Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    2. అశ్వినులారా ! మీరు అవశ్యము ఇంద్రునివంటి శ్రేష్ఠులు. మరుత్తులవంటి శ్రేష్ఠులు. స్తుతి యోగ్యులు. శత్రునాశకులు. సత్కర్ములు. రథవంతులు. రథికులలో శ్రేష్ఠులు. మేఘపూర్ణులు. మీరు నలుదిశల మీ ప్రసన్న రథమును నడిపింతురు. అదే రథముమీద దయతో హవ్యదాత వద్దకు చేరుడు.

    3. అశ్వినులారా ! మీరు ఇచట ఎందుకు ఉన్నారు? ఏమి చేయుచున్నారు? హవ్యహీనుడు ఆదరణీయుడు అయినచో అతనిని పడగొట్టుడు. పణిలేక అయాజ్ఞికుని ప్రాణములు నాశము చేయుడు. నేను మేధావిని. మిమ్ము స్తుతించదలచినాను. నాకు జ్యోతిని ప్రసాదించుడు. "జ్యోతిర్విప్రాయ కృణుతం"

    4. అశ్వినులారా ! కుక్కలవలె పాడుకూతలు మొరుగుచు మమ్ము నాశనము చేయుటకు వచ్చువారిని నశింపచేయుడు. వారిని హతమార్చు ఉపాయము మీకు తెలియును. మిమ్ము స్తుతించువారి విశిష్ట వృత్తాంతమును రత్నవతిని చేయుడు. మీరు ఉభయులు నా స్తుతిని రక్షింపుడు.

    5. అశ్వినులారా ! తుగ్రమహారాజు పుత్రుని కొఱకు మీరు సముద్ర జలములందు ప్రసిద్ధము, దృడము, పక్ష విశిష్టము అయిన నౌకను చేసినారు. దేవతలందరిలో అతనిని అనుగ్రహించినారు. నౌకతో అతనిని బయటకు తీసినారు. మీరు అనాయాసముగా సముద్రమున పడినవారిని ఉద్ధరించినారు.

    6. తుగ్రపుత్రుడు బోర్లపడవేయబడినాడు. అతడు ఆధార రహితుడయి, అంధకారమున అనేక బాధలు పడినాడు. అశ్వినుల ప్రేరణతో జలమున చేరిన నాలుగు నౌకలు అతనికి అందినవి.

    7. తుగ్రపుత్రుడు అందరిని అర్థించుచు జలమధ్యమున నిశ్చల వృక్షమును పట్టుకున్నాడు. ఆ వృక్షము ఏది? అశ్వినులారా ! మీరు అతనిని సురక్షితముగా దరికి చేర్చినారు. గొప్ప కీర్తిని ఆర్జించినారు.

    8. నరాకారులగు అశ్వినులారా ! మీ భక్తులు మీ కొఱకు రచించిన స్తోత్రములను స్వీకరించుడు. నేటి యజ్ఞపు సోమయాగ సంపాదన స్తోత్రమున వ్రతము పూనుము. అందువలన మాకు అన్నము, బలము, ధనము కలుగును.

    ఆలోచనామృతము

    1. ఆలోచనకు అవధులు లేవు. "గగనం గగనాకారం, సాగరస్సాగరోపమః" అంటాడు వాల్మీకి. ఆకాశాన్ని సముద్రాన్ని వర్ణించుటకు ఉపమానమలు లేవు. అందువలన ఆకాశము ఆకాశమువలె సముద్రము సముద్రమువలె ఉన్నవి అన్నాడు ఆదికవి వాల్మీకి.

    అట్లే ఆలోచనమునకు ఆద్యంతములు లేవు. ఎల్లలు లేవు. ఆలోచనకు అస్తి-నాస్తి సహితము లేదు. ఆలోచన ఉన్నదానిని గురించి మాత్రమేకాదు లేని దానిని గురించి కూడ వచ్చును. భూతము, అభూతము ఆలోచన సంతానములే !

    ఆలోచనమే మానవుని నాగరకుని చేసినది. సభ్యత కలవానిని చేసినది. విజ్ఞానవంతుని చేసినది. ఉన్నతుని చేసినది. "అహం బ్రహ్మాస్మి" నేనే బ్రహ్మను అనునట్లు చేసినది.

