Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
జడభరతుని కథ
అంగిరస గోత్రపు ఒక బ్రాహ్మణునకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు తొమ్మిదిమంది పుత్రులు. వారు విద్యా, రూప, సౌశీల్యవంతులు. రెండవ భార్యకు ఒక కుమారుడు, ఒక కూతురు. ఆ కుమారుడు మన రాజర్షి భరతుడు. అతడు లేడిజన్మ వదిలి బ్రాహ్మణ కుమారుడై పుట్టినాడు.
ఈ జన్మమున సహితము అతనికి పూర్వజన్మ జ్ఞానము ఉండెడిది. ఈ జన్మమున కూడా విఘ్నములు కలుగునేమోయని అడుగడుగున జంకువాడు. తన వారితో సహితము సంబంధము లేకుండునట్లు రోజులు గడుపువాడు. సర్వదా శ్రీహరి పాదపద్మములే మనసున నిలుపుకొని యుండెడివాడు. ఎదుటివారికి అతడు పిచ్చివాని వలెను, జడుని వలెను, గ్రుడ్డివాని వలెను, చెవిటివాని వలెను కనిపించువాడు.
పుత్రుడు జడుడయినను తండ్రి ఉపనయనము వరకు సంస్కారములన్నియు నిర్వర్తించినాడు. కాని భరతుడు అన్ని నియమములను ఉల్లంఘించువాడు. తండ్రి అతనితో వేదాధ్యయనము చేయించుటకు సంకల్పించినాడు. నాలుగు మాసములు ప్రయత్నించినను భరతునకు "భూర్భువస్వః" రాలేదు. ఒక్కొక్క వర్గము నేర్పినను లాభము లేకపోయినది. ఏ అక్షరము తరువాత ఏ అక్షరము పలుకవలెనో, ఏ స్వరము తరువాత ఏ స్వరము పలుకవలెనో అర్థము కాలేదతనికి. అయినను తండ్రి విసుగుకొనలేదు. ఎంతో ప్రయత్నించినాడు. అయినను అతని సంకల్పము నెరవేరలేదు. కాలము వేగముగా వచ్చి అతనిని మ్రింగినది. అతని చిన్న భార్య తన బిడ్డలిద్దరను సవతికి అప్పగించి సహగమనము చేసినది.
తండ్రి మరణించిన తరువాత అన్నలు అతనికి విద్య గురుపుటకు ప్రయత్నించలేదు. కర్మకాండలో నిష్ణాతులైన వారికి ఆధ్యాత్మ విద్యా పారంగతుని ప్రభావము తెలియలేదు. గ్రామ జనులందరు అతనిని జడుడు అనువారు. వారు అప్పుడప్పుడు అతనిచేత పనులు చేయించుకొని పిడికెడు అన్నము పడవేయువారు. ఒక్కొక్కప్పుడు అడుక్కొని తినువాడు. ఏ పదార్థమైనను అసహ్యించుకొనకుండా తినువాడు. జీవికకై మాత్రము తినువాడు కాని ఇంద్రియముల తృప్తికై కాదు.
అతని శరీరము దృఢముగను, అవయవములు కరకుగను ఉండెడివి. ఎండ, వాన, చలిని లేక్కచేయువాడుకాడు. ఆబోతువలె ఒంటిపై గుడ్డలేక తిరుగువాడు. కటిక నేలపైనే పరుండువాడు. ఏ మాత్రము పోషణలేకున్నను అతడు శుభ్రము చేయని మణివలె ఉండెడువాడు.
జడభరతుడు కూలి చేయువాడు. వారు పెట్టినది తిని పొట్టనింపుకొనువాడు. అది చూచి అన్నలు అతనిని పొలము పనిలో పెట్టినారు. వారు ఏది చెప్పిన అదే చేయువాడు భరతుడు. మడులు సమముగా చేయుటకుగాని, గట్లు పోయుటకు గాని తెలియునది కాదు. పోసినచోటనే మళ్ళు పోయువాడు. త్రవ్విన చోటనే త్రవ్వువాడు. అన్నలు భరతునకు తెలకపిండి, పుచ్చిన మినుములు, అడుగుమాడిన అన్నము పెట్టువారు. అయినను అతడు దానినే ఆనందముగా భుజించువాడు.
