Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
శ్రీహయగ్రీవాయనమః
జ్ఞానానంద మయందేవం | నిర్మలస్పటికాకృతిం |
ఆధారం సర్వ విద్యానాం | హయగ్రీవ ముపాస్మహే ||
రెండవ మండలము
-: ఆంధ్ర వచన ఋగ్వేద సంహితము :-
అయిదవ అధ్యాయము రెండవ అష్టకము
మొదటి అనువాకము మొదటి సూక్తము
ఋషి - శౌనకుడు గృత్పమదుడు, దేవత - అగ్ని, ఛందస్సు - జగతి.
1. అగ్నీ ! నీవు దేవ, మానవులకు స్వామివి. యజ్ఞమునాడు ఆవిర్భవింపుము. సర్వత్ర దీప్తవంతుడవయి ఆవిర్భవింపుము.పవిత్రుడవయి ఆవిర్భవింపుము. జలమునుండి ఆవిర్భవింపుము. పాషాణమునుండి ఆవిర్భవింపుము. వనము నుంచి ఆవిర్భవింపుము. ఓషధులనుండి ఆవిర్భవింపుము.
2. అగ్నీ ! హోత-పోత-ఋత్విక్కు, నేష్ట మున్నగువారి కార్యములు అన్ని నీ కర్మవలననే జరుగుచున్నవి. నీవు అగ్నిధ్రుడవు. నీవు యజ్ఞమును తలచినపుడు ప్రశాస్త కర్మము సహితము నీదియే. నీవే అధ్వర్యుడవు. నీవే బ్రహ్మనామక ఋషివి. మా గృహమున నీవే గృహపతివి.
3. అగ్నీ ! నీవు సురల మనోరథము పూర్తిచేతువు. అందువలన నీవు విష్ణువవు. నీవు అనేకుల స్తుతిపాత్రుడవు. నమస్కార యోగ్యుడవు. ధనవంతుల అధిపతివి. మంత్రముల స్వామివి. విభిన్న పదార్థముల స్రష్టవు. అనేక అభివృద్ధులయందు వసించువాడవు.
4. అగ్నీ ! నీవు వ్రతము ధరించినవాడవు. అందువలన వరుణరాజువు. నీవు శత్రునాశకుడవు - స్తుతియోగ్యుడవు. అందువలన ప్రత్యేకుడవు. నీవు సాధువుల రక్షకుడవు అందువలన అర్యమవు. అర్యమ దానములు సర్వవ్యాపకములు. నీవు సూర్యుడవు. నీవు మా యజ్ఞమునందు ఫలదానము చేయుము.
5. అగ్నీ ! నీవు త్వష్టవు. నీ సేవకుల బలమవు. సర్వ స్తుతులు నీ కొఱకే రచించబడినవి. నీ వెలుగు హితమును కూర్చును. నీవు మా బంధువవు. మమ్ము ఉత్సాహవంతులను చేతువు. మాకు అశ్వాది ధనము ప్రసాదింతువు. నీవద్ద మరింత ధనము ఉన్నది. నీవు మానవులకు బలమవు.
6. అగ్నీ ! నీవు మహదాకాశమున అసుర రుద్రుడవు. మరుత్తులకు బలస్వరూపుడవు. అన్నములకు ప్రభువువు. సుఖములకు ఆధార స్వరూపుడవు. ఎర్రనిది వాయు సదృశమునగు అశ్వముపై పయనింతువు. నీవు పూషవు. నీవే మానవులను రక్షింపుము.
7. అగ్నీ ! నిన్ను అలంకరించి పూజించు యజమానికి నీవు స్వర్గము ప్రసాదింతువు. నీవు ప్రకాశవంతుడవగు సూర్యుడవు. రత్నములకు ఆధార స్వరూపుడవు. కీర్తనీయుడవు. ధనదాతవు. యజ్ఞగృహమున నిన్ను సేవించు యజమానిని రక్షింతువు.
8. అగ్నీ ! జనులు తమ ఇండ్లలో నిన్నుకాంచుదురు. పూజింతురు. నీవు నరుల పాలకుడవు. కాంతిమంతుడవు. మమ్ము అనుగ్రహించువాడవు. నీసేవ అత్యుత్తమము. నీవు సర్వ హవిస్సులకు ఈశ్వరుడవు. నీవు వేల-వందల-పదుల ఫలములు ప్రదానము చేతువు.
