Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



        మాముపెత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్
        వాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః  15

    అట్టి మహాత్ములు నన్ను చేరుకొనుచున్నారు. తదుపరి అశాశ్వతము దుఃఖభాజనము అయిన పునర్జన్మను పొందకున్నారు.

        అబ్రహ్మభువానా ల్లోకాః పున రావర్తినో -ర్జున
        మాముపేత్య తు కౌంతేయ! పునర్జన్మ న విద్యతే  16

    బ్రహ్మలోకము మొదలు యితర లోకములన్నియు, పునర్జన్మ కలిగించునవియే. అర్జునా! నన్ను చేరినవానికి పునర్జన్మ ఉండదు.
    
        సహస్ర యుగపర్యంతం అహర్వద్ బ్రహ్మణో విదుః
        రాత్రిం యుగసహస్రాంతాం తే -హోరాత్రవిదోజనాః  17

    వేయి యుగములకాలము బ్రహ్మకు ఒక పగలు. ఆ యుగ సహస్రము తర్వాత బ్రహ్మకు రాత్రి అగుచున్నదని విద్వాంసులకు తెలియును.

        అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే
        రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే  18

    బ్రహ్మకు పగలు మొదలవుతుంది. అప్పుడు సృష్టి జరుగుతుంది. రాత్రి మొదలవుతుంది. సృష్టి ముగుస్తుంది.

        భూతగ్రామ స్సఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే
        రాత్ర్యాగమే -వశః పార్థ! ప్రభావ త్యహరాగమే  19

    ఈ భూతజాలము మరల మరల పుట్టుచునే యుండును బ్రహ్మకు రాత్రి కాలము అగును. అప్పుడు అవ్యక్తమున లీనమగును.

        పరస్తస్మాత్తు భావో -న్యః అవ్యకో - వ్యక్తాత్ సనాతనః
        య స్స సర్వేషు భూతేషు పశ్యత్సు న వినశ్యతి  20

    అట్టి అవ్యక్తమును మించినదియు, విలక్షణమైనదియు, సనాతనమైనదియు పరమపదము. సర్వభూతములు నశించును. కాని పరమ పురుషులు నశింపరు.
    
        అవ్యక్తో -క్షార ఇత్యుక్తః తమాహుః పరమాం గతిమ్
        యం ప్రాస్య న నివర్తంతే తద్ధామ పరమం మమ  21

    పరమ పదము అవ్యక్తము అక్షరము అనబడుచున్నది. అట్టి పరమ పదమునకు చేరుటయే గాని మరలుట యుండదు.

        పురుషః న పరః పార్థ! భక్త్యా లభ్య స్త్వనన్యయా
        యస్యాంతః స్థాని భూతాని యేన సర్వమిదం తతమ్  22

    పార్థా! అట్టి పరమ పురుషుడు పరమ భక్తి అననస్యత్వములకే లభించువాడు.

        యత్రకాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః
        ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ!  23

    మరణించినవాడు ఏ కాలమున ఆవృత్తిని అనావృత్తిని చెందుతున్నారో! అర్జునా! అటువంటి కాలమును చెప్పుచున్నాను.

        అగ్నిర్జ్యోతి రహ శ్శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్
        తత్ర ప్రయాతా గచ్చన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః  24

    సూర్యుని జ్యోతి పగలు శుక్లపక్షము. ఉత్తరాయణము ఆరునెలలు ప్రయాణము చేసిన బ్రహ్మ బ్రహ్మవిదులగు జనులు అచటికి చేరుచున్నారు.

        ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్
        తత్ర చాంద్రమసం జ్యోతిః యోగీ ప్రాప్య నివర్తతే  25

    ధూమము, రాత్రి, కృష్ణపక్షము, దక్షణాయనము ఆరునెలలు. అచ్చటికి చంద్రుని జ్యోతికలయోగులు చేరుదురు. తిరిగి భూమికి వత్తురు.

        శుక్ల కృష్ణే గతీ హ్యేతే జగత శ్శాశ్వతే మతే
        ఏకయా యాత్యనా వృత్తిం అన్యయా -వర్తతే పునః  26
    ఇవి శుక్ల, కృష్ణ మార్గములు. అట్లని జగత్తున వ్యవహారము గలదు. శుక్లపక్షమున పోయినవాడు మరలిరాడు. కృష్ణపక్షమున పోయినవారు తిరిగి వత్తురు.
    
        నైతే సృతీ పార్థ! జానన్ యోగీ ముహ్యతి కశ్చన
        తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున!  27

    అర్జునా! యీ రెండు మార్గములు తెలిసినవాడు యోగి అగుచున్నాడు. చలించకున్నాడు. కాబట్టి సర్వకాలములందును అర్జునా! యోగయుక్తుడవగుము.

