Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



    అజామీళునకు మరణకాలము సమీపించినది. అపుడు సహితము అతని మనసు ఉంపుడుకత్తె చివరి పుత్రునిమీదనే ఉండినది. వానిపేరు నారాయణుడు.
    భయంకరమగు ముగ్గురు యమకింకరులు అజామీళునకు కనిపించారు. చేతలలో యమపాశములుండి వికృతాకారములు గల ఆ యమభటులను చూచి అదరిపోయినాడు. చనిపోవుచున్నానని గ్రహించినాడు అజామీళుడు. చిన్నకొడుకు కళ్ళలో మసిలినాడు. వాడు దగ్గరలేడు. దూరముగా ఆడుకొనుటకు వెళ్ళినాడు. ఉచ్ఛస్వరమున "నారాయణా! నారాయణా!" అని కేకవేసినాడు.
    నశమ్య మ్రియమాణస్య ముఖతో హరికీర్తనమ్
    భర్తుర్నామ మహారాజ పార్ష దాస్స హసాపతన్
    మరణ సమయమున హరికీర్తనము చేసినందున వెంటనే విష్ణుదూతలు అచట ప్రత్యక్షమైనారు.
    అజామీళుని దేహము నుండి సూక్ష్మదేహమును యమదూతలు లాగుకొని పోవుటకు ప్రయత్నించుచుండగా విష్ణు దూతలు అడ్డుపడినారు.
    యమదూతలు తేజోవంతులైన విష్ణుదూతలను చూచినారు. వారి నేత్రములు తామర రేకులవలె ఉన్నవి. వారు పీతాంబరములు ధరించినారు. తలలపై రత్న ఖచితములైన కిరీటములున్నవి. చెవులకు తళతళ మెరయు కుండలములున్నవి. మెడలలో తామర పూవుల దండలున్నవి. నాలుగు చేతులందు శంఖ, చక్రాద్యాయుధములున్నవి.
    వారిని చూచి వెనుకంజ వేసినారు యమదూతలు. వికృతాకారులగు ఆ యమదూతలు తేజోవంతులగు విష్ణుదూతలను చూచి, "స్వాములూ! మీరెవరు? ఎవరి దూతలు? యమధర్మరాజు భటులమైన మేము మా ధర్మము నిర్వర్తించుచుండగా ఏల అడ్డుతగులుచున్నారు".
    విష్ణుదూతలు మేఘ గంభీరస్వరమున పెద్దగా నవ్వి, "మీరు యమధర్మరాజు దూతలా? ఎవరిని, ఏల దండించవలెనో చెప్పగలరా?" అని అడిగినారు.
    యమదూతలు వారి కిట్లనిరి.
    "వేదము చెప్పినది ధర్మము. వేదమునకు వ్యతిరేకమైనది అధర్మము. వేదము స్వయం ప్రకాశకమైనది. నారాయణాత్మకమైనది. శారీరకముగను, మానసికముగను చేయు పనులన్నింటికి సూర్య చంద్రాదులు, అగ్ని, దిశలు, వాయువు, ఇంద్రియములు, సంధ్యలు, రాత్రింబవళ్ళు, ఆకాశము, నీరు, భూమి, కాలము, ధర్మము సాక్షులు. వీనివలన అధర్మము తెలిసిపోయి దండనార్హుల నిర్ణయము జరుగును. పాపము చేసినవారెల్లరు తమతమ కర్మముల ననుసరించి దండనార్హులగుదురు.
    మనుష్యులు పుణ్యకర్మలు, పాపకర్మలు చేయుదురు. వారిని కర్మగుణముల సంబంధము వదలదు. "దేహవాన్నహ్య కర్మకృత్" దేహము ధరించినవాడు కర్మ చేయక ఉండలేడు. ఈ లోకమున చేసిన కర్మమునకు పుణ్యమును, అధర్మమునకు పాపమును అనుభవింతురు. సత్వరజస్తమో గుణముల భేదము వలన ఈ లోకమున పుణ్యాత్ములు, పాపాత్ములు ఏర్పడుచున్నారు. సత్వ గుణ ప్రధానులైనవారు సుఖమును అనుభవించు చున్నారు. వారు పుణ్యాత్ములు. రజోగుణ ప్రధానులైనవారు సుఖ దుఃఖములను అనుభవించు చున్నారు. వారు పుణ్యపాపాత్ములు, తామన గుణ ప్రధానులు దుఃఖముచే అనుభవించు చున్నారు. వారు కేవలము పాపాత్ములు. అదేవిధముగా ఈ జన్మము నందలి పాపపుణ్యములను బట్టియే పరజన్మ మందలి పాపపుణ్యములు తెలియును.
    మా యమధర్మరాజు సర్వజ్ఞుడు. అతడు అందరి మనములందును ఉండును. అతడు అందరి పాపపుణ్యముల పరికించగలడు. ఈ అజామీళుడు ఉంపుడుకత్తె వెంటబడి ధర్మచ్యుతుడై అధర్మకార్యములు చేసినందున ఇతనిని యమలోకమునకు కొనిపోవుటకు వచ్చినాము. మీరు మమ్మేల అడుగుచున్నారు?"
    అందుకు విష్ణుదూతలు యమదూతలతో నిట్లనిరి.
    "యమదూతలారా! మేము విష్ణుదేవుని దూతలము. ప్రజా రక్షకుడు, సమదర్శి శాసకుడు అయిన ప్రజాపతి విషమముగా ప్రవర్తించినచో ప్రజలు ఎవరిని శరణు వేడవలెను?
    యద్యదాచరతి శ్రేయో నితరస్తత్త దీహతే
    స యత్ర్పమాణంకురుతే లోకస్త దనువర్తతే
    ఉత్తములు నడుచుకున్నట్లు సాధారణులు నడుచుకొందురు. వారు దేనిని ప్రమాణము చేసిన లోకులు దానిని అనుసరింతురు. సాధారణులు ధర్మాధర్మతత్వము తెలియక ఉత్తములనే నమ్ముకొందురు.
    నెమ్మిదొడలమీద నిద్రించు చెలికాని నమ్మదగినవాడు నయము విడిచి
    ద్రోహబుద్ధిచంప దొడరునే యెందైన బ్రీతిలేక ధర్మదూతలారా!
    ఈ అజామీళుడు భగవంతుని కళ్యాణ ప్రదమైన నామము గొంతెత్తి 'నారాయణ!' అని పలికినాడు.
    "ఏతేనై వహ్యాఘకో - స్య కృతం స్యాదఘనిష్కృతమ్
    యదా నారాయణాయేతి జగదా చతురక్షరమ్'
    దానితో కోటి జన్మల పాపమునుండి ఇతడు నిష్కృతుడైనాడు. 'నారాయణ' అను నాలుగు అక్షరములు ఉచ్చరించిన ఉత్తర క్షణముననే ఇతని పాపములు పటాపంచలైనవి.
    బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని కీలలు హరినామ కీర్తనలు
    గురుతల్ప కల్మష క్రూరసర్వములకు గేకులు హరినామ సంకీర్తనములు
    తపనీయ చౌర్యౌఘ తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు
    మధుపాన కిల్బిష మదనాగ సమితికి గేసరుల్ హరినామ కీర్తనములు
    మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల నలరు బ్రహ్మాది సురులకు నందరాని
    భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య ఖేల నంబులు హరినామ కీర్తనములు.
    అజామీళుడు మరణ సమయమున భగవానుని నామము ఉచ్చరించినాడు. కాబట్టి తన పాపము లన్నింటికి పూర్తిగా ప్రాయశ్చిత్తము చేసుకున్నవాడైనాడు. మీరు అతనిని తీసుకొని వెళ్ళుటకు వీలులేదు. బిడ్డ పేరు పెట్టి పిలిచినను, పరిహాసమున కైనను, ప్రాసకోసరమైనను, హేళనకైనను, భగవంతుని పేరు పలికిన పాపములన్నియు పటాపంచలగునని పండితులందురు.
    
