Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
ఎనిమిదవ అధ్యాయము
అక్షరబ్రహ్మయోగము
అర్జున ఉవాచః
కిం తద్ర్బహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ!
అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్చతే 1
పురుషోత్తమా బ్రహ్మమనగానేమి? అధ్యాత్మం అనగానేమి? కర్మ అనగానేమి? అధిభూతము అనగానేమి? అధిదైవమని దేనిని అనుచున్నారు.
అధియజ్ఞః కథం కోత్ర దేహే స్మిన్ మధుసూదన
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః 2
'అధియజ్ఞము' అనగానేమి? అది యీ శరీరమున ఎట్లుండును? నియతాత్మయగువాడు అంత్య కాలమున నిన్ను ఎట్లు తెలిసికొందురు?
భగవానువాచః
అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ధ్యాత్మముచ్చతే
భూతాభావోద్భవకరంః విసర్గః కర్మసంజ్ఞితః 3
బ్రహ్మము అనగా పరమ అక్షరుడు. అధ్యాత్మము స్వభావము - భూతభావము తెలుపు యజ్ఞము కర్మ అనబడును.
అధిభూతం క్షరోభావః పురుషశ్చాధి దైవతమ్
అధియజ్ఞో హమేవాత్ర దేహే దేహభృతాం వర! 4
క్షరమగునది అధిభూతము. పరమపురుషుడు అధిదైవతము. ఈ శరీరములో అంతర్యామిగా నున్న నేనే అధియజ్ఞము.
అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరమ్
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః 5
అంత్యకాలమందు నన్నే స్మరించుచు దేహమను వదిలినవాడు నన్నే చేరుచున్నాడు. ఇందు సందేహము లేదు.
యం యం వా- పి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరమ్
తం తమేవైతి కౌంతేయ! సదా తద్భావ భావితః 6
అర్జునా! మానవులు అవసాన దశయందు యే భావమును స్మరించునో అతడు మరుజన్మలో అదే స్వభావమును పొందుచున్నాడు. ఏలనన అతడు సర్వదా దానినే స్మరించుచున్నాడు.
శ్రీ భాగవతములో ఈ విషయానికి సంబంధించిన ఒక చక్కని కథ యున్నది. అది:
భరతుడు
ఋషభుడు భరతునికి రాజ్యపట్టము కట్టినాడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించి భరతుడు మిక్కిలి ధర్మముగా రాజ్యము చేసినాడు. అందువలన అజనాభవర్షము భరతుని పేర భరతవర్షముగా మారినది.
భరతుడు విశ్వరూపుని పుత్రిక పంచజననిని పెండ్లాడినాడు. ఆమె వలన అయిదుగురు పుత్రులను కన్నాడు. వారు సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతుడు అనువారు. భరతుడు అనేకమైన యజ్ఞములు చేసినాడు. అతడు యజ్ఞఫలమును వాసుదేవునకే అర్పించినాడు. అతడు భగవంతుని మీద బుద్ధి నిలిపి హృదయ మాలిన్యమును వదిలించుకున్నాడు. హృదయాకాశమున నున్న వాసుదేవుని పూజించినాడు.
అతడు వేయి ఆయిత సంవత్సరములు అనగా కోటి సంవత్సరములు రాజ్యము చేసినాడు. అతడు తన పుత్రులకు రాజ్యమును పంచి పులహాశ్రమమునకు వెళ్ళిపోయినాడు. అచట ఒక ఏకాంత ప్రదేశమున ఆశ్రమము ఏర్పాటు చేసికొన్నాడు. పుష్పములతోనూ, ఫలములతోనూ భగవంతుని ఆరాధించినాడు. విషయాభిలాషలు పరిత్యజించి శాంతుడై పరమానందమును అనుభవించినాడు. ఆనందానుభవమున శరీరము పులకరించినది. ప్రేమ బాష్పములు ప్రవహించినది.
భక్తిభావము పొంగి పొరలినది. అతడు అందు మునకలు వేసినాడు.
ఒకనాడు భరతుడు గండకి నదిలో స్నానము చేసినాడు. నిత్యనైమిత్తికములు ముగించుకున్నాడు. ప్రణవము జపించుచు నదీతీరమున కూర్చున్నాడు.
అప్పుడు ఒక లేడి నీరు త్రాగుటకు ఆ యేటికి వచ్చినది. అది నీరు త్రాగుచుండగా దానికి సింహగర్జన వినిపించినది. లేడి ఉలిక్కిపడి బెదురుచూపులు చూచినది. నిండు చూలాలుగా వున్న ఆ లేడి ప్రాణభయమున చెంగున ఏటిలోనికి దూకినది. గర్భపాతమై బయటపడిన లేడిపిల్ల ప్రవాహమున పడి కొట్టుకొని పోయినది. మందతప్పిన తల్లిలేడి పోయి పోయి ఒక కొండ గుహలో పడి చచ్చిపోయినది.
ముద్దులొలుకు లేడిపిల్ల నదిలో కొట్టుకొని పోవుట చూచినాడు భరతుడు. అతడు కరగిపోయినాడు. దయారసము పొర్లినది. వెంటనే పరుగెత్తి తల్లిలేని ఆ లేడిపిల్లను ఆశ్రమమునకు తెచ్చి కన్నబిడ్డను పెంచినట్లు పెంచినాడు.
భరతునకు లేడిపిల్ల మీద మమకారము ఏర్పడినది. భరతుడు ప్రతిదినము దానికి మేత మేపువాడు నీరు త్రాగించువాడు. క్రూర మృగముల బారినుండి కాపాడువాడు. రోజు రోజుకు మమత పెరిగినది. దానిమీద అతనికి "ఇది నాది" అన్న భావము ఏర్పడినది.
