Home » vaddera chandidas » Anukshanikam 2



    మూడు నెలల క్రితం ఓ రోజున, బజార్లో నలుగురెవరినో వెంటబెట్టుకుని వెళుతున్న రవిని చూస్తే రామ్మూర్తికి బుర్రలో ఆలోచన మెరిసి _ మూడురోజుల తరవాత రవి దగ్గిరికి వెళ్ళాడు. రవితో రామ్మూర్తికి అంతగా పరిచయం లేదు. ఒకసారి తను నిజాం కాలేజీకి వెళ్ళిన సందర్భంలో పరిచయం అవటం, మాటల సందర్భంలో తనని అతను సోషల్ కండిషనింగ్ ఆఫ్ ఇండివిడ్యువల్ గురించి అడగటం తను వివరించటం_అతనవరకే. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని వెళ్ళి, తనని వుద్యోగంలోంచి పీకేసిన సంగతి చెప్పి, "మీలాంటివాళ్ళు తలుచుకుంటే నన్ను తొలగించడం అన్యాయం అని నిరూపించి, న్యాయం జరిపించవచ్చు" అన్నాడు.
    "అన్యాయాన్ని నిరూపించటం కష్టం. నయానో భయానో సాధించాలి. వాడి జాతకం తెలుసుకుని నాలుగు నొక్కులు నొక్కి పని చేయించుకోవాలి. మీరు వివరాలన్నీ రాసివ్వండి ప్రయత్నిస్తాను. లెటర్ రాస్తాను తరవాత." అన్నాడు రవి.
    "దేనికి నేనే వస్తానులెండి ; మళ్ళీ ఆదివారం వచ్చి కలుస్తాను." అన్నాడు రామ్మూర్తి.
    "ఆ చిన్న టెంపరరీ వుద్యోగం దేనికి అంత చదివి?" అన్నాడు రవి.
    "అదైనా దొరకని రోజులు. కాగా కొన్నాళ్ళే. త్వరలో నాకు పోస్ట్ డాక్టొరల్ ఫెలోషిప్ వస్తుంది" అన్నాడు రామ్మూర్తి.
    నెలరోజులకి రామ్మూర్తికి ఆ వుద్యోగం ఇప్పించాడు రవి.
    "10-A- టెంపరరీ వేకెన్సీల్లో తను నియామకం చేసిన వాళ్ళదగ్గిర నాలుగో వంతు జీతం మీ ఆఫీసరు పుచ్చుకుంటాడట. మీరివ్వలేదని తీసేసి వుంటాడు." అన్నాడు రవి.
    "ఇవ్వడం ఇవ్వకపోవడం తరవాత మాట. ముందు నన్ను అడగనిదే!" అన్నాడు రామ్మూర్తి.
    "చప్రాసీ సూచించి వుంటాడు. మీరు గ్రహించి వుండరు."
    "ఐతే యిప్పుడు నెలనెలా నాలుగో వంతు వాడికివ్వాలన్నమాట!"
    "అక్కర్లేదు. వాడు పరమ కక్కుర్తి వెధవ. వాణ్ని యెక్కడ నొక్కాలో అక్కడ నొక్కి వుంచాను. మే జోలికి రాడు నా కాండిడేట్ అని. వస్తే దబాయించండి" అన్నాడు రవి.
    "మీకు కృతజ్ఞతలు యెట్లా చెప్పాలో_"
    "యెట్లాగూ చెప్పొద్దు" అని చిన్నగా నవ్వాడు రవి.
    ఆ కాగితాలు పూర్తిచేసి ప్యూన్ కిచ్చి పంపిస్తూ ; "ఈ ఆర్డరుకి యెంత గిడుతుందో గాడిదకొడుక్కి. ట్రైబల్ వెల్ ఫేర్ సెల్ లోని యీ ప్రాజెక్టుకి కూడా వీడే డైరెక్టరు. వీడికేం తెలుసునని! వీడికింద నేను అసిస్టెంటుని!" అనుకున్నాడు రామ్మూర్తి.
    ఐదున్నర అయింది.
    పర్స్ తీసి పౌడర్ అడ్డుకుని, లిప్ స్టిక్ పూసుకుని, చేత్తో జుట్టు సరిచేసుకుని లేచి, "ఇవాల్టికి తెమలండి రామ్మూర్తిగారూ" అంది మేరీ సౌందర్య తిలకం ఇంగ్లీషులో.
    "హీఁహీఁ" అని ఇకిలించి లేచి నుంచుని ఫైల్ ట్రేలో పడేశాడు రామ్మూర్తి. ఆమె బూట్ల టకటక గుమ్మం దాటింది.
