Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    11. మరుద్గణములు మహామహులు, మహిమాన్వితులు, సంపన్నులు. ఆకాశమున నక్షత్రములవలె సుదూరమున ప్రకాశింతురు. వారు ప్రసన్నులు, మధురవాక్కులు, సుందర శబ్దవంతులు, ఇంద్రునకు సహాయకులు, స్తుతియోగ్యులు. వారు మా యజ్ఞస్థలమునకు విచ్చేయవలెను.

    12. మరుత్తులారా ! మీది శుభజన్మలు. మీ మాహాత్మ్యము సర్వవిదితము. అదితి వ్రతమువలే మీరు చేయు దానములు నిరంతరములు. మీరు పుణ్యాత్ముడగు యజమానికి దానము ఇచ్చిన తరువాత ఇంద్రుడు అతని విషయమున కుటిలుడు కాజాలడు.

    13. మరుత్తులారా ! మీ స్నేహము ప్రసిద్ధము, స్థిరము. మీరు అమరులు. అయినను మా స్తుతులను చక్కగా రక్షింతురు. అనుగ్రహము వహించి మానవులతో కలిసి ఉందురు. వారికి నేతృత్వము వహింతురు. కర్మద్వారా సర్వము గ్రహింతురు.

    14. వేగవంతులగు మరుత్తులారా ! మహత్తరమగు మీ ఆగమనము కొఱకు దీర్ఘ కర్మవంతమయిన యజ్ఞమును వర్థిల్ల చేయుదుము. ఆ యజ్ఞము వలన మానవుడు యజ్ఞమున విజయుడు అగును. ఈ యజ్ఞములన్నియు మీ శుభాగమనమునకే నిర్వహించుచున్నాను.

    15. మరుత్తులారా ! ఈ స్తుతి, ఈ స్తోత్రము మాననీయము. హర్షదాయకము. మాన్యుడు విజ్ఞుడు అయిన కవి రచించినాడు. ఇది దేహపుష్ఠి కొఱకు మిమ్ము చేరును. మాకు అన్నము, బలము, దీర్ఘాయువు లభించవలెను.

                               నూట అరువది ఏడవ సూక్తము
          ఋషి - అగస్త్యుడు, దేవత - ఇంద్రుడు, మరుత్తులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! నీవు వేల తీర్లుగా రక్షింపుము. నీ రక్షణలు మాకు చెందవలెను. హర్యశ్వవంతుడవగు ఇంద్రా ! నీ వద్ద వేలకొలది ప్రశంసనీయ అన్నములు ఉన్నవి. అవి మాకు చెందవలెను. నీవద్ద వేనవేల తీరుల సంపదలు ఉన్నవి. మా తృప్తికొఱకు అవి మాకు చెందవలెను. వేలకొలది పశువులు లభించవలెను.

    2. మరుత్తులారా ! మీరు ఆశ్రయ ప్రదాతలు. ప్రశస్తులు. దీప్తిమంతులు. విచ్చేయుడు. మావద్దకు సకల సంపదలతో విచ్చేయుడు. మీ అశ్వములు, నియుత్నామకములు సముద్రమునకు ఆవల సహితము ధనమును వహించును.

    3. సువ్యవస్థితము, జలవర్షకము, సువర్ణవర్ణ విద్యుత్తుయుక్త మేఘమాలవలె లేదా చాటున దాగి ఒదిగిచూచు షత్నివలె యజ్ఞవాణి మరుత్తులను కలియును.

    4. సాధారణ యువతివలె ఆలింగన ప్రియమగు విద్యుత్తు యుక్తమగు జలదము-శుభ్రము వేగవంతము, ఉత్కష్ణము అగు మరుద్గణములందు మిళితములు అగును. భయంకరములు అగు మరుద్గణములు బలపూర్ణములు అయ్యు ద్యావాపృథ్వులను కదిలించవు. దేవతలు మరుత్తుల మైత్రి కారణముగా మరుత్తుల సమృద్దిని సాధన చేయుదురు.

    5. మరుత్తుల పత్ని, విద్యుత్తు, విరిసిన కేశములు, అనురక్త మనముతో భర్తల సంగమము కొఱకు నిరంతరము సేవించును. సూర్యుని పుత్రి సూర్య అశ్వినుల రథము ఎక్కినట్లు వికసించిన అవయవముల చంచల విద్యుత్తు మరుత్తుల రథమును అధిరోహించి విచ్చేయును.

