఆశ్రయము కోరియున్నాను.

    7. అగ్నీ ! నీవు మేధావివి. మానవుల హృదయములను గ్రహించినవాడవు. ఉభయ జన్మలను ఎరిగినవాడవు. నీవు

    ఈ లోకమునకు, బంధువులకును దూతరూపుడవు.

    (ఉభయ జన్మల అనగా యజించు యజమాని, యజించబడు దేవతల జన్మములు అని అర్థము)

    8. అగ్నీ ! నీవు విద్వాంసుడవు. నా మనోకామన పూర్తి చేయుము. నీవు చైతన్యవంతుడవు. క్రమప్రకారము దేవతల యజ్ఞము చేయుము. కుశములపై ఆసీనుడవగుము.

                               ఏడవ సూక్తము
         ఋషి-భార్గవసోమాహుతి, దేవత-అగ్ని, ఛందస్సు-గాయత్రి.

    1. అగ్ని తరుణతముడు. భరతుడు. వ్యాప్తుడు. అట్టి అగ్ని మాకు ప్రశంసనీయము, దీప్తిమంతము, బహుజనవాంఛితము అయిన ధనమును ప్రసాదించవలెను.

    2. అగ్నీ ! మానవుల లేక దేవతల శత్రువులు మమ్ము పరాభవించరాదు. మమ్ము రెండువిధముల శత్రువులనుండి రక్షింపుము.

    3. అగ్నీ ! జలధారను దాటినట్లు మేము స్వయముగానే శత్రువులను అందరిని లంఘించి పోవుదుము.

    4. అగ్నీ ! నీవు పరిశుద్ధుడవు. పావకుడవు. వందనీయుడవు. ఘృతము ద్వారా ఆహోతుడవు అగుదువు. అత్యంత ప్రకాశవంతుడగు అగుదువు.

    5. అగ్నీ ! నీవు భరతుడవు. నీవు మా వాడవు. వంధ్యగోవు, వృషభము, గర్భిణిగోవు ద్వారా ఆహ్వానించబడినావు.

    6. అగ్ని అన్నమే సమిధగా గలవాడు. అతనితో ఘృతసిక్త హోత ఉన్నాడు. అతడు పురాతనుడు. హోమ నిష్పాదకుడు. వరణీయుడు. బలపుత్రుడు. అగ్ని అత్యంత రమణీయుడు.

                                 ఎనిమిదవ సూక్తము
        ఋషి-శౌనక గృత్సమదుడు, దేవత-అగ్ని ఛందస్సు-గాయత్రి, 6 అనుష్టుప్.

    1. హోతా ! అన్నమును కోరువానివలె యశోవంతములు, వరప్రదాతలు అగు అగ్నియొక్క అశ్వములను స్తుతించుడు.

    2. అగ్ని మంచినేత, జరారహితుడు. మనోహర గమనుడు. హవిస్సులు అందించు యజమాని యొక్క శత్రువులను నశింప చేయుటకు అగ్నిని ఆహ్వానింతుము.

    3. సుందరజ్వాలలు గల అగ్నిని, తమ ఇంటరాత్రింబవళ్ళు స్తుతించువాని, వ్రతము ఎన్నటికిని క్షీణించదు.

    4. కిరణ స్వరూపుడగు సూర్యుడు ప్రకాశించినట్లు అగ్ని సహితము జరా రహిత శిఖల ద్వారా నలువైపుల ప్రకాశితుడు అయి సూర్యునివలె కిరణ్యస్వరూపుడై విరాజిల్లును.

    5. శత్రునాశకుడు, స్వయం ప్రకాశితుడు అగు అగ్నినే సకల ఋక్కులు స్తుతించుచున్నవి. సకల శోభలను అగ్నియే ధరించినాడు.

    6. మేము అగ్ని, ఇంద్రుడు, సోమము, అన్య దేవతలను ఆశ్రయించినాము. మాకు హాని తలపెట్టువాడు ఉండడు. మేము శత్రువులను జయింతుము.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహితమున రెండవ అష్టకమున రెండవ మండలమున అయిదవ
                               అధ్యాయము సమాప్తము.)

