Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    2. మరుత్తులారా ! ఈ స్తోత్రమున అన్నము ఉన్నది. దీనిని మీ కొఱకుగాను దేవతలు తమ మనసులందు కల్పించినారు. దీనిని మీ మనసులందు దాల్చుడు. దీనిని సాదరముగ స్వీకరించుడు. విచ్చేయుడు. మీరు అన్నరూపమగు హవ్య వర్థకులు.

    3. మరుత్తులారా ! మా స్తుతులు వినుడు. మాకు సుఖములు ప్రసాదించుడు. ఇంద్రా ! మా నుతులు వినుము. మాకు సకల సుఖములు ప్రసాదించుము.

    "ఊర్ధ్వానః సన్తు కోభ్యావనాన్యహాని విశ్వామారుతో జిగీషా"

    మరుత్తులారా ! మేము జీవించినంతకాలము దినములన్నియు ఉత్కృష్టములు, స్మరణీయములు, భోగయోగ్యములు కావలెను.

    4. మరుత్తులారా ! ఇంద్రుడు బలవంతుడు. అతనికి భయపడి వడకి పారివచ్చినాము. మీ కొఱకు సిద్ధపరచిన హవ్యాన్నమును ఇంద్రుడు దూరము చేసినాడు. మమ్ము మన్నింపుడు. మాకు సుఖములు ప్రసాదించుడు.

    5. ఇంద్రా ! నీవు బల స్వరూపుడవు. నీ అనుగ్రహమువలననే ఉషస్సు కిరణములు దాల్చి ప్రాణులను చేతనులను చేయుచున్నవి.

    ఇంద్రా !  నీవు అభీష్ట ఫల ప్రదాతవు. ఉగ్రబల ప్రదీపుడవు. సనాతనుడవు. నీవు మరుత్తుల సహితుడవయి అన్నములను ధరింపుము. వహింపుము.

    6. ఇంద్రా ! మరుత్తులు స్వతస్సిద్ధముగా బలవంతులు. వారి విషయమున క్రోధము వహించకుము. వారిని రక్షింపుము. మరుత్తులు ఉత్తమ ప్రజావంతులు. వారితో కూడి శత్రువును నాశనము చేయుము. మమ్ము రక్షింపుము. మాకు అన్నము, బలము, దీర్ఘాయువు ప్రసాదించుము.

                            నూట డెబ్బది రెండవ సూక్తము
            ఋషి - అగస్త్యుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు - గాయత్రి

    1. మరుత్తులారా ! మీ ఆగమనము ఆశ్చర్యకరము కావలెను. మీరు దానశీలురు. ఉత్కృష్టులు. దీప్తిమంతులు. మీరాక మా రక్షణకు కావలెను.

    2. మరుత్తులారా ! మీరు దానశీలురు. దీప్తిమంతులు. ప్రాణులను వధించు మీ అస్త్రములు మాకు దూరముగా ఉండవలెను. మీరు విసరు అశ్మనామక అస్త్రము కూడ మాకు దూరముగా ఉండవలెను.

    3. దాతలగు మరుత్తులారా ! తృణప్రాయులయినను మా ప్రజలను రక్షింపుడు. "ఊర్ధ్వాన్నః కర్త జీవసే" జీవించుటకుగాను మమ్ము ఉన్నతులను చేయుము.

                               నూట డెబ్బది మూడవ సూక్తము
                ఋషి - అగస్త్యుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! ఉద్గాత సామము గానము చేయుచున్నాడు. అతని గానము ఆకాశమున వ్యాపించి నిన్ను చేరుచున్నది. ఈ స్తోత్రము వృద్ధిని కలిగించునది. స్వర్గ ప్రదాత. దీనిని మేము పూజింతుము. స్వర్గవాసివగు ఇంద్రా ! హింస ఎరుగనిది, పాలు ఇచ్చునది అగు గోవు గడ్డిమీద కూర్చున్నపుడు నిన్ను సేవించును. అట్లే మేము నిన్ను పూజింతుము.

    2. హవ్య కర్త అధ్వర్యు-హవ్యదాత యజమాని సహితముగా హవ్యములు అర్పించి ఇంద్రుని పూజింతురు. దప్పిగొన్న మృగమువలె ఇంద్రుడు శీఘ్రముగా యజ్ఞమునకు విచ్చేయగలడు. స్తోత్రాభిలాషులగు దేవతలను స్తుతించుచు హోతలు, స్త్రీ, పురుషులు ఇంద్రుని యజ్ఞము నిర్వహింతురు.

