Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
5. పరస్పర సంసక్తములు, నిత్యయవ్వనులు, సమానసీమా సంయుక్తులు, భగినీభూతులు, బంధు శదృశులు ద్యావాపృథ్వులు. ప్రాణులకు నాభిస్థానమువంటి ఉదకమును వారు ధరింతురు. "ద్యావా రక్షితం పృథివీ నో అభ్వాత్"
6. నేను దేవతలను ప్రసన్నము చేయు సంకల్పించినాను. అందుకుగాను విశాల నివాసవంతములు మహానుభావములు సస్యాదిసముత్పాదకములు అగు ద్యావాపృథ్వులను యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాను. అవి విచిత్ర రూపములు, జలధరములు. "ద్యావారక్షితం పృథివీ నో అభ్వాత్"
7. మహంతములు, విశాలములు, నానారూపులు, విశిష్టములు, అనంతములు ద్యావాపృథ్వులు. నేను వారిని యజ్ఞస్థలమున సమంత్రకముగా నమస్కరింతును. స్తుతింతును. వారు జగములను వహించవలెను. "ద్యావారక్షితం పృథివీ నో అభ్వాత్"
8. మేము దేవతల విషయమున సదా అపరాధములు చేయుచుందుము. బంధువులు, జామాత విషయమున సహితము అనేక అపరాధములు చేయుచుందుము. ఈ యజ్ఞము మమ్ము అట్టి అపరాధములనుండి రక్షించవలెను. "ద్యావారక్షితం పృథివీ నో అభ్వాత్"
9. ద్యావాపృథ్వులు స్తుతి యోగ్యులు. మానవులకు హితకరులు. వారు నాకు ఆశ్రయము కల్పించవలెను. అందుకు వారు నాతో కలిసి ఉండవలెను. దేవతలారా ! మేము మిమ్ము స్తుతించుచున్నాము. మేము మీకు అన్నము సమర్పింతుము. మిమ్ము తృప్తులను చేతుము. మీనుండి భూరిదానము భూరి అన్నము ఆశింతుము.
10. నేనుకవిని. ద్యావాపృథ్వులకు నలుదిశల ప్రకాశము కలుగునట్టి అత్యుత్తమ స్తోత్రమును రచించినాను. ద్యావా పృథ్వులు మాతాపితరులు. వారు మమ్ము నీచపాపములనుండి రక్షించవలెను. వారు సర్వదా మా వెంట ఉండవలెను. మాకు తృప్తి కలిగించు పదార్థములను ప్రసాదించవలెను. పాలించవలెను.
11. మాతాపితరులారా ! ఈ యజ్ఞమున మీ కొఱకు నేను స్తుతులు చదివినాను. మీరు వానిని సార్థకము చేయవలెను.
ద్యావాపృథ్వులారా ! మాకు ఆశ్రయము ప్రసాదించుడు. స్తోతలకు సమీప వర్తులు కండు. అందువలన మాకు అన్నము, బలము, దీర్ఘాయువు కలుగును.
నూట ఎనుబది ఆరవ సూక్తము
ఋషి - అగస్త్యుడు, దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్నిని, సవితను స్తుతించుచున్నాము. వారు మా స్తుతుల వలన భూస్థిత దేవతల సహితులయి యజ్ఞ భూమికి విచ్చేయవలెను. మా యజ్ఞమునకు యువత యథేచ్చగా రావలెను. వారు సమస్త జగములవలె మమ్ము కూడ ప్రసన్నులను చేయవలెను.
2. శత్రుదమనుడగు మిత్రుడు, వరుణుడు, అర్యమ అందరు మా విషయమున సమాన ప్రేమ కలిగి ఉండవలెను. వారు విచ్చేయవలెను. వారు మమ్ము సంవర్ధకులను చేయవలెను. మా శత్రువులను పరాజితులను చేయవలెను. మమ్ము అన్నహీనులము కాకుండ చేయవలెను.
3. దేవతలారా ! మీకు శ్రేష్ఠ అతిథి అగ్ని అగును. నేను శీఘ్రతముడను, మీవలె ప్రీతీ కరుడను అయి అగ్నిని మంత్రయుక్తముగా స్తుతింతును. కీర్తిమంతుడు, విద్వాంసుడు అగు వరుణుడు మా వాడు. వరుణుడు శత్రువులను హుంకరించును. అన్నములు ప్రసాదించును. మమ్ము పరిపూర్ణులను చేయును.
4. దేవతలారా ! మేము రాత్రింబవళ్ళు మీకు నమస్కరింతుము. మా పాపములను జయించుటకు పాడి ఆవు వలె మీ వద్దకు వత్తుము. ఋతువులను అనుసరించి భూమిలో పండిన ఖాద్య పదార్థముల మిశ్రమమును మీ కొఱకు తెచ్చినాము.