ఒక దొంగలరాజు భద్రకాళికి నరబలి ఇచ్చుటకు మ్రొక్కుకున్నాడు. బలికొరకు సిద్ధము చేసి వుంచిన వ్యక్తి అర్దరాత్రి సమయమున తప్పించుకొని పోయినాడు. దొంగలు పారిపోయినవాని కొరకు ఎంతో వెదికినారు. అతడు దొరకలేదు. పంట పొలమున జడభరతుని చూచినారు దొంగలు. అతనిమీద పడి త్రాళ్ళతో కట్టివేసి భద్రకాళి గుడికి పట్టుకొని వెళ్ళినారు. జడభరతునకు స్నానము చేయించినారు. కొత్తబట్టలు కట్టించినారు. పూలదండలు వేసి. ముస్తాబు చేసి బలికొరకు సిద్ధపరచినారు. తిండి తినిపించి ధూపములు వేసినారు. భయంకరములైన బలి గీతములు పాడినారు. బలిబాజాలు వాయించుచు భరతుని బలిపీఠము వద్దకు తీసుకొని వెళ్ళినారు.
దొంగల పురోహితుడు పెద్ద కత్తి తీసుకున్నాడు. బలి ఇచ్చుటకు సంసిద్దుడైనాడు. బ్రహ్మభావపూర్ణుడైన బ్రాహ్మణ బలిని సహించలేకపోయినది కాళి. హఠాత్తుగా విగ్రహము బ్రద్దలు కొట్టుకొని బయటకు వచ్చినది కాళి.
ఆమెలో క్రోధము పొంగి పొరలినది. భయంకర రూపము దాల్చినది. కనుబొమలు ముడిపడినవి. కోరలు తళతళమెరసినవి. కన్నులు జ్యోతులైనవి. లోకమంతయు దహించునంత వీరావేశమున దిక్కులు పిక్కటిల్లునట్లు మహాట్టహాసము చేసినది. వికటముగా నవ్వి ఒక్క ఉరుకు ఉరికి పురోహితుని చేతిలోని కత్తి లాగి తీసుకొన్నది. దొంగల తలలు తాటికాయలు నరికినట్లు నరికివేసినది. వేడి వేడి రక్తము త్రాగినది. ప్రళయ నృత్యము చేసినది. తలలను బంతులుగా చేసి ఆడినది.
ఏవమేవఖలు మహదభిచారాతి క్రమః కార్త్న్యే నాత్మని ఫలతి
మహాపురుషుల విషయమున తలపెట్టిన ఘోరము అట్లే ఎదురుతిరుగును. పాపము కట్టికుడుపును.
తనను బలి ఇచ్చుటకు పూనుకున్న దొంగల విషయమున కూడ అతనికి కోపము రాలేదు. అందు విచిత్రమేమి? దేహాభిమానమను గ్రంథిని అతడు త్రెంచివైచినాడు. వైరభావము చంపుకొని సర్వప్రాణుల ఆత్మ ఒకటిగానే భావించినాడు. అట్టివారికి వికారములు ఉండునా?
తమ తల తెగిపోవుచున్నను చలించని పరమహంసల విషయమున ఇది ఏ మాత్రము ఆశ్చర్యము కాదు.
ఒకనాడు సింధు సౌవీరదేశముల రాజు రహూగణుడు పల్లకిలో వెళ్ళుచున్నాడు. అతని పల్లకి ఇక్షుమతీ నదీ తీరమునకు వచ్చినది. బోయల నాయకునకు మరొక బోయవాడు కావలసివచ్చి బోయవాని కొరకు వెదకుచుండగా అతనికి జడభరతుడు కనిపించినాడు. అతనిని పల్లకి మోయుటకు నియోగించినాడు.