    3. అగ్ని హోమ సంపాదకుడు. అతడు గార్హపత్యాది స్థానములతో నలువైపుల వ్యాపించి ఉన్నాడు. అగ్ని శరత్కాల దిశగా భూమి గర్భమున ఉన్న అన్నమును పరిగ్రహించును. అశ్వమువలెను- వృషభమువలెను శబ్దము చేయుచు ఆకాశము పృథ్వి నడుమ దూత స్వరూపుడయి ముచ్చట పెట్టును.

    4. మేము ఇంద్రునకు అత్యంత వ్యాపక హవ్యమును సమర్పింతుము. దేవతలను అభిలషించి యజమాని స్తోత్రము చేయును. అశ్వినులవలె జ్ఞాతవ్యుడు రథమున ఉన్నవాడు అగు ఇంద్రుడు మా స్తోత్రమును స్వీకరించవలెను.

    5. ఇంద్రుడు అనంత బలవంతుడు. శౌర్యవంతుడు. దృఢమగు రథమున ఉన్నాడు. యోద్ధలలో శ్రేష్ఠుడు. వజ్రాది ఆయుధములు కలవాడు. మేఘమును చలింపచేయువాడు. హోతలారా ! అట్టి ఇంద్రుని స్తుతించుడు.

    6. ఇంద్రుడు కర్మ నిష్ఠుడు. అతడు యజమానుల స్వర్గాది కోర్కెలు తీర్చుటకు అత్యంత సమర్ధుడు. అతని వ్యాప్తికి ద్యావాపృథ్వులు చాలవు. భూమిని అంతరిక్షము పరివేష్టించి ఉన్నది. అట్లే ఇంద్రుడు తన ప్రతిభతో ముల్లోకములందు పరివ్యాప్తుడయి ఉన్నాడు. వృషభము అనాయాసముగ శృంగములు ధరించినట్లు ఇంద్రుడు స్వర్గమును ధరించి ఉన్నాడు.

    7. ఇంద్రుడు శూరుడు. యుద్ధమునందు సాధువులకు బలప్రదుడు, ఉత్తమ మార్గదర్శకుడు. మరుద్గణములు నిన్ను స్వామిగా భావించి హర్షింతురు. వారు నీకు పరిజనులు. నీ ఆనందమును అందరు ఆనందింతురు. నిన్ను అలంకరించుటకు ప్రయత్నింతురు.

    8. అంతరిక్షమున ఉన్న జలము కాంతివంతము, ప్రజలకొరకగు వృష్టిజలము ఇంద్రునకు సుఖప్రదము కావలెను. సకల స్తోత్రములు ఇంద్రుని ప్రసన్నుని చేయవలెను. ఇంద్రుడు వర్షము కలిగించి స్తోత్ర పాఠకుల కోర్కెలు తీర్చవలెను. అట్లయిన ఇంద్రునకు సంబంధించిన ఈ యజ్ఞము సుఖప్రదము అగును.

    9. ఇంద్ర ప్రభూ ! మేము నీకు మిత్రులము. నిన్ను రాజునువలె స్తుతింతుము. నీవు మా అభీష్టములను నెరవేర్చుము.

    ఇంద్రదేవా ! మా స్తుతి కాలమున విచ్చేయుము. మా యజ్ఞమునందలి స్తోత్రములను పరిగ్రహింపుము.

    10. మానవులందు ప్రతిస్పర్థులను ప్రశంసించి ప్రసన్నులను చేసినట్లు మేము ఇంద్రుని ప్రసన్నుని చేతుము. ఇంద్రుడు కేవలము మాకొరకే అగును. శాసకుడు యోగ్యుడు అయినపుడు అతని అభిమానులు అతనిని ప్రశంసింతురు. అదేవిధముగా అధ్వర్యులు హవ్యములు ఇచ్చి ఇంద్రుని పూజింతురు.

    11. యజ్ఞ పరాయణులు యజ్ఞములుచేసి ఇంద్రుని వర్థిల్లచేతురు. అది వారిని దారిలో ఎదుట ఉన్న నీటివలె ఆనందపరచును. కుటిలురు మనములందు మ్రగ్గి దుఃఖభాజనులు అగుదురు. సుదూరమున కనిపించు జలమువలె వారు తృప్తులుకారు. నిరాశచెందుదురు.