    6. యజ్ఞారంభమున వర్షదానము చేయు మరుత్తులు ప్రాయపు అందకత్తె రోదసిని తమ రథము మీద ఎక్కించుకొందురు. అదే సమయమున అర్చన మంత్రయుక్త హవ్యములు సమర్పించువాడును, సోమాభిషేవకారియునగు యజమాని మరుత్తులకు సేవ చేయుచు స్తోత్రపాఠము చేయును.

    7. మరుత్తుల మహిమ సర్వజన ప్రశంసనీయము. అమోఘము. వారి ప్రియురాలు రోదసి. ఆమె వర్షాభిలాషిణి. అహంకారిణి. అవినాశ్య సౌభాగ్యశాలిని. ఉత్పత్తిశీల. ఆమె ప్రజలను పోషించును. నేను ఆమెను వర్ణింతును.

    8. మిత్రుడు, వరుణుడు, అర్యమ ఈ యజ్ఞమును దోషరహితము చేయుదురు. యజ్ఞమునందలి అయోగ్య వస్తువులను నశింప చేతురు. మరుత్తులారా ! మీరు వర్షించు సమయము వచ్చినపుడు వారు మేఘము మధ్యమునచేరి వర్షము కలిగింతురు. 

    9. మరుత్తులారా ! మాలో ఎవ్వరును దూరము నుండి అయినను మీ బలముల పారమును కనుగొన లేకపోయినారు. మీరు ఇతరులను ఓడించి బలములతో సాగరములవలె ఉప్పొంగి, శత్రువులను పరాజితులను చేతురు.

    10. నేడు మేము ఇంద్రునకు ప్రియతములము అగుదుము. యజ్ఞమున మేము ఇంద్రుని మహిమలు గానము చేతుము. ఇంతకుముందు కూడా ఇంద్రుని మహిమలు గానము చేసినాము. నిత్యము గానము చేతుము. అందువలన ఇంద్రుడు మాకు అనుకూలుడు కావలెను.

    11. మరుత్తులారా ! ఈ స్తుతి మాననీయుడగు మాందర్యుడు మీ కొఱకు రచించినాడు. ఇది తన ఇష్టానుసారము శరీర పుష్టికిగాను మీవద్దకు వచ్చును. మాకు అన్నము, బలము, దీర్ఘాయువు కలుగవలెను.

                              నూట అరువది ఎనిమిదవ సూక్తము
          ఋషి-అగస్త్యుడు, దేవత-మరుత్తులు ఛందస్సు 1-7 జగతి, 8-10 త్రిష్టుప్.

    1. మరుత్తులారా ! మిమ్ము అన్ని యజ్ఞములకు సమానముగా ఆహ్వానింతురు. మీరే మా కర్మలు అన్నింటిని దేవతలకు చేర్చెదరు. మీరే ద్యావా పృథ్వులను రక్షించువారు. అందుకే ఉత్తమ స్తోత్రముల ద్వారా మిమ్ము మావద్దకు ఆహ్వానించుచున్నాము.

    2. మరుత్తులారా ! మీరు స్వయంభువులు. బలములు సర్వము మీ స్వాధీనమున ఉన్నవి. మీరు ఎల్లరను గడగడలాడించగలరు. మీరు అన్న స్వరూపులు. స్వర్గ స్వరూపులు. అసంఖ్యాకములు, ప్రశంసనీయములు అయిన గోవులు జీవనప్రదములయిన దుగ్ధములు ఇచ్చినట్లు మీరు మావద్దకు విచ్చేసి ప్రాణప్రదములగు జలమును ప్రసాదింతురు.

    3. సంస్కరించి, అభిషవించిన సోమము హృదయాంతర్గత అయి పనిచేయును. ధ్యానించినచో మరుత్తులు అట్లే హృదయములందు ప్రవేశింతురు. భుజములను స్త్రీ చుట్టుకున్నట్లు ఆయుధములు వారి భుజములను ఆశ్రయించి ఉండును. మరుత్తుల హస్తములందు కర్తనమను ఆయుధ విశేషము విరాజిల్లుచుండును.

    4. మరుద్గణములు పరస్పరము కలిసి ఉండువారు. అమరులు. పాపములు ఎరుగనివారు. అనేక యజ్ఞములందు వారు ఉద్భవింతురు. ప్రకాశింతురు. వారు పర్వతములను సహితము గడగడలాడించగలరు. మరుత్తులు అనాయాసముగ స్వర్గము నుండి విచ్చేయుదురు. తమ వాక్యములతో ఉత్సాహము కలిగింతురు.

