Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ సంపత్కుమార
ఉత్తర గోగ్రహణము
అదె యాక్రమించినా రు
న్మదు లుత్తరసీమలన్ సమస్తము గో సం
పద నొక్కట పరు లా
కదర్యులగు వారి నూరక వదలుటయా!
మన గోసంపదనా హరించిరన నేమౌ నంతతో నాగునా
మన భూసంపద నాహరింపరని సంభావింప వీలున్నదా?
ఎనయన్ రెండును రెండుగా నగునుగానీ, గోధరిత్రీద్వయిన్
కన భేద మ్మిసుమంతలేదు భరతక్ష్మావాసి కేనాటికిన్.
ఈ దండెత్తినవానికిన్ మనకుగానీ పూర్వ వైరమ్ము లే
నీ దుర్వ్యాహృతులేని వాదనలుగానీ లేనెలేవయ్యె, నే
డేదీ క్రొత్తగ చేయుచుండుటయుగానీ లేదు స్నేహమ్ములో
నే దండెత్తెనటన్న మోసమునకై యింకేమి చెప్పంగనౌ?
వాడా! వాడొక ధార్తరాష్ట్రుడు ధరావాంఛా విషాక్తుండు, మా
యాడంబాధికు డట్టివాని కొక స్నేహమ్మంచు ధర్మమ్మటం
చేడన్ గల్గును, స్నేహ వాక్యములతోనే నమ్మికంజూపి యా
టాడించున్, మరి మోసమే కొనమొదళ్లై గెల్పు రాజూచెడున్
సరి యివ్వియన్ని పోనీ
పరకాంతన్ నిండుసభకు వస్త్రము లూడ్పిం
తురె! యదియున్ జేసె మహా
ఘ రిరంసాప్రథమ మూర్తిగా, రారాజై
వానిగని పిరికితనమా?
వానికి భయపడుటయా? అవార్యుడువాడా?
వాని యధర్మమే బల
హీనత వానికిని, ధర్మమే మన బలమై.
పోనీ గోవులెకాదె! ఏనుగులె పోనిమ్మనన్ వచ్చు నీ
వైనన్ భూ ప్రజలెల్ల నీయటుల కారయ్యా! మరిన్ నీవలెన్
తానీ గోవని యన్నయంత పశుమాత్రమ్మంచు నూహింపరున్,
ప్రాణమ్ముల్ బలె, దేవతల్ బలెనె సంభావింతు రెల్లప్పుడున్
గోవన గోవెకాదు మరి గోవన భూమియు కాంతిరేఖయున్
గోవన స్వర్గమున్ మరియు గోవన వాక్కును, దేవతాళి వా
సావసధమ్ముగాగ భరతావని బుట్టిన యెవ్వడేని చే
తోవధిగా నెరుంగ పరమార్థ మటంచు వినిశ్చయించెదన్
శ్వేతశ్వేత మనోహరాంగ రుచులన్ విన్జీల్చు శృంగమ్ములన్
మాతృత్వానభిభూత వీక్షణములన్ బర్యాప్త వత్సమ్ములన్
స్ఫీతస్వాదుపయః ప్రవాహకములన్ వేరెవ్వరో వచ్చి గో
వ్రాతమ్మున్ హరియింపగా నెటుల నోర్వన్ వచ్చు వై రాటికా!
నరునకు మువ్వురు తల్లులు
నరయంగా కన్నతల్లి, అవనియు, గోవున్
మరి హెచ్చుతగ్గు లేవియు
స్ఫురించ వీముగురియందు పొడమని లోటై.
ఎవడొ తల్లిని వచ్చి బంధించు నప్పు
డవమతింజేయు నప్పుడు నాక్రమించు
నప్పుడును గూడ కన్నుల నప్పగించి
చూచుచుండుటకన్నను నీచమున్నె?
తరి మాతౄణము దీర్పలేని జనుడెంతన్ గొప్పవాడైన ది
గర్వణాలంకృత కీర్తివల్లరులతో వర్ధిల్లువాడైన, మం
దర ధీరుండును మేరువంత బలియైనన్ గూడ నేమయ్యె, త
న్నర జన్మమ్మును జన్మమా! మరియు పుత్రత్వమ్ము పుత్రత్వమా?
వాడు మనపైకి నిటు వచ్చినాడనంగ
వాని యాశల నూహల పద్ధతులును
ఎన్ని విధములుగా ప్రసరించునో, అ
దేమో చెప్పుటకును నైన నెవని తరము!
నీ జనతాభి రక్షణము నీయది, దానికి నేరవేని, నే
నే జయశాలినై పరుని నిర్జితు చేయుదు, ఇంక నీవు నీ
వాజుల తోలుచుండు మొకపాటిగ నైనను, కాని భీతితో
భూజనమున్ శుగంబుధుని ముంచగ జూడకుమోయి ఉత్తరా!
* * * *





