Home » vaddera chandidas » Anukshanikam 2



    పావుగంట.
    కన్నీళ్ళు ఆగిపోయాయి. ముఖం గంభీరంగా తీక్షణంగా అయింది. కాఠిన్యంగా అనిపిస్తోంది.
    రెప్పలు పైకెత్తి, యేదో ఆలోచిస్తున్నట్లుగా యెక్కడో చూస్తూ_
    మూడు నిమిషాలు.
    బాత్ రూంలోంచీ గదిలోంచీ బయటికి వచ్చింది. తిన్నగా వంటగదిలోకి వెళ్ళి, ఎలక్ట్రిక్ స్టవ్ ఒక సన్న యినుపతీగ ముక్క పట్టుకుని గదిలోకి తిరిగివచ్చింది. తలుపు గడియపెట్టింది.
    బాత్ రూంలోకి నడిచింది. తలుపు దగ్గిరికి లాగింది.
    ప్లగ్గు తగిలించి స్విచ్ నొక్కింది. స్ప్రింగ్ కాయిల్ యెర్రగా అవుతోంది.
    తీగ కూడా వేడెక్కింది.
    స్టవ్ ప్రక్కనే కూచుని చూస్తోంది.
    "ఏడుకొండలవాడా యే జన్మ పాపమో యిది. యింక చాలు నన్ను నీ దరికి చేర్చుకో" అనుకుంది మనసులో.
    చేతికి రింగు అంటటం లేదు. వేడి తగులుతోంది.
    అరంగుళం దూరంలో మృత్యువు. అరక్షణం వ్యవధి.
    పెదాలు బిగించి, కళ్ళు మూసుకుని, చేతివేళ్ళు తిప్పింది సీత.
    రోజూ ఆరింటికే లేచి, వంటింట్లో వంటమనిషికీ తనకీ తోడుగా వుండే సీత లేచి రాకపోతే ఆశ్చర్యపడింది వాళ్ళ పిన్నత్త.
    యెనిమిదింటికి మెలుకువొచ్చింది విజయ్ కుమార్ కి. పావుగంట బద్ధకంగా పడుకుని లేచి కాళ్ళు కింద పెట్టగానే జిల్ మన్నాయి. వెంటనే పైకి తీసుకున్నా అర్ధంకాక మళ్ళీ కిందపెట్టాడు. వెంటనే జిల్ మనటంతో_ క్షణకాలం ఆలోచించాడు_ యెక్కడన్నా వైర్ యర్త్ అయ్యి వుంటుందేమో అనుకుని, కాస్త అవతలగా వున్న స్లిప్పర్లు పాదాలతో అందుకున్నాడు, మంచం అంచు మీదనుంచి జారి. వాటిలో కాళ్ళుపెట్టి చకచకా బయటికి నడిచాడు.
    గది బయట, స్లిప్పర్లు విడవకుండానే బొటనవేలితో గచ్చు తాకి చూశాడు. యేమీ అనిపించలేదు. కాలు తీసి నేలమీద పెట్టాడు. కొద్దిగా జిల్ అనిపించింది. హాల్లోకి వెళ్ళిచూశాడు. అక్కడేమీలేదు. పినతండ్రి కూర్చుని వున్నాడు_ చెప్పుల పక్కనే నేలమీద కాళ్ళు పెట్టుకుని.
    లేచి మిగతా గదుల్లోకి వెళ్ళాడు.
    వంటింట్లో వంటమనిషి, పినతల్లి.
    "సీత ఇంకా లేవలేదేంరా. వొంట్లో బాగాలేదా?" అంది.
    వినపడనట్లుగా బయటికొచ్చి, చకచకా తనగదిలోకి వెళ్ళాడు. వంగి మంచం కింద చూశాడు.
    బాత్ రూం తలుపు నెట్టాడు. నేలమీద పడివున్న సీత. ఎలక్ట్రిక్ స్టవ్ లో చెయ్యి!
    వణుకు పుట్టింది. గబగబా వచ్చి మంచం మీద కూచున్నాడు. అంతలోనే లేచి హాల్లోకి వెళ్ళి _ పినతండ్రితో చిన్నగా విషయం చెప్పాడు.
    విజయ్ కుమార్ మెయిన్ ఆఫ్ చేస్తానని వెళ్ళబోతూంటే, "వొద్దు ఇటేపు ఫీజు తియ్యి" అన్నాడు పినతండ్రి.
    తీసేసి వచ్చాడు.
    ఇద్దరూ గదిలోకి వచ్చారు. తలుపు గడియ వేశారు. బాత్రూంలోకి వెళ్ళి _ చెరోపక్కా పట్టుకుని సీత మృతదేహాన్ని లేవనెత్తి తెచ్చి మంచంమీద పడుకోబెట్టారు. దుప్పటి కప్పారు.
