Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
"అయ్యో! ఎంత పాపిని నేను. బ్రాహ్మణుడనైన నేను ఉంపుడుకత్తె కడుపున సంతానము కని భ్రష్టుడనైపోతినే! తామసులైన తల్లితండ్రులను దిక్కులేని వారలను చేసినానే! అయ్యో!! ఎంత కృతఘ్నుడను నేను!! కట్టుకున్న భార్యను వదలి ఉంపుడుకత్తె కొరకు ఎన్ని ఘోరములైన పాపములు చేసినాను! నేను ఎంత ఘోరమగు నరకమున కూలవలసి వున్నది? ఏది దారి? ప్రాణమును, ఇంద్రియములను, మనసును సంయమ పరచుకొని జాగ్రత్తపడెదను. ఇక పాపంధకారమున అడుగుపెట్టను. అవిద్య వలన అనేక కోర్కెలు కొనితెచ్చుకొని నా కాళ్ళకు నేను బంధములు పెట్టుకున్నాను. వాటిని త్రెంచు కొందును. వాసనలు వదలుకొని ప్రాణికోటికి మేలు చేయుదును. దీనుల ఎడ దయ చూపుదును" అనుకున్నాడు.
విష్ణుదూతల క్షణకాల సాంగత్యము వలన అజామీళునకు నిర్వేదము కలిగినది. సంసార బంధములను త్రెంచుకొని వారి ద్వారమునకు వెళ్ళినాడు. ఒక మందిరమున కూర్చుని భక్తి యోగము అవలంబించినాడు. ఆత్మను పరమాత్మకు సమర్పించినాడు.
అప్పుడు పూర్వము విష్ణుదూతలు అతనిముందు ప్రత్యక్షమైనారు. అజామీళుడు వారికి నమస్కరించి, శరీరమును త్యజించినాడు. ఉత్తరక్షణమున విష్ణుదూతలతో కలిసి బంగారు విమానమెక్కి విష్ణుపదము చేరుకున్నాడు.
యేతం పరమం గుహ్యమితిహాస మాఘాపహమ్
శృణుయాచ్చ్రద్ధయా యుక్తో యశ్చభక్త్యానుకీర్తయేత్
నవైన నరకం యాతి నేక్ష్యతే యమకింకరైః
యద్యప్యమంగళో మర్త్యో విష్ణులోకే మహీయతే
ఈ చరిత్రము అతి రహస్యమైనది. పాపములను పోగొట్టునది. శ్రద్ధగా దీనిని విన్నవాడు, కీర్తించినవాడు నరకమును తప్పించుకొనును. అతనికి యమకింకరులు కనిపించరు. అతడు ఎంత పాపాత్ముడైనను విష్ణులోకమును చేరును.
అజామీళుని కథ ఒక నూతనాధ్యాయమును ప్రారంభించినది.
మానవ సమాజపు తొలిదశలో మతమే రాజకీయమై యుండెను. రాజశాసనము పేటికవలె కాక నామమాత్రముగ నున్నప్పుడు మానవుని దుష్కార్యములనుండి మరలించినది మతము మాత్రమే. జనులకు భయంకరములగు పాపములను చూపి వారిని పరహింసనుండి మరలించినది మతము.
రాచరికము బలవత్తరమైన కొలది మతము యొక్క ఆశ్రయమును రాజకీయము వదలినది. రాజకీయము నేరస్తుని ఐహికముగా శిక్షించునది కాగా మతము పారలౌకికముగా శిక్షించసాగినది. అట్లు నేరములు, పాపములు విడిపోయినవి. నేరములు భౌతికములు కాగా పాపములు ఆధ్యాత్మికములైనవి.
అజామీళుని కాలమునకు మతాశ్రయమును పూర్తిగా వదిలి యుండవలెను. కాబట్టియే అజామీళుని నేరములను గురించి ఎక్కువగా విచారించలేదు విష్ణుదూతలు. నేరములు చేసిన శిక్షించవలసినవాడు రాజు. ఆత్మకు సంబంధించినంత వరకు నారాయణ నామోచ్ఛారణతో అతడు పవిత్రుడైనాడు. అంతేకాక అతడు పశ్చాత్తాప పడినాడు. పశ్చాత్తాపమునకంటే నరుడు చేయదగినదేమి?
