Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
44. కేశయుక్తులగు ముగ్గురు వ్యక్తులు, అగ్ని, ఆదిత్యుడు, వాయువు, వర్ష సహితులయి భూమిని దర్శింతురు. ఒకడు అగ్ని, భూమిని శుద్ధము చేయును. రెండవ వాడగు సూర్యుడు సమస్త జగములను చూపించును. మూడవవాడగు వాయువు కంటికి కనిపించడు. చలనము మాత్రము అనుభూతము అగును.
45. వాక్కు నాలుగు విధములు. మేధావులు దానిని ఎరుగుదురు. మూడు విధముల వాక్కు నిగూఢము, వ్యక్తము కాదు. నాలుగవది మనుష్యులు మాట్లాడు వాక్కు.
46. మేధావులు ఆదిత్యుని ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని అందురు. అతడే స్వర్గమందు ఉన్నవాడు. గరుడుడు. సుందరుడు. వేగవంతుడు. "ఏకంసద్విప్రా బహుధావదంతి" ఒకే దానిని పండితులు అనేక రీతుల చెప్పుదురు. అతనిని, అగ్ని యముడు, మాతరిశ్వాన్ అందురు.
47. సూర్య కిరణములు సుందరగమనలు. జలగ్రహణలు. అని నియమిత గమనముగల మేఘమును జలపూరము చేయును. జలదములు ద్యులోకము చేరును. తదనంతరము దిగివచ్చును. భూమిమీద వర్షించును. ధరిత్రిని తడుపును.
48. పన్నెండు పరిధులు - రాశులు, ఒక చంద్రుడు - సంవత్సరము, మూడు పలకలు - ఋతువులు గల చక్రము ఇది. దీనిని ఎవడు ఎరుగును? ఈ చంద్రునకు మూడువందల - అరువది గూటములు - దినములు ఉన్నవి.
49. సరస్వతీ ! నీయందున్న గుణగణములు లోకమునకు సుఖప్రదాతలు. నీవు సకల సంపదలను రక్షింతువు. నీగుణములు బహురత్నములకు ఆధార భూతములు. నీవు సమస్త సంపదను ధరించి ఉన్నావు. నీవు శుభంకరివి. వానిని మేము త్రాగుటకు ప్రకటించుము.
ఇది నదికి వర్తించు అర్థము.
సరస్వతీ ! నీ దేహమునందలి స్తనములు సుఖప్రదాతలు. సకల సంపదలను రక్షించును. అవి బహురత్నములకు ఆధార భూతములు. అవి సమస్త సంపదలు ధరిచి ఉన్నవి. శుభంకరములు మాకు పాలు త్రాగుటకు ప్రకటించుము.
ఇది దేవీరూపమగు అర్థము.
50. యజమానులు, దేవతలు గ్ని రూపమున యజ్ఞము చేసినారు. అది వారి పరమ ధర్మము. ఆ మాహాత్మ్యము ఆకాశమున ఏకత్రితమయి ఉన్నది. అంతకుముందే అక్కడ ప్రాపించ తగిన దేవతలు ఉన్నారు.
51. జలము సాంతము ఏకరూపమే. ఒకప్పుడు దిగువకు, ఒకప్పుడు పైకి వచ్చిపోవుచుండును. హర్షప్రదాత మేఘము లోకములకు ముదము కలిగించును. అగ్ని ద్యులోకమునకు ముదము కలిగించును.
52. సూర్యుడు స్వర్గవాసి. సుందరుడు. వేగవంతుడు. పండితుడు. జలగర్భోత్పాదకుడు. ఔషధప్రకాశకుడు. అతడు వర్షించును. జలాశయములను తృప్తిపరచును. నదులను పోషించును. మమ్ము రక్షించమని ఆదిత్యుని ఆహ్వానించుచున్నాము.
(ఋగ్వేదము ప్రథమ మండలమున ఇరువది రెండవ అనువాకము సమాప్తము.)