9. అగ్నీ ! నీవు తండ్రివి. అందువలన జనులు యజ్ఞము చేతురు. నిన్ను తృప్తి పరచెదరు. జనులు నిన్ను సోదరుని చేసుకొనవలెనని అనుకొందురు. కర్మలు చేసి నిన్ను సంతుష్టుని చేతురు. నీవు వారి దేహములను కాంతిమంతములు చేతువు. నిన్ను సేవించినవారికి నీవు పుత్రుడవు. నీవు సఖుడవు, శుభంకరుడవు. శత్రునాశకుడవయి మమ్ము రక్షింపుము.
10. అగ్నీ ! నీవు ఋభుడవు. నీవు ప్రత్యక్ష స్తుతియోగ్యుడవు. నీవు ఎల్లెడల విస్తార ధనములకు, అన్నములకు స్వామివి. నీవు అత్యంత ప్రకాశవంతుడవు. అంధకారమును అంతము చేయుటకు మెలమెల్లగా పుల్లలు దహింతువు. నీవే యజ్ఞ నిర్వహకుడవు. నీవే యజ్ఞఫలమును విస్తరింప చేసెదవు.
11. అగ్నీ ! నీవు హవ్యదాతకు అదితివి. నీవు హోతవు. భారతివి. మా స్తుతుల వలన నీవు వర్థిల్లుము. నీవు ఇళవు. నీవు ధన పాలకుడవు. వృత్ర హంతవు. సరస్వతివి.
12. అగ్నీ ! నీకు పుష్టి కలిగించిన వానికి నీవు ఉత్తమ పదార్థములు ప్రసాదింతువు. ఉత్తమము, కాంతిమంతము అగు నీ వర్ణమున ఐశ్వర్యములు ఉన్నవి. నీవే అన్నమవు. రక్షకుడవు. ధనమవు. విశాలుడవు. సర్వవ్యాపకుడవు.
13. అగ్నీ ! ఆదిత్యుడు నీకు ముఖమును ఇచ్చినాడు. దేవతలు నీకు నాలుకను ఇచ్చినారు. దాన సమయములందు కూడిన దేవతలు నిన్నే ఆపేక్షింతురు. ఆహుతులు సమర్పించిన హవ్యములను నీనుండియే స్వీకరింతురు.
14. అగ్నీ ! అమరులు దోషరహితులగు దేవతలు వారికి ఆహుతులుగా సమర్పించిన హవిస్సులను నీముఖతః సేవింతురు. మర్త్యులు సహితము నీవలననే అన్నమును ఆస్వాదింతురు. నీవు లతలు మున్నగువాని గర్భరూపుడవు. ఉత్పాదకుడవు. నీవు పవిత్రుడవయి జన్మను గ్రహించినావు.
15. అగ్నీ ! నీవు నీ బలము వలన ప్రఖ్యాత దేవతలతో కలిసి ఉండుము. నీ బలము ద్వారానే నీవు ప్రత్యేకముగా ఉండుము. నీవు వారిని మించిన బలవంతుడవు అగుము. నీ వలననే యజ్ఞపరమగు అన్నము కలుగుచున్నది. నీ మహిమ వలననే శబ్దాదులు ద్యావాపృథ్వుల మధ్య వ్యాపించును.
16. అగ్నీ ! స్తోతలకు గోవులు, అశ్వాదులు దానము చేయు పండితులను, మమ్ము పరమస్థానమునకు తీసికొని వెళ్లుము. మేము వీరుల సహితముగా యజ్ఞమున విరాట్ మంత్రములు పఠింతుము.
ఆలోచనామృతము
1. గృత్సమదుడు తొలుత అంగిరసుల వంశమున శునహోత్రునకు పుత్రుడు. ఒకానొక యజ్ఞమునందు దస్యులు గృత్సమదుని అపహరించినారు. ఇంద్రుడు అతనిని దస్యులనుండి విముక్తుని చేయించినాడు. ఇంద్రుని ఆదేశము ప్రకారమే గృత్సమదుడు భృగు కులమునందలి శునకునకు పుత్రుడు అయినాడు. ఆవిధముగా గృత్సమదుడు అంగిరస శౌనకుడు అయినాడు.
గృత్సమదుడు రెండవ మండల ద్రష్ట.