    5. మరుత్తుల భుజములందు ఆయుధ లక్ష్మి అలంకృత అయి ఉన్నది. రెండు దవడల మధ్య నాలుక ప్రచలితమగును. మరుత్తులారా ! మీరు ఎవరి మధ్య ఉండి ప్రచలితులు అగుదురు? వర్షము మేఘము వలన ప్రచలితమయినట్లు మీరు స్వయం పరిచాలితులు. అట్లే ఫలములను ఆశించు యజమాని అన్నప్రాప్తికొఱకు మిమ్ము పరిచలింపచేయును.

    6. మరుత్తులారా ! మీరు జలవర్షము కలిగించుటకు వచ్చెదరు. ఆ జలరాశియొక్క ఆది ఎక్కడ? అంతము ఎక్కడ? మీరు గడ్డి పరకను విరిచినట్లు జలదమును విరుతురు. అప్పుడు వెలుగొందు వజ్రమున మేఘమును విడగొట్టుదురు.

    7. మరుత్తులారా ! మీరు ఎంత ధనవంతులో అంత దానవంతులు. దానము చేయుటలో ఇంద్రుడు మీకు సహాయకుడు. అతనిలో సుఖము ఉన్నది. కాంతి ఉన్నది. అతని ఫలము పరిపక్వము. అతని కృషి మంగళప్రదము. దాతకు దక్షిణవలె అతడు శీఘ్రఫలప్రదాత. అతడు జయములను కలిగించు శక్తి.

    8. వజ్రము మేఘ సంభూత శబ్దమును కలిగించినపుడు మేఘములందలి జలము విచలితము అగును. మరుత్తులు భూమిని జలముతో తడిపినప్పుడు విద్యుత్తు నిమ్నముఖ అయి పృథ్వి మీద దర్శనము ఇచ్చును.

    9. పృశ్నియను వాడు మహా సంగ్రామమునకుగాను దీప్తవంతులు, వేగవంతులు, అయిన మరుత్తులను కలిగించినాడు. సమానరూపులయిన మరుత్తులు జలమును సృష్టించినారు. ఆ తరువాతనే జగములకు అన్నము, ఆహారము లభించినది.

    10. మరుత్తులారా ! మాన్యుడు, కవి మాందర్యుడు ఈ స్తుతిని మీ కొఱకు రచించినాడు. శరీర పుష్టికొఱకు ఇది మిమ్ము చేరును. మాకు అన్నము, బలము, దీర్ఘాయువు కలుగవలెను.

                              నూట అరువది తొమ్మిదవ సూక్తము
         ఋషి - అగస్త్యుడు, దేవత - ఇంద్రుడు ఛందస్సు - 1, 3-8 త్రిష్టుప్, 2 జగతి.

    1. ఇంద్రా ! నీవు మహామహులయిన మరుత్తులను విడువవు. అందువలన నీవు మహా మహిమాన్వితుడవు. నీవు మరుత్తులకు విధాతవు. నీవు మాపై దయతలచుము. మాకు ప్రియతమమగు సుఖమును ప్రసాదించుము.

    2. ఇంద్రా ! సర్వమానవులకు ప్రియులు, మానవులకు జలప్రదాతలు, విద్వాంసులు మరుత్తులు నీవెంట ఉన్నారు. మరుద్గణముల సేన సుఖములు ప్రసాదించుటకు కలిగిన సంగ్రామమున సర్వదా విజయములు సాధించినది.

    3. ఇంద్రా ! నీ వజ్రాయుధము ప్రసిద్ధము. అది మా కొఱకు మేఘమును చేరును. మరుత్తులు వర్షము కురిపింతురు. యజ్ఞమునందు అగ్ని ప్రదీప్తము అగును. జలములు కాంతిని ధరించినట్లు అగ్ని హవిస్సులను ధరించును.

    4. ఇంద్రా ! మేము నీకు రక్షణలు ఇత్తుము. నిన్ను ప్రసన్నుని చేతుము. నీవు దాతవు. నీవద్ద దానయోగ్యమగు ధనము ఉన్నది. దానిని దానము చేయుము. నీవు శీఘ్రఫలప్రదాతవు. స్తోత్రము చేయువారు నిన్ను స్తుతించదలచినారు. మధురదుగ్ధముల కొఱకు స్త్రీ స్తనములను పరిపుష్టము చేసినట్లు మాకు అన్నము ప్రసాదించుటకుగాను నీకు పుష్టిని కలిగింతుము.

