Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
నూట తొంబదవ సూక్తము
ఋషి - అగస్త్యుడు, దేవత - బృహస్పతి, ఛందస్సు - త్రిష్టుప్.
1. బృహస్పతి అభీష్టప్రదాయకుడు. మధుజిహ్వుడు. స్తుతియోగ్యుడు. హోతా ! అర్చన సామగ్రితో మంత్రములతో బృహస్పతిని వర్థిల్లచేయుము. అతడు స్తోతలను వదులుకొనడు. దీప్తిమంతుడు, స్తోతవ్యుడు బృహస్పతికి దేవగణములును, మనుష్యుగణములును స్తోత్రగానములు వినిపింతురు.
2. వర్షృతు సంబంధ స్తుతులు సృజనకర్తయగు బృహస్పతిని చేరును. అవి దేవతలను ఆరాధించువారికి ఫలితములు ప్రసాదించును. అవి సకల విశ్వములందు వ్యక్తములు అగును. అవి స్వర్గమునందలి "మాతురిశ్వ" వలె వలసిన ఫలితములు కలిగించి యజ్ఞము కొఱకు సంభవించినవి.
3. సూర్య కిరణములు కాంతి ప్రసరించు కార్యమును నిర్వర్తించును. అట్లే బృహస్పతి యజమాని సమర్పించు స్తుతి, అన్నము, దానము, మంత్రములను స్వీకరించు కార్యము నిర్వర్తించును. బృహస్పతి శక్తి రాక్షస శూన్యము, శత్రుశూన్యము అయినది. అతని శక్తి పగలు సూర్యునివలెను, భయంకర జంతువువలెను శక్తిశాలి. సర్వత్ర భ్రమించును.
4. బృహస్పతి కీర్తి భూలోక, ద్యులోకములందు వ్యాపించి ఉన్నది. బృహస్పతి సూర్యునివంటి తేజోవంతుడు. అతడు పవిత్రములగు హవిస్సులను గ్రహించును. వేటగాని ఆయుధమే బృహస్పతి ఆయుధము. అది నిత్యము మాయావులను వెంబడించును.
5. బృహస్పతీ ! నీవు కళ్యాణకరుడవు. అయినను పాపిష్టివారు నిన్ను ముసలి ఎద్దుగా భావింతురు. వారికి నీవు వరములు ఇవ్వరాదు. సోమ యజ్ఞము చేసిన వారిని నీవు అవశ్యము కరుణించవలెను.
6. బృహస్పతీ ! సుఖవంతులు, అన్నవంతులు, విశిష్టులు అయిన యజమానులకును, దుష్టులను వధించు రాజులకును నీవు బంధువవు. మమ్ము నిందించువారు సురక్షితులు అయినను వారిని రక్షారహితులను చేయుము.
7. నరులు రాజును చేరినట్లు, నదులు సముద్రుని చేరినట్లు సకలస్తుతులు బృహస్పతిని చేరును. బృహస్పతి విద్వాంసుడు. ఆకాశమున సంచరించు పక్షివలె అతడు నదిని చూడగలడు. తటిని చూడగలడు.
8. బృహస్పతి మహా మహుడు. బలవంతుడు. అభీష్ట ప్రదాయకుడు. దీప్తిమంతుడు. అతడు బహు జనులకు ఉపకరించుటకు అవతరించినాడు. మేము బృహస్పతిని స్తుతించుచున్నాము. అతడు మమ్ము వీరులను విశిష్టులను చేయవలెను. అందువలన మాకు అన్నము, బలము, దీర్ఘాయువు కలుగును.
నూటతొంబది ఒకటవ సూక్తము
ఋషి-అగస్త్యుడు, దేవత-అప్-తృణ-సూర్యులు ఛందస్సు, 1-9, 14-16 అనుష్టుప్,
10,12, మహాపంక్తి, 13 మహాబృహతి.
1. అల్పవిషవంతములు, మహావిషవంతములు, జలములందలి అల్పవిషవంతములు, మహావిషవంతములు, జలచరములు, స్థలచరములు, దహించునవి, అదృశ్య ప్రాణులు నన్ను విషవలయమున చుట్టుముట్టినవి.
2. ఔషధము సేవించినవాడు అదృశ్య విషధర ప్రాణులను వినష్టపరచును. ఆవర్తన కాలము సహితము వానిని వినష్టపరచును. వినాశకాలము వినష్టపరచును. రాచినపుడు రాతికింద వినష్టపరచును.
3. శర, కుశర, దర్భ, సైర్య, ముంజ అను తృణ విశేషములందు ఉన్న విషము నన్ను చుట్టుముట్టినది.