మనసునకు సంబంధించిన వాదము, భరతుని వద్ద బలపడి ఇట బలవత్తరమైనది. కర్మకు ప్రాధాన్యత తగ్గినది. "తపోదాన వ్రతములచే పాపము నశించును. వాస్తవమే కాని పాపము వలన మలినమైన హృదయము పరిశుద్ధమగునా?" అను విష్ణుదూతల వాదముల నెంతేని బలము కలదు. గోహత్య చేసి తచ్చాంతికి అశ్వమేధము చేసిన అది దానికి ప్రాయశ్చిత్తమైనచో అతడు మరొక బ్రహ్మహత్య చేసి మరొక అశ్వమేధము చేయవచ్చును కదా! ఈ కర్మలందు హృదయ పరివర్తనమునకు స్థానము లేనందున హార్దిక పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తమునకన్న మేలు కదా!
రహూగణై తత్తపసా నయాతి నచేజ్యయా నిర్వపణాద్సుహాద్వా
నఛందసా నోతజలాగ్ని నూర్యైర్వినా మహత్పాదరజోభిషేకమ్
జడభరతుడు రహూగణునకు తత్వము ఉపదేశించుచు 'మహా పురుషుల పాదసేవ చేయనిదే తపస్సు, వైదిక కర్మలు, అన్నదానములు, అతిథి సేవలు, దీనులను సేవించుటను, గృహస్తుల ధర్మకార్యములు, వేదాధ్యయనములు, జలాగ్ని సూర్యాది దేవతల ఉపాసనలు వంటి సాధనల వలన పరమార్థ జ్ఞానము కలుగదు" అని చెప్పినాడు. అట్లుచెప్పి అతడు వేదాధ్యయనాదుల ప్రాధాన్యతను పూర్వులు అంగీకరించనంతగా అంగీకరించలేదు.
అజామీళుని కథలో యమదూతలు 'వేద సమ్మతమైనదే ధర్మము. వేదవ్యతిరేకమైనది అధర్మము, అనగా విష్ణుదూతలు...
యద్యదాచరతి శ్రేయా నితరస్తత్తదీహతే
సమత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తములు నడుచుకొన్నట్లు సాధారణులు నడుచుకొందురు. వారు దేనిని ప్రమాణము చేసిన లోకులు దానినే అనుసరింతురు అనుచున్నారు.
వేదములకన్న సత్పురుషుల ఆచరణకే వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చుచున్నారు.
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి
కౌంతేయ! ప్రతిజానీహి స మే భక్తః ప్రణశ్యతి 31
అతడు వెంటనే ధర్మాత్ముడు అగుచున్నాడు. నిత్యశాంతిని పొందుచున్నాడు. అర్జునా! నా భక్తుడు ఎన్నటికి నశించడు అను విషయము తెలుసుకొనుము.
మాం హి పార్థ! వ్యపాశ్రిత్య యే - పి స్యుః పాపయోనయః
స్త్రియో వైశ్యా స్తథా శూద్రాః తే -పి యాన్తి పరాంగతిమ్ 32
పార్థా! పాపయోనులు, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు సహితము నన్ను అనన్యముగా పూజించి పరమగతిని పొందుచున్నారు.
కిం పునర్భ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా
అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మామ్ 33
అట్లు కాగా బ్రాహ్మణులు, పుణ్యాత్ములు, భక్తులు, రాజర్షుల విషయము చెప్పపని లేదు. ఈ లోకము అనిత్యము. అసుఖము. నన్ను భజించుము. పొందుము.
మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు
మామేవైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః 34
నీవు నన్నే చింతింపుము. నా భక్తుడవగుము. నన్ను పూజింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవు అయినచో నన్ను చేరుకొనగలవు.
రాజ విద్యా రాజగుహ్య యోగమను తొమ్మిదవ అధ్యాయం ముగిసినది.
ఓం శాంతిః శాంతిః శాంతిః