2. రెండవ మంత్రమున 1. హోత, 2. పోత, 3. ఋత్విక్కు, 4. నేష్ట అనువారిని పేర్కోనుట జరిగినది. కల్లూకభట్టు 16మంది యాజకులను పేర్కొన్నాడు. వారు నాలుగు వర్గములవారు.
i) హోత, అధ్వర్యు, ఉద్గాత, బ్రహ్మ. వీరు ఒక్కొక్కరు పన్నెండు గోవులను దక్షిణగా పొందుదురు. ii) మిత్రావరుణుడు, ప్రతిస్తోత్ర, బ్రహ్మణాగచ్చంసి ప్రస్తోత్ర వీరికి ఆరు గోవులు లభించును. iii) అఛ్వక, నేస్త్ర, అగ్నీధ్ర, ప్రతిహర్త. వీరికి ఒక్కొక్కరికి నాలుగు గోవులు లభించును. iv) గ్రహస్త, నేత్ర, పోత్ర సుబ్రహ్మణ్య. వీరికి ఒక్కొక్కరికి మూడు గోవులు లభించును.
ఈ విదముగా యజ్ఞమున దక్షిణగా నూరు గోవులు లభించును.
కుమారిల భట్టు 16 మందిని ఇట్లు చూపినాడు.
1. అధ్వర్యు, ప్రతిప్రస్థాత, నేష్ట, ఉన్నేత.
2. బ్రహ్మ, బ్రహ్మణాగచ్చంసి, అగ్నీధ్ర, పోత.
3. ఉద్గాత, ప్రస్తోత, ప్రతిహర్త, సుబ్రహ్మణ్య.
4. హోత, మైత్రావరుణ, అచ్చావాక్, గ్రావాష్టుత్.
రెండవ సూక్తము
ఋషి - గృత్సమదుడు, దేవత - అగ్ని, ఛందస్సు - జగతి.
1. అగ్నీ ! నీవు దీప్తిమంతుడవు. అన్న సంపన్నుడవు. స్వర్గదాతవు. దీపకుడవు. హోమపావకుడవు. అట్టి సర్వభూతజ్ఞుడగు అగ్నిని యజ్ఞము ద్వారా వర్థిల్ల చేయవలెను. యజ్ఞమున విస్తృత స్తోత్రములతో యజించవలెను.
2. పగటిపూట ఆవు దూడను ఇచ్చగించును. అగ్నీ ! యజమాని నన్ను రాత్రియు, పగలును కోరుకొనును. అనేకులకు మాననీయుడవగు నీవు ద్యులోకమున వ్యాపించుము. మానవుల యజ్ఞములందు సర్వదా వసింతువు. రాత్రులు వెలుగులు పరతువు.
3. అగ్ని శుభదర్శనుడు. ద్యావాపృథ్వులకు ప్రభువు. ధనపూర్ణ రథ సదృశుడు. దీప్త వర్ణుడు. జ్వాలా స్వరూపుడు. కార్యసాధకుడు. యజ్ఞమునందు ప్రశస్తుడు. అట్టి అగ్నిని దేవతలు మూలరూపమున లోకమున స్థాపించినారు.
4. అగ్ని అంతరిక్షమునందలి జలమును వర్ష రూపమున ఇచ్చు దాత. చంద్రునివలె వెలుగుల రేడు. జలములవలె రక్షకుడు. సర్వజనని. ద్యావాపృథ్వులను వ్యాపింప చేయువాడు. అట్టి అగ్నినే నిర్జన గృహమున స్థాపించినాము.
5. అగ్ని హోమ నిష్పాదకుడయి సమస్త యజ్ఞములకు వ్యాపించవలెను. మానవులు తమ హవ్యములు, స్తోత్రములచే అగ్నిని పూజించినారు. దాహక శిఖాయుక్తమగు అగ్ని వర్థిల్ల ఓషధుల మధ్య జ్వలించి ఆకసమున వెలుగు చుక్కలవలె ద్యావాపృథ్వులను కాంతిమంతము చేయును.
6. అగ్నీ ! ప్రజ్వరిల్లుము. ప్రకాశవంతము అగుము. మాకు శుభములు సమకూర్చునట్టి, క్రమాగతమయి వర్థిల్లునట్టి ధనమును ప్రసాదించుము. మాకు ద్యావాపృథ్వులందలి ఫలములను అనుగ్రహింపుము. మానవులు అర్పించు హవిస్సులు దేవతలు సేవించుటకు అందించవలెను.
