Home » vaddera chandidas » Anukshanikam 2



    మధ్యలోనే అందుకుని, "అవును ఆయనది మా జిల్లానే. వాళ్ళింట్లో చూపెట్టారు నాకు. హిమాలయాల్లో శివుడి జటాజూటంలో నుండి జలపాతం లాగా దూకుతున్న గంగావతరణం." అన్నాడు విజయ్ కుమార్.
    'ఓరి సిగ్గులేని వెధవా! నీలాంటివాణ్ని ఇంటి చాయలకి కూడా రానీయడాయన. నిన్ను మేడమీదకి తీసుకెళ్ళి నీకు ఆ చిత్రం చూపెట్టారన్నమాట! దాన్లో శివుడి మట్టి గొట్టుకుపోయిన జుట్టులోంచి జలపాతంలా దూకుతున్న గంగావరణం చూశావన్న మాట! శివుడా, నీ మొగుడా? The Birth of Ganges. గంగ పుట్టుక ప్రగాఢంగా వుంటుంది గానీ జలపాతంలాగానో బృందావన్ గార్డెన్ లో ఫౌంటెన్ లాగానో వుండదురా చీంబోతు వెధవా' అనుకుని. "మీరు చూసిన చిత్రం మరొకటై వుంటుంది. క్యాలండర్ బొమ్మ లాంటిది. రోరిక్ చిత్రంలో అవేమీ లేవు" అన్నాడు శ్రీపతి.
    విజయ్ కుమార్ గుర్రుగా చూశాడు, పెదాలూ మూతీ బిగించాడు. పక్కన యాదగిరి వున్నందున మరీ యిబ్బంది పడ్డాడు. 'వీడేదో పెద్ద తెలిసినాడిలాగా పెద్ద పెయింటర్ లాగా మాట్లాడుతున్నాడు. జన్మలో యెప్పుడూ బ్రష్ పుచ్చుకునుండడు_' అని కసిగా అనుకుంటూ, 'టూత్ బ్రష్ తప్ప' అని జోడించుకుని, తనలోనే పిసరంత నవ్వుకుని, "మీరు చెప్తున్నది ఆ చిత్రంగా గురించా. అవును_అది అట్లాంటిదే" అన్నాడు విజయ్ కుమార్.
    "ముత్యాల ముగ్గులో లేదిది." అన్నాడు యాదగిరి నీరసంగా.
    "బాపూ పెయింటర్ కదా అందుకని ఇట్లాకూడా తీస్తాడు" అన్నాడు విజయ్ కుమార్ యాదగిరితో బోధపరుస్తున్నట్లుగా.
    "బాపూ పెయింటర్ కాదు. మంచి లైన్ డ్రాయింగ్ యిల్లస్ట్రేషన్ ఆర్టిస్ట్." అన్నాడు శ్రీపతి.
    వినిపించుకోకుండా "శ్రీపతిగారూ, ఢిల్లీలో మీ ఫ్రెండు ఆ విని కౌల్ చాలా సహకరించాడు. త్వరలో పని జరగవచ్చు. థాంక్యూ వెరీమచ్" అన్నాడు విజయ్ కుమార్.
    "బారిష్ తక్కువాయె" అన్నాడు యాదగిరి.
    శ్రీపతి బిల్లు చెప్పించబోతే, అడ్డుపడి విజయ్ కుమార్ చెల్లించాడు.
    "టీ నీళ్ళ బిల్లు యెవరిస్తే యేం?" అని చిన్నగా నవ్వాడు శ్రీపతి.
    "నీ చురకల తెలివికేంలే' అనుకుంటూ విజయ్ కుమార్ బయటికి నడిచాడు "మీరెటు?" అని శ్రీపతితో అంటూ.
    "గూటికి" అని అడుగులు వేశాడు శ్రీపతి.
    స్కూటర్ స్టార్ట్ చేశాడు విజయ్ కుమార్. వెనక యాదగిరి కూర్చున్నాడు. యాదగిరిని అతనుండే వీధిలో వదిలేసి సుల్తాన్ బజార్ కోఠీకి వచ్చాడు దిలావర్ కోసం.
    దిలావర్ వున్నాడు.
    "మీకోసమే రెండు గంటలు చూస్తి. నయ్ ఆతే అనుకొని పంపేస్తి మిలటరీ ఆఫీసర్స్ తోటి" అన్నాడు దిలావర్.
    "కొత్త పిట్ట పిటపిట లాడుతుందని మోజుపడి వుంచమని చెప్తే యిట్లాగేనా చేసేది? రాకెక్కడికి పోతాను సినిమా వెళ్ళాల్సొచ్చింది" అని విసుక్కున్నట్లుగా అని గిలగిల్లాడిపోయాడు.