5. అంతరిక్ష సంచారి "అహిర్బుధ్నుడు" మాకు సుఖములు ప్రసాదించవలెను. మేము జలముల పౌత్రుడు అగ్నిని నుతింతుము. మనోవేగముగల మేఘము అతనిని తీసికొనిపోవును.
6. త్వష్ట మాముందునకు విచ్చేయవలెను. యజ్ఞమున స్తోతల సహితుడయి త్వష్ట సమానప్రీతిని ప్రదర్శించవలెను. విరాట్ స్వరూపుడు. వృత్ర హంతకుడు. అభీష్ట ప్రదాత, ఇంద్రుడు మా యజ్ఞభూమికి విచ్చేయవలెను.
7. ఆవు తన దూడను నాకిన రీతి అశ్వతుల్యములయిన మా మనములు తరుణవయస్కుడు అగు ఇంద్రుని ఉపాసించును. స్త్రీ పురుషుని చేరి సంతానవతి అగును. అట్లే మా స్తోత్రములు ఇంద్రుని చేరి ఫలములు ప్రసాదించును.
8. మరుద్గణములు అతి బలవంతులు. ప్రీతివంతులు. 'పృషత్' నామక అశ్వవంతులు. అవనత స్వభావులు, శత్రుభక్షకులు. మైత్రీపూర్ణులయిన ఋషులవలె ద్యావాపృథ్వులతో కలిసి మరుత్తులు ఈ యజ్ఞమునకు విచ్చేయవలెను.
9. మరుత్తుల మహిమ ప్రసిద్ధము. వారు స్తుతి యోగ్యత తెలిసినవారు. వెలుగులు జగములను వ్యాపించినట్లు మరుత్తుల వర్షసేన మరుభూములకు వ్యాపించి ఉత్పాదక శక్తి ప్రసాదించును.
10. ఋత్విక్కులారా ! మా రక్షణ కొఱకు అశ్వినులను, పూషను స్తుతించుడు. ద్వేష రహితుడగు విష్ణువును, వాయువును, ఇంద్రుని, బలవంతులగు అన్యదేవతలను స్తుతించుడు. సుఖము కొఱకు నేను సమస్త దేవతలను ముందుకు తెచ్చెదను.
11. పూజనీయులగు దేవతలారా ! ప్రభావశాలియగు మీ జ్యోతి మాకు ప్రాణదాత, ఆవాసదాత కావలెను. అన్నవంతమగు మా జ్యోతి దేవతలను ప్రకాశవంతులను చేయవలెను. మాకు అన్నము, బలము, దేర్ఘాయువు కలుగవలెను.
నూట ఎనుబది ఏడవ సూక్తము
ఋషి - అగస్త్యుడు, దేవత - అన్నము,
ఛందస్సు 1 అనుష్టు భోష్ణిక్, 2,4,8,10 గాయత్రి 3,5,7 అనుష్టుప్ 11 బృహతి.
1. నేను శీఘ్రముగ విశాలము, జీవధారకము, బలాత్మకము అగు అన్నరూప పితరుని స్తుతింతును. అన్న శక్తివలననే ఇంద్రుడు వృత్రుని సంధులు విరిచి వానిని వధించినాడు.
2. ఓ స్వాదు పితా ! ఓ మధుర పితా ! మేము నిన్ను సేవింతుము. నీవు మమ్ము రక్షింపుము.
3. తండ్రీ ! నీవు మంగళమయుడవు. కళ్యాణకారివి. మాకు ఆశ్రయము ప్రసాదించుము. మా వద్దకు రమ్ము. మాకు సుఖములను ఇమ్ము. నీ రుచి మాకు అప్రియము కాకుండవలెను. నీవు మాకు మిత్రుడవు అగుము. అద్వితీయ సుఖకరుడవు అగుము.
4. పితా ! వాయువు అంతరిక్షమున వ్యాపించి ఉన్నది. అట్లే నీయొక్క రసము సర్వజగముల వ్యాపించి ఉన్నది.
5. స్వాదుతమ పితా ! నిన్ను ప్రార్థించువారు భోక్తలు. మీ కృపవల్లనే వారు నీకు దానములు ఇత్తురు. నీయొక్క రసమును ఆస్వాదించువాడు మెడవంచడు. బలవంతుడు అగును.
6. పితా ! మహా మహా దేవతలు సహితము మనములందు నిన్నే ప్రతిష్ఠించుకొన్నారు. నీ బుద్ధికుశలత ఆశ్రయదాయిత్వమువలననే "అహి"ని వధించుట జరిగినది.