4. గోవులు కొట్టమున ఉన్నప్పుడు, జింకలు స్వస్థానములందు విశ్రమించునప్పుడు, మనుష్యులు నిద్రించుచున్నప్పుడు విషధరములు నన్నుచుట్టుముట్టినవి.
5. దొంగలనువలె వాటిని అన్నింటి రాత్రులందు చూడవచ్చును. అవి అదృశ్యములు. అయినను సకల రోకములను చూచును. అందువలన మానవులు అప్రమత్తులయి ఉండవలెను.
6. స్వర్గము తండ్రి, భూమి తల్లి, సోమము సోదరుడు, అదితి సోదరి అగుదురు. అదృశ్యులు, సమదర్శనులు అగు మీరు మీమీ స్థానములందు సుఖముగా సంచరించుడు.
7. భుజములందు, అంగములందు, కొండ్లయందు విషము ఉన్నవి అతి విషవంతములు. అదృశ్య విషవంతములకు ఇక్కడ ఏమి పని? మీరందరు మాకు దూరముగా వెళ్లిపొండు.
8. సూర్యుడు తూర్పున ఉదయించును. అతడు లోకములను అన్నింటిని చూచును. అదృశ్య విషధరములను వినాశము చేయును. అతడు అదృశ్య రాక్షసాదులను సహితము అంతము చేయును.
9. సూర్యుడు బహుసంఖ్యాకములగు విషములను వినాశము చేయును. ఆదిత్యుడు సర్వదర్శి. అదృశ్యనాశకుడు. ప్రాణులకు శుభములు కూర్చుటకు ఉదయించుచున్నాడు.
10. సుర చేయువాడు చర్మసురా పాత్రనువలె నేను విషమును సూర్యమండలమున విసరినాను. పూజనీయుడగు సూర్యుడు ప్రాణములు వదలడు. అట్లే మేమును ప్రాణములు వదలము. అశ్వచాలకుడగు సూర్యుడు దూరస్థ విషమును విరిచివేయును. మధువిద్య విషమును అమృతముగా మార్చును.
11. క్షుద్ర శకుంతక పక్షి నీ విషము మింగినది. కక్కినది. ప్రాణములు విడువలేదు. అట్లే మేమును ప్రాణములు విడువము. అశ్వచాలకుడగు సూర్యుడు దూరస్థ విషయమును విరిచివేయును. మధువిద్య విషమును అమృతముగా మార్చును.
12. అగ్ని యొక్క ఏడు నాలుకలు తెలుపు, నలుపు, ఎరుపు రంగులు కలవి. అవి ఇరువది ఒక్క ప్రకారములగు పక్షుల విషపుష్టిని వినాశము చేయును. అవి ప్రాణములు విడువలేదు. అట్లే మేమును ప్రాణములు విడువము. అశ్వచాలకుడగు సూర్యుడు దూరస్థ విషమును విరిచివేయును. మధు విద్య విషమును అమృతముగా మార్చును.
13. విషనాశకములగు తొంబదితొమ్మిది నదుల నామములను కీర్తింతును. అశ్వచాలకుడగు సూర్యుడు దూరస్థ విషమును విరిచివేయును. మధువిద్య విషమును అమృతముగా మార్చును.
14. స్త్రీలు కుండలలో నీళ్లు నింపినట్లు దేహమా ! ఇరువది ఒక్క పక్షులు, ఏడు నదులు నీలోని విషమును దూరము చేయవలెను.
15. దేహమా ! ఈ చిన్న ముంగిస నీలోని విషయమును దూరము చేయవలెను. అది అట్లు చేయకున్న నేను దానిని కర్రతో కొట్టి చంపుదును. నాశరీరమునందలి విషము దూరము కావలెను. దూరదేశమునకు వెళ్లిపోవలెను.
16. పర్వతమునుంచి వచ్చి ముంగిస అన్నది "వృశ్చికమా ! నీ విషము రసశూన్యము" వృశ్చికమా ! నీ విషము ప్రభావ శూన్యము.
(ఈ సూక్తమున విషమును హరించు మధువిద్య లేక విషవిద్య వివరించబడినది. వైద్య విద్యజ్ఞులు దీనిని పరిశీలించవలెను.)
విద్వాంసుడు, బహుభాషావేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటక కర్త, చలనచిత్ర రచయిత, విమర్శకుడు, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త, స్వాతంత్ర్య సమరయోధుడు, వినయవంతుడు, భగవదనుగ్రహ పాత్రుడగు దాశరథి రంగాచార్య రచించిన ఆంధ్రవచన ఋగ్వేద సంహితమున మొదటి మండలము సమాప్తము.
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః





