Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
4. ఇంద్రా ! సోమము అభిషవించని వారు, దుస్సాధ్యులు నిన్ను సుఖించనీయరు. వారిని వధించుము. వారి ధనమును మాకు ప్రసాదించుము. నిన్ను స్తుతించిన వానికే ధనము లభించును.
5. స్తోత్రములు-హవిస్సులు అను ద్వివిధ కర్మలను యజమాని నిర్వర్తించుచున్నాడు. సోమమా ! నీవు అతని మంత్రములందు సదా నిలిచి ఉండుము. వానిని రక్షింపుము. సోమమా ! ఇంద్రుని యుద్ధములందు అన్నము కొఱకు అన్నవంతుడగు ఇంద్రుని రక్షింపుము.
6. ఇంద్రా ! నీవు పురాతన స్తోత్రకారులకు దప్పిగొన్న వానికి నీటి చందమవు అయినావు. అందువలన మేము నిన్ను మరల మరల స్తుతించుచున్నాము. మాకు అన్నము, ఆయువు, బలము కలుగవలెను.
నూట డెబ్బది ఏడవ సూక్తము
ఋషి - అగస్త్యుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రుడు మానవులకు ప్రీతిదాయకుడు. అభీష్టప్రదాయకుడు. అందరిచే ఆహ్వానించబడువాడు. మా వద్దకు రావలెను. ఇంద్రా ! నీవు మా స్తుతులను గ్రహించుము. తరుణ వయస్కులగు అశ్వినులను నీ రథముమీద చేర్చి విచ్చేయుము. మా హవిస్సులు స్వీకరించుము. మమ్ము రక్షింపుము.
2. ఇంద్రా ! నీ అశ్వములు తరుణములు. ఉత్తమములు. మంత్రములతో రథమునకు పూన్చబడినవి. రథయుక్తములు. నీవు రథము మీద అశ్వయుక్తుడవయి విచ్చేయుము.
3. ఇంద్రా ! నీ రథము అభీష్ట వర్థకము. నీవు దానిని అధిరోహింపుము. మనోరథపూర్ణమగు సోమము, మధురమగు ఘృతము సిద్ధముగా ఉన్నవి. అభీష్టప్రదాతలగు హర్యశ్వములగు రథమున పూన్చి వేగముగా మా ముందుకు విచ్చేయుము. యజమానులపై కృపారసము కురిపింపుము.
4. ఇంద్రా ! ఈ యజ్ఞము దేవతల కొఱకు నిర్వహించబడుచున్నది. ఈ యజ్ఞ పశువు, ఈ సోమము, ఈ కుశాసనము నీ కొఱకు ఏర్పరచబడినవి. త్వరగా విచ్చేయుము. ఆసీనుడవగుము. యజ్ఞ స్థలమున హర్యశ్వములను విడువుము. సోమపానము చేయుము.
5. ఇంద్రా ! మా దివ్య స్తోత్రములను గ్రహింపుము. స్తోత్ర పాఠకుల మంత్రములను స్వీకరింపుము. మా ముందుకు విచ్చేయుము. మాకు నీ ఆశ్రయమును, వాసస్థానమును, అన్నమును, బలమును ఆయువును ప్రసాదించుము.
నూట డెబ్బది ఎనిమిదవ సూక్తము
ఋషి - అగస్త్యుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రా ! స్తోతలను రక్షించునట్టి నీ సమృద్ధి సర్వత్ర ప్రసిద్ధము కావలెను. మమ్ము గొప్పవారిని చేయవలెనను నీ అభిలాషను వర్జించకుము. నీకు అందుబాటులో ఉన్న భోగ్య పదార్థములు మాకు కూడ లభించవలెను.
2. అక్క చెల్లెండ్ల వంటి రాత్రింబవళ్ళు తమ జన్మస్థానమున జరుపు వృష్టికార్యము మా కార్యములకు భంగము కాకుండునట్లు ఇంద్రుడు చూడవలెను. ఇంద్రునకు బలకారణములగు హవ్యములు వ్యాప్తములు అగును. ఇంద్రుడు మాకు అన్నమును, స్నేహమును ప్రసాదించవలెను.
3. ఇంద్రుడు పరాక్రమశాలి. మరుత్తులు యుద్ధనేతలు. ఇంద్రుడు మరుత్తులతో కలిసి విజయార్థము యుద్ధమునకు సాగునపుడు అనుగ్రహార్థులగు స్తోతల ఆహ్వానములను ఆలకింతురు. స్వయముగా స్తుతివాక్యములను వినగోరినపుడు ఇంద్రుడు తన రథము మీద యజమాని వద్దకు వచ్చును.
4. ఉత్తమ ధన లాభము కొఱకు యజమాని సమర్పించు అన్నమును ఇంద్రుడు స్వీకరించును. అది ప్రకట రూపమున యజమాని శత్రువులను పరాజితులను చేయును. సత్యపాలకుడగు ఇంద్రుడు విభిన్న ఆహ్వానధ్వనియుక్త యుద్ధమున యజమాని కర్మను కీర్తించి హవ్యము స్వీకరించును.
5. ఇంద్రా ! నీ సాయమున తమను అవధ్యులు అనుకొను శత్రువులను వధింతుము. నీవు మా సోదరుడవు. మాకు వర్థమానమగు ధనమును, అన్నమును, బలమును, దీర్ఘాయువు ప్రసాదించుము.
నూటడెబ్బది తొమ్మిదవ సూక్తము
5-6 బ్రహ్మచారి, దేవత - రతి, ఛందస్సు 1-4, 6 త్రిష్టుప్, 5 బృహతి.
1. లోపాముద్ర అనుచున్నది :-
అగస్త్యా ! అనేక సంవత్సరాలనుండి రాత్రింబవళ్ళు జరాకారకమగు ఉషస్సులందు నిన్ను సేవించినాను. అలసినాను. ముదిమి శారీరక సౌందర్యమును నష్టపరచును. అప్పుడు పురుషుడు స్త్రీవద్దకు ఏల చేరవలెను?
2. అగస్త్యా ! ప్రాచీనులు, సత్యపాలకులు అగు ఋషులు దేవతలతో సంభాషించినారు. వారికి కూడ రేతస్ఖలనము జరిగినది. వారికి సహితము అంతుపట్టలేదు, పురుషుడు స్త్రీవద్దకు ఏల చేరవలెను?
3. అగస్త్యుడు అనుచున్నాడు :-
మనము వట్టిగా అలసిపోలేదు. దేవతలు మనలను రక్షించుచున్నారు. మనము సర్వభోగములను అనుభవించవచ్చును. మనము ఇద్దరము కోరినచో ఇహ లోకములందలి వందల కొలది భోగములను సాధించగలము. అనుభవించగలము.
4. నేను జయము, సంయమము కోరి ఉన్నాను. అయినను ఏ కారణముననో ఏదో కారణమున నాకు కామవాంఛ కలిగినది. లోపాముద్ర పతితో సంగమించవలెను. అధీరయగు నారి బలవానుడగు పురుషునకు ఉపభోగ్యము కావలెను.
5. శిష్యుడు అనుచున్నాడు :-
మనసుతో త్రావిన సోమమును హృదయ పూర్వకముగా ప్రార్థించుచున్నాను. సోమము నాకు సుఖమును ప్రసాదించవలెను. లీపులు కామోహి మర్త్యః మానవుడు అనేక కోరికలవాడు.
(సోమమునకు చంద్రపరమగు అర్థము ఉన్నది)
6. అగస్త్యుడు మహిమాన్వితుడు అగు ఋషి. అతడు అనేక ఉషస్సులను ఉపాసించినాడు. అతడు బలము కోరినాడు. పుత్రులను కోరినాడు. తపమాచరించినాడు. కాలము అనుభవించినాడు. ఉభయములను పాలించినాడు. అగస్త్యుడు దేవతలనుండి వాస్తవ ఆశీస్సులు అందుకున్నాడు.
నూట ఎనుబదవ సూక్తము - ఋషి - అగస్త్యుడు,
దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. అశ్వినులారా ! శుభగమనములుగల మీ అశ్వములు మిమ్ము కోరిన స్థలమునకు చేర్చినపుడు మీ బంగారు రథపు ఇరుసు అభీష్ట ప్రదాత అగును. కావున ఉషః కాలమున సోమపానము చేయుచు యజ్ఞమునకు విచ్చేయుడు.
