Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



    రహూగణుడు భరతుని తత్వోపదేశము విని పల్లకి దిగి రాజాభిమానము వదలి జడభరతుని పాదముల ముందు తలవంచి క్షమాభిక్ష వేడుకున్నాడు.
    "మహాత్మా! నివురుగప్పిన నిప్పువలె ఉన్న నీవు ఎవరు?" దత్తాత్రేయుడు మున్నగు అవధూతలలోని వాడవా? నేను దేవేంద్రుని వజ్రాయుధమునకు సహితము వెఱవను. కాని బ్రహ్మజ్ఞానము కలవారిని అవమానించుట యనిన వెఱతును. జడునివలె కనిపించు నీలో జ్ఞానము వీర్యము గుప్తముగా ఉన్నవి. నీవు పలికిన పలుకులు యోగశాస్త్రమునకు సంబంధించినవి. నేను నా గురువు అయిన కపిలదేవుని వద్దకు వెళ్ళుచున్నాను. నీవు మారువేషమున తిరుగుచున్న కపిలదేవునివా? గృహస్థాశ్రమమున ఉన్న మందమతిని నేను. నా సంశయములు తీర్చుము.
    బరువు మోయుట శ్రమకాదని అన్నావు. యుద్దములలోని శ్రమ నేను ఎరుగను. కాన పల్లకిమోత శ్రమయనియే భావించుచున్నారు వ్యవహార మార్గమున కూడా అది సత్యమనిపించుచున్నది. మిధ్యాఘటమున నీరు తెచ్చుట కుదరదు కదా!
    కష్టము శరీరమునకు గాని ఆత్మకు లేదన్నావు. పొయ్యిమీద కుండ పెట్టినపుడు కుండ క్రింది నిప్పుచే కుండలోని నీరు వేడెక్కును. అందులోని బియ్యము కూడా ఉడుకును. అట్లే శరీరమునకు ఎండ తగిలిన ఇంద్రియములు ఉడుకుపట్టి తద్వారా ప్రాణము. మనసు వేడెక్కును. ఆత్మ తపించును.
    రాజు - సేవకుడు అను భావము మార్పు చెందునది అయినను రాజుగా ఉన్నప్పుడు ప్రజలను శాసించుట, శిక్షించుట తప్పదు.
    జడస్వభావుని దండించుట అన్నావు. దండించినంత మాత్రమున జడుని స్వభావము మారకున్నను అతనిని దండించుట వ్యర్థము మాత్రముకాదు. భగవంతుని దాసుడైన రాజు భగవదాజ్ఞ పాలించినచో స్వధర్మమును అవలంబించినట్లగును. మహానుభావా! రాజునన్న అహంకారమున, తెలియక మీవంటి మహాత్ములను అవజ్ఞ చేసినాను. నా అపరాధమును మన్నించి నేను ఈ పాపము నుండి విముక్తి పొందునట్లు అనుగ్రహింపుము.
    అందుకు జడ భరతుడు.
    "రాజా! నీవు పండితుడవు కావు. అయినను పండితునివలె వాదించుచున్నావు. అంతమాత్రమున నీవు పండితులలో లెక్కించబడుట వట్టిది. తత్వజ్ఞానమును అవగాహనముచేసుకున్న పండితులకు రాజు, సేవకుడు మున్నగు లౌకిక వ్యవహారములవలె వైదిక వ్యవహారములు సహితము సత్యములు కావు యజ్ఞ యాగాది కర్మలవలన స్వర్గాదులు లభించుట అబద్ధము, రాగ ద్వేషములు నశించు తత్వజ్ఞానము రమారమి అందులేదనియే చెప్పవచ్చును. స్వర్గ సుఖములు స్వప్నసుఖము వంటివని తెలుసుకొనని వానికి ఉపనిషత్తులు సహితము జ్ఞానము కలిగించలేవు.
    మనసు సత్వరజస్తమో గుణాలతో కలిసి ఉన్నంత వరకు అది మనిషిచేత మంచిపనులు, చెడుపనులు చేయించుతూనే వుండును. పంచభూతములు పదకొండు ఇంద్రియములు అను పదహారు కళలలో మనసే ముఖ్యమైనది. ఉత్తమత్వమునకు కారణమగునది మనసు. సంసార చక్రమును సృష్టించునది మనసు. సుఖదుఃఖములు కలిగించునది మనసు. కాన బంధమోక్షములకు మనసే ప్రధానమైనది. మనసు గుణములను వదిలిన అదే శాంతి ప్రదమైన మోక్షమును లభింపజేయును. ప్రమిదలో కాలునప్పుడు వత్తి నూనెతో తడిపి పొగ, శిఖ కలిగి వెల్గును. నూనె చెల్లిపొగా మండి అగ్నిలో కలిసిపోవును. గుణకర్మలయం దాసక్తి ఉన్న మనసు ఎన్నియో ప్రవృత్తులను అవలంబించును. గుణకర్మలు వదలగా పరమాత్మమున లీనమగును.
    శోకము, మోహము, రోగము, రాగము, లోభము, అహంకారము, మమకారము మున్నగునవి కలిగించుటకు ప్రధానకారణం మనసు నీ శత్తువే మనసు నీవు ప్రమత్తుడవై ఉన్న ఇది మరింత చెలరేగును. ఇది నీ ఆత్మ స్వరూపమును కప్పిపెట్టును కాన నీవు జాగ్రత్త పడుము. శ్రీహరి పాదపద్మములను ఉపాసించుట అను శస్త్రమున దానిని హతమార్చుము.
    ఇక నీ ప్రశ్నలకు జవాబు చెప్పెదను వినుము.