    ఆరవ అధ్యయము             తొమ్మిదవ సూక్తము
       
        ఋషి - శౌనక గృత్సమదుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్ని దేవహోత. విద్వాంసుడు. ప్రజ్వలితుడు. దీప్తిమంతుడు. బలశాలి. అప్రతిహతుడు. అనుగ్రహకారి. నివాసదాత. భరించువాడు. విశుద్ధశిఖావంతుడు. అట్టి అగ్ని, హోత గృహమున సుఖాసీనుడు కావలెను.

    2. అభీష్టప్రదాతవగు అగ్నీ ! నీవు మాకు దూతవు అగుము. మమ్ము ఆపదలనుండి కాపాడుము. మాకు ధనమును ప్రసాదించుము. ప్రమాద శూన్యుడవు, దీప్తిమంతుడవు అగుము. మమ్ము, మా పుత్రులను రక్షింపుము. అగ్నీ ! మేల్కొనుము.

    3. అగ్నీ ! నీది ఉత్తమ జన్మస్థానము. మేము దానిని సేవింతుము. నీవు వెలువడిన స్థలమును పూజింతుము. నీవు ప్రజ్వలితుడవు అయినపుడు అధ్వర్యులు నీకు హవ్యములు అందించెదరు.

    4. అగ్నీ ! నీవు యజ్ఞములందు శ్రేష్ఠుడవు. హవ్యములద్వారా యజ్ఞము చేయుము. మేము సమర్పించు అన్నమును గురించి దేవతలముందు ప్రశంసించుము. నీవు ధనములందు ఉత్కృష్ట ధనములకు అధిపతివి. మా ప్రదీప్త స్తోత్రమును గ్రహింపుము.

    5. అగ్నీ ! నీవు ప్రదీప్తుడవు. నిత్యము ఆవిర్భవింతువు. నీకు సంబంధించిన దివ్యము, పార్థినము అయిన ధనము అవినాశ్యము. స్తోత్రకర్త అగు యజమానికి అన్నమును ప్రసాదించుము. అతనిని సంతాన ధనమునకు స్వామిని చేయుము.

    6. నీవు నీ బృంద సహితుడవయి మమ్ము అనుగ్రహింపుము. మీరు ఉభయులు యాజకులు, ఉత్తమ యజ్ఞకర్తలు, దేవతల రక్షకులు, మా పాలకులు కండు. మిమ్ము హింసించగలవాడులేడు. అగ్నీ ! నీవు ధనదీప్తిమంతుడవయి నలుగడల వ్యాపింపుము.

                             పదవ సూక్తము
        ఋషి-శౌనక గృత్సమదుడు, దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.

    1. అగ్ని ప్రప్రథమ హోతవ్యుడు. పితృసముడు. అగ్ని మానవుల ద్వారా యజ్ఞమున ప్రజ్వలితుడు అగును. అతడు దీప్తిపూర్ణుడు. మృత్యురహితుడు. విభిన్న ప్రజ్ఞాయుక్తుడు. అన్నవంతుడు. బలవంతుడు. సర్వ సేవనీయుడు అగును.

    2. అగ్ని అమరుడు. విశిష్ట ప్రజ్ఞావంతుడు. విచిత్రకాంతిమంతుడు. అతడు మా స్తుతి యుక్తములగు అన్ని ఆహ్వానములను ఆలకించవలెను. రెండు ఎర్రని గుఱ్ఱములు అగ్నిని వహించును. సర్వత్ర సంచరించును.

    3. అధ్వర్యుడు ఊర్ధ్వముఖ అరణి నుంచి అగ్నిని పుట్టించును. అగ్ని వివిధ ఓషధులందు గర్భస్థమై ఉన్నది. ఉత్తమ జ్ఞానవంతము అగు అగ్ని రాత్రులందు వెలుగులలో వసించును.