    ఆలోచనమే మానవుని దానవుని, క్రూరుని, నరహంతకుని, మానవనాశకుని చేసినది. కావున సదాలోచనము మాత్రమే మానవుని దైవాంశకు చేర్చగలదు. అందుకే నాది ఆలోచనామృతము!

    ఏది సదాలోచన? దీనికి నిర్వచనము లేదు. నిర్వచనములు అనేకములకు లేవు. ఏలనన జీవితము స్థిరమైన కాదు. ప్రవాహము వంటిది. నిలకడలేని దానికి నిర్వచనము అసాధ్యము. "ఏకం సద్విప్రాబహుధావదన్తి " ఇది వేదవాక్కు. ఒకే సత్యమును మేధావులు బహువిధములుగా చెప్పుదురు అని అర్థము. అసత్యము ఏది? మానవజాతి పుట్టినదాదిగా ఆ సత్యాన్వేషణమే జరుగుచున్నది. సత్యము తెలిసిన కదా బహుధా చెప్పునది?

    నిర్దిష్టత ప్రకృతికి లేదు. కాబట్టి ప్రాకృతములయిన ఏ పదార్థమునకు లేదు. భగవానునకు తప్ప సృష్టిలో పరిపూర్ణత దేనికిని లేవు. సర్వము సాపేక్షమే! నా ఆలోచానము సహితము అటువంటిదే !

`    వేదము అపారము. వేదార్థము బహువిధము. ఇందు అనేక శాస్త్రములు, శాస్త్రార్థములు, విజ్ఞానములు, వికాసములు, నానాశాఖలు ఉన్నవి. ఏ ఒక్కరు దీనిని అర్థము చేసికొనుట అసాధ్యము. అసంభవము. నాకు ఉన్న స్వల్పజ్ఞానముతో ఆలోచనామృతము చేయుచున్నాను. ఇదే వాస్తవమని నేను చెప్పను. చెప్పలేను. ఆలోచనమునకు ఇది ఆలంబనము మాత్రమే !

    2. సత్యమును దర్శించుటకు ఒకే ఈశ్వరుని ప్రతిపాదించుటకు వేదమున నిరంతర ప్రయత్నము సాగుచున్నది.

    లోకము గతానుగతికము. నలిగిన మార్గమున నడుచునది. కొత్తను ఆమోదింపచేయుట ఎంత కష్టమైనను పాతది నిలుచుటలేదు. అయినను సామాజిక శాస్త్రమున, తాత్వికశాస్త్రమున విజయవంతములయిన ప్రయోగములు అరుదు.

    ఈ అధ్యాయ ప్రారంభము నుండి అగస్త్యుడు మరుత్తులను ప్రతిష్ఠించుటకు నిర్విరామ ప్రయత్నము చేసినాడు. మరుత్తులను కాకున్నను మరొకరిని ప్రతిష్ఠించు ప్రయత్నములు ఇంతకుముందు సహితము విదితములు. అగస్త్యుడు తనదారిన నిలువలేక పోయినాడు. లోకమార్గమును అనుసరించవలసి వచ్చినది. శంకర భగవత్పాదులు సహితము ఆచరణమున అద్వైతమును అవలంబించలేక పోయినారు.

    లోకపు పోకడ విచిత్రము ! మహాత్ములను లోకము అనుసరించునా? లోకమును మహాత్ములు అనుసరింతురా?

    3. ప్రకృతి నిలుచుటకు జలము, జలమునకు వర్షము ఆధారము. ఇది వేదము వెల్లడించిన పరమ సత్యము. పరమ సత్యమే శాశ్వత సత్యమగును. ఈ సత్యమును "విప్రా బహుధా వదంతి." వర్షము కలుగుట లేక కలిగించుటను గురించి విభిన్న వాదములు మతములు ఉన్నవి. అందువలన వర్షమును గురించి వేదమునందలి వాదములను మతములను రీతులను ఆధునిక విజ్ఞానవేత్తలు నిశితముగా పరిశీలించవలసిన అవసరము అత్యవసరముగ ఉన్నది. ఏలనన ఆధునికమనబడు రాక్షస ఉత్పత్తి విధానము భూగోళమును జలరహితము చేయుటకు ఉరుకులు పెట్టుచున్నది !