7. అగ్నీ ! మాకు కోరినన్ని గోవులు, అశ్వములు మున్నగువానిని వేలకొలది పుత్రపౌత్రులను ప్రసాదించుము. మాకు కీర్తి కొఱకు అన్నమును అనుగ్రహింపుము. అన్న ద్వారములను తెరువుము. ఉత్కృష్ట యజ్ఞముల ద్వారా ద్యావాపృథ్వులను మాకు అనుకూలము చేయుము. ఆదిత్యుని ప్రకాశింప చేసినట్లు ఉషస్సులు నిన్ను ప్రకాశింప చేయును.
8. రమణీయ ఉషస్సులందు అగ్ని ప్రజ్వలితుడు అగును. అప్పుడు సూర్యునివలె ఉజ్వల కిరణములతో దేదీప్యమానుడయి ప్రకాశించును. అగ్ని మానవుల హోమ సాధకుడు. కీర్తనీయుడు. ఉత్తమ యజ్ఞవంతుడు. ప్రజలకు స్వామి. అట్టి అగ్ని ప్రియ అతిథివలె యజమాని వద్దకు వచ్చును.
9. అగ్నీ ! నీవు ద్యుతిమంతుడవు. దేవతలకు పూర్వవర్తివి. మానవుల స్తుతులు నిన్ను ప్రసన్నుని చేయును. పాడి ఆవువలె యజ్ఞమునందలి స్తోతవలె ఈ స్తుతి స్వయముగా వివిధము, అపరిమితమగు ధనములను ఇచ్చును.
10. అగ్నీ ! మేము నీ కొఱకుగాను అపారములగు అన్నములు, అశ్వములు, సామర్థ్యములు సాధింతుము. అట్లు సాధించి అందరిని దాటిపోవుదుము. మాకు అనంతము, అన్యులకు అప్రాప్యము అగు ధనరాశి సూర్యునివలె పంచవర్ణులకు ప్రదీప్త కారణము అగుము.
(పంచవర్ణులు నాలుగు వర్ణములవారు అయిదవవారు నిషాదులు అని శాయన వ్యాఖ్య. శాయనుడే మరొకచోట దేవతలు, పితరులు, మానవులు, పశువులు, పక్షులు, పంచజనులు అని చెప్పినాడు. నిరుక్తమున గంధర్వులు, పితరులు, దేవతలు, అసురులు, రాక్షసులు అని చెప్పబడినది.)
11. శత్రుంజయడవగు అగ్నీ ! నీవు మా స్తుతి యోగ్యుడవు. మా స్తవములను వినుము. సజన్ములగు స్తోతలు నిన్ను నుతింతురు. ధన, పుత్ర ప్రాప్తికొఱకు హవ్య విశిష్టుడగు యజమాని గృహమున అగ్ని ప్రదీప్తుడు అగును. యజనీయ అగ్నికి అర్చన జరుగును.
12. సర్వభూతజ్ఞుడవగు అగ్నీ ! స్తోత, యజమానులగు మేము ఇద్దరము, మా సుఖ ప్రాప్తికొఱకు నీవారలము అగుదుము. మా నివాస స్థానము అతి ఆహ్లాదకరము కావలెను. మాకు పుత్ర, పౌత్రాది ధనమును ప్రసాదించుము.
13. అగ్నీ ! స్తోతలకు గోవులు అశ్వాదులు దానము చేయు పండితులను, మమ్ము పరమస్థాన దిశగా నడిపించుము. మేము మీరుల సహితముగా యజ్ఞమున మహా మంత్రములు పఠింతుము.
మూడవ సూక్తము
ఋషి - గృత్సమదుడు, దేవత - అగ్నులు ఛందస్సు 1-6, 8-11 త్రిష్టుప్, 7 జగతి.
1. వేది మీద 'సమిద్ధ' నామక అగ్ని వెలుగుచున్నది. హోమ నిష్పాదకుడు, విశుద్ధకారి, ప్రాచీనుడు, ప్రజాసంయుక్తుడు, ద్యోతమానుడు, పూజనీయుడు అగు అగ్ని దేవతలను పూజించవలెను.
2. "నరాశంస" నామక అగ్ని సుందర జ్వాలాయుక్తము. మహిమాన్వితము. ఆహుతి స్థలమును ప్రకాశవంతము చేయువాడు. ముల్లోకములను వ్యక్తపరచువాడు. అట్టి అగ్ని ఘృతము వర్షించు కోరికతో హవ్యములను సిద్ధముచేసి యజ్ఞమున దేవతలను ప్రకటింప చేయవలెను.