2. స్తుతి యోగ్యులగు అశ్వినులారా ! మీ సోదరి ఉష ప్రకటమయినపుడు, అన్నము, బలము కొఱకు యజమాని మిమ్ము స్తుతించినప్పుడు, మీ యొక్క నిరంతర గమనము కలది, విచిత్ర గతులది, మానవుల హితము కోరునది, విశిష్ట రూపముగలది, పూజనీయ మగునది అగు రథము నిమ్నాభిముఖము అగును.
3. అశ్వినులారా ! మీరు గోవులందు దుగ్ధములు స్థాపించినారు. మీరు ఆవులకు అధోభాగమున పరిపక్వమగు పాలను ప్రవేశపెట్టినారు. వనవృక్షములందు దాగిన దొంగవలె అప్రమత్తుడు, విశుద్ధ స్వభావుడు అగు యజమాని హవిమంతమగు యజ్ఞమున మిమ్ము స్తుతించుచున్నాడు.
4. అశ్వినులారా ! అత్రిమహర్షి మీ సహాయము అర్థించినాడు. మీరు అతని కొఱకు పాలు - నేతి ఏరులు పారించినారు. నరాకార అశ్వినులారా ! అందువలన మీ కొఱకు అగ్ని సహితమగు యజ్ఞము జరుగుచున్నది. మీ రథ చక్రము నుండి మధుధారలవలె ఈ యజ్ఞమున సోమము మీ కొఱకు ఊరుచున్నది.
5. అశ్వినులారా ! వృద్ధుడగు తుగ్రుని పుత్రునివలె మిమ్ము నేను స్తుతులతో నా అభిమత ప్రాప్తి కొఱకు యజ్ఞ భూమికి తీసికొని వత్తును. మీ మహిమ వల్లనే ద్యావా పృథ్వులు కలిసి ఉన్నవి. వీడు జరాజీర్ణుడగు ఋషి. వీనిని పాప విముక్తుని చేయుడు. దీర్ఘాయువు ప్రసాదించుడు.
6. అశ్వినులారా ! మీరు శుభప్రదాతలు. మీరు నియుత నామక అశ్వములను రథమున పూన్చునపుడు భూతములను అన్నముతో నిండిపోవును. అందువలన వాయువువలె స్తోతలు మిమ్ము తృప్తులను వ్యాప్తులను చేయవలెను. మంచి మనిషివలె యజమానులు తమ ఉనికి కొఱకు అన్నము అడుగుదురు.
7. మేము మీకు స్తోతలము అగుదుము. సత్య ప్రతిజ్ఞులము అగుదుము. విభిన్న స్తుతులతో మిమ్ము కీర్తింతుము. స్తుతిపాత్రులు, అభీష్ట ప్రదాతలయిన అశ్వినులారా ! దేవతల వద్ద సోమపానమును చేయుడు.
8. అశ్వినులారా ! కర్మపరులలో అగస్త్యుడు శ్రేష్ఠుడగు ఋషి. అతడు గ్రీష్మతాప నివారకమగు స్తోత్రమును సాధించ సంకల్పించినాడు. ధ్వనులను పుట్టించు శంఖాదులవలె వేల స్తోత్రములతో మిమ్ము మేల్కొలుపుచున్నాడు.
9. అశ్వినులారా ! మీ రథమహిమతో యజ్ఞము ధరించుడు. యజమానియొక్క హోతవలె రాకపోకలు సాగించుడు. స్తోతలకు బలమును, ఉత్తమ అశ్వములను, ధనములను ప్రసాదించుడు.
10. అశ్వినులారా ! మీ రథము స్తుతిపాత్రము, నవీనము, ఆకాశవిహారి, అభగ్నచక్రి. ఆ రథమును స్తోత్రముల ద్వారా ఆహ్వానించుచున్నాము. అందువలన మాకు అన్నము, బలము, దీర్ఘాయువు లభించును.