    4. రతిని దేవతను చేసి మానవ జీవితమున రతి ఆవశ్యకత అవసరమును గురించి చెప్పినాడు. రతికి చాటు అవసరము. కాని రతి రహస్యముకాదు. రతి భార్యా భర్తల మధ్యనే జరుగవలెను అనునది విధి. ఒక ఆరోగ్యవంతమగు సమాజమునకు రతి విషయపు కట్టుబాట్లు తప్పనిసరి.

    5. అగస్త్యుడు కుటుంబ జీవనము సాగించుచునే తపమాచరించినాడు. ఇది అగస్త్యుడు ప్రవేశ పెట్టిన నూతన విధానమువలె కనిపించుచున్నది.

    6. "ఊర్ధ్వానః సన్తుకోమ్యావనాన్యాహాని విశ్వమరుతో జిగీష". జీవించినంతకాలము మంచిగా జీవించవలెననుట ఎంతటి ఉదాత్త ఉన్నత ఆలోచన ! సంకల్పము !! ఇది 171వ సూత్రమున మూడవ సూత్రము.

                          నూట ఎనుబది మూడవ సూక్తము
            ఋషి - అగస్త్యుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అశ్వినులారా ! మీ రథము మనసును మించిన వేగము గలది. అది త్రిబంధుకరము. త్రిచక్రము. బంగారము, వెండి, రాగి విశిష్ట సమ్మిశ్రణము గలది. అభీష్ట ప్రదాత్రి. ఆ రథమును సిద్ధము చేయుడు. పక్షులు రెక్కల బలమున ఎగిరినట్లు మీరు ఆ రథమున సుకృతములు చేయువాని ఇంటికి చేరుదురు.

    2. అశ్వినులారా ! మీరు సంకల్పవంతులయి హవ్యములు అందుకొనుటకు మీ దివ్యరథమును ఎక్కినపుడు అది మిమ్ము దేవ యజన స్థానమునకు చేర్చును. మీకు హితకరములయిన స్తుతులు మిమ్ము కలుసుకొనగలవు. మీరు ద్యులోకపుత్రి ఉషను కలుసుకొనుడు.

    3. అశ్వినులారా ! హవిస్సులు అందించు యజమానికర్మయే లక్ష్యముగా సాగునదియు, మీరు యజ్ఞశాల చేరుటకు సంకల్పించునదియు, అత్యంత సంచారశీలమగు రథమున ఎక్కి యజమాని పుత్రుని వద్దకు అతనికి మేలు కలిగించు యజ్ఞ గృహమునకు విచ్చేయుడు.

    4. అశ్వినులారా ! మీ కృప వలన అడవి తోడేళ్ళు నన్ను వెన్నాడరాదు. మీరు నాకు తప్ప ఇతరులకు దానము చేయవలదు.

    అశ్వినులారా ! ఇదియే మీ హవ్యభాగము. ఇదియే మీ స్తుతి. ఇదియే మీ సోమము నిండిన పాత్ర.

    5. అశ్వినులారా ! దారి తెలుపుటకు మార్గదర్శిని పిలిచినట్లు గౌతముడు, పురుమీఢుడు, అత్రి మీకు హవ్యములు ఇచ్చి తృప్తిపరచుటకు ఆహ్వానించినారు. నా ఆహ్వానమును మన్నింపుడు. నావద్దకు విచ్చేయుడు.

    6. అశ్వినులారా ! మీ అనుగ్రహమున మేము అంధకారమును దాటగలము. ఈ స్తుతి మీ కొఱకు కూర్చబడినది. దేవతల గమ్యమగు యజ్ఞమునకు విచ్చేయుడు. అందువలన మాకు అన్నము, బలము, దీర్ఘాయువు లభించును.

    (శ్రీ మదాంధ్ర వచన ఋగ్వేద సంహిత రెండవ అష్టకము మొదటి మండలము నందలి
            నాలుగవ అధ్యాయము సమాప్తము.)

    అయిదవ అధ్యాయము             నూట ఎనుబది నాలుగవ సూక్తము

          ఋషి - అగస్త్యుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అశ్వినులారా ! అంధకారమును అంతమొందించు ఉష అవతరించినపుడు మేము మిమ్ము నేటి యజ్ఞమునకును, రేపటి యజ్ఞమునకును ఆహ్వానింతుము. మీరు అసత్యరహితులు. ద్యులోకనేతలు. మీరు ఎక్కడ ఉన్నను స్తోతలు దానశీలుడగు యజమాని కొఱకు ఋగ్వేదమంత్రములతో మిమ్ము స్తుతింతురు.