    శరీరము, పాషాణము రెండును భూమియొక్క వికారము వలననే ఏర్పడినవి. మరి ఈ రెండింటికి భేదమేమి? కారణం తరము వలన చలనము కలుగుటచే దీనికి "జనుడు" అని పేరు వచ్చినది. దీనికి రెండు పాదములున్నవి. పాదముల మీద మీగాళ్లున్నవి. మీగాళ్ళమీద పిక్కలున్నవి. పిక్కలమీద తొడలు, తొడలు మీద నడుము, నడుము మీద రొమ్ము ఉన్నవి. దానిమీద భుజము మున్నగు అవయవములు ఉన్నవి. వాస్తవముగా వీనిలో దీనికి శ్రమ కలిగినదని చెప్పుటకు వీలు కలగనందున శ్రమాశ్రయ పదార్ధము దుర్లభము. సరి. భుజముల మీద ఒక కఱ్ఱపల్లకి ఉన్నది. దానిపైన సింధుసౌవీర దేశముల రాజు అను భూమిలోని ఒకానొక వికారము కూర్చొని ఉన్నది. అది ఆత్మాభిమానమున మదించి గ్రుడ్డిగా ఉన్నది.
    పల్లకిలో కూర్చుండగానే నీవు గొప్పవాడవైపోలేదు. వాస్తవమునకు నీవు క్రూరుడవు. దుష్టుడవు. దీనులైన బోయలచే చాకిరీ చేయించుకొని ప్రజారక్షకుడను అని ప్రగల్భములు పలుకుదువు. సకల చరాచర జీవులన్నియు భూమినుండియే పుట్టి తిరిగి భూమిలోనే కలిసిపోవుచున్నవి. పేర్లు మాత్రము వేరుగా ఉన్నవి. ఇంతకుమించి వేరేమియు లేదు.
    "భూమి" అను శబ్ద వ్యవహారము సహితము అసత్యమే. భూమి పరమాణువులలో లీనమగును. పరమాణువుల కలయికవలన భూమి ఏర్పడినది. ఈ పరమాణువులు అజ్ఞానము వలన మనసుచే కల్పించబడినవి. కావున వాస్తవమునకు పరమాణువులు సహితము అసత్యమే భూమియు అసత్యమే.
    సన్నము, లావు, అణువు, బృహత్తు, కారణము, కార్యము, చేతనము, అచేతనము, ద్రవ్యము, స్వభావము, సంస్కారము, కాలము, కర్మము-ఇవన్నియు అసత్యములు, మాయవలన పుట్టినవి.
    సత్యమైనది విశుద్ధమైన జ్ఞానమే ఒక్కటియే. అది లోపరహితమైనది. అద్వితీయమైనది. పూర్ణమైనది. వినాశరహితమైనది. సర్వవ్యాప్తమైనది. అట్టి జ్ఞానము పరమాత్ముడు దానినే పండితులు వాసుదేవుడందురు.
    తపస్సు, వైదిక కర్మలు, అన్నదానములు, అతిథి సేవలు, వేదాధ్యయనములు, సూర్యుడు, అగ్ని మున్నగు దేవతలను ఉపాసించుట వలన పరమాత్మ జ్ఞానము కలుగదు. సత్సాంగత్యముననే అట్టి జ్ఞానము కలుగును. మనసు వాసుదేవుని మీద లగ్నమగును.
    సంసారమను కీకారణ్యమున ప్రవేశించి జీవుడు అనేక దుఃఖములను అనుభవించును అతడు భయంకరమగు వ్యసనములతో నిండియున్న ఆ యరణ్యమును వీడలేడు. వనమునకు ఆవలనున్న స్వచ్చము, విశాలము, ప్రశాంతము, ఆనందదాయకము అయిన ప్రపంచమొకటి ఉన్నదని గ్రహించలేడు. వన్యమృగముల బారినుండి తనను కాని, తన వారలను కాని రక్షించుటయందునో, రక్షించుటకు ఏర్పాటు చేయుట యందునో జీవిమంతయు తను గడిపివేయును. తిరిగి ఏ పేడలోని పురుగుగనో జన్మించి అందే మహానందమున్నదని భావించి పేడలోనే పుట్టి పెరిగి నశించును. ఈ సంసారము కీకారణ్యము వంటిది. అగాధమైన కూపము వంటిది. అజగరము వంటిది. దానిలో ప్రవేశించినవాడు బయటపడుట అరుదు.
    రహూగణా! "నీవును అదే అరణ్యమున పడికొట్టుకొనుచున్నావు. ప్రజలను దండించుట విడువుము. ప్రాణులన్నింటిని బంధువులుగా భావించుము. విషయాసక్తి వీడి భగవంతుని సేవించుము. జ్ఞానము అను వాడియైన గొడ్డలితో ఈ అడవిని నరికి బయటపడుము".
    జడభరతుని తత్వబోధ విని అంధకారము నుండి బయటపడినాడు రహూగణుడు. అతడు 'మహాత్మా! జన్మములన్నింటిలోను మానవజన్మ శ్రేష్ఠమైనది. స్వర్గమందలి దేవజన్మ సహితము దీనికి సరిరాదు. ఏలననిన మానవ లోకమునందువలె స్వర్గమున నీవంటి సాధుపురుషుల సాంగత్యము లభించదు.
    ఒక ముహూర్తకాలము నీ సాంగత్యము లభించినందున నా అజ్ఞానాంధకారము పటాపంచలైనది. కాన నీపాదధూళిని సేవించిన మహాత్ములకు భగవంతునిపై భక్తి కుదురుటలో ఆశ్చర్యము లేదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.