        'కూలిన చోట గొట్టువడి కుందిన చోట మహాజ్వరాదులం
        బ్రేలిన చోట సర్పముఖ పీడలనందినచోట నార్తులై
        తూలినచోట విష్ణు భవదూరుని బేర్కొనరేని మీద న
        క్కాలుని యాతనా వితతిగానరు పూనరు దుఃఖఖారముల్'

    మహర్షులు పెద్ద పాపములకు పెద్ద ప్రాయశ్చిత్తములు, చిన్న పాపములకు చిన్న ప్రాయశ్చిత్తములు నిర్ణయించినారు. తపస్సు వలనను, జపములవలనను, దానముల వలనను పాపములు హరించుననుమాట వాస్తవమే కాని పాపముల వలన మలినమైన హృదయము పరిశుద్ధమగునా? భగవంతుని పాదసేవ వలననే చిత్తము పరిశుద్ధమగును.
    తెలియక భగవంతుని నామము ఉచ్ఛరించిన పాపములు ఎట్లు నశించునందురేమో! తెలియక ఒకడు శక్తివంతమగు మందు తినినప్పుడు దాని గుణము పూర్తిగా పొందునా పొందడా? అట్లే తెలియకున్నను భగవన్నామమును ఉచ్ఛరించిన దాని ఫలితము తప్పక కలుగును.
    విష్ణుదూతలు అట్లు యమదూతలతో వాదించి అజామీళుని యమకింకరుల బారి నుండి రక్షించినారు. యమకింకరుల బారినుండి బయటపడినందునను, శుభావహము, శాంతి ప్రదమునైన విష్ణుదూతల దర్శనము వలనను అజామీళుని భయము తగ్గినది. అతడు స్థిరచిత్తుడైనాడు.
    విష్ణుదూతలు అంతర్దానులైనారు.
    విష్ణుదూతలనోట భాగవత ధర్మమును విన్న అజామీళుని హృదయమున భక్తి భావము తలెత్తినది. తన పాపములు కన్నుల ముందు తాండవమాడినవి. వాటిని తలచుకొని అతడు గాఢమగు పశ్చాత్తాపము నందినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.