ఇరువది మూడవ అనువాకము నూట ఆరువది అయిదవ సూక్తము
ఋషులు - మంత్రదేవతలు, దేవత - అనేకులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రుడు అనుచున్నాడు :-
మరుత్తులు సమానవయస్కులు. ఏకస్థాన నివాసులు. సాధారణులకు తెలియనంతటి శోభస్కరులు. వారు భూమిని తడుపుదురు. వారు మనసులలో ఏమనుకున్నారు? ఏ ప్రదేశము నుండి వచ్చినారు? వచ్చి వర్షగణము ధనలాభము కొఱకు అర్చించు బలము ఏది?
2. మరుత్తులు తరుణ వయస్కులు. వారు ఎవని హవ్యములు స్వీకరింతురు? వారు అంతరిక్షమున డేగవంటి వారు. యజ్ఞమున వారిని ఎవడు తొలగించగలడు? ఏ మహాస్తోత్రమున వారిని మనము ప్రసన్నులను చేయగలము?
3. మరుత్తులు అనుచున్నారు.
సాధుజన రక్షకుడవు. పూజనీయుడవగు ఇంద్రా ! నీవు ఒంటరిగా ఎక్కడికి వెళ్లుచున్నావు? ఎందుకు వెళ్లుచున్నావు? మాతో కూడి నీవు సరియైన ప్రశ్న అడిగినావు. ఇంద్రా ! మాకు చెప్పదలచినది మధురముగా చెప్పుము.
4. ఇంద్రుడు అనుచున్నాడు :-
సర్వహవ్యములు నావి. సర్వ స్తుతులు నన్ను ప్రసన్నుని చేయుటకే అయి ఉన్నవి. నేను కఠిన వజ్రము విసరిన అనర్థములు జరుగును. యజమానులు నన్నే ప్రార్థింతురు. ఋక్కుమంత్రములు నన్నే కోరును. హరినామక అశ్వములు హవ్యములు అందుకొనుటకు నన్నుగొనిపోవును.
5. మరుత్తులు అనుచున్నారు :-
అందుకొరకే మేము మహా తేజోవంతులము అయినాము. అందముగా అలంకరించుకున్నాము. బలసంపన్నములయిన అశ్వములను కూర్చినాము. యజ్ఞస్థానమునకు వెళ్లుటకు సిద్ధముగా ఉన్నాము. నీవు బల సంపన్నుడవయి మా వెంట ఉండుము.
6. ఇంద్రుడు అనుచున్నాడు :-
మరుత్తులారా ! వృత్రాసుర వధ సమయమున మీరు నాతో ఉండుటకు కారణమేమి? నేనే ఉగ్రబలవంతుడను. మహత్తుగలవాడను. నేనే సమస్త శత్రువులను వధించినాను. పరాజితులను చేసినాను.
7. మరుత్తులు అనుచున్నారు :-
ఇంద్రా ! నీవు అభీష్ట ప్రదాతవు. మనము సమాన శూరులము. మాతో కలిసి నీవు ఎన్నో ఘనకార్యములు చేసినావు. ఇంద్రా ! నీవు బలవత్తముడవు. మేము కూడా చాల కార్యములు చేసినాము. మేము మరుత్తులము. కార్యరూపులము అగుదుము. వర్షాదికములను కోరుదుము.
8. ఇంద్రుడు అనుచున్నాడు :-
మరుత్తులారా ! నాకు క్రోధము కలిగినపుడు మహాబల పరాక్రమశాలిని అయినాను. నా బాహుబలమున వృత్రుని పరాజితుని చేసినాను. నేను వజ్రాయుధుడను. నేను మానవుల ఆనందము కొఱకు హర్షదాయకమగు వర్షము కలిగింతును.
9. మరుత్తులు అనుచున్నారు :-
ఇంద్రా ! నీవు ఉత్తమోత్తముడవు. దేవతలందు నీ అంతటి విద్వత్తు మరొకరికి లేదు. నీవు అతి బలవంతుడవు. నీవు చేసిన ఘనకార్యములను పూర్వము ఎవరును చేయలేదు. ముందు ఎవరును చేయజాలరు.