    12. ఇంద్రా ! యుద్ధకాలమున నీవు మరుత్తులను విడువవు. మమ్ము కూడ విడువకుము. ఏలననగా ఇంద్రుడు బలసంపన్నుడు. అతని యజ్ఞభాగము స్వతంత్రము. ఫలసమన్వితమగు మా స్తుతులు హవిష్మంతులు జలదాతలు అయిన మరుత్తులను నమస్కరించును.

    13. ఇంద్రా ! ఈ స్తవము నీది. దీని ద్వారా నీవు మేము చేయు దేవయజనములను ఎరుంగుము. మా వద్దకు సుఖముగా అనాయాసముగా విచ్చేయును.

                                నూట డెబ్బది నాలుగవ సూక్తము
                  ఋషి - అగస్త్యుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! నీవు సమస్తలోకములకు సమస్త దేవతలకు రాజువు. నీవు మానవులను రక్షింపుము. మమ్ము రక్షింపుము. నీవు సాధుజన పాలకుడవు. ధనవంతుడవు. మాకు ఉద్ధారకుడవు. నీవు సత్య సంపదల ప్రదాతవు. నీవు నీ తేజమున అందరి తేజములను హరించినావు.

    2. ఇంద్రా ! నీవు సంవత్సరము పాటు సుదృఢములయిన ఏడు నగరములను విరిచినావు. ఆ క్లిష్ట సమయమున ప్రజలను నీ సంయమ వాక్కులతో ఓదార్చినావు. నీవు ద్రవించు జలమును ప్రసాదించినావు. తరుణ వయస్కుడు పురుకుత్సరాజు కొఱకు వృత్రుని వధించినావు.

    3. ఇంద్రా ! నీవు రాక్షసుల నగరములను జయించుటకు వెళ్లుదువు. అక్కడి నుండి పరిజన సహితుడవయి స్వర్గము చేయుదువు. అక్కడ ఆర్పరాని, విశేష వేగముగల అగ్నిని రక్షింతువు. అందువలన అగ్ని స్వగృహమున కర్తవ్యము నిర్వహించగలడు.

    4. ఇంద్రా ! నీ వజ్రమునకు బెదిరిన శత్రువు నిన్ను ప్రశంసించును. మేఘములు స్వస్థానమున నిలుచును. నీవు అస్త్ర హస్తుడవయి బయల్వెడలుదువు. వర్షము కురిపింతువు. హర్యశ్వములను అధిరోహింతువు. నీ శక్తిచే సస్యములను సమృద్ధము చేతువు.

    5. ఇంద్రా ! యజ్ఞమున నీవు కుత్స్రుషిని గురించి యోచించినపుడు, నీవు నీ వశవర్తులు, వాయువేగవంతులు అయిన నీ గుర్రములను నడిపింతువు. అట్టితరి సూర్యుడు తన రథ చక్రమును దగ్గరకు తేవలెను. వజ్రధారి ఇంద్రుడు శత్రువుల ముందునకు రావలెను. 

    6. ఇంద్రా ! నీవు హరి వాహనుడవు. స్తోత్రములచే వృద్ధి చెందుదువు. దానహీనులు, యజ్ఞ విఘాతులను నాశనము చేతువు. నిన్ను ఆశ్రయ దాతగ గ్రహించినవారిని నీకు హవ్యము ఇచ్చువారిని సంతానవంతులను చేతువు.

    7. ఇంద్రా ! పూజనీయమగు అన్న ప్రాప్తి కొఱకు కవులు నీ స్తుతులు రచింతురు. నీవు పృథ్విని అసురుల దీర్ఘనిద్రా భూమిని చేసినావు. నీవు మూడు భూములను నగరములను దానముచేసి ఆశ్చర్యము కలిగించినావు. దుర్యోణిరాజు కొఱకు 'కుయవాచు'ని వధించినావు.

    8. ఇంద్రా ! నవృషి గణములు నీ సనాతనములయిన వీర కృత్యములను స్తుతించుచున్నవి. యుద్ధ నివారణ కొఱకు నీవు అనేక హింసకులను హతమార్చినావు. నీవు దేవశూన్యములయిన శత్రునగరములను ధ్వంసము చేసినావు. దేవరహిత శత్రువులను పరాజితులను చేసినావు.