    అగ్నిని అంధకారము ఆర్పలేదు.

    4. సర్వభువనములకు అధిష్టాత, మహామహుడు, సర్వగామి, శరీరవంతుడు, ప్రవృద్ధ హవ్యవ్యాప్తుడు, బలవంతుడు, దృశ్యమానుడు అగు అగ్నిని మేము హవ్యఘృతముల పూజింతుము.

    5. అగ్ని సర్వవ్యాపకుడు. యజ్ఞాభిముఖ ఇచ్చకుడు. అట్టి అగ్నిని మేము నేతితో తడుపుదుము. అతడు శాంత చిత్తమున ఆ ఘృతమును గ్రహించవలెను. మానవులకు కీర్తనీయుడు - శ్లాఘనీయ వర్ణముగల అగ్ని పూర్తిగా ప్రజ్వలితుడు అయినపుడు అతనిని తాకుట అసాధ్యము.

    6. అగ్నీ ! నీవు నీ తేజోబలమున శత్రువులను పరాజితులను చేయునపుడు నీకు హర్షదాయకము అగు మా స్తుతులను ఆలకింపుము. నీ ఆశ్రయమున మేము నిన్ను మనువువలె స్తుతింతుము. బహుళ మధుదర్శి, అన్నప్రదుడు అగు అగ్నిని జుహువు మరియు స్తోత్రముల ద్వారమున ఆహ్వానింతును. 

                              పదకొండవ సూక్తము
                 ఋషి-శౌనక గృత్సమదుడు, దేవత - ఇంద్రుడు.
                       ఛందస్సు - 1-20 విరాట్, 21 త్రిష్టుప్.

    1. ఇంద్రా ! నా స్తుతి వినుము. తిరస్కరించకుము. మేము నీ ధన-దాన పాత్రులము. నదివలె ప్రవాహశీలమయిన ఈ హవ్యము యజమానికిగాను ధనమును కోరుచున్నది. ఇది నిన్ను వర్థిల్ల చేయవలెను.

    2. ఇంద్రా ! నీవు శూరుడవు. నీవు కురిపించిన వర్షమును వృత్రుడు ఆక్రమించినాడు. నీవు ఆ జలమును త్యజించినావు. వాడు ఆ వృత్రుడు అమరుడను అనుకున్నాడు. నీవు స్తుతుల ద్వారా వర్థిల్లినావు. వృత్రుని నేలకు కొట్టినావు.

    3. ఇంద్రా ! నీకు సుఖకరము, హర్షదాయకము, అభీష్టము అగు బుక్ మంత్రము శుభ్రము, దీప్తిమంతము అగు స్తుతిగా యజ్ఞములందు నీ కొఱకు ఆవిర్భవించును.

    4. ఇంద్రా ! నిన్ను మేము స్తుతింతుము. నిన్ను సుఖవంతుని చేయుదుము. నీ చేతికి దీప్తిమంతమగు వజ్రాయుధమును అర్పింతుము. నీవు వర్థిల్లుము. తేజోవంతుడవు అగుము. సూర్య సమాన తేజస్సుగల ఆయుధముతో దస్యులను పరాజితులను చేయుము.

    5. గుహలో ఉన్నవాడు, వెలువడనివాడు, తిరోహితుడు, జలములందు ఉన్నవాడును అగు వృత్రుడు తన శక్తి సామర్థ్యములతో అంతరిక్షమును, ద్యులోకమును చకితులను చేసినాడు. అట్టివానిని నీవు వజ్రమున నష్టపరచినావు.

    6. ఇంద్రా ! మేము నీ ప్రాచీన మహత్కార్యములను స్తుతింతుము. అధునాతన మహత్కార్యములను కీర్తింతుము. నీ చేతనున్న వజ్రమును నుతింతుము. నీవు సూర్యాత్మవు. పతాక స్వరూపములయిన నీ హరినామ అశ్వములను శ్లాఘింతుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.