    మేరీ సౌందర్య తిలకం. మేరీ అంటే హిందీలో నా అని అర్ధం అంట. మేరీ సౌందర్య తిలకం అంటే నా సౌందర్య తిలకమూ అని అర్ధమన్నమాట హతోస్మి....
    రామ్మూర్తి బయటపడ్డాడు. నడక.
    బస్టాపు.
    జ్యోతి, భక్తకన్నప్ప వాల్ పోస్టర్ల కింద ఓ మలయాళం సినిమా. పడకగది రతికాండ కాండం బొమ్మని సరిగా చూడనివ్వకుండా_ బస్సులు అగేవీ ఆగకుండా పోయేవీ స్టాపుకి అవతలగా ఆగి పారిపోయేవి.
    యెవరో పాట కూస్తున్నాడు_ "ముత్యాలూ వస్తావా" అంటూ.
    అరగంట.
    యెలాగైతేనేం ఓ బస్సులో చొరబడ్డాడు.
    కంపు_ చెమట కంపు. రకరకాల చెమటల, మగ చెమట కంపు. సాయంకాలపు ఆఫీసు బస్సుల చెమట కంపు.
    దిగాడు. యెక్కడం యెంత కష్టమో దిగటమూ అంతే కష్టం.
    తనుండే వీధిలో నడుస్తున్నాడు. రబ్బీస్ రోడ్లు.
    నడుస్తున్నాడు.
    "హలో" యెవరో వాడకట్టులో మనిషి.
    "హలో_హీఁహీఁ"
    అతనికి కాస్త ముందుగా సైకిలు చక్రాల బండి. బండి నిండా ఆపిల్ పళ్ళు.
    అంతలో వెనకనుంచి వచ్చి ముందుకు దూసుకుపోయిన కారు. కారులో తార ఒక్కతే కారు నడుపుతూ. గుర్తించాడు. భుజం చెంపజబ్బ కనిపించాయి.
    కారు దూసుకు వెళ్ళిపోగా రేగిన ఎర్ర దుమ్ములో రామ్మూర్తీ, పళ్ళ బండీ.
    గాలి దుమ్ముగాలి దుమ్ముగాలి దుమ్ముగాలి గుమ్మగాలి గుమ్మగాలి బొమ్మగాలి పిల్లగాలి పిల్లగాలిలో పిల్లగాలి పిల్లగాలిలో దుమ్ముగాలిలో పిల్లగాలిలో పళ్ళబండి పాలపళ్ళు పాలపళ్ళు పాలపండ్లు పాలపళ్ళు పాలపండ్లు డాట్సన్ ఉయ్యాల కార్లో పండ పాలపండ్ల చెట్టునుండి రాలినపండు నేలమీదో గుంటలోనో కాక మహల్ మీద పడింది అదీ లక్కే....
    రామ్మూర్తి ఇల్లు చేరాడు. తలుపు తట్టాడు. లోపల్నుంచి పసిబిడ్డ ఏడుపు. రామ్మూర్తి భార్య క్రితం నెలలో మగ పిల్లాడ్ని ప్రసవించింది. తొలి కాన్పు అవటం వల్ల కష్టమే అయింది. అతని అత్త వచ్చి రెండు నెలలుండి క్రితం వారమే వెళ్ళింది. మధ్యలో అతని తల్లీ చెల్లెలూ వచ్చి వెళ్ళారు.
    తలుపు తెరుచుకుంది. గుమ్మం పక్కన భార్య నిర్మల.
    "వాడెందుకట్లా గొంతు చించుకుంటున్నాడు? నేను యింటికి వచ్చాననా" అన్నాడు రామ్మూర్తి విసుగ్గా.
    "పసికందుని అవేం మాటలండీ" అంది నిదానంగా. నిర్మల మాట, తాపీగా బెల్లంపాకం లాగినట్లుగా వుంటుంది.
    మాట జావజారినట్లూ మనిషి నీరస పడినట్లూ తగలడుతుందేం తిండిలేనట్లుగా_అని మనసున చిరాకుపడి, "యెన్నాళ్ళనుండి ఉపవాసం" అని అనబోయి ఆగి, "ఒంట్లో యెట్లావుంది?" అన్నాడు.
    నిర్మలని చులకనగా పరిహసిస్తున్నప్పుడు ఒక్కోసారి ఆ రాత్రి రైలుపెట్టెలో రమణి గుర్తొస్తుంది. లోలోన వణుకు వస్తుంది. రమణి పేరు అతనికి తెలియదు. తనలో తను నామోషీ పడిపోతాడు. ఆ విషయం యెవరితోనూ అనలేదు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.