మహానుభావుడు, ఆత్మజ్ఞాని అయిన భరతునకు ఈ పని తెలియదు. అయినను తక్కిన బోయవారితో భుజము కలిపి నడువసాగినాడు. వేగముగా నడుచుట వలన తన అడుగుల క్రింద పురుగులు నలుగును అనుకున్నాడు. జీవహింస జరుగునను భయమున చూచిచూచి అటు ఇటు అడుగులు వేయసాగినాడు. బోయలు అడ్డదిడ్డముగా అడుగులు వేయుట చూచి మహారాజు "అడుగులు చక్కగా వేయుడు. ఏమిటా నడక?" అని గద్దించినాడు.
బోయలు రాజదండనకు భయపడి "మేము సరిగ్గానే నడుచుచున్నాము. మహారాజా! ఈ కొత్తమనిషి నడువలేకున్నాడు. అందువలన మాకు ఇబ్బంది కలుగుచున్నది" అని విన్నవించినారు.
రహూగణుడు మహర్షుల సేవ చేసినవాడే. అతడు ఆత్మోపదేశము పొందుటకు గాను కపిలదేవుని దగ్గరకు వెళ్ళుచున్నాడపుడు. అయినను రాజు కదా! రజోగుణము అతని కండ్లు కప్పినది. నివురుగప్పిన నిప్పువంటి భరతుని కనుగొనలేక పోయినాడు.
"దుంగ వలె ఉన్నావు. పండు ముసలివలె చేయుచున్నావు. అలసినావా నాయనా! అడుగులు తడబడుచున్నవి" అని వెక్కిరించినాడు రహూగణుడు.
రాజు మాటలు లెక్కపెట్టలేదు భరతుడు. అట్లే నడచినాడు. పల్లకి ఎగుడు దిగుడుగనే నడవసాగినది. రహూగణుడు మండిపడినాడు.
"ఒరే! బ్రతికియున్నావా! పీనుగువా? నీకు నా మాట లక్ష్యము లేకున్నదే. నన్ను ఎరుగవేమో! యమునివలె నీ దేహము చదును చేయుదును. అప్పుడుగాని దారికి రావు" అని గర్జించినాడు.
భరతుడు రాజు దురభిమానము గమనించినాడు.
అతని అజ్ఞానమును గ్రహించినాడు. భరతుడు ఏ అభిమానమును పెట్టుకొనలేదు. అతడు ఉద్రిక్తుడు కాలేదు. చిరునవ్వు నవ్వుచూ ఇట్లన్నాడు:
"రాజా! బరువు మోయునది దేహముగాని ఆత్మకాదు. నేను స్థూలముగా లేనన్నావు. నేను ఆత్మ స్వరూపుడను. నాకు స్థూలత్వము లేదు స్థూలముగా ఉండుట, సూక్ష్మముగా ఉండుట దేహమునకు గాని ఆత్మకు కాదు. స్థూల సూక్ష్మములు ఆత్మకు లేవు. సుఖదుఃఖములు దేహాభిమానముగల జీవునకు గాని దేహాభిమానము లేని ఆత్మకు చెందవు. బ్రతికియున్నావా? పీనుగువా? అన్నావు. వికారమున్న ప్రతిదానికి చావు బ్రతుకులు కలవు. పరిణామముగల ప్రతిదానికి బ్రతుకుట చచ్చుట తప్పదు. నీవు రాజువు. నీ మాట లక్ష్యపెట్టలేదనుచున్నావు. రాజు ఎప్పుడూ రాజుగా ఉండి సేవకుడు ఎప్పుడూ సేవకుడిగా వున్నచో నీవు అన్నది ఒప్పు కావచ్చును. కాని నేటి రాజు రేపు సేవకుడు. నేటి సేవకుడు రేపు రాజు అగుచున్నాడు. కాన ఒకడు చెప్పుట మరొకడు వినుట అసందర్భము. అయినా రాజు, సేవకుడు అను సంబంధము నిత్యమని భావించుచున్నావు. కావున చెప్పుము ఏమి చేయమందువో. నేను ఉన్మత్తునివలె జడునివలె ఉంటున్నాను. నన్ను చదును చేసి ఏమి బాముకొందువు? పిండిని నూరుట వలన ప్రయోజనమేమి?"