7. మధురపితా ! మేఘములు ప్రసిద్ధ జలములు తెచ్చినప్పుడు మాకు భోజనము అగుటకు మావద్దకు విచ్చేయుము.
8. మేము మా ఇష్ట ప్రకారము జలము, యవలు మున్నగు ఓషధులు సేవింతుము. అందువలన దేహమా ! బలిష్ఠము అగుము.
9. సోమమా ! యవాదులు, దుగ్దాదుల మిశ్రమమును మేము సేవింతుము. అందువలన దేహమా ! నీవు బలిష్ఠము అగుము.
10. ఓ కరభమా ! నీవు బలసంపాదకవు. రోగ నివారకమవు. ఇంద్రియ దీపకమవు. దేహమా ! నీవు బలిష్ఠము అగుము.
(కరభము అనగా పెరుగు కలిపిన పేలపు పిండి)
11. తండ్రీ ! నిన్ను స్తుతింతుము. గోవునుండి హవ్యము గ్రహించినట్లు నీనుండి రసము గ్రహింతుము. ఈ రసము దేవతలను మాత్రమే కాదు మమ్ము సహితము తృప్తిపరచును.
నూట ఎనుబది ఎనిమిదవ సోక్తము
ఋషి - అగస్త్యుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్నీ ! నీవు దీప్తవంతుడవు. సమస్త జ్ఞాన సంపన్నుడవు. మమ్ము సన్మార్గమున ధనమువైపు నడిపింపుము. కుటిల పాపములను మాదరికి చేరనీయకుము. నీకు మరల మరల నమస్కరింతుము.
2. అగ్నీ ! నీవు నిత్యనూతనుడవు. మేము నిన్ను స్తుతించుచున్నాము. మమ్ము దుర్గమ పాపములనుండి విముక్తము చేయుము. మా భూమి ప్రశస్తము కావలెను. మా నగరము మరింత ప్రశస్తము కావలెను. నీవు మా పుత్రులకు సంతానములకు సుఖములు ప్రసాదించుము.
3. అగ్నీ ! రోగములను అన్నింటిని మా నుండి దూరము చేయుము. అగ్ని హోత్రము చేయని వారిని మాకు ద్రోహము తలపెట్టిన వారిని దూరము చేయుము. నీవు అమరులగు దేవతలు అందరితో యజ్ఞమునకు విచ్చేయుము. మాకు శుభప్రద ఫలములను ప్రసాదించుము.
4. అగ్నీ ! నీవు నిరంతరము మాకు ఆశ్రయము కల్పింపుము. యజ్ఞగృహము మాకు ప్రియమయినది. నలుదిశల దానిని ప్రదీప్తము చేయుము. నిత్యయవ్వనుడగు అగ్నిని నేను స్తుతింతును. నాకు ఇప్పుడుగాని ఎప్పుడుగాని భయము కలుగకుండవలెను.
5. అగ్నీ ! మమ్ము భక్తునకు హింసకునకు శుభనాశకునకు, శత్రువునకు ఒప్పగించకుము. కోరలుండి కాటువేయు పాములకు ఒప్పగించకుము. దంతములులేని కొమ్ములుగల జంతువులకు ఒప్పగించకుము. హింసకులు రాక్షసాదులకు ఒప్పగించకుము.
6. అగ్నీ ! నీవు యజ్ఞ ఉత్పాదకుడవు. వరణీయుడవు. దేహపుష్టి కొఱకు నిన్ను ఆరాధించు జనులు నిన్నుపొందుదురు. అట్టివారు దుష్టుల, హింసకుల బారినుండి బయటపడుదురు. కుటిల వర్తనులను, దుష్టులను నీవు ధ్వంసము చేయుము.
7. పూజనీయుడవగు అగ్నీ ! యజ్ఞము చేయువారు ఉన్నారు. యజ్ఞము చేయనివారు ఉన్నారు. వారిలో యజ్ఞము చేయువారిని నీవు కోరుకొనుము. పవిత్రాభిలాషగల యజమానికి ఋత్విక్కులు బోధనలు చేతురు. నీవు సహితము - సమయమును బట్టి యజమానికి శిక్షణ ఇమ్ము.
8. మంత్రపుత్రుడు, శత్రునాశకుడు అగు అగ్ని కొఱకు ఈ స్తోత్రములు అన్నియు రచించబడినవి. ఈ అతీంద్రియ ప్రకాశములగు మంత్రముల ద్వారా వేలకొలది ధనములు పొందుదుము. మాకు అన్నము, బలము, దీర్ఘాయువు ప్రసాదించుము.