    5. ఇంద్రా ! నీ వద్ద ఉన్న ధనము సుఖప్రదము, యజమాని యజ్ఞనిర్వాహకము అగును. ముందుగానే యజ్ఞములకు బయలుదేరుటకు సిద్ధులగు మరుత్తులు మాకు సుఖములు ప్రసాదించవలెను.

    6. ఇంద్రా ! నీవు జలప్రదాతవు. పురుషార్థియు విశాలము అగు మేఘము చెంతకు చేరుము. యుద్ధభూమిలో శత్రువుల పరాక్రమమువంటి మరుత్తుల అశ్వగణము మేఘముమీద దాడి చేయును.

    7. ఇంద్రా ! కృష్ణ వర్ణులు, భయంకరులు, గమనశీలురు అగు మరుత్తులు వచ్చు సవ్వడి వినిపించుచున్నది. పరాక్రమవంతుడయిన శత్రువును నాశనము చేసినట్లు మానవుల రక్షణకొఱకు మరుద్గణముల సేనావాహిని కదలును.

    8. ఇంద్రా ౧ నీవే సమస్త ప్రాణులను సృష్టించినావు. మరుద్గణ సహితుడవయి మీ ప్రతిష్ఠకుగాను దుఃఖనాశకము, జలధారకము అగు మేఘములను ప్రకంపింప చేసినావు. దేవగణములు నిన్ను నుతించును. మాకు అన్నము బలము, దీర్ఘాయువు ప్రసాదించుము.

                                         నూట డెబ్బదవ సూక్తము
                                    ఋషి - అగస్త్యుడు, దేవత - ఇంద్రుడు
                              ఛందస్సు -1బృహతి, 2-4 అనుష్టుప్, 5 త్రిష్టుప్.

    1. ఇంద్రుడు అనుచున్నాడు :-
   
    నేడు ఉన్నది లేనిది ఎరుగము. రేపటి సంగతి ఎవడు ఎరుగును? మనుష్యుల చిత్తములు అత్యంత చంచలములు. బాగా చదివినది కూడా మరిచిపోవుదురు. లీఆధీతం వినశ్యతి.

    2. అగస్త్యుడు అనుచున్నాడు :-

    ఇంద్రా ! నీవు నన్ను చంపవలెను అనుకొనుచున్నావా ? మరుద్గణములు నీ సోదరులు. వారితో కలిసి యజ్ఞభాగము అనుభవింపుము. యుద్ధకాలమున మమ్ము హింసింపకుము.   

    3. ఇంద్రుడు అనుచున్నాడు :-

    సోదరా ! అగస్త్యా ! నీవు నాకు మిత్రుడవు. అట్లయి ఏల అనాదరింతువు? నీ మనసులోని మాట నేను ఎట్లు గ్రహించగలను? నీవు ఏల ప్రకటింపవు?

    4. ఋత్విక్కులారా ! వేదికను అలంకరించుడు. అగ్రమున అగ్నిని ప్రజ్వరిల్ల చేయుడు. తదనంతరము మనము అమృత సూచక యజ్ఞము చేయుదము.

    5. అగస్త్యుడు అనుచున్నాడు :-

    ఓ ! ధనాధిపతీ ! మిత్రపతీ ! నీవే ఈశ్వరుడవు. నీవే ఆశ్రయమవు. మా యజ్ఞము సిద్ధముగా ఉన్నది. సమయమునకు విచ్చేసి హవిస్సులు స్వీకరించమని మరుత్తులతో చెప్పుము.

                                నూట డెబ్బది ఒకటవ సూక్తము
        ఋషి - అగస్త్యుడు, దేవత - మరుత్తులు, ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. మరుత్తులారా ! నేను నమస్కరించుచు, స్తుతించుచు మీ దర్శనమునకు వచ్చుచున్నాను. మీ అనుగ్రహము అర్థించుచున్నాను. నా స్తుతి వినుడు. ప్రసన్నులు కండు. క్రోధము వర్జించుడు. గుర్రములను విడువుడు. మా వద్ద నిలువుడు. 




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.