క్రమక్రమముగా భగవత్సేవ మున్నగునవి వెనుక పట్టినవి. కొన్నాళ్ళకు అతడు భగవంతుని మరచినాడు. లేడిపిల్లయే అతనికి భగవంతుడైనది. లేడిపిల్ల తనను ఆశ్రయించినదనియు, దానిని రక్షించుటే పరమ ధర్మమనియు అతడు భావించినాడు.
కుశలు దర్భలు మున్నగువాని కొరకు అరణ్యమునకు వెళ్ళినప్పుడు గాని, నీరు తెచ్చుటకు నదికి వెళ్ళినప్పుడు గాని అతని ధ్యాస లేడిపిల్ల పైననే ఉండునది. ఆశ్రమమున ఒంటరిగా ఉన్న యెడల కుక్కలు కరచునో, పులి ఎత్తుకొని పోవునోయని భావించువాడు.
కొంతకాలమునకు దానిని సహితము వెంటతీసుకొని వెళ్ళసాగినాడు. దారిలో పచ్చిక బయలు కనిపించినచో లేడిపిల్ల అటు పరుగెత్తెడిది. దానివెంట పరుగెత్తి దానిని పట్టుకొని భజములపై వేసుకొని నడుచువాడు. ఒకప్పుడు ఒడిలో పెట్టుకొని నడచువాడు. అట్లు దానిని ఎన్నో విధముల గారాబము చేసియు, లాలన చేసియు, ముద్దులాడియు ఆనందము ననుభవించువాడు. దానికేమైనను ప్రమాదము వచ్చునేమోయని శంకించి బాధపడువాడు. అది కనిపించకపోయినచో ధనమును కోల్పోయిన దరిద్రునివలె విలపించెడివాడు. ఆశ్రమమంతయు దాని కొరకు గాలించువాడు. దాని అడుగుల గుర్తులు నేలమీద చూచి "ఈ నేల ఎంత తపస్సు చేసికొనినదో కదా! సుందరమైన నా లేడి కాలి గుర్తులతో అలంకరించుకొనినది. నేనున్నాను దరిద్రుడను. ఎంత తపస్సు చేసిన నేమి? నా లేడిపిల్లను కానలేకున్నాను" అని విలపించెడివాడు.
ప్రారబ్దకర్మయే లేడిపిల్ల రూపమున వచ్చి భరతుని యోగనిష్ఠను భంగపరచినది. కాకున్న ఆలుబిడ్డలు మోక్షమునకు ఆటంకమని వారిని విడిచిన తాపసి లేడిపిల్లపై ఇంత వ్యామోహము పెట్టుకొనునా?
భరతుడు యోగభ్రష్టుడైనాడు. ఆత్మస్వరూపమును మరచినాడు. ఇంతలో కాలము కాటువేయు సమయము వచ్చినది. ఎలుక కన్నమున దూరు సర్పము వలె అది భరతుని తలపై కూర్చున్నది. అపుడు సహితము లేడిపిల్లయే అతని కన్నుల మసలినది.
ఆ స్థితిలో భరతుడు ప్రాణము వదలినాడు.
మరణ సమయమున ఏది ధ్యానమున వున్న ఆ జన్మమే వచ్చును. భారత మహారాజు మరుసటి జన్మమున లేడియై పుట్టినాడు. కాని యోగభ్రష్టుడైనందున అతనికి పూర్వజన్మ జ్ఞానము వుండెను. తన లేడి జన్మమునకు కారణము తెలుసుకొని ఎంతో ప్రశ్చాత్తాప పడువాడు.
"అయ్యో! యోగభ్రష్టుడనైతినే? పతితుడనైతినే? సర్వసంగ పరిత్యాగము చేసి శ్రీహరి పాదారవిందములపైననే చిత్తము నిలిపి అతని గుణములనే గానము చేసితినే? అట్టి నేను ఒక చిన్న లేడిపిల్ల వెంటపడి భ్రష్టుడనైతినే?" అని వాపోవువాడు. అట్లు తలచి వైరాగ్యభావమున తల్లి లేడిని వదలి తాను పుట్టిన కాలంజర పర్వతము నుండి బయలుదేరి పులహాశ్రమమునకు వచ్చినాడు భరతుడు. అచటనే తిరుగుచు ఎండుటాకులు, గడ్డిగాదము తినుచు కాలము వెళ్ళబుచ్చినాడు.
తుదకు లేడి శరీరము వదలిపెట్టినాడు.
నీటిలో కొట్టుకొనిపోవు ముద్దులొలుకు లేడిని కాపాడుట పాపమా? భగవత్స్వ రూపమైన ఒక ప్రాణిని రక్షించినాడే భరతుడు. అతడు చేసిన పాపమేమి? యోగము చేయువాని మనసు బండ కావలెనా? అది ప్రాణుల దుఃఖము చూచి కరుగరాదా? ఒకరికి ఉపకారము చేయుటయందు, అందునను ప్రాణము రక్షించినచో పాపము కలుగవలెనా? పుణ్యమా?
ఈ ప్రశ్నలన్నింటికి జవాబు ఒక్కటే. నీవు దుఃఖించు ప్రాణిజాలమున కంతటికిని సాయపడుము. కాని ఎవరి ఎడను మమకారము పెంచుకొనవలదు. నీవు చేయు సహాయము భగవంతుడు ప్రాణికి చేయునట్లు గోప్యముగా నుండవలెను. కాని ప్రకటితము కారాదు. నీవు కోట్ల ప్రాణుల కన్నీరు తుడవవలసియున్నది. ఒక్క ప్రాణియెడల మమత కలిగియున్నచో నీ ధర్మమును నిర్వహించినట్లగునా?