        వేదేషు యజ్ఞేషు తపస్సుచైవ
        దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్
        అత్యేతి తత్పర్వ మిదం విదిత్వా
        యోగీ పరం స్థానముపైతి చాద్యమ్  28

    వేదముల నెరుగుట, యజ్ఞములు చేయుట, కర్మల నాచరించుట, దానము చేయుటకు పుణ్యఫలము చెప్పబడింది. వీనిని తెలియుట వలన ఆది సర్వము కలుగుచున్నది. అట్టి యోగి సాద్యము, పరమైన స్థానమును పొందుచున్నాడు.

    దీపిక:

    1. తొలిసారిగా యీ అధ్యాయమున ఫలశృతి చెప్పినాడు. ఫలశృతి అనగా ఒకదానిని తెలియుట వలన కలుగు ఫలితము.
    2. భారత తాత్వికత వేనవేల యేండ్ల పురాతనముది. సనాతనము, దివ్యము, అమృతతుల్యము అగుచున్నది. హారుషులు, రుషులు, సాధువులు, సత్పురుషులు మానవ జాతి కల్యాణము కొరకు నిరంతరము శ్రమించినారు. ప్రయత్నించినారు. తపించినారు. సత్ఫలితాలను కనుగొన్నారు. వాటిని ప్రచారము చేసినారు. నేడు అవి భారతీయుల రక్తమున జీర్ణములై ఆచారములై సంప్రదాయములై శాస్త్రములై ప్రాణములై కావ్యములై విలసిల్లుచున్నవి.
    వీనిలో యీ అధ్యాయమునకు సంబంధించినది పునర్జన్మ లేక జన్మరాహిత్యము. భారతీయునికి పుట్టుకతోనే పునర్జన్మ అలవడుచున్నది. ఏది జరిగినను పూర్వజన్మ సుకృతము లేక దుస్కృతము అనుకొనుచున్నారు. పునర్జన్మ హేతుబద్ధము. ఈ లోకమున దేనికిని మార్పు తప్ప అంతము లేదు. కర్రను కాల్చిన బొగ్గు అగును. బొగ్గును కాల్చిన బూడిద అగును. బూడిద మట్టిలో కలిసిపోవును. ఇది పరిణామక్రమము.
    ఇదే పద్ధతి మానవ జీవితమునకు వర్తించుచున్నది. బాల్యము, యవ్వనము, వార్థక్యము దేహాంతర ప్రాప్తి, పరిణామములు అగుచున్నవి.
    దేహాంతర ప్రాప్తి తర్వాత జరుగు మార్పులను స్వామి యీ అధ్యాయములో వివరించినాడు. ఇవి రెండు విధములు.
    1. పునర్జన్మ 2. పునర్జన్మ రాహిత్యము.
    ఆ రెండు 1. కృష్ణపక్షమున గతించినవారికి పునర్జన్మ లేదు. 2. కృష్ణపక్షము, దక్షిణాయనమున మరణించినవారికి పునర్జన్మ కలదు.
    స్వామిని భజించినవారికి పునర్జన్మ రాహిత్యం. అన్యదేవతలను భజించినవారికి పునర్జన్మలు.
    3. ఈ జన్మలు కద్దనుకొనుట, వద్దనుకొనుట ఎందులకు?
    1. దేహమునకు సంబంధించిన బాధలు వ్యాధులు జరామరణములు దుఃఖము.
    2. రక్త సంబంధులు వారితో ఒకప్పుడు బాధలు, ఒకప్పుడు సుఖములు.
    మానసిక బాధలు. మనిషికి మనిషికి మధ్య ఎక్కువ దుఃఖం కలిగించునవి మానసిక బాధలే. భార్యాభర్తలు పితాపుత్రులు, యీ విధముగా సంబంధీకులతో సంబంధ బాంధవ్యములు వానిలో లోటుపాట్లు.
    ఇవి ప్రతి జన్మలోను ఉండును. కాబట్టి మానవుడు జన్మరాహిత్యమును కోరుకుంటాడు.
    జన్మరాహిత్యమును కోరుకొనువాడు సత్పురుషుడైయుంటాడు. వాడివల్ల లోక కల్యాణము, సమాజ కల్యాణము జరుగుతుంది.
    4. పునర్జన్మ వలన సమాజమునకు శ్రేయస్సు కలుగుచున్నది. అది ఎట్లనిన చెడుపని చేయువాడు రానున్న జన్మలో బాధపడతానని భయపడతాడు.
    మంచిపని చేయువాడు రానున్న జన్మలో సుఖములు కలుగునని మరిన్ని మంచి పనులు చేస్తాడు. ఆ విధముగా సమాజములో నేర ప్రవృత్తి తగ్గుతుంది.
    అక్షర బ్రహ్మయోగమను ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.

                                 ఓం శాంతిః శాంతిః శాంతిః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.