3. 'ఇళా' నామక అగ్నీ ! మా విషయమున ప్రసన్న చిత్తుడవు అగుము. యాగ కర్మ యోగ్యుడవు అగుము. నేడు మా కొఱకు మానవులముందు నిలిచి దేవ యజ్ఞము నిర్వర్తించుము. దానికి మరుత్తులకు. ఇంద్రుని సంబంధము కలిగించుము. ఋత్విక్కులారా ! కుశలపై కూర్చున్న ఇంద్రుని యజ్ఞము చేయుడు.
4. 'కుశ' స్వరూపమగు అగ్ని మా ధనలాభమునకు ఈ వేదికమీద చక్కగా వ్యాపించవలెను. కుశాగ్నీ ! నీవు సదా వర్థిల్లుడవాడవు. వసువులు, విశ్వ దేవులు, యజ్ఞయోగ్యులగు ఆదిత్యులు నేయిపూసిన కుశలమీద ఆసీనులు కావలెను.
5. ద్యుతిమంతమగు ద్వారరూప అగ్నీ ! నీవు వెలువడుము. జనులు నీకు నమస్కరింతురు. హవనము చేతురు. సవినయముగా నీవద్దకు వచ్చెదరు. నీవు వ్యాపకము, అహింసాయుతము, వీర విశిష్టము, యశోయుక్తము, వర్ణనీయము అగు రూపవంతుడవు. నీవు విశేష విఖ్యాతుడవు అగుము.
6. అగ్ని రూపములయిన ఉషస్సులు, రాత్రులు మాకు సత్కర్మలకు మంచి ఫలితములను ఇచ్చును. అవి నేయుటలో చతురులయిన ఇరువురు రమణులవంటివి. ఉషయు రాత్రియు పరస్పరము పహాయము చేసికొనుచు, వచ్చుచు, పోవుచు యజ్ఞరూప చిత్రమును నేయుటకు దారములను పేకలు పడుగులుగా చేతురు. వారు అత్యంత ఫలప్రదాతలు, జలయుక్తములు.
7. అగ్నిరూపులయిన దివ్యహోతలు ఇద్దరు ముందునుంచే యజ్ఞమునకు యోగ్యులు అయి ఉన్నారు. వారు అన్నివిధముల విద్వాంసులు. మంచి ఆరోగ్యవంతులు. వారు మంత్రములతో చక్కగా పూజింతురు. అవసరమును బట్టి దేవతలకొఱకు యజ్ఞములు చేతురు. పృథ్వికి నాభిరూపి యగు ఉత్తరవేదిన గార్హపత్యాది మూడు అగ్నులను స్థాపింతురు.
8. మా యజ్ఞ నిష్పాదికలు అగ్నిరూప సరస్వతి, ఇళ, సర్వవ్యాపి భారతి అయి ఉన్నారు. ఈ ముగ్గురు దేవేరులు యజ్ఞ గృహమును ఆశ్రయించి ఉందురు. వారు హవ్యలాభమునకుగాను నిర్దోషరూపమున మా యజ్ఞమును పాలింతురు.
9. అగ్ని స్వరూపుడగు త్వష్ట దయవలన మాకు వీరపుత్రులు కలుగవలెను. వారు పింగళవర్ణులు, యజ్ఞకర్తలు, శీఘ్రకర్ములు, దేవాభిలాషులు కావలెను. త్వష్ట మాకు కులరక్షక సంతానమును ప్రసాదించవలెను. దేవతల ఆయువు మాకు కలుగవలెను.
10. వనస్పతి రూపాగ్ని మా కర్మలను అనుసరించి మా వద్ద ఉన్నది. విశేష ప్రక్రియతో అగ్ని హవ్యమును చక్కగా పాకము చేయును. 'దివ్య శమిత' నామక అగ్ని త్రివిధ సిక్త హవ్యములను ఎరిగి దేవతలకు చేర్చును. (త్రివిధ అనగా నేయి, అన్నము, సోమము.)
11. నేను అగ్నికి ఆజ్యము అర్పింతును. ఆజ్యము అగ్నికి జన్మస్థానము. ఆజ్యము అందిన అగ్ని మరింత దీపించవలెను. అగ్ని అభీష్ట వరదుడు. హవ్యములు అందించి అగ్ని దేవతలను ప్రసన్నులను చేయవలెను. అగ్నిరూపమగు స్వాహాకార హవిస్సును అగ్నివహించవలెను.