    విజయ్ కుమార్ "పిన్నికి చెపుతా" అన్నాడు.
    "ఇక్కడికి పిల్చుకురా"
    విజయ్ కుమార్ పిల్చుకొచ్చాడు.
    గడియ వేశారు.
    "యీ ముండ మన పీకలమీదకి తెచ్చింది. యిష్టం లేదని చెప్తే దీన్ని దీని కొంపకి పంపేవాళ్ళంగా_ ఇంతోటి సుందరాంగి దొరకదనా" అన్నాడు అతని పినతండ్రి.
    "సీత మంచిదండీ." అంది చిన్నగా.
    "మంచిదైతే ఇట్టా మన పీకలమీదకి తెస్తందా? నువ్వు వంటింట్లో కెళ్ళు. సీతకి ఒంట్లో బాగాలేదని చెప్పు. ఐతే ఇటెవర్నీ రానివ్వొద్దు" అన్నాడు. ఆమె వెళ్ళింది.
    "ఒరే నువ్వు వేరే యెవరన్నా యింకో డాక్టరుకి ఫోనుచేసి పిలువు మా బాబాయికి ఒంట్లో బాగాలేదని. డాక్టరొచ్చి పరీక్ష చేసేటప్పుడు నువ్వు వంటింట్లో కెళ్ళి చిన్న గిన్నెతో వేన్నీళ్ళు పట్టుకురా _ డాక్టరెళ్ళిపోయినాక, వంటింట్లోకి ఆ నీళ్ళగిన్నె పట్టికెళ్ళి_ సీతకి డాక్టరు ఇంజక్షనిచ్చి వెళ్ళాడు. గదిలో అలికిడి పనికిరాదన్నాడని చెప్పు, పనాళ్ళకి వినబడేటట్లు" అన్నాడు.
    గంటసేపట్లో యిదంతా జరిగిపోయింది.
    "దీన్ని గప్ చిప్ గా ఎక్కడన్నా పారేస్తే __" అన్నాడు విజయ్ కుమార్.  
    "పీకలమీదకొస్తుంది. సాయంత్రం చచ్చిపోయినట్లు, డాక్టరు అప్పుడే చెప్పి వెళ్ళినట్లు వెల్లడించి కొందర్ని పిలుద్దాం. వాళ్ళవాళ్ళకి సాయంత్రం టెలిగ్రాం ఇవ్వు"
    "ఇంకేమన్నా వుందా? దాని అన్న అసాధ్యుడు" అన్నాడు విజయ్ కుమార్.
    "ఆడికెందుకు ఖరగ్ పూర్లో వాడికి. దాని బాబుకివ్వు. టెలిగ్రాం రేపొద్దుటికి గాని వూరు చేరదు"
    "యెవరైనా ముఖంమీద గుడ్డ తొలగించిది ఒంటిరంగు అట్లా_"
    "మేకప్ రంగేదన్నా పట్టుకొచ్చి పుయ్యి ఒళ్ళంతా. ముఖం దవడలూ అయ్యీ కాస్త సరిగా నొక్కు, చెయ్యి చీర లోపలికి పెట్టు. పాడే గీడే మొయ్యటం వొద్దు. ఇప్పుడప్పుడే మనవాళ్ళకీ చెప్పొద్దు. ఈ విషయం మన ముగ్గురికీ తప్ప యింకో ప్రాణికి తెలవకూడదు. అసలు దీన్నెవడు చావమన్నాడు పెంటలంజ. నీతో ఛస్తానని బెదిరించిందా?"
    "వుఁహూఁ. బాగానే చూస్తున్నాగా. యేం పుట్టుకొచ్చిందో రాత్రికి రాత్రికి__"
    "యేం లేకుండా యెట్టా వుంటుందిలేరా"
    "యేం లేదు బాబాయ్. వొంట్లో బాగాలేదు యీ పూట వొద్దంది. ఆ మాత్రానికే యేం పర్లేదులే_ అని నేనేదో కక్కుర్తి పడ్డానులే. అంత మాత్రానికే యింత అఘాయిత్యం చేసిందంటే_ ఇదేనాటికైనా మన పీకలమీదకి తెచ్చును."
    సాయంత్రం వార్త వెల్లడించారు.    
    రేపటిరోజు కీడురోజు శవాన్ని వుంచకూడదు_అని అప్పటికప్పుడే తరలించారు వ్యానులో. యింకా రెండు కార్లలో మరికొందరు వున్నారు. మున్సిపల్ ఆఫీసర్ ఒకతను, పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఒకతను వాళ్ళకి సన్నిహితంగా తెలిసినవాళ్ళు కూడా వున్నారు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.