నూట ఎనుబది ఒకటవ సూక్తము
ఋషి - అగస్త్యుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. అశ్వినులారా ! మీరు అన్నమును, ధనమును పైకి తీసుకొని వెళ్లుదురా? యజ్ఞము సమాప్తము అగుటకు వానిని జలరూపమున భూమిపై వర్షింతురా? మానవులకు ఆశ్రయ ప్రదాతలయిన అశ్వినులారా ! ఈ యజ్ఞమున మీ ప్రశంస జరుగుచున్నది.
2. అశ్వినులారా ! మీ అశ్వములు దీప్తిమంతములు, వృష్టిమంతములు, వాయువేగవంతములు, మనోవేగవంతములు, తరుణములు, శుభపృష్టములు. అవి మిమ్ము ఈ యజ్ఞమునకు కొనిరావలెను.
3. అశ్వినులారా ! మీ రథము ఉన్నత స్థానార్హము. అశ్వద్వయము గలది. భూమండలమువలె విస్తారమయినది. ఉత్తమ బంధురము. వర్ష సమర్థము. మనోవేగము గలది. అహంకారి. పూజనీయము. ఆ రథమును ఈ యజ్ఞమునకు తెండు.
4. అశ్వినీ ద్వయమా ! మీరు సూర్యచంద్రరూపులయి ప్రభవించినారు. మీరు పాపరహితులు. సుందరులు. మహిమాన్వితులు. ఆ కారణమున మిమ్ము తేపతేప స్తుతించుచున్నాము. మీలో ఒకరు యజ్ఞ ప్రవర్తకులయి లోకమును ధరించి ఉన్నారు. మరొకరు ద్యులోక పుత్రుడయి కిరణములు దాల్చి లోకమును ధరించి ఉన్నారు.
5. అశ్వినులారా ! మీలో ఒకరు స్వర్ణవర్ణ రథమున యథేచ్చగా యజ్ఞమునకు రావలెను. మరొకరి హరినామ అశ్వములను మానవులు సోమమునను, స్తుతులతోను పూజింతురు.
6. అశ్వినులారా ! మీలో ఒకరు మబ్బులను చెదరగొట్టుదురు. ఇంద్రునివలె శత్రువులను సంహరింతురు. హవ్యాభిలాషి అయి అన్నధామం కొఱకు అరుగును. రెండవ వానిని యజమానులు హవ్యములు అర్పించి ప్రసన్నుని చేయుదురు. అతను పంపిన విశాలములు, దరులు దాటి పారు నదులు మావద్దకు వచ్చును.
7. అశ్వినులారా ! మీరు విధాతలు. మీకు స్థిరత్వము కలుగుటకు అత్యంత స్థిరములయిన స్తోత్రములు రచించబడును. అవి మూడు ప్రకారములుగా మిమ్ము చేరును. మీరు ప్రసన్నులుకండు. యాచించు యజమానిని రక్షించుడు. నిలచి అతని స్వాగతమును ఆలకింపుడు.
8. అశ్వినులారా ! మీ యొక్క దీప్తివంతమగు స్తుతి త్రికుశము, యజ్ఞసాధన ద్వారా యజమానులను ప్రసన్నులను చేయవలెను. మీరు మేఘజలమును వర్షించినట్లు మానవులకు సంపదలు ప్రసాదించి ప్రసన్నులను చేయుడు.
9. అశ్వినులారా ! యజమాని పూషవంటి ప్రజ్ఞావంతుడు. హవిష్మంతుడు. అగ్ని, ఉషలనువలె మిమ్ము స్తుతించుచున్నాడు. స్తోత్ర స్తుతించినపుడు యజమాని సహితము స్తుతించును. మాకు, అన్నము, బలము, ఆయువు ప్రసాదించుడు.
నూట ఎనుబది రెండవ సూక్తము
ఋషి - అగస్త్యుడు, దేవత - అశ్వినులు ఛందస్సు 1-5, 7 జగతి, 6, 8 త్రిష్టుప్.
1. ఋత్విక్కులారా ! అశ్వినుల అభీష్టదాయక రథము అరుదెంచినట్లున్నది. మీరు ఎదురేగి నిరీక్షించుడు. అశ్వినులు పుణ్యాత్ముల కార్యములను ఫలప్రదము చేయువారు. స్తుతి యోగ్యులు. విశ్పలకు మేలు చేసినవారు. స్వర్గపు మనుమలు. వారి కార్యములు శుచిమంతములు.