    2. అభీష్టప్రదాతలగు అశ్వినులారా ! మీరు స్తుతి అపేక్షకులు. సంచయ కర్తలు, మీరు సోమపానము చేయుడు. బలవంతులు కండు. పణ్యులను దస్యులను సమూలముగ నాశము చేయుడు. మిమ్ము సంతుష్టులను చేయుటకు మిమ్ము ఆహ్వానించుటకు మేము స్తుతులు చదువుచున్నాము.

    3. అశ్వినులారా ! మీరు సూర్యచంద్రరూపులు. శరవేగమునసాగుడు. కళ్యాణ ప్రాప్తి కొఱకు సూర్యుని పుత్రికను గ్రహించుడు. పూర్వయుగమువలె మహావరుణుని ప్రసన్నుని చేయుటకు ఏర్పడిన ఈ స్తుతి మిమ్ము స్తుతించును.

    4. అశ్వినులారా ! మీరు మధుపాత్రగలవారు. మీరు మాన్యుడు అగు అగస్త్యుని స్తుతి స్వీకరించుడు. మీదానములు మాకు మాత్రము పరిమితము కావలెను. అన్నము, బలము కోరు యజమాని సహితముగా పురోహితుడు సహితము మీ అంత సంతోషించవలెను.

    5. అశ్వినులారా ! మీరు అన్నవంతులు. మీ కొఱకు హవ్యముతోపాటు పాపవినాశకమగు స్తోత్రము రచించబడినది. మీరు అగస్త్యుని విషయమున సంతుష్టులు కండు. యజమానికి పుత్రులు మున్నగు సుఖములు ప్రసాదించుటకు యజ్ఞభూమికి విచ్చేయుడు.

    6. అశ్వినులారా ! మీ అనుగ్రహమున మేము అంధకారమును దాటగలము. ఈ స్తుతి మీ కొఱకు కూర్చబడినది. దేవతల గమ్యమగు యజ్ఞమునకు విచ్చేయుడు. అందువలన మాకు అన్నము, బలము, దీర్ఘాయువు లభించును.

                          నూట ఎనుబది అయిదవ సూక్తము
          ఋషి - అగస్త్యుడు, దేవత - ద్యావాపృథ్వులు, ఛందస్సు - త్రిష్టుప్.

    "కతరాపూర్వా కతరా పరాయోః కథాజాతే కవయః కో వివేద"

    1. విద్వాంసులారా ! ద్యావాపృథ్వులలో ముందు ఎవరు పుట్టినారు? తదుపరి ఎవరు పుట్టినారు? ఈ విషయము ఎవరికి తెలియును? అవి ఒకదానిమీద వేరొకటి ఆధారపడి ఉన్నవి. కలిసి జగములను ధరించుచున్నవి. రాత్రింబవళ్ల చక్రమును తిప్పుచున్నవి.

    2. ద్యావాపృథ్వులు పాద రహితములు. ఆచలములు. ప్రాణులు పాదయుక్తములు సచలములు. ద్యావాపృథ్వులు తలిదండ్రులవలె ప్రాణులను వడిలోపెట్టుకొని కాపాడుచున్నవి. ఈ ద్వావాపృథ్వులు మనలను మహాపాపములనుండి కాపాడవలెను. "ద్యావా రక్షితం పృథివీ నో అభ్వాత్"

    3. పాపరహితము, అక్షయము, హింసారహితము, అన్నయుక్తము, స్వర్గతుల్యము అగు ధనము కొఱకు అదితిని ప్రార్థించుచున్నాము. తమను పూజించు యజమానికొఱకు ద్యావాపృథ్వులు అట్టి ధనమునే సృష్టించవలెను. (ద్యావా రక్షితం పృథివీ నో అభ్వాత్"

    4. మాకు ప్రకాశమానము అగు దివారాత్రుల ఉభయ ధనములు కావలెను. అందుకు దుఃఖరహితములు, అన్నము ద్వారా తృప్తి కలిగించు ద్యావాపృథ్వులను ప్రార్థింతుము. "ద్యావా రక్షితం పృథివీ నో అభ్వాత్"




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.