    ఖాళీగా వున్న యిద్దరి ముగ్గురి పేర్లు చెప్పాడు దిలావర్.
    "ఆ రొచ్చు.......చేసుకోను? రేపటికి యీ కొత్తపిట్టని__ పేరేంటన్నావు_దాన్ని సిద్ధంగా వుంచు. ఆలస్యమైతే దానికే మంచిదిగా_దాని డబ్బు దానికెట్లాగూ ముడుతుందిగా!" అన్నాడు విజయ్ కుమార్.
    "జీ సాబ్. గట్లనే మొఖరర్ వుంచుత" అన్నాడు దిలావర్.
    చిరాగ్గా అసహనంగా స్కూటర్ యెక్కాడు. వాన మొదలైంది. మరింత చిరాగ్గా అసహనంగా అనిపించి ; దారిలో కనిపించిన బార్ లోకి వెళ్ళాడు.
    విస్కీ గుక్కలు వేస్తూ, మరాటాతో పాటు కోడి తొడా మేక కార్జం మెక్కాడు.
    అరగంట. బయటికొచ్చాడు. వాన తగ్గింది. స్కూటర్ యెక్కి తిన్నగా యింటికి చేరుకున్నాడు.
    పడక గది తలుపు నెట్టాడు. తెరుచుకుంది.
    మంచంమీద ముసుగెట్టుకుని పడుకునుంది సీత.
    'దీనెమ్మా ముండ ముసుగూ యిదీ'-అని విసుక్కుంటూ దుప్పటి లాగేశాడు.
    మూలుగుతూంది సీత.
    "యేం మూలిగి చస్తున్నావ్?" అన్నాడు.
    "జ్వరంగా వుంది" అంది.
    "ఆ మాత్రానికే మూలగాలా?" అని పక్కన చేరి బ్లౌజు హుక్కులు తప్పించాడు.
    అవతలికి జరగబోయింది.
    "యేఁవొచ్చింది  వేషాలేస్తన్నావివాళ?" అన్నాడు ఆశ్చర్యంగా.
    "ఒళ్ళు నొప్పులు కూడా" అంది.
    "నేనో పట్టుపడితే నొప్పులు అయ్యే యెగిరిపోతయ్" అని సిగరెట్ వెలిగించుకుంటున్నాడు.
    సీత కళ్ళవెంట నీళ్ళొచ్చాయి. అలాంటిది అలవాటు లేనందువల్ల మండుకొచ్చింది. అసలే కొత్తపిట్ట పోయిందన్న యిదిలో వున్నందున మరింత మండుకొచ్చి సిగరెట్ తో ఓ చురక అంటించాడు చనుగుబ్బమీద.
    యేడుపు ఆపుకుంటున్న మూతిమీద పెదవులు బిగించి పళ్ళతో నొక్కాడు.
    స్తనాలమీద గోళ్ళతో దిగగుచ్చుతూ, పళ్ళతో కొరుకుతూ, పైకి జరిగి ఆమెని ఆక్రమించుకున్నాడు.
    ఆమె మూలుగుతోంది.
    "నీయమ్మా రోగిష్టి అంతా జన్మంతా నీతో యిట్లా నానా చావూ చావాలేమో నేను_యెక్కడ దాపురించావే" అని చీదరించుకున్నాడు.
    ఆమె మూలుగు ఆగిపోయింది. శ్వాసకూడా ఆగిపోయినట్లుగా పక్కకి అంటుకుపోయింది.
    పని ముగించుకుని, రగ్గు కప్పుకుని ఐదో నిమిషంలో గుర్రు పెడుతున్నాడు విజయ్ కుమార్.
    అతని గురక మొదలయ్యాక, సీత కళ్ళవెంట నీళ్ళు ప్రవహించటం మొదలయ్యాయి.
    ఆ మంచం మీద పడుకోలేకపోయింది. లేచి వెళ్ళి కుర్చీలో కూచుంది.
    యేడుపు పెల్లుబుకు కొస్తూంటే చప్పుడవకుండా బాత్ రూం తలుపు తీసి లోనకి వెళ్ళి తలుపు మూసుకుని బిగ్గరగా యేడ్చింది_గొంతు నొక్కి పట్టుకునే.
    వొంట్లో యే బాదా తెలియనంతగా మనసంతటా ఏహ్యపు దైనపు అవమానపు బాధ. అంతూ దరీ కానరాని బాధ.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.