(అగ్నికి ద్వాదశ రూపములు ఉన్నవి. అవి 1. సమిద్ధ అగ్ని 2. తనూనపాతము 3. నరాశంసము 4. ఇళ 5. బర్హి 6. దేవీద్వారము 7. ఉషాసానక్తారి 8. దివ్యహోతలు ఇద్దరు 9. ముగ్గురు దేవేరులు సరస్వతి-ఇళ-భారతి 10. త్వష్ట 11. వనస్పతులు 12. స్వాహాకృతులు.
ఈ సూక్తమున తనూనపాతము తప్ప మిగిలిన ఏకాదశాగ్నులను పేర్కొనుట జరిగినది.)
నాలుగవ సూక్తము
ఋషి-భార్గవ సోమాహుతి, దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.
1. యజమానులారా ! నేను మీ కొఱకు అతిదీప్తియుక్తుడు పాపరహితుడు యజమానులకు అతిథి స్వరూపుడు హవ్యయుక్తుడగు అగ్నిని ఆహ్వానించుచున్నాను. అతడు సర్వ భూతజ్ఞాత. నరుల నుండి దేవతలవరకు ధరించువాడగును.
2. భృగువులు అగ్నిని సేవించినారు. వారు అగ్నిని జలస్థానములందు అంతరిక్షమున మానవుల మధ్య స్థాపించినారు. శీఘ్రగామి, అశ్వవంతుడు, దేవతల స్వామి అగు అగ్ని మాకుగల సమస్త శత్రు ప్రాణులను పరాజితులను చేయవలెను.
3. దేవతలు స్వర్గమునకు వెళ్లునపుడు మిత్రునివంటి అగ్నిని మానవుల మధ్య స్థాపించినారు. ఆ అగ్ని హవ్యదాత అయిన యజమానికొఱకు అతని ఇంట నిలిచినది. తనను అభిలషించు రాత్రులను అగ్ని వెలిగించును.
4. తన దేహమును పుష్టికరము చేసికొనుటవలె అగ్ని దేహమును పుష్టికరము చేయుట రమణీయమయినది. నలువైపులకు పాకి, కర్రలను భస్మము చేయునపుడు అగ్ని అత్యంత సుందరుడయి ప్రకాశించును. రథమునకు పూన్చిన అశ్వము తేప తేప తన తోకను కదిలించినట్లు కర్రపుల్లలను కాల్చు అగ్ని తన శిఖలను కదిలించును.
5. స్తోతలు మా సహయోగులు. వారు అగ్ని మహత్త్వమును స్తుతింతురు. ఆహ్వానించు ఋత్విక్కులయందు అగ్ని తన రూపమును ప్రకటించును. రమణీయ హవ్యముల కొఱకు అగ్ని విచిత్ర కిరణ ప్రకాశమున వ్యక్తము అగును. అగ్ని వృద్ధుడయయు తక్షణమే మరలమరల యువకుడు కాగలడు.
6. దప్పిగొన్న వానివలె అగ్ని వనములను దహించును. జలమువలె ఇటునటు పరువులిడును. రథపు అశ్వమువలె ధ్వని చేయును. అగ్నిది కృష్ణమార్గము. మసిదారి. అతడు తాపకుడు. అయినను నభోమండలమునందలి ద్యులోకమువలె ప్రకాశించును.
7. అగ్ని విశ్వమును వ్యాపింపచేయును. విశాల పృథ్విని మరింత పెంచును కాపరిలేని పశువులవలె ఇచ్చవచ్చినరీతి సంచరించును. అదే దీప్తిమంతమగు అగ్ని ఎండిన చెట్లను కాల్చి, బాధకలిగించు కంటకములను దూరముచేసి, చక్కగా రసాస్వాదనము చేయును.
8. అగ్నీ ! నీవు తొలుత ప్రథమ సవనమున మమ్ము రక్షించినావు. అది మా మనముల నిలిచి ఉన్నది. అందువలన తృతీయ సవనమున మనోహర స్తోత్రములను ఉచ్ఛరింతుము. నీవు మమ్ము వీరులను చేయుము. విశిష్టులను చేయుము. మాకు మంచి సంతానమును, సంపదను ప్రసాదించుము.