10. ఇంద్రుడు అనుచున్నాడు :-
నేను ఒక్కడనే బలవంతుడను. నా బలము సర్వత్ర వ్యాపించి ఉన్నది. నేను ఉగ్రుడను విద్వాంసుడను. నాకు తెలిసిన సంపదలకు నేనే అధిపతిని ! నేను అనుకున్న పని తక్షణమే చేయగలను.
11. మరుత్తులారా ! మీరు నన్ను ఎంతో స్తుతించినారు. అది నాకు ఆనందము కలిగించినది. నేను వరప్రదాతను. ఐశ్వర్యవంతుడను. అనేకరూపుడను. మీకు అనువగు మిత్రుడను.
12. మరుత్తులారా ! మీది బంగారు చాయ. నా కొఱకు మీరు ప్రసన్నులు అయినారు. వ్యాపింప చేసినారు. అన్నమును ధరించినారు. మీ వెలుగు తేజస్సుతో నన్ను ఆచ్చాదితుని చేసినారు. అచ్చాదితుని చేయగలరు.
13. అగస్త్యుడు అనుచున్నాడు :-
మరుత్తులారా ! మీరు ఎల్లరకు మిత్రులు. మిమ్ము ఎల్లరు పూజింతురు. మీరు యజమాని ముందుకు విచ్చేయుడు. మీరు మనోహర ధన ప్రాప్తికి ఉపాయ భూతులు కండు. సత్యకర్మను గ్రహించుడు.
14. మరుత్తులారా ! మిమ్ము స్తుతించి పరిచర్యలు చేయగలవారు, స్తోత్ర సంపన్నులు మాన్యులు అగు ఋత్విజుల బుద్ధి కుశలత మిమ్ము సేవించుటకు మాముందుకు వచ్చును. నేను మేధావిని. నాముందుకు విచ్చేయుడు. మీ ప్రసిద్ధ కార్యములు లక్ష్యముగా స్తుతికర్తలు మిమ్ము పూజించుచున్నారు.
15. మరుత్తులారా ! ఈ స్తుతి ఈ స్తోత్రము మానవీయము. హర్షదాయకము. మాన్యుడు, విజ్ఞుడు అయిన కవి రచించినాడు. ఇది దేహపుష్టి కొఱకు మిమ్ము చేరును. మాకు అన్నము, బలము, దీర్ఘాయువు, విజయము, దానము లభించవలెను.
శ్రీ మదాంధ్ర ఋగ్వేద సంహిత రెండవ అష్టకమునందలి మొదటి మండలము మూడవ
అధ్యాయము సమాప్తము.
ఓం నతా మనన్తి మాయినో నధీరా వ్రతా దేవానాం ప్రథమా ధ్రువాణి |
నరోదసీ అద్రుహ వేద్యాభిర్న పర్వతాని నమేత స్థివాంసః ||
నాలుగవ అధ్యాయము నూట ఆరువది ఆరవ సూక్తము
ఋషి-అగస్త్యుడు, దేవత-మరుత్తులు, ఛందస్సు 1-13 జగతి, 14-15 త్రిష్టుప్.
1. యజ్ఞము ఫలము వర్షించునది. మరుత్తులు త్వరగా యజ్ఞమునకు విచ్చేయవలెను. వారి పూర్వగాధయు, మహాత్మ్యములను వివరింతును. మరుత్తులు సమర్థ ధ్వనియుక్తులు. సర్వకార్య సమర్థులు. మరుత్తులు యజ్ఞశాలలో ప్రవేశించినపుడు సమిధలు తేజస్సుతో ఆవృతములు అగును. మరుత్తులారా ! అదే రీతిగా మీరు యుద్ధమునకు బయలుదేరుటకు బలసంపన్నులు కండు.