    9. ఇంద్రా ! నీవు శత్రువులను గడగడలాడింతువు. నీవు ప్రవహించునట్టి 'సీరా' నామక నదివలె తరంగ యుక్తజమును భూమి మీద వర్షింతువు. నీవు సముద్రమును నింపినపుడు యదు, తుర్వసుల శుభము కోరినావు. వారిని పాలించినావు.

    10. ఇంద్రా ! నీవు ఎల్లవేళల మాకు రక్షక శ్రేష్ఠుడవు అగుము. ప్రజలను పాలింపుము. మా సేనలకు బలమును ప్రసాదించుము. అందువలన మాకు అన్నము, బలము, ఆయువు ప్రాప్తించును.

                             నూట డెబ్బది అయిదవ సూక్తము
                             ఋషి - అగస్త్యుడు, దేవత - ఇంద్రుడు,
                      ఛందస్సు 1 బృహతి, 2-5 అనుష్టుప్, 6 త్రిష్టుప్.

    1. ఇంద్రా ! నీవు హరి వాహనుడవు. హర్షదాయివి. అభీష్టఫలదాతవు. అన్నవంతుడవు. పారమెరుగని దానవంతుడవు. మహానుభావుడవు. సోమమును పాత్రమున ఉంచినట్లు నీవు ప్రవేశించి పానము చేయుము. సోమమును ధరించుము. ప్రసన్నుడవు అగుము.

    2. ఇంద్రా ! నీవు సంతోషప్రదుడవు. అభీష్ట వర్థకుడవు. వరణీయుడవు. సహాయకారివి. శత్రుసైన్య సంహర్తవు. అవినాశమగు ఈ సోమమును స్వీకరింపుము.

    3. ఇంద్రా ! నీవు శూరుడవు. దాతవు. నేను మానవుడను. నా కోరికలు తీర్చుము. అగ్ని తన మంటలతో పాత్రను కాల్చును. అట్లే నీవు నీ ప్రతాపమున వ్రతహీనులగు దస్యులను కాల్చుము.

    4. ఇంద్రా ! నీవు మేధావివి. ఈశ్వరుడవు. నీ సామర్థ్యమున సూర్యుని రెండు రథచక్రములలో ఒకదానిని హరించినావు. 'శుష్ణు' ని వధించుటకు వజ్రము అందుకొని వాయువేగాములగు అశ్వములతో విచ్చేయుము.

    5. ఇంద్రా ! నీ ప్రసన్నత ఎల్లరను మించిన బలము గలది. నీ యజ్ఞము ఎల్లరను మించిన అన్నము గలది. నీవు అనేక అశ్వముల దాతవు. నీకు సంబంధించినది, వృత్రుని వధించునది, ధనమును ఇచ్చునది అగు యజ్ఞమును సమర్ధించుము.

    6. ఇంద్రా ! నీవు పురాతన కారులకు దప్పిగొన్నవానికి నీటి చందమవు అయినావు. అందువలన మేము నిన్ను మరల మరల స్తుతించుచున్నాము. మాకు అన్నము బలము ఆయువు కలుగవలెను. 

                               నూట డెబ్బది ఆరవ సూక్తము
         ఋషి - అగస్త్యుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు 1-5 అనుష్టుప్, 6 త్రిష్టుప్.

    1. సోమమా ! ధనలాభము కొఱకు ఇంద్రుని ప్రసన్నుని చేయుము. అభీష్ట వరదుడగు ఇంద్రుని అంతరంగమున ప్రవేశింపుము. ఇంద్రుడు ప్రసన్నుడయి శత్రువులను నాశము చేయును. క్రమముగా వ్యాపించును. ఎంతటి పగవానినైనను దరిచేరనీయడు.   

    2. ఇంద్రా ! నీవు మానవులకు అధీశ్వరుడవు. వారు తమ ఆహారమగు యవ ధాన్యమునువలె నీ అభీష్టములను నెరవేర్తును.

    (జీవధారకము అగు అన్నమువలె భావింతురు.)

    3. ఇంద్రుని వద్ద 1 మానవులు 2 దేవతలు 3 పితరులు 4 పశువులు 5 పక్షులు-పంచజనుల అన్నము ఉన్నది. మాకు ద్రోహము చేయు వారిని ఇంద్రుడు తన వజ్రాయుధమున హతమార్చును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.