2. మరుత్తులకు హవ్యము ఔరస పుత్రునివలె ప్రియమయినది మధురమయినది. వారు ప్రసన్నచిత్తులయి హవ్యమును గ్రహించవలెను. యజ్ఞశాలయందు నర్తించవలెను. వినయవంతుడగు యజమాని కొఱకు మరుద్గణములు రుద్ర గణములతో కలియుదురు. బలములు అన్నియు వారి అధీనములు. వారు యజమానిని ఇబ్బంది పెట్టరు.
3. మరుత్తులారా ! మీరు సర్వరక్షకులు. అమరులు. సుఖప్రదాతలు. హవిస్సు సమర్పించిన యజమాని విషయమున ప్రసన్నులు అగుదురు. వలసినంత ధనము ప్రసాదింతురు. ఆ యజమానికి వలెనే సమస్త లోకములకు మిత్రులు. భూమండలమును అంతను నీటితో తడుపుదురు.
4. మరుత్తులారా ! మీ రథము అశ్వయుక్తమయి అశ్వముల స్వబలముతో సకలలోకముల సంచరించును. మీ యానము అత్యంత ఆశ్చర్యకరము. ఆయుధము పట్టిన వానిని చూచి లోకులు గడగడలాడుదురు. అట్లే మా ప్రయాణ కాలమున సమస్త భువనములు, హర్మ్యరాజములు, గడగడలాడును.
5. మరుత్తుల గమనము అతీవ ఉజ్వలము. వారు గిరి గహ్వరములందు ప్రవేశించి మహారావము చేతురు. మానవహితము కొఱకు అంతరిక్షమున పరుగులిడుదురు. అప్పుడు వారి మార్గమునందలి విరోధులు గడగడలాడుదురు. తొలగిపోదురు రథము మీది స్త్రీవలె ఓషధులు ఒక స్థానము నుండి మరొక స్థానమునకు మారును.
6. ఉగ్రరూపులగు మరుత్తులారా ! మీరు బుద్ధిమంతులు కండు. అహింసను అవలంబించుడు. మాకు మంచి బుద్ధిని ప్రసాదించుడు. మీరు విసరు కోరలుగల పిడుగు దర్శనము ఇచ్చినపుడు ఆయుధములబారిన పడినట్లు పశువులు నశించును.
7. మరుత్తుల దానము అవిరళము. వారి ధనము కళంక రహితము. వారి శత్రువు వధార్హుడు. వారి స్తుతి సుగీతము. ఇంద్రుని కీర్తిని ఎరిగినవారిలో వారే ప్రథమతములు. అందువలన మరుద్గణములు సోమపానము కొఱకు స్తుతులు గానము చేతురు.
8. శూరులు, బలవంతులు అగు మరుత్తులారా ! మీరు క్రూరపాపముల నుండి రక్షించిన వానిని, సంతానాది సంపదలు ప్రసాదించి నిందలకు అందకుండ చేసిన వానిని అసంఖ్యాక సంపదలు ప్రసాదించి పాలించుడు.
9. మరుత్తులారా ! మీ రథమున సకల శుభప్రద వస్తు సముదాయము సమకూరి ఉన్నది. మీ స్కంధావారమున ఒకదానిని మించిన ఆయుధము మరొకటి ఉన్నది. మీరు విశ్రమించు స్థలములందు భోజనము సిద్ధముగా ఉన్నది. మే చక్రములు అన్నియు ఇరుసుచుట్టు భ్రమించుచున్నవి.
10. మరుత్తులారా ! మీ భుజములు మానవులకు హితకరములు. వానిమీద మీరు అనేకములగు శుభప్రద పదార్థములను వహింతురు. మీ వక్షము కాంతిమంతము. స్వర్ణాభరణ భూషితము. మీ భుజములు శ్వేతమాలలు ధరించినవి. అవి వజ్రముమీద ఛురికను ధరించును. పక్షులు పక్షములవలె, మరుత్తులు శ్రీలను ధరింతురు. పక్షాన్వ్యను శ